నవ తెలంగాణ నిర్మాణంలో యువత పాత్రే కీలకం
మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ
జోగిపేట, న్యూస్‌లైన్: నవ తెలంగాణ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జోగిపేటలో సిరి, వివేకానంద, శ్రీరాం, భవానీ, గణేష్, గణసేన, దుర్గాభవానీ, జూనియర్ వివేకానంద యువజన సంఘాలకు చెందిన సుమారు 500 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఓటమి, గెలుపులు సహజమే అయినప్పటికీ యువత సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకుడికి, ప్రజలకు మధ్య విశ్వసనీయత ఉండాలన్నారు.
వాగ్ధానాలు చేసే ముందు అవి ఆచరణకు సాధ్యమా లేదా అని ఆలోచించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు అవసరమన్నారు. మనిషికి ఉన్న స్వేచ్ఛ, స్వయంపాలన, ఆత్మగౌరవం, సమానత్వాన్ని హరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని దానినే ఉద్యమంటారన్నారు. మనిషికి అస్తిత్వం, ఆత్మగౌరవం, జవాబుదారీ తనం ఉండాలన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. సమావేశానికి మాజీ డీసీసీబీ డెరైక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్.సురేందర్‌గౌడ్, ఏ.చిట్టిబాబు, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు పి.నారాయణ, హెచ్.రామాగౌడ్, యువజన సంఘ నాయకులు నాగరాజ్‌ముదిరాజ్, శ్రీధర్, ఆనంద్, ఫైజల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.