MJ Akbar
-
ఆత్మవిశ్వాసమిచ్చే తీర్పు
మూడేళ్లక్రితం మన దేశంలో రగుల్కొన్న ‘మీ టూ’ ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో వేధింపులు, వివక్ష, అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా కుమిలిపోయే మహిళా లోకానికి ఆత్మసై్థర్యాన్నిచ్చే ఘట్టం. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తన పరువు దిగజారుస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా చెల్లుబాటు కాదని ఢిల్లీ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ఎంజే అక్బర్ పత్రికా సంపాదకుడిగా ఉన్న ప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని, అసభ్యంగా ప్రవర్తించేవారని పలువురు మహిళలు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలనీ, ఈ అసత్యారోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానని అప్పట్లో అక్బర్ హెచ్చరించారు. చివరకు ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత మన దేశంలో తొలిసారి బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సినీ రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు. ఆ తర్వాత ఫేస్బుక్ వేదికగా కొందరు మహిళలు తమకెదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. అందుకు కారకులెవరో వారి పేర్లతో సహా వెల్లడించారు. అయితే తమ వివ రాలేమిటో, ఆ వేధింపుల స్వభావం ఎటువంటిదో చెప్పకుండా, గోప్యంగా వుండి ఆరోపించే ధోరణి సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అది దాదాపు చల్లబడిపోతున్నదని అందరూ అనుకునే సమయంలో ప్రియా రమణి నేరుగా అక్బర్ పేరు వెల్లడించి, ఆయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేశారు. విచారణ సందర్భంగా అప్పట్లో తన వయసుకూ, ఆయన వయ సుకూ... ఆ సంస్థలో ఆయనకుండే పలుకుబడికీ... తన నిస్సహాయతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని వివరించారు. ఇవి బయటపెట్టడంలో తనకెలాంటి స్వప్రయోజనాలూ, దురుద్దేశాలూ లేవని చెప్పారు. ఈమధ్య ‘బ్రాస్ నోట్‌బుక్’ పేరుతో తన ఆత్మకథను వెలువరించిన ప్రముఖ ఆర్థికవేత్త దేవకీ జైన్ 1958లో పాతికేళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తనకెదురైన చేదు అనుభవాలనూ, అవి అనంతర కాలంలో తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనను ప్రతిఘటించినందుకు ఉద్యోగం కోల్పోవటంతోపాటు తన ఆత్మ విశ్వాసం ఎలా దెబ్బతిన్నదో తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే ప్రతి మహిళా ఇలాంటి దుస్థితిలోనే పడతారు. ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అన్నట్టు ఇలాంటి వేధింపులన్నీ మహిళ ఒంటరిగా వున్నప్పుడే జరుగుతాయి. వేధింపులకు పాల్పడే మాయగాళ్లు నలుగురిలో వున్నప్పుడు మర్యాదస్తుల్లా ప్రవ ర్తిస్తారు. మంచివారిలా మెలుగుతారు. అందువల్లే బాధిత మహిళ సహోద్యోగులకు చెప్పడానికి సంశయిస్తుంది. చెప్పినా తననే దోషిగా పరిగణిస్తారన్న భయం ఆమెను ఆవహిస్తుంది. చేస్తున్న ఉద్యోగం పోతుందేమోనని సందేహిస్తుంది. దీర్ఘకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని ‘మీ టూ’ ఉద్యమం బద్దలుకొట్టింది. దీనికి ముందు మన దేశంలో ఎవరూ ప్రశ్నిం చలేదని కాదు. రాజస్తాన్ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం 1997లోనే కీలకమైన తీర్పు వెలువరించింది. పనిచేసేచోట మహిళలకు వేధింపులు ఎదురుకాకుండా వుండటానికి తీసు కోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి చేష్టలు లైంగిక వేధింపులకిందికొస్తాయో ఆ మార్గదర్శకాలు వివరించాయి. ఆ తర్వాత పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు 2013లో ఒక చట్టం వచ్చింది. అయితే విషాదమేమంటే చట్టపరంగా ఎన్ని రక్షణలు కల్పించినా వేధింపులూ, వివక్ష సమసి పోలేదు. అటువంటి మహిళలకు ధైర్యాన్నిచ్చే విధంగా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు సైతం పట్టనట్టు వ్యవహరించటం అందుకు కారణం. రెండున్నర దశాబ్దాలక్రితం జరిగిందంటూ తనపై ప్రియా రమణి చేసిన ఆరోపణలవల్ల పాత్రికేయుడిగా, పత్రికా సంపాద కుడిగా జీవితపర్యంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ అక్బర్ చేసిన వాదనను మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అంగీకరించలేదు. మీ పరువు కోసం ఒక మహిళ జీవించే హక్కును పణంగా పెట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు. వేధింపులు ఎదుర్కొనటమేకాక, ముద్దాయిగా బోనులో నిలబడవలసివచ్చిన బాధితురాలి స్థితిగతుల్ని అవగాహన చేసుకుని ఎంతో పరిణతితో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గది. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కోసం ప్రియా రమణి 50 సార్లు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది. కేసులో ఓడిపోతే చెల్లించాల్సిన పరిహారం సంగతలావుంచి, క్రిమినల్ కేసు ఎదుర్కొనాల్సివచ్చేది. కానీ ఆమె నిబ్బరంగా పోరాడారు. ఆమె తరఫు న్యాయవాది రెబెకా జాన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పనిచేసే చోట నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న లక్షలాదిమంది బాధిత మహిళలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దోషులను బయటికీడ్చేందుకు దోహద పడుతుంది. -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
మీటూ : కేంద్రమాజీ మంత్రికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : చిత్ర పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి చేసిన అరోపణలు అప్పట్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. తనపై ప్రియా తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎంజే అక్బర్ కోర్టును ఆశ్రయించారు. ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది. బాధితురాలిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్‌కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది. గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. -
‘ఎంతో కోల్పోవాల్సి వస్తుందని తెలుసు’
న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళ ధైర్యంగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ పాత్రికేయురాలు ప్రియా రమణి అన్నారు. తమను వేధించిన వారికి ఎదురు తిరిగి యుద్ధం చేసినపుడే ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రకంపనలు రేపిన మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ జర్నలిస్టు, మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి గతేడాది సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జాబ్ ఇంటర్వ్యూలో భాగంగా తనను హోటల్ గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వికృత చేష్టలతో అక్బర్ తనను మానసికంగా హింసించాడని తెలిపారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళా జర్నలిస్టులు ప్రియను స్పూర్తిగా తీసుకుని అక్బర్ కారణంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బహిర్గతం చేశారు. దీంతో అక్బర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించింది. చదవండి: #మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రియా రమణి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంజే అక్బర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఇందులో భాగంగా ప్రియా రమణి సోమవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫు న్యాయవాది సంధించిన ప్రశ్నలకు బదులుగా...ఎంజే అక్బర్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే నేను నిజాలు మాట్లాడాను. మీటూ ఉద్యమంలో భాగంగా నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా.. పని ప్రదేశాల్లో తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళా ధైర్యంగా ముందుకు వస్తారనే ఆశతో నిజాలు మాత్రమే చెప్పాను. ఈ కేసు వల్ల వ్యక్తిగతంగా నేనెంతగానో కోల్పోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నిశ్శబ్ధంగా ఉంటే ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అది సరైంది కాదు. నన్ను టార్గెట్ చేయడం ద్వారా ‘అక్బర్ బాధితుల’ నోరు మూయించాలనేదే వారి ఉద్దేశం’ అని ప్రియా రమణి న్యాయమూర్తికి విన్నవించారు. -
