'చేతి' లో అంతఃపుర కుట్ర | conspiracion in congress party leadership | Sakshi
Sakshi News home page

'చేతి' లో అంతఃపుర కుట్ర

Published Sat, Jul 5 2014 11:46 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'చేతి' లో అంతఃపుర కుట్ర - Sakshi

'చేతి' లో అంతఃపుర కుట్ర

రాహుల్ ఒంటికి రాజకీయ అధికారం ఏ మాత్రం సరిపడదని దిగ్విజయ్ ఎప్పుడు నిర్ధారణకు వచ్చారు? 2014 సాధారణ ఎన్నికలకు ముందు, ప్రచార ఘట్టంలో ఆయన మీద కాంగ్రెస్ అపారమైన ఆశలు పెట్టుకున్న సమయంలోనే ఇలాంటి నిర్ధారణకు వచ్చేశారా? కాంగ్రెస్‌కు కడు దీనమైన పరిస్థితిని కల్పించిన ఫలితాలు చూశాక  వచ్చారా?
 
ప్రజాస్వామిక వ్యవస్థలో ఎదురయ్యే ఒక కఠోర వాస్తవం ఏమిటంటే, ఒకసారి ఒక ప్రకటన చేస్తే,  దాన్ని చెరిపివేయడం ఇక బ్రహ్మతరం కూడా కాదు. కాబట్టే ఉత్తమ రాజకీయవేత్తలు వారు ఎంతో జాగ్రత్తగా  చెప్పిన విషయానికి, వారు చెప్పకుండా వదిలిపెట్టిన దానితోనే ఓ ముసుగు కప్పి ఆసక్తి రేకెత్తేటట్టు అంతే జాగరూకత వహిస్తారు. ఇక ఉత్తమోత్తములైన రాజకీయవేత్తలైతే తాము చెప్పిందాన్ని పత్రికా రచయితలు విశ్లేషించడానికి ఉబలాటపడేటట్టు చేయవచ్చు.
 
మాటలాడడం తప్ప, రోజంతా పొద్దు పుచ్చడానికి  మరో పనేదీ లేకపోతే, కాంగ్రె స్‌లో కాకలు తీరిన దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకుడి నోటి నుంచి కూడా, అభేద్యమైన అన్ని అవరోధాలను దాటుకుని కొన్ని అప్రియ సత్యాలు బయటకు ఉరుకుతూ ఉంటాయి. రాజకీయాధికారమంటే వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధీ ఒంటికి ఏమా త్రం సరిపడదంటూ ఆయన ఇచ్చిన ప్రక టన సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే వెలు వడి ఉంటుంది. తప్పుని ఎప్పుడైనా సరిదిద్దుకోవచ్చు. కొన్ని మినహాయింపులతో అబద్ధం సంగతి కూడా అంతే. అవి వాటికవే సమసిపోతాయి కూడా. కానీ తెలిసో తెలియకో సత్యాన్ని ప్రజలంతా చర్చించుకునే విధంగా వదిలిపెట్టి ఆ తరువాత నాలుక్కరుచుకుని  ఎంత ప్రయత్నించినా మళ్లీ  వెనక్కి లాక్కుని రావడం సాధ్యం కాదు.
 
