రాహుల్ సభ విజయవంతం
- భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
- రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన యువనేత
- కుర్చీలు సరిపోక నిలబడే వేచి చూసిన జనం
- ఆకట్టుకున్న ఐడియా సూపర్ సింగర్ ఫేం మధుప్రియ, రషీద్‌ల పాటలు
సాంపల్లి (డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషంలో మునిగి పోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి మం డలం సాంపల్లిలో సోమవారం నిర్వహించిన సభ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 2 గంటల నుంచే జనాలు రావడం మొదలైంది.
సభికుల దాహార్తిని తీర్చడం కోసం జాతీయ రహదారి నుంచి సభా ప్రాంగణం వరకు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎస్పీజీ అధికారులతో పాటు ఎస్పీ తరుణ్‌జోషి సభా ప్రాంగణంలో కలియ తిరుగుతూ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
పాసు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వీఐపీ గ్యాలరీ నుంచి లోనికి పంపించ వద్దని సిబ్బందికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత వద్ద పాసు లేకపోవడంతో పావుగంట పాటు ఆమె వాహనాన్ని పోలీసులు లోనికి అనుమతించలేదు. ఎస్పీజీ అధికారులు, స్థానిక పోలీసు అధికారులు సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు హాజరైన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. సభా స్థలం నుంచి సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు వావానాలు నిలిపి ఉంచి ప్రజలు నడుచూ కుంటూ సభాస్థలానికి చేరుకున్నారు. ఉక్కపోత వేడికి నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి ప్రజలు సభకు తరలి వచ్చారు.
రూరల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా సుమారు 40 వేల మంది తరలి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో డీఎస్ ఆనందంలో మునిగి పోయారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కళాకారులు పాటలు పాడటం ప్రారంభించారు. ఆర్మూర్‌కు చెందిన శంకరమ్మ కళాబృందం బుడగ జంగాల కళను ప్రదర్శించారు. రేలా రే.. ఐడియా సూపర్ సింగర్ ఫేం, ప్రముఖ గాయని మధుప్రియ, అంధుడైన రషీద్‌లు తన పాటలతో జనాలను ఉత్సాహపరిచారు. అంతకంతకు సభా ప్రాంగణం జనాలతో పోటెత్తింది. దీంతో కుర్చీలు సరిపోక బారికేడ్ల బయట జనాలు ఎండలో నిల్చున్నారు.
ప్రాంగణంలోని వారితో పాటు మైదానం చుట్టూ వందలాది మంది కార్యకర్తలు రాహుల్ గాంధీ రాక కోసం వేచి చూశారు. చివరకు రాహుల్ గాంధీ హెలికాప్టర్ సాయంత్రం 5.52 గంటలకు వేదిక వద్ద ల్యాండయింది. ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించారు.
వేదికపైకి 5.56 నిమిషాలకు చేరుకున్న రాహుల్ కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేయడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. వేదికపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగిస్తుండగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ శాలువాతో రాహుల్‌ను సన్మానించారు. 6.06 గంటలకు ప్రసంగం ప్రారంభించిన రాహుల్ 6.35 గంటలకు ముగించారు.
రాహుల్ హిందీలో ప్రసంగించగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తెలుగులో అనువాదం చెప్పారు. ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఓటాఫ్ థ్యాంక్స్ తెలుపడంతో సభ ముగిసింది. అనంతరం పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులను రాహుల్‌కు పరిచయం చేశారు. సభ ముగిసిన తర్వాత రాహుల్‌ను చూడటానికి కార్యకర్తలు ముందుకు దూసుకు వచ్చారు.