ప్రియాంకా.. ఇక నీవే దిక్కు!!
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణంగా.. కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేని దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త నాయకత్వం కోసం అర్రులు చాస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణమైన ఫలితాలు రావడం, దేశవ్యాప్తంగా వచ్చిన ఆధిక్యాల్లో కనీసం అర్ధసెంచరీ కూడా చేరుకోలేకపోవడం లాంటి పరిణామాలు చూసి పూర్తిగా నీరుగారిపోయింది. పార్టీలో యువరక్తం ఏదైనా మ్యాజిక్ చేస్తుందనుకుంటే.. రాహుల్ గాంధీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఆయన పేలవమైన ప్రసంగాలు చూసి సొంత పార్టీ కార్యకర్తలే నీరసించిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటే ఇక దేశంలోనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందన్న భయం ఆ పార్టీ నాయకులకు మొదలైంది. అయితే.. గాంధీ-నెహ్రూ కుటుంబం తప్ప మరొకరి నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించలేని ఆ పార్టీ, ఇప్పుడు మళ్లీ వారసులే రావాలంటూ ఆహ్వానిస్తోంది.
అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ ముమ్మూర్తులా నాయనమ్మను పోలి ఉండటంతో ఇకమీదట ఆమే పార్టీ పగ్గాలను చేపట్టాలని పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు కోరుతున్నారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంకా వాద్రా ప్రసంగాలు వెయ్యిరెట్లు బాగుండటం.. ఇలాంటి కారణాలతో ప్రియాంకను ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికలలోపే ఆమె పార్టీ పగ్గాలను చేపడితే.. ఈలోపు కాంగ్రెస్కు ఎంతోకొంతమేర జవసత్వాలు అందిస్తారని భావిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి సోనియాగాంధీ ఎటూ నాయకత్వ బాధ్యతలు చేపట్టే పరిస్థితిలో ఉండకపోవచ్చని, రాహుల్ గాంధీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే ఉంటుందని అంటున్నారు.