రాహుల్‌గాంధీకి రాజకీయాలలో మహాత్మా గాంధీలా అవతరించే ఉద్దేశాలేమీ లేనపుడు, కాంగ్రెస్ పార్టీ తన భావి ఆశలన్నింటినీ ఆయన మీదే ఎందుకు పెట్టుకున్నట్టు? ఇది ఎవరికైనా వెంటనే వచ్చే ధర్మసం దేహం. అసలు రాహుల్ ఒంటికి రాజకీయ అధికారం ఏ మాత్రం సరిపడదని దిగ్విజయ్ ఎప్పుడు నిర్ధారణకు వచ్చారు? 2014 సాధారణ ఎన్నికలకు ముందు, ప్రచార ఘట్టంలో ఆయన మీద కాంగ్రెస్ అపారమైన ఆశలు పెట్టుకున్న సమయంలోనే ఇలాంటి నిర్ధారణకు వచ్చేశారా? కాంగ్రెస్‌కు కడు దీనమైన పరిస్థితిని కల్పిం చిన ఫలితాలు చూశాక  వచ్చారా? లేకపోతే, ఎన్నికల సమరం మధ్యలో విశ్రాంతి కోసం రాహుల్ గాంధీ పరుగెట్టిన మరు క్షణంలో ఇలాంటి నిర్వేదానికి దిగ్విజయ్ వచ్చారా? లేదంటే అసలు ఓటర్లతో రాహుల్ గాంధీ మమేకం కాలేకపోయిన పుడు ఈ జ్ఞానోదయం అయిందా?
 
 ఇతరులు ఎవరినీ అడగలేరు కనుక చతికిలపడిన కాంగ్రెస్‌వారు తమని తామే ప్రశ్నించుకుంటు న్నారు- రాహుల్ గాంధీ ఇంత కంటే మెరుగైన రీతిలో వ్యవహరిం చగలరని అనుకోవడానికి ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా? తన కవి హృదయం ఎదుటివారికి బోధపడే విధంగా చేసుకుని, రాజ కీయాల గురించి ఆలోచించగలిగే మనిషిగా ఆయన తనను తాను మలుచుకోగలరా? కానీ, రాహుల్ మాత్రం  ఇంతవరకు  ఏంటినా నుంచి సంకేతాలు తెగిపోయిన రేడియోలా మౌన ముద్ర దాల్చడానికి పరిమితమయ్యారు.

త్వరలోనో, సంవత్సరంలోనో, లేదా ఆ తరువాతే గానీ జరిగే ఎన్నికలేమీ లేవు.  ఉన్నా అవన్నీ విపక్ష జడత్వంతో ఉంటాయి. ఇంతలో తెరమరుగు కావడమనే ప్రమాదం ఉంది. ఒకవేళ రాహుల్‌కు అధికార రాజకీయాల పట్ల ఆసక్తి లేకుంటే, ఆయన దిగ్మండలంలో మరో రాజకీ యం ఏదీ లేదు కూడా. అంటే వెల్లకిలా శయనించాలని రాహుల్ గాంధీ గట్టిగా ఆకాంక్షిస్తున్నారన్నమాట.
 
రాహుల్ గాంధీ రాజకీయ జీవితం నుంచి వైదొలగి, తన స్థానాన్ని సోదరి ప్రియాంక వాద్రాకి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీలో సంతోషించే వారి సంఖ్య పెరుగుతుందన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబ సంస్థగా చెలామణిలో ఉంది కాబట్టి, సదరు కుటుంబం బయట నుంచి కొత్త నాయకుడు ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఇప్పుడు పార్టీ ఎదురు చూడడం సాధ్యం కాదు. అయితే తిరస్కరించడానికి వీల్లేని రీతిలో వర్ధిల్లుతున్న గుసగుసలు కొన్ని కాంగ్రెస్ వారిలో ఉత్కంఠకు కారణమవుతున్నాయి.

అందుకే కొందరు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అమాయకంగా చేసినవి  కాదని చెబుతున్నారు. కాంగ్రెస్ వాణిగా, పార్టీని ముందుండి నడిపించే నేతగా ప్రియాంకకు పట్టం కట్టే దృశ్యాన్ని వీక్షించడానికీ, పార్టీని పునర్ నిర్మించాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే వీలు కల్పిస్తూ రాహుల్‌ను ప్రవాసానికి అనుమతించడానికీ సంబంధించిన దృశ్య మాలికను చూపించే అంతఃపుర కుట్ర ఇప్పటికే ఆరంభమైందనీ, దిగ్విజయ్ వ్యాఖ్యలు దీనినే సంకేతిస్తున్నాయని పార్టీలో కొందరు భాష్యం చెప్పేవరకు వెళ్లారు.
 