‘ఆమె నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం’
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ ప్రియా రమణి తనపై చేసిన ట్వీట్లు, కథనాలు పని ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల సమస్యపై దృష్టి సారించడానికి ఉద్దేశించినవిగా పేర్కొనడం తప్పని కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు. ప్రియా రమణిపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం శనివారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియా రమణిని లక్ష్యంగా చేసుకొని తాను పరువునష్టం కేసు వేయలేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 10న కోర్టు విచారణకు హాజరైన ప్రియ రమణి తాను చేసిన ఆరోపణలు సరైనవే అన్నట్లు, ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. మీటూ ఉద్యమం సందర్భంగా ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మొదటి మహిళ ప్రియా రమణి. వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల కారణంగా.. 2018, అక్టోబర్ 17న కేంద్ర మంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయవలసి వచ్చింది. -
#మీటూ : ప్రియా రమణికి బెయిల్
న్యూఢిల్లీ : బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో, రాజకీయాల్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారి ముసుగులు తొలగించింది. ఎంజే అక్బర్ ఏకంగా మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మీద ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియా రమణి మీద అక్బర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రియా రమణి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఇక ఇప్పుడు నా వంతు.. నా కథను ప్రపంచానికి వినిపించే సమయం వచ్చింది. నిజమే నా ఆయుధం’ అని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. (#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ) -
అది అంగీకార సంబంధం కాదు
వాషింగ్టన్: విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్(67) అధికార దుర్వినియోగం, బలప్రయోగంతో తనపై అత్యాచారం చేశారని నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరి మధ్య 1994లో కొన్ని నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగిందన్న అక్బర్ వాదనను ఆమె ఖండించారు. అక్బర్ చేతిలో తనకు ఎదురైన భయానక అనుభవాలపై పల్లవి వాషింగ్టన్ పోస్ట్‌కు ఓ కథానాన్ని రాశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. అక్బర్ లైంగిక వేధింపుల పర్వంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు శుక్రవారం రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అక్బర్ చేతిలో లైంగికదాడులకు గురైన మహిళలు ముందుకొచ్చి నిజాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాతున్నట్లు వెల్లడించారు. తమను అక్బర్ లైంగికంగా వేధించాడని 16 మందికి పైగా మహిళలు ముందుకురావడంతో ఆయన్ను కేంద్రం మంత్రి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. -
అక్బర్‌పై మరో ‘మీ టూ’
వాషింగ్టన్: ప్రముఖ సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్(67) లైంగిక వేధింపులపై మరో బాధితురాలు గళం విప్పారు. 23 ఏళ్ల క్రితం తనపై ఆయన అత్యాచారం చేశారంటూ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘నేషనల్ పబ్లిక్ రేడియో’ చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఒక వార్తా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉన్న ఆ ‘తెలివైన పాత్రికేయుడు’ హోదాను వాడుకుని తనను వలలో వేసుకున్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఆమె రాసిన వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ఏషియన్ ఏజ్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగికదాడికి, వేధింపులకు పాల్పడ్డారంటూ వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో పల్లవి గొగోయ్ ఆరోపించారు. జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని అందులో పేర్కొన్నారు. ‘22 ఏళ్ల వయస్సులో ‘ఏషియన్ ఏజ్’లో చేరా. ఆ సమయంలో అక్బర్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉండేవారు. ఏడాదిలోనే ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి ఎడిటర్‌గా అక్బర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం అద్భుతంగా అనిపించేది. ఆయన వాగ్ధాటి చూసి మైమరిచిపోయేదాన్ని. అయితే, నాకెంతో ఇష్టమైన ఆ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తీసేస్తా.. 1994 వేసవిలో ఒక రోజు ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి నేను రాసిన అద్భుతమైన శీర్షికను చూపిద్దామని అక్బర్ ఆఫీసుకు వెళ్లా. నా ప్రతిభను మెచ్చుకుంటూనే ఆయన అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారు. నేను వెంటనే వెనుదిరిగి బయటకు వచ్చేశా. ఆందోళనకు, అయోమయానికి గురయ్యా’. అక్బర్ మరోసారి ఆఫీసు పనిపై ముంబై తాజ్ హోటల్ రూంకు పిలిపించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను విడిపించుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నా ముఖంపై గోళ్లతో రక్కారు’ అని పల్లవి ఆ వ్యాసంలో వివరించారు. మరోసారి ఇలా అడ్డుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని తెలిపారు. ‘ఓ సారి అసైన్మెంట్ నిమిత్తం జైపూర్‌కు వెళ్లా. అప్పటికే అక్కడ ఓ హోటల్లో ఉన్న అక్బర్ ఆ కథనంపై చర్చించేందుకు రూంకు రమ్మన్నారు. అక్కడే నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేనెంత ప్రతిఘటించినా ఆయన బలం ముందు నిలవలేకపోయా. ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెప్పినా నమ్మరని తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన నాపై మరింత అధికారం చెలాయించ సాగారు. ఆయన చూస్తుండగా నేను తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా సహించేవారు కాదు’ అని పేర్కొన్నారు. నాపై అలా ఎందుకు పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చానన్నదే నాకు అర్థం కాలేదు. బహుశా ఉద్యోగం పోతుందని భయపడి ఉంటా. నన్ను నేనే అసహ్యించుకుంటూ కుమిలిపోసాగా’. బ్రిటన్, యూఎస్ పంపిస్తా.. 1994 డిసెంబర్లో ఎన్నికల కవరేజీపై అక్బర్ నన్ను మెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అమెరికా కానీ, బ్రిటన్ కానీ పంపిస్తానన్నారు. ఆ విధంగానైనా వేధింపులు లేకుండా దూరంగా ఉండొచ్చని ఆశించా. కానీ, ఢిల్లీకి దూరంగా ఉండే అలాంటి చోట్లకు ఎప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. నాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చన్నది ఆయన వ్యూహమని నేను ఊహించలేదు. లండన్‌లోని పత్రిక ఆఫీసులో ఓ సహోద్యోగితో మాట్లాడుతుండగా గమనించిన అక్బర్..