మట్టి కరిచిన దిగ్గజాలు
కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ
* పరాజితుల్లో డీఎస్, పొన్నాల, దామోదరతోపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు
*ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకూ
*షాక్ ఇచ్చిన ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేతలు ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థులతో పాటు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, పార్టీ మాజీ అధ్యక్షుడు, మంత్రుల వంటి పలువురు ఓడిన వారిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ దెబ్బకు హేమాహేమీలు సైతం కొట్టుకుపోయారు. జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయ్యాయి. అధికారంలోకి రాకున్నా... మెజారిటీ దగ్గరలోకి వస్తామని భావించిన కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగిలింది.
పరాజయంపాలైనవారిలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతోపాటు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, విజయశాంతి, సురేష్‌రెడ్డి, జగ్గారెడ్డి, జయసుధ, ముఖేష్‌గౌడ్, గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు, సుదర్శన్‌రెడ్డి, దానం నాగేందర్, ప్రసాద్‌కుమార్, షబ్బీర్ అలీ, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు పార్లమెంట్ కు పోటీ చేసిన జైపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజగోపాల్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు ఉన్నారు.
ఇతర పార్టీల్లో కూడా..
ఇతర పార్టీల్లో కూడా కొందరు ప్రముఖులు ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఈసారి ఓడిపోయారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గాలి వీస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆయన పరాజయం చవిచూశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి కూడా ఓట మిని చవిచూశారు. టీఆర్‌ఎస్ తరఫున నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన మందా జగన్నాధం కూడా ఓటమిపాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ప్రముఖుల్లో తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి కూడా సీహెచ్ విద్యాసాగర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి వంటివారు ఓటమి చవిచూశారు. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న నాగం జనార్దన్‌రెడ్డికి కూడా ఈసారి భంగపాటు తప్పలేదు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని వదిలి పెట్టి బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
నారాయణ.. నారాయణ..
ఖమ్మం లోక్‌సభకు పోటీ చేసిన సీపీఐ నేత కె.నారాయణ పరాజయం పాలయ్యారు. కనీసం రెండో స్థానం కాకుండా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పోలింగ్ ముగిసిన ఆయన సీపీఎంపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఒకే ఒక్కడు..
వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన దొంతు మాధవరెడ్డి విజయదుందుభి మోగించారు. తెలంగాణలో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచింది ఆయన ఒక్కరే కావడం విశేషం. కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి తిరిగి రద్దు చేయడంతో మాధవరెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 19 వేల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కత్తి వెంకటస్వామి ఇక్కడ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.
నోటాకు ఓటు..
సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా పార్లమెంట్ స్థానంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. భువనగిరి, నల్లగొండ, మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్, వరంగల్ వంటి స్థానాల్లో సుమారు 10 వేలకు పైగా ఓట్లు నోటాకు పడ్డాయి. కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 1592 మంది ఓటర్లు నోటా మీట నొక్కారు.