జై తెలంగాణ.. అనంగనే సామి యాద్కొస్తడు
మల్లమ్మ, స్వామి తల్లి, ఒగులాపూర్ గ్రామం, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ జిల్లా
అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు.
‘పొద్దున వోయేటేడు....రాత్రికొచ్చేటోడు. తిండి తిప్పల్లేకుండా తిరుగుడేందిరా.. అంటే ‘తెలంగాణ రాష్ర్టం కోసమే...’ అనేటోడు. ‘ఆ..గది అచ్చేదా సచ్చేదా దానితెరువుకి నువ్వెందుకురా’ అంటే ‘గందరట్లంటే సొంత రాష్ట్రమేడికెళ్లొస్తదే’ అన్నడొకసారి. నాకు ఒక బిడ్డ, ముగ్గురు మగపిల్లలు. పెద్దోడు సామి. నిజంగా ఆడు పెద్దోడే. ఆడు స్కూలు నుంచి వచ్చినంక పొద్దుగూకి పొలం పనికి పోయి పైసలు సంపాదించేటోడు. నా దవఖాన ఖర్చంతా సామే చూసుకొనేటోడు. ర్యాలీల తిరగాలె, నిరాహార దీక్షల కూసోవాలె...అని ఒకసారి ఇరవైరోజులు ఇంటికి రాలె.
ఎవరో రాజకీయ నాయకుడు తెలంగాణ వచ్చుడు కష్టమన్నడంట. గా మాటకు వాడు పురుగుల మందుతాగి పాణమిడిసిండు. గాసంది...నెలకొకసారొచ్చే పిట్స్‌రోగం...సామి యాదికొచ్చినపుడల్లా వస్తంది. ‘తెలంగాణ రాష్ర్టమొచ్చింది గదే! ఇప్పుడు మనకేమొస్తదె..’ అని నేను మాయానను అడిగితే...‘వాడు కోరుకున్నట్లు మన రాష్ర్టం మనకొచ్చింది. పేదోళ్ల ఇంటికొచ్చి మాట్లాడే నాయకులొస్తే రోజూ సామి ఫొట్వోకి మొక్కుదం’ అన్నడు. సామి ఎప్పుడూ.. అమ్మా...‘జై తెలంగాణ’ అను అనేటోడు. ఆ మాట యినొస్తే సాలు సామి యాద్కొస్తుండు.’
- సేకరణ: భువనేశ్వరి, సాక్షి, హైదరాబాద్