తిడుతూ నాపై చేయిచేసుకున్నారు. ఓ కత్తెరతోపాటు టేబుల్‌పై ఉన్న వస్తువులని నాపై విసిరేశారు. వాటి నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్ప్లేస్కు పారిపోయా. ఈ ఘటనతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నా. ఈ ఘటన తర్వాత అక్బర్ నన్ను తిరిగి ముంబైకి పిలిపించారు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్‌లోని ‘డౌజోన్స్’ పత్రికలో చేరాను’ ప్రతిభతో ఎదిగా.. ‘ఇప్పుడు నేను యూఎస్ పౌరురాలిని. ఒక భార్యగా, తల్లిగా ఉంటూ నా పాత్రికేయ వృత్తిని ఆనందంగా కొనసాగిస్తున్నా. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నా. నా ప్రతిభ, కష్టంతో డౌజోన్స్, బిజినెస్ వీక్, యూఎస్ఏ టుడే, అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో అత్యున్నత హోదాలో ఉన్నా. మీటూలో పలువురు మహిళలు చేసిన ఆరోపణలను నిరాధారాలంటూ అక్బర్ ఖండించడం, ఒక మహిళపై పరువు నష్టం కేసు వేయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అప్పట్లో ఆయన మా శరీరాలపై అధికారం చెలాయించినట్లుగానే, ప్రస్తుతం ’నిజం’ అనే దానికి తనదైన శైలిలో భాష్యం చెప్పాలని చూస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం:ఎడిటర్స్ గిల్డ్ ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సభ్యుడు కూడా అయిన ఎంజే అక్బర్‌పై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. పరస్పర అంగీకారంతోనే: అక్బర్ పల్లవి గొగోయ్ ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ సంబంధం నా కుటుంబ జీవితంలోనూ కలతలకు కారణమైంది. ఇద్దరి అంగీకారంతోనే ఈ సంబంధం ముగిసింది’ అని పేర్కొన్నారు. అక్బర్ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారు. అప్పట్లో ఆమె నా భర్తతో నెరిపిన సంబంధం గురించి నాకు తెలుసు. నా భర్తకు అర్ధరాత్రిళ్లు ఆమె ఫోన్ చేసేవారు. నా సమక్షంలోనే అక్బర్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎందుకు చెబుతోందో తెలియదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే’ అని ఆప్రకటనలో పేర్కొన్నారు. -
మీటూ: స్పందించిన ఎంజే అక్బర్ భార్య
-
అక్బర్‌పై ఆరోపణలు : సంచలన విషయాలు వెల్లడించిన భార్య
న్యూఢిల్లీ : ‘మీటూ ఉద్యమం’లో భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో జర్నలిస్ట్‌గా స్థిరపడిన పల్లవి గొగోయ్.. ఎంజే అక్బర్ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. అయితే పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలపై ఎంజే అక్బర్‌తో పాటు ఆయన భార్య మల్లికా అక్బర్ కూడా స్పందించారు. అక్బర్‌పై ఎంతమంది ఆరోపణలు చేసిన పెదవి విప్పని ఆయన భార్య పల్లవి గొగోయ్ ఆరోపణల విషయంలో మాత్రం తన భర్తకు మద్దతుగా నిలవడమే కాకా ఆమె అబద్దాలు ప్రచారం చేస్తోందంటూ పల్లవి గొగోయ్‌పై మండి పడ్డారు. పల్లవి గొగోయ్ ఆరోపణలపై స్పందించిన ఎంజె అక్బర్.. ‘1994 సమయంలో పరస్పర అంగీకారంతో మా ఇద్దరి(పల్లవి గొగోయ్, తనకు) మధ్య ఒక బంధం ఉన్న మాట వాస్తవం. ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది. మా బంధం గురించి అందరికి తెలుసు. చాలా మంది మా ఇద్దరి గురించి మాట్లాడుకునే వారు. దీని వల్ల నా ఇంటిలో కలతలు కూడా చెలరేగాయి. కొన్నాళ్లకు ఈ బంధం ముగిసింది. అయితే ఈ బంధానికి ఒక మంచి ముగింపు మాత్రం ఇవ్వలేకపోయాము’ అంటూ అక్బర్ చెప్పుకొచ్చారు. అక్బర్ భార్య మల్లికా అక్బర్ మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కాపురంలో కలతలు రేపింది. పల్లవి రాత్రి పూట నా భర్తకు ఫోన్ చేసేది. పబ్లిక్‌లో నా ముందే నా భర్త మీద ప్రేమ చూపించేది. వీటన్నింటిని చూసిన తర్వాత నాకు వారి బంధం గురించి పూర్తిగా అర్థమయ్యింది. ఈ విషయం గురించి మా భార్యభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. చివరకూ నా భర్తలో మార్పు వచ్చింది. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు. అంతేకాక ఇప్పుడు పల్లవి ఎందుకు ఇలాంటి అబద్దాలు చెప్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. పల్లవి చేసిన ఆరోపణలన్ని అవాస్తవాలేనంటూ ఖండించారు. -
#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీసాయి. జర్నలిస్టు ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా, ప్రియా రమణిపై పరువు నష్టం కేసు లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఆయన ఒక పాత్రికేయుడుగా ఎంతటి ప్రతిభావంతుడో.. మహిళలను వేధించడంలో అంతే స్థాయికి దిగజారి ప్రవర్తించేవాడు అనేది ఆయా ఆరోపణల సారాంశం. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అమెరికాలో ప్రముఖ జర్నలిస్టుగా స్థిరపడిన, నేషనల్ పబ్లిక్ రేడియోలో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ పంచుకున్న లైంగిక వైధింపులు, అత్యాచారం ఆరోపణలు మరో ఎత్తు. 23 సంవత్సరాలుగా తన గుండెను మెలిపెడుతున్న, తన జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలను వాషింగ్ పోస్ట్‌లో షేర్ చేశారు. ముఖ్యంగా భారతదేశంలో అక్బర్‌పై చెలరేగిన ఆరోపణలు, వాటిని ఆయన ఖండించిన తీరు చూసిన తరువాత తన స్టోరీని కూడా చెప్పాలనుకుంటున్నానంటూ ఎడిటర్ ఇన్ ఛీప్‌గా అక్బర్ తను మానసికంగా, శారీరంగా వేధించిన వైనాన్ని పల్లవి వెల్లడించారు. అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు మీటూ అంటూ ముందుకు వచ్చిన తీరు, ఆక్రోశం కదిలించింది. అందుకే అక్బర్‌పై పోరుకు సిద్దమైన మహిళలందరికీ మద్దతుగా తన గాథను చెబుతున్నాన్నారు. ఇకనైనా తానేం చేసినా చెల్లుతుంది అనే అక్బర్ లాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలని ఈ సందర్బంగా ఆమె కోరుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి చెందిన విదేశాంగశాఖలో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా అక్బర్ పనిచేశారు. బేటీ బచావో అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పాలక పార్టీకి ఇప్పటికీ సభ్యుడుగా, ఎంపీగా ఉన్నారని పల్లవి ఎద్దేవా చేశారు. ఏసియన్ ఏజ్‌లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు నాకు 22ఏళ్లు. అక్కడ చాలామంది మహిళలున్నారు. జర్నలిజంలో ఓనమాలు కూడా రాని సమయమది. కొద్దికాలంలోనే, చిన్నవయసులోనే ఏసియన్ ఏజ్‌లో ఆపోజిట్ ది ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్‌గా పెద్ద బాధ్యత నిర్వహించాను. భారతీయ రాజకీయ ప్రముఖులు, ప్రముఖ రచయితలు, మేధావులు, ముఖ్యంగా జస్వంత్ సింగ్, అరుణ్ శౌరీ, నళినీ సింగ్ వంటి ప్రముఖులతో మాట్లాడేదాన్ని. న్యూఢిల్లీలో ఎంజే అక్బర్ లాంటి గొప్ప జర్నలిస్టుతో పనిచేయడం గర్వంగా భావించే దాన్ని. ఆయన స్థాయికి ఎదగాలని కలలు కనేదాన్ని. కానీ తన కెంతో ఇష్టమైన ఉద్యోగం కోసం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చిందంటూ అక్బర్ నిజస్వరూపం గురించి ఈ ఇండో అమెరికన్ జర్నలిస్టు పల్లవి వాషింగ్టన్ పోస్టులో షేర్ చేశారు. మొదటి సంఘటన 1994 సంవత్సరంలో తన పేజీ చూపించడానికి ఆయన క్యాబిన్‌కి వెళ్లాను. ఆయన నన్నుపొగుడుతూనే. అకస్మాత్తుగా ముద్దుపెట్టుకోవడానికి ముందుకొచ్చాడు. తీవ్ర గందరగోళం, అవమానం మధ్య బయటికి పరుగెత్తాను. ఈ విషయాన్ని నా ఫ్రెండ్ తుషితకు వెంటనే (ఆమె ఒక్కదానికే) చెప్పుకున్నాను. రెండవ సంఘటన కొన్ని నెలల తర్వాత మరో సంఘటన. ఈసారి ముంబైలో. ఒక పత్రికను ప్రారంభించటానికంటూ ముంబైలోని తాజ్ హోటల్లోని తన గదికి అక్బర్ నన్ను పిలిచాడు. అక్కడ మళ్ళీ ముద్దు పెట్టుకోవటానికి వచ్చినప్పుడు , తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయాను. ఆ సందర్భంలో హోటల్ దగ్గర పడిపోయాను, దెబ్బలు కూడా తగిలాయి. దీంతో ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత అక్బర్ నాపై ఎగిసి పడ్డాడు. తనకు లొంగకపోతే ఉద్యోగంనుంచి తీసేస్తానని బెదిరించాడు. అయినా నేను వెరవలేదు. అత్యాచార పర్వం ఉదయం 8 గంటలకే ఆఫీసుకు చేరుకుని పని పూర్తి చేసుకుని, ఎడిటోరియల్ పేజీలు సిద్ధంగా ఉంచి ఆయన్నుంచి తప్పించుకుని పారిపోయేదాన్ని. చాలాసార్లు రిపోర్టింగ్ వెళ్లిపోయేదాన్ని. ఈ క్రమంలోనే ఢిల్లీకి దూరంలో ఒక ప్రేమజంట(వేరు వేరు కులాలు)ను కుటుంబ సభ్యులు ఉరితీసిన భయానక ఉదంతాన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్లాను. ఈ ఎసైన్మెంట్ జైపూర్‌లో పూర్తి చేసుకొని, తిరిగి వచ్చేలోపు అక్బర్నుంచి కాల్. స్టోరీ గురించి మాట్లాడాలని హోటల్‌కు రమ్మన్నాడు. భయపడుతూనే వెళ్లాను. హోటల్ గదిలో అతను విలాసంగా. మళ్లీ ఎటాక్ చేశాడు. కానీ ఈసారి ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. శారీరకంగా బలవంతుడైన అక్బర్ నన్ను వశం చేసుకుని, రేప్ చేశాడు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేనంత అవమానంతో కుంగిపోయాను. దీని గురించి ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా చెబితే నమ్ముతారా? అసలు హోటల్ గదికి ఎందుకు వెళ్ళానంటూ నన్ను నేను నిందించుకుంటూ మిన్నకుండిపోయాను. దీంతో నాపై మరింత పట్టు బిగించిన అక్బర్ తన దాడి కొనసాగించాడు. పురుష సహోద్యోగులతో మాట్లాడటం చూస్తే చాలు..రెచ్చిపోయేవాడు. డెస్క్‌లో అందరిముందే గట్టి అరవడం, తిట్టడం చేసేవాడు. జీవితంలో అన్నింటిపైనా పోరాడిన నేను అతనితో ఎందుకు పోరాడలేకపోయాను? ఎందుకంటే..అతను నాకంటే అన్నివిధాలుగా శక్తివంతుడు. ఎన్నడూ ఊహించని ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. పైగా ఈ విషయంలోఅంతకుముందు పోరాడిన వాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు. ఒకపక్క ఉద్యోగం పోతుందన్న భయం. మరోపక్క ఎక్కడో దూరంగా ఉన్న తల్లిదండ్రుల వద్ద నా నిజాయితిని ఎలా నిరూపించుకోవాలన్న ఆవేదన. తెలిసిందల్లా ఒకటే.. నన్ను నేను ద్వేషించుకుంటూ ప్రతిక్షణం చస్తూ బతకడం. రిపోర్టింగ్ కోసం ఎపుడెపుడు దూరంగా పోదామా అని చూస్తూ ఉండేదాన్ని. ఇంతలో డిసెంబరు, 1994 కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. ఈ సందర్భంగా పొలిటికల్ రిపోర్టింగ్‌లో పట్టును, గుర్తింపును, అనుభవాన్ని సాధించాను. దీనికి గుర్తింపుగా విదేశీ కరస్పాండెంట్‌గా యూఎస్, యూకే పంపిస్తున్నానని అక్బర్ చెప్పాడు. ఆశ్చర్యపోయాను. అలాగైనా అతని వేధింపులనుంచి దూరంగా వెళ్లొచ్చని సంబరపడ్డాను. కానీ అది తప్పని తరువాత తెలిసింది. దూరంగా ఉంటే నాకు రక్షణ ఉండదు కనుక తన వేట నిరాటంకంగా కొనసాగించవచ్చనేది అక్బర్ ప్లాన్. మళ్లీ వేట షురూ. ఒకసారి లండన్ ఆఫీసులో పురుష కొలీగ్‌తో మాట్లాడుతుండగా నాపై అక్బర్ మరోసారి విరుచుకుపడ్డాడు. డెస్క్‌లో పేపర్ వెయిట్, కత్తులు, చేతికి ఏది దొరికితే అది తీసుకొని నా మీదకు విసిరి పారేశాడు. దీంతో భయపడి లండన్ ఆఫీసునుంచి పారిపోయి సమీపంలోని ఒక పార్క్‌లో ఒక గంట దాక్కుని ఇంటికి చేరాను. ఆ మర్నాడు తుషిత, సుపర్నతో నా బాధను షేర్ చేసుకున్నాను. మానసికంగా, శారీరకంగా చితికిపోయాను. దుర్మార్గుడి నుంచి పారిపోతున్నానని చెప్పాను. లండన్ నుంచి వచ్చేయాలనుకుంటున్నానని అమ్మానాన్న, చెల్లికి కూడా చెప్పాను. విదేశీ ప్రతినిధిగా వీసా వుంది కదా అమెరికాలో కొంతమంది సీనియర్ ఎడిటర్ల సాయంతో పని చేసుకుందాం అనుకున్నా..కానీ ఇంతలో ముంబైకి తక్షణమే రమ్మంటూ అక్బర్ ఆజ్ఞాపించాడు. దీంతో ఇక ధైర్యంగా రిజైన్ చేశాను. ఆ తరువాత డౌజోన్స్‌లో అసిస్టెంట్ రిపోర్టర్‌గా జాయిన్ అయ్యాను. నేనిష్టపడే జర్నలిజాన్ని దక్కించుకున్నాను. ముక్కలుగా విరిగిపోయిన జీవితాన్ని తిరిగి దక్కించుకున్నాను. కృషి, పట్టుదల, టాలెంట్‌తో ఉన్నత స్థాయికి ఎదిగాను. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో ఛీప్‌గా ఉన్నాను. పెళ్లికి ముందే నా భర్తకు ఇవన్నీ చెప్పాను. ఇపుడు ఇద్దరు బిడ్డలకు తల్లిని. బాధిత మహిళలకు మద్దతుగా ఉండటంతోపాటు యవ్వనంలో ఉన్న నా కొడుకు, కూతురుకోసం కూడా ఇది రాస్తున్నా. ఎవరైనా వేధిస్తున్నపుడు, బాధిస్తున్నపుడు తిరగబడాలని వారూ తెలుసుకోవాలి. నా గురించి ఎవరు ఎలా అయినా అనుకోనీ, ఆ చీకటి క్షణాలనుంచి బయటపడ్డాను. ఇలాగే ముందుకు సాగుతాను. ఇది పల్లవి గొగోయ్ ఆవేదన. మరోవైపు ఈ ఆరోపణలను ఎంజే అక్బర్ తిరస్కరిస్తున్నారని ఆయన న్యాయవాది సందీప్ కపూర్ వెల్లడించారు. -
మీటూ : పరువు నష్టం దావాపై ఈనెల 31న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తనను మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన జర్నలిస్ట్ ప్రియా రమణిపై దాఖలైన పరువు నష్టం దావాపై ఢిల్లీ కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. 20 ఏళ్ల కిందట ఎంజే అక్బర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ప్రియా రమణి ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ట్వీట్లతో మాజీ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అక్బర్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన తరపు న్యాయవాది గీతా లూథ్రా అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్‌కు నివేదించారు. ఈ ఆరోపణల ఫలితంగా అక్బర్ మంత్రి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. జర్నలిస్టుగా అక్బర్ ప్రతిష్టను ప్రస్తావిస్తూ ఆయన 40 ఏళ్లుగా సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులను ఈ ఆరోపణలు దెబ్బతీశాయంటూ ఆయన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన క్లెయింట్ ప్రతిష్టను దిగజార్చేలా ప్రియా రమణి ట్వీట్ చేశారని, ఆమె రెండో ట్వీట్‌ను 1200 మంది లైక్ చేశారని, ఇది తన క్లెయింట్ ప్రతిష్టను దెబ్బతీయడమేనని లూథ్రా వాదించారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఈ ట్వీట్లను ప్రస్తావించారని, తన ఆరోపణలను ఆమె నిరూపించలేకపోతే ఈ ట్వీట్లు అక్బర్ ప్రతిష్టను మసకబార్చేవేనని పేర్కొన్నారు. లూథ్రా వాదనలు విన్న అనంతరం అక్టోబర్ 31న అక్బర్ స్టేట్మెంట్ను నమోదు చేయాలని, దీనిపై తాము సంతృప్తికరంగా ఉంటే ప్రియా రమణికి నోటీసులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. తనపై పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఎంజే అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అక్బర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇది రాజకీయ కుట్రేనని అభివర్ణించారు. మరోవైపు సత్యమే తనకు బాసటగా నిలుస్తుందని ప్రియా రమణి పేర్కొన్నారు. -
‘మీ టూ’కు తొలి వికెట్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది. వ్యక్తిగతంగానే పోరాడుతా.. వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు. దోవల్‌ను కలిశాకే నిర్ణయం.. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యాకే అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్‌కు దోవల్ తెలిపారు. అక్బర్ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్‌పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్ రాజీనామా చేసినట్లు సమాచారం. -
ఎట్టకేలకు రాజీనామా!
‘మీ టూ’ ఆరోపణలను బేఖాతరు చేస్తూ వచ్చిన విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె. అక్బర్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఒక మహిళా జర్నలిస్టుపై తాను పెట్టిన పరువు నష్టం కేసు విచారణకు రావడానికి ముందురోజు అక్బర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత హోదాలోనే న్యాయస్థానంలో పోరాడి అవన్నీ తప్పుడు ఆరోపణలని రుజువు చేస్తానని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. ఒకరిద్దరు ఆరోపణలు చేస్తే వారికి ఉద్దేశాలను ఆపాదించటం, కొట్టిపారేయటం సులభం. కానీ ఆ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అంతేకాదు... ‘అవన్నీ వాస్తవం. బాధి తులకు అనుకూలంగా మేం సాక్ష్యం చెబుతామ’ంటూ మరికొందరు ముందుకు రావటంతో అక్బ ర్కు దారులన్నీ మూసుకుపోయాయని చెప్పాలి. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఆయన రాజీనామా చేశారని ఒక కథనం, అది ఆయన సొంత నిర్ణయమేనని మరో కథనం మీడి యాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏది నిజం... రేపన్న రోజున న్యాయ స్థానాలు ఏం తేలుస్తాయనే అంశాలు అలా ఉంచితే, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఆరోపణలు వచ్చి నప్పుడు ఎలా ప్రవర్తించాలన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాఫెల్ వ్యవహారం జోరు కాస్త తగ్గించి, అక్బర్‌పై స్వరం పెంచి మాట్లా డటంతో ఈ ఎన్నికల సమయంలో బీజేపీకి ఇది నష్టదాయకంగా మారవచ్చునన్న అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. నిజానికి తనంత తాను రాజీనామా చేయాలనుకుంటే అక్బర్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆ పని చేసేవారు. అమెరికా మొదలుకొని మన దేశం వరకూ అన్నిచోట్లా ‘మీ టూ’పై విమర్శలు చేస్తున్నవారు బాధితులు ఇప్పుడే ఎందుకు గొంతెత్తుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో రిపబ్లికన్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేసిన బ్రెట్ కేవనాపై ఆరోపణలొచ్చిన పర్యవసానంగా దర్యాప్తు జరిగినప్పుడు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇదే ప్రశ్న వేశారు. కానీ దీన్ని మహిళలంతా సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పకూడదని ఎదురు ప్రశ్నించారు. నిజానికిది సామాజిక మాధ్యమాల విస్తృతి ఫలితంగానే సాధ్యమైంది. అంతక్రితం బాధిత మహిళ లకు ఉండే అవకాశాలు చాలా పరిమితం. ఆ అవకాశాలు కూడా నిర్దిష్టమైన చట్రానికి లోబడి మాత్రమే ఉంటాయి. విశాఖ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల పర్యవసానంగా మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు ఎదురైతే విచారించి చర్య తీసుకునేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటయ్యాయి. అలాగే ఏ మహిళైనా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, నేరుగా న్యాయస్థానంలో కేసు దాఖలు చేసేందుకు అవకాశాలున్నాయి. కానీ వీటన్నిటికీ నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. పైగా అలాంటి మహిళలు దాదాపు ఒంటరి పోరాటం జరపాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి సమస్యలుండవు. ఒకరి స్వరానికి కొన్ని గంటల్లోనే వందలు, వేల స్వరాలు జత కలుస్తాయి. వారికి నైతిక మద్దతు పుష్కలంగా లభిస్తుంది. అలాగని తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టడం బాధిత మహిళలకు అంత సులభమైన విషయమేమీ కాదు. ఆ వేధింపులు ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తే తప్ప, ఇక గత్యం తరం లేదనుకుంటే తప్ప వాటిని బయటపెట్టడానికి ఎవరూ సాహసించరు. ఎంతో అభివృద్ధి చెందిందనుకుంటున్న పాశ్చాత్య దేశాల్లోనే హాలీవుడ్ దర్శకుడు హర్వీ వైన్‌స్టీన్ వంటి ‘సీరియల్ రేపిస్టుల’ అసలు స్వరూపం వెల్లడి కావడానికి దశాబ్దాలు పట్టింది. ఎందుకంటే తమను వేధించే వ్యక్తులతో మాత్రమే కాదు... భిన్న స్థాయిల్లో వారికి అండగా నిలబడే వ్యవస్థలతో కూడా ఆ బాధిత మహిళలు పోరాడవలసి ఉంటుంది. పైగా చాలా సందర్భాల్లో ఆ పోరాటం ఒంటరిగానే సాగిం చాల్సి ఉంటుంది. విలువైన సమయాన్ని, డబ్బును...మొత్తంగా జీవితాన్ని దానికోసమే వెచ్చిం చాల్సి ఉంటుంది. ఈలోగా ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమని ముద్ర వేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఒక సమస్యను ఎదుర్కొనడానికి వెళ్తే సవాలక్ష సమస్యలు చుట్టుముడుతున్నపుడు మౌనంగా ఉండటమే శ్రేయస్కరమన్న భావన ఏర్పడుతుంది. సామాజిక మాధ్యమాలు ఇలాంటి అవాంతరాలనూ, అడ్డుగోడలనూ ఛేదించాయి. బాధితులకూ, వారికి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నవారికీ మధ్య వారధి నిర్మించాయి. అందుకే కాస్త ఆలస్యమైంది తప్ప ‘మీ టూ’ మన దేశంలో అన్ని రంగాలనూ ముంచెత్తడం మొదలుపెట్టింది. రాజకీయ పార్టీలు, వాటికి అనుబం ధంగా ఉండే సంఘాలు కూడా దీనికి తలవంచక తప్పని స్థితి ఏర్పడింది. ఆఖరికి బీజేపీ, కాంగ్రె స్లు సైతం ఇన్నాళ్లుగా తమ సంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు అవస రమైన యంత్రాంగాలను నెలకొల్పుకొనలేదని వెల్లడైంది. ఇప్పటికిది నగరాల్లోని ఉన్నత వర్గాలకు పరిమితమైన ధోరణిగా కనబడుతున్నా ఇక్కడితో ఇది ఆగుతుందని చెప్పలేం. మన సమాజంలో మహిళలను వేధించే ధోరణి సర్వత్రా ఉన్నప్పుడు, దాని వల్ల బాధితులుగా మారిన వారికి ఈ ఉద్యమ స్ఫూర్తి ఆలస్యంగానైనా చేరకతప్పదు. తమకు జరుగుతున్న అన్యాయాలను మౌనంగా భరించడంకాక ఎలుగెత్తి చాటితే ప్రయోజనం సిద్ధిస్తుం దన్న భరోసా ఏర్పడుతుంది. అక్బర్ వ్యవహార శైలి గురించి ఒకరి తర్వాత ఒకరు బయట పెడుతుండగా అహ్మదాబాద్‌లోని ఒక సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధించాడని ఒక యువతి వెల్లడించింది. ప్రముఖ పెయింటర్ జతిన్‌దాస్ తమతో అసభ్యంగా ప్రవర్తించేవారని నలుగురైదుగురు యువతులు బయటపెట్టారు. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడిపై ఆరోపణలు రావడంతో అతనితో రాజీనామా చేయించారు. ఏదేమైనా అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరో పణలు తీవ్రమైనవి. వాటిలోని నిజానిజాలు నిగ్గుదేలేలోగా ఆయన పదవి నుంచి వైదొలగడమే సరైంది. ఆలస్యంగానైనా అది జరగడం హర్షించదగ్గది. -
#మీటూ : ఎంజె అక్బర్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై వెల్లువెత్తిన ఉద్యమంలో మీటూలో కీలక అడుగు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు పదవికి రాజీనామా చేశారు. పలు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించాయి. ముందుగా ప్రియరమణి అనే జర్నలిస్టు ఆయనపై ట్విటర్ ద్వారా ఆరోపణల చేశారు. దీంతో అక్బర్ బాధితులు దాదాపు 20 మంది మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకే పదవి నుంచి తప్పుకున్నానని బుధవారం ఎంజేఅక్బర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఈ సందర్భంగా అక్బర్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రియరమణిపై అక్బర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు, తక్షణమే మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు బీజేపీ అనుబంధ సంస్థ శివసేన కూడా అక్బర్ వ్యవహారంపై మండిపడిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ఏమన్నారు? అటు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామాపై మీటూ ఉద్యమ ప్రధాన సారధి ప్రియా రమణి ట్విటర్లో స్పందించారు. ఆయన రాజీనామాతో మహిళలుగా విజయం సాధించాం. కోర్టులో కూడా న్యాయపరంగా విజయం సాధించే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. As women we feel vindicated by MJ Akbar’s resignation. I look forward to the day when I will also get justice in court #metoo — Priya Ramani (@priyaramani) October 17, 2018 -
మోదీ సర్కార్ తీరే వేరు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదు. ఎవరి నుంచి ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా చర్య తీసుకోకుండా భీష్మించుకుని కూర్చోవాలన్నది మోదీ ప్రభుత్వం విధానంగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతలు తప్పుగా పేర్కొన్నారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. మోదీ ప్రభుత్వం ఆమెకే అండగా నిలిచింది. ఇతర కారణాల చేత ఆ తర్వాత ఆమె శాఖను మార్చారు. ఐపీఎల్ స్కామ్‌లో కూరుకుపోయిన లలిత్ మోదీ దేశం విడిచి పారిపోయేందుకు సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద పెట్టున ఆందోళన చేసినా వారిని మోదీ ప్రభుత్వం తొలగించలేదు. దేశంలోని బ్యాంకులకు 9,400 కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. పార్లమెంట్ ఆవరణలో జైట్లీని కలుసుకున్న విజయ్ మాల్యా ఆ రోజు సాయంత్రం లండన్ వెళుతున్నట్లు చెప్పినా, ఆయన్ని ఆపేందుకు జైట్లీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది తెల్సిందే. ఏబీవీపీ తరఫున పోటీ చేసి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షడిగా ఎన్నికైన అంకివ్ బైసో డిగ్రీ పట్టా నకిలీదని తేలినా ఆయనపై చర్య తీసుకోవడానికి బీజేపీ తిరస్కరించింది. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోదీపైనే పలు ఆరోపణలు వచ్చాయి. భార్యను వదిలిపెట్టిన ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బ్రహ్మచారిగా పేర్కొన్నారు. మోదీ ఎంఏ పూర్తి చేయకుండానే చేసినట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారన్నది వివాదాస్పదం అయింది. తనకన్నా వయస్సులో ఎంతో చిన్నదైన యువతిపై అధికార దుర్వినియోగానికి పాల్పడి నిఘా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు మోదీపై కొత్త కాదు. మంత్రులు రాజీనామా అవసరం లేదన్న రాజ్‌నాథ్ ‘మా మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇది వారి ప్రభుత్వం కాదు. ఇది ఎన్డీయే ప్రభుత్వం. విమర్శలకు తలొగ్గి రాజీనామాలకు, ఉద్వాసనలకు మేము పాల్పడం. అలా చేస్తే విమర్శలు వస్తూనే ఉంటాయి. రాజీనామాలు, ఉద్వాసనలు కొనసాగించాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం బలహీన పడుతుంది. ఈ విషయాన్ని మేము రెండో యూపీఏ ప్రభుత్వం నుంచే నేర్చుకున్నాం....’ అప్పట్లో వసుంధర రాజె, సుష్మా స్వరాజ్‌ల రాజీనామా డిమాండ్లపై స్పందిస్తూ రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలివి. యూపీఏ హయాంలో మంత్రులు రాజీనామా చేయలేదనా, చేసినందు వల్ల ప్రభుత్వం బలహీన పడిందన్నది ఆయన ఉద్దేశమా ? స్పష్టత లేదు. యూపీఏ హయాంలో తమపై వచ్చిన ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి నైతిక బాధ్యత వహించి పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామాల పర్వం లలిత మోదీ ఐపీఎల్ స్కామ్తోని అప్పటి విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతోని రాజీనామా చేయించింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కారణంగా కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఏ రాజా, జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ వీరభద్ర సింగ్, పర్యాటక శాఖ మంత్రి సుబోద్ కాంత్ సహాయ్, న్యాయ శాఖ మంత్రి అశ్వణి కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌లు రాజీనామాలు చేశారు. వారిలో కొంత మంది ఇప్పటికే కేసుల నుంచి నిర్దోషులుగా బయటకు రాగా, మరికొందరిపై కేసుల విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరికీ శిక్ష పడలేదు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్‌ను తొలగించాల్సిందిగా ఆరెస్సెస్ అధిష్టానం నుంచి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంజె అక్బర్ ముస్లిం అయినందువల్లనే ఆరెస్సెస్ ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మీ బిడ్డలను బీజేపీ నుంచి కాపాడండి
షియోపూర్ (మధ్యప్రదేశ్): కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి బిడ్డలను కాపాడుకోవాలన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదాన్ని ‘బీజేపీ కే మంత్రి ఔర్ ఎమ్మెల్యే సే బేటీ బచావో (బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అమ్మాయిలను కాపాడండి)’ అనే దానిలా మార్చాలని ఎద్దేవా చేశారు. -
ఇది కేంద్రానికి రమణికి మధ్య పోరాటం!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇది ఎంజె అక్బర్ వర్సెస్ నా భార్య ప్రియ (రమణి)కు మధ్య పోరాటం కాదు. అక్బర్ కేంద్ర మంత్రి కనుక యావత్ కేంద్రానికి, అక్బర్ పేర్కొన్న 97 మంది న్యాయవాదులు, నా భార్య మధ్య జరుగుతున్న పోరాటం. ఎక్కడో ఉంటున్న మా ఇంటి చిరునామాను ఒక్క పూటలో పట్టుకున్నారంటే అక్బర్ పవర్ ఏమిటో నాకు తెలుసు. నా భార్య మొదటిసారి అక్బర్ పేరును వెల్లడించినప్పుడు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడ మా చిన్న, ప్రశాంత జీవితం బలవుతుందేమోనని భయపడ్డాను. అక్బర్ బాధితులు కూడా ఇలాగే భయపడి ఉంటారు. అప్పుడు, అలా భయపడక పోయి ఉంటే వ్యక్తిగత జీవితాలను పక్కన పెడితే ఎంత మంది వృత్తి జీవితాలు దెబ్బ తినేవో! భారత్ లాంటి పురుషాధిక్య సమాజంలో లైంగిక వేధింపులను ఓ రకంగా తమ హక్కుగా పురుషులు భావిస్తున్నారు. మగవాడు మగవాడే, ఆడది ఎక్కడుండాలో అక్కడ ఉండాల్సిందే అన్నది వారి వాదన. బాధితులెప్పుడూ బలహీనులే, భయపడే వారే. అందుకే దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారల్లో 70 శాతం సంఘటనలు ఫిర్యాదుచేసే వరకు రావడం లేదు. సమాజం ప్రభావం మహిళలపై కూడా కొనసాగుతోంది. భార్యను భర్త కొట్టడం తప్పేమి కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మగవాళ్లు అభిప్రాయపడగా 52 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారంటే ఆశ్చర్యం. అలాంటి సమాజంలోనే పుట్టి పెరిగింది నా భార్య. తనపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసే ధైర్యం ఆమెకు ఆనాడు లేకపోవచ్చు. మీటూ ఉద్యమం వల్ల ఆలస్యంగానైనా పురుష పుంగవులు లైంగిక ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి శిక్షలుండాలన్నదే బాధితుల వాదన. నా భార్య చేస్తున్న పోరాటంలో ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, వారిదంతా ఒక్కటే రాజకీయ కులం. అక్బర్ విషయంలో నా ప్రియ చూపిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. అందుకే ఆమెకు అండగా నిలబడాలనుకున్నాను. ‘నిజం’ ఒక్కటే మాకు కవచం. అదే గెలిపిస్తుందని నమ్మకం. అక్బర్ బాధితులంతా ముందుకొస్తే గెలుపు అంత కష్టం కూడా కాకపోవచ్చు’–––సమర్ హలార్న్‌కర్. (గమనిక: కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ తనపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన ప్రియా రమిణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేయడం పట్ల ఆమె భర్త, ‘ఇండియా స్పెండ్ డాట్ కామ్’ ఎడిటర్ సమర్ హలార్న్‌కర్ స్పందన ఇది. ముందుగా ట్విట్టర్లో స్పందించిన ఆయన ఆ తర్వాత తమ డాట్‌కామ్‌లో పెద్ద వ్యాసమే రాశారు. ఆ వ్యాసంలోని సారాంశాన్నే ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాం) -
ఎంజె అక్బర్ కేసులో గెలుపెవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ సీనియర్ జర్నలిస్ట్ ఎంజె అక్బర్ సోమవారం నాడు ప్రియా రమణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. అందులో ఆయన తన తరపున వాదించడానికి 30 మంది మహిళలు సహా 97 మంది న్యాయవాదులను పేరు పేరున పేర్కొనడం గమనార్హం. అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 14 మంది మహిళల్లో ప్రియా రమణి మొదటి వారు. 2017, అక్టోబర్ నెలలో ‘వోగ్ ఇండియా’లో ఓ ఎడిటర్ నీచ ప్రవర్తన గురించి ప్రియా రమణి ఓ ఆర్టికల్ రాశారు. అయితే ఆ వ్యాసంలో ఆమె ఆ ఎడిటర్ పేరును ప్రస్తావించలేదు. ఏడాది అనంతరం అక్టోబర్ 8వ తేదీన ఆ ఎడిటరే ఎంజె అక్బర్ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మరో 13 మంది మహిళా జర్నలిస్టులు బయటకు వచ్చి తాము కూడా అక్బర్ లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించడం తెల్సిందే. అప్పుడప్పుడు మీడియాను వేధించేందుకు రాజకీయ నాయకులు పరువు నష్టం దావాలు వేయడం మామూలే. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు అక్బర్ ఏకంగా నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. దీని కింద దోషికి జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అక్బర్ తన పిటిషన్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. ఒకటి సమాజంలో తన పరువు, ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేశారని, దీని వెనక రాజకీయ కోణం ఉందన్నది. రెండోది 20 ఏళ్ల క్రితం నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది. ‘మీటూ’ ఉద్యమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్లందరు కూడా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్నే నొక్కి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు అక్బర్ పెట్టుకున్న 97 మంది న్యాయవాదులకన్నా ఎక్కువ మంది న్యాయవాదులు సమాధానం చెప్పగలరు. ఇందులో ముడివడి ఉన్న మొట్టమొదటి అంశం ‘పవర్ ఈక్వేషన్’. అంటే, ఎవరి అధికారం ఎక్కువ, ఎవరిది తక్కువన్నది. సహజంగా బాధితుల అధికారమే తక్కువుంటుంది. వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న భయం, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందన్న ఆందళన వారిని వెంటాడుతోంది. అందుకనే వారు ఫిర్యాదు చేయడానికి సాహసించలేరు. ఎందుకు కేసు పెట్టరంటే..... ఫిర్యాదు చేయాలన్నా అప్పటికి ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్) యాక్ట్’ లేదు. దీన్ని యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చింది. ఈ చట్టం రాకముందు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చే యాలంటే పోలీసుల వద్దకు వెళ్లడం ఒక్కటే మార్గం. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఫిర్యాదు చేయాలంటే ఎంతో ఒత్తిడి గురికావాల్సి వస్తుంది. వ్యక్తిగత పరువు, ప్రతిష్టలు దెబ్బతీస్తారన్న భయం ఉంటుంది. ఫిర్యాదు చేసిన పెద్దవారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉండదు. పలుకుబడిగల వ్యక్తులపై ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదును తిరస్కరించిన ఉదంతాలను ఇప్పటికీ వింటుంటాం. పైగా చట్టానికూడా పరిమితులు ఉన్నాయి. ఫలానా కేసుకు ఫలానా కాల పరిమితిలోగా ఫిర్యాదులు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసే తీసుకుంటే సంఘటన జరిగిన నాటి నుంచి మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి తేరుకొని, పోరాడే మనస్తత్వాన్ని సంతరించుకొని, ఫిర్యాదు దాఖలుచేసే ధైర్యాన్ని కూడదీసుకునే వరకే ఈ మూడేళ్ల సమయం గడచిపోవచ్చు. కేసు పెట్టక పోవడం కూడా హక్కే! కేసు దాఖలు చేయడానికి కాల పరిమితి ముగిసి పోయినందున తనపై కేసు కొట్టివేయాలన్నది కూడా అక్బర్ పిటిషన్లో ఓ వాదన. కేసు కొట్టివేస్తే ఆయన నిర్దోషన్నమాట. ఇదంతా తప్పుడు వాదనే అవుతుంది. కేసు పెట్టడం, పెట్టకపోవడమన్నది బాధితురాలి ఇష్టమే కాదు, ఆమె హక్కు కూడా. ఆమె జరిగిన సంఘటన గురించి కేసు దాఖలు చేయలేదు కనుక ఆ సంఘటన గురించి ఆమెకు వెల్లడించే హక్కు లేదంటే ఎలా? నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనప్పుడు నేరస్థుడు విడుదలవుతాడు, అలాంటప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి బాధితుడు లేదా బాధితరాలు మాట్లాడకూడదంటే ఎట్లా! జరిగిన సంఘటన నిజమైనప్పుడు పరువు నష్టం దావాను శంకించాల్సిందే! గెలుపోటములు అంతిమంగా ప్రియా రమణి లైంగిక ఆరోపణలు నిజమవుతాయా, ఎంజె అక్బర్ పరువు నష్టం దావా నెగ్గుతుందా? అన్నది ప్రశ్న. ఏ కేసులోనైనా సరే నిజా నిజాలు తేల్చాలంటే చట్ట ప్రకారం అందుకు తగిన ఆధారాలు ఉండాల్సిందే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఆమె చూపించలేకపోవచ్చు. పైగా సకాలంలో ఫిర్యాదు చేయలేదు. అక్బర్ నమ్ముతున్నది కూడా ఇదే. ఆ తర్వాత ఏకంగా 13 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేయడం చిన్న విషయమేమీ కాదు. వారు కూడా కోర్టు వర కు వచ్చి సాక్ష్యాలిస్తే కేసు బలపడుతుంది. మొట్టమొదటి సారిగా తన పేరు బయటపెట్టి పరువు తీసిందన్న అక్కసుతోపాటు ఇంకెవరు తనకు వ్యతిరేకంగా బయటకు రావద్దనే ఉద్దేశంతో అక్బర్ పరువు నష్టం దావా వేసినట్లు కనిపిస్తోంది. ఆయన పరువు నష్టం దావాను కూడా ఆయనే నిరూపించుకోవాలి కనుక అది నిలబడే అవకాశం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, అందులోనూ జర్నలిస్టులు రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్రపన్నారని నిరూపించడం అంత సాధ్యమయ్యే పనేమీ కాదు. -
ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం
న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్‌నాథ్, నానా పటేకర్, బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఉన్నారు. తమను ఎంజే అక్బర్ వేధించాడని జర్నలిస్ట్ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ సోమవారం ప్రైవేటు క్రిమినల్ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో అక్బర్ న్యాయవాది సందీప్ కుమార్ స్పందిస్తూ.. ‘అక్బర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్ కుమార్ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్‌నాథ్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్దోషి సెషన్స్ కోర్టులో అలోక్‌నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.. లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్‌కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ప్రెస్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ వుమెన్ ఇన్ ఇండియా సంయుక్తంగా డిమాండ్ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్‌గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ దువాపై ఆరోపణలు ది వైర్ వెబ్సైట్ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్‌కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్ జోక్ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు. మిత్రపక్షాల అసంతృప్తి సెగ.. సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్‌ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో అక్బర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
#మీటూ : పోరుకు సై, సత్యమే రక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ పేరుతో సాక్షాత్తూ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చేసి జర్నలిస్టు ప్రియా రమణికి దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులనుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏకంగా 97మంది లాయర్ల సహకారంతో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేయడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 14మందికిపైగా మహిళల ఆరోపణలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏమీ పట్టించుకోలేదు. మంత్రిపై ఎలాంటి చర్యల్ని ప్రకటించలేదు. కనీస విచారణ చేపడతామన్న మాటకూడా మాట్లాడలేదనీ ఇది శోచనీయమని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అక్బర్ తీసుకున్న చర్య విస్తుగొల్పిందని దుయ్యపట్టారు. 14మంది మహిళలు ఆరోపణలు చేస్తే కేవలం ప్రియా రమణిపైనే ఎందుకు కేసులని కామిని జైశ్వాల్ ప్రశ్నించారు. దీని వెనుక పెద్దకుట్ర దాగా వుందని ఆరోపించారు. మరోవైపు పరువు నష్టం దావాపై ప్రియా రమణి కూడా ట్విటర్ లో స్పందించారు. దీనిపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సత్యమే తనకు రక్షణ అని పేర్కొన్నారు. అనేక మంది మహిళలు అతడిపై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేవలం తనను మాత్రమే బెదిరించడం వేధింపుల ద్వారా వారి నోరు మూయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. పలు మహిళా జర్నలిస్టు సంఘాలు తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశాయి. తక్షణమే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రియా మరణి రమణికి మద్దతుగా దేశాధ్యక్షుడు రామ్ నాద్ కోవింద్‌కు, ప్రధానమంత్రి నరేంద మోదీకి లేఖ రాస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. అక్బర్‌ను పదవినుంచి తొలగించాలని, అలాగే రమణిపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసాయి. మరోవైపు మనీ లైఫ్ ఇండియా మేగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న సుచేతా దలాల్... ప్రియరమణితో పాటు 14మంది ఇతర జర్నలిస్టులు కూడా స్థైర్యం కోల్పోరాదని, ఖర్చులకు కూడా వెరువరాదని హితవు పలికారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలంటే ఆర్థికంగా కూడా ఎంతో భరించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ప్రియా రమణి తరఫున వాదించేందుకు ప్రముఖ లాయర్లు చాలా మందే ఉన్నారని, అందుకయ్యే ఖర్చు కూడా తమ శక్తికొద్దీ భరిస్తామని సుచేతా దలాల్ ప్రతిపాదించడంతో... ఆ ట్వీట్ చాలా మంది ఫాలో అవుతూ తాము కూడా మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా పలు మహిళా జర్నలిస్టుల లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై దాదాపు41 పేజీలతో పరువునష్టం దావావేశారు. కరాంజవాలా సంస్థలోని 97మంది లాయర్లు (30మంది మహిళా లాయర్లు) మద్దతుతో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ దావానునమోదు చేసిన సంగతి తెలిసిందే. Hey @priyaramani and all 14 who have spoke up. Let’s crowd fund your defence. I am sure may top lawyers will help you fight pro bono, but we at @MoneylifeIndia know there are lots of expenses involved! So think about it! Happy to support I am sure thousands of others will too! https://t.co/WmSnOfFKQy — Sucheta Dalal (@suchetadalal) October 15, 2018 My statement pic.twitter.com/1W7M2lDqPN — Priya Ramani (@priyaramani) October 15, 2018 -
ఏది రాజకీయం, ఏది కుట్ర?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘బహుత్ హువా నారి పర్ వార్ (మహిళలపై జరిగిన అత్యాచారాలు ఇక చాలు)’ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ముఖ్య నినాదాల్లో ఒకటి. ఇప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న బీజేపీని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ తనపై జరుగుతున్న రాజకీయ కుట్రగా అక్బర్ అభివర్ణించారు. పరువు నష్టం కేసు వేయాలని కూడా నిర్ణయించారు. ఎంత హాస్యాస్పదం! మీడియా మాజీ ఎడిటరైన అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 14 మంది మహిళలు. వారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉంది. పైగా వారంతా జర్నలిస్టులు. ప్రియా రమాని, ఘజాల వాహబ్, సబా నక్వీ, మజ్లీ డే పుయ్ కాంప్, శుమా రహా, హరిందర్ బవేజా, శుతాప పాల్, సుపర్ణ శర్మ, అంజు భారతి, మాలిని భూప్తా, కాదంబరి వాడే, కనిక గహ్లాట్, రుత్ డేవిడ్, ప్రేరణ బింద్రా అక్బర్‌పై ఆరోపణలు చేశారు. వారిలో కొందరు తమపై లైంగిక దాడి జరిపినట్లు చెప్పగా, లైంగిక దాడులకు ప్రయత్నించినట్లు మిగతా వారు ఆరోపించారు. పేర్లను బట్టి చూస్తే వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వారంతా కలిసి ఎలాంటి ప్రజా పలుకబడి పునాదులు లేకుండా రాజ్యసభ ద్వారా మంత్రి అయిన అక్బర్‌పై రాజకీయ కుట్ర పన్నుతారా? ఎంత హాస్యాస్పదం! బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఎంజె అక్బర్‌పై వచ్చిన ఆరోణలపై బీజేపీ నేతలు పలు విధాలుగా స్పందించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సుబ్రమణియన్ స్వామి అన్నారు. అది ఆయనకు, ఆరోపణలు చేసిన వారికి సంబంధించిన సమస్య, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉమా భారతి వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలను చేస్తున్న మహిళలను లక్ష్యంగా పెట్టుకోరాదని, అయితే అక్బర్ గురించి మాట్లాడే స్థానంలో తాను లేనని మరో మహిళా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ అన్నారు. లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిని తాను నమ్ముతున్నానని, ప్రతి ఫిర్యాది వెనకనుండే బాధను, వ్యధను తాను అర్థం చేసుకోగలనంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ‘మీటూ’ ఆరోపణలన్నింటిని విచారించేందుకు సీనియర్ జుడీషియల్, లీగల్ వ్యక్