జమీందారీ విధానం మీద పరిశోధన చేసిన ఏ చరిత్ర పరిశోధకునికైనా కాంగ్రెస్ సంక్షోభం కరతలామలకమంటే అతిశయోక్తి కాదు. వేరే ఎక్కడో ఉండి, జమీందారీ వ్యవహారాలను చక్కబెట్టాలనుకునే భూస్వామి గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది కేవలం భౌతికంగా గైర్హాజరు కావడం గురించిన ప్రశ్న ఒక్కటే కాదు. నిజానికి అంశం కూడా ఇందులో ఉందనుకోండి. రాహుల్ గాంధీకి విదేశాలకు వెళ్లాలని ఉంది. అందుకే ఇండియాలో ఉన్నప్పటికీ ఆయన భౌతికంగా గైర్హాజరైనట్టే. నాయకుడంటే పార్టీకీ, క్రింది శ్రేణి కార్యకర్తల వరకు అందరికీ అందుబాటులో ఉండాలి.
 
ముఖ్యంగా ఘోర పరాజయం తరువాత ఇది మరింత అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, పునర్ వైభవం సంగతి దేవుడెరుగు, అసలు బతికి బట్టకడితే చాలు అన్నట్టే ఉంది. విజయంలోనే కాదు, ఓటమి సమయంలోనూ నాయకుడు అవసరమే. అప్పుడే పార్టీని ముందుండి నడిపించగలరు. సలహాదారులు వాళ్ల స్థానాలలో ఉంటారు. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉండవలసిన చోట ఉంటుంది. అయితే అగ్రశ్రేణి నాయకత్వం చతికిల పడితే ఇవేమీ సాధ్యం కాదు. ఏమీ జరగదు. కాంగ్రెస్ ప్రయోజనాలనే గుండె అంతా నింపుకున్న దిగ్విజయ్ వంటి వారి అంతరంగం ఇదే కావచ్చు.
 
 బహుశా రాహుల్ ఆత్మతృప్తి తత్వంలో పడినట్టు ఉన్నారు. దీని సమర్థకులు దీనికీ ఉన్నారు.  రెండేళ్లు కదలకుండా కూర్చో. ప్రస్తుత ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయే వరకు ఓపిగ్గా వేచి ఉండు. అప్పుడే నేను రక్షకుడిని అంటూ ధీరత్వం ప్రదర్శించు- అంటుంది ఈ తత్వం. ఓటర్లు కూడా అలాంటి ఆత్మ తృప్తి పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటి తత్వం అంతగా రాణించదని చెప్పే ఉదంతాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టు, ఇతర రాజకీయ పార్టీలు  కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడానికి పొంచి ఉన్నాయి. మమతా బెనర్జీ, జయలలిత వంటి నాయకురాళ్లు ఓటమిని ఎదర్కొన్నా, మళ్లీ పోరాడారు. వాళ్లు ఎప్పుడూ యుద్ధభూమిని విడిచిపెట్టి పోలేదు.
 
దిగ్విజయ్ సింగ్ ఇద్దరితో మాట్లాడారు- ఒకరు ప్రజలు, రెండు కాంగ్రెస్‌ను గుప్పిట్లో పెట్టుకున్న కుటుంబంతో. ఆయన మార్పు గురించి మాట్లాడడం లేదు. కానీ ఎక్కడో ఉన్న భూస్వామి పనులు జరిగేటప్పుడు పొలం దగ్గర ఉండాలని కోరుతున్నారు. అయినా జమీందారీ వ్యవస్థ శాశ్వత ఒప్పందం మీద ఆధారపడి ఉంది కాబట్టి, భూస్వామిని మార్చడం కూడా అంత సులభం కాదు. అయితే భూస్వామి నిర్లక్ష్యం చేసిన జమీన్‌లు భ్రష్టుపట్టాయి. మాజీ సంస్థానాధీశుడు కాబట్టి దిగ్విజయ్‌సింగ్‌కు ఈ అంశం బాగా తెలుసు.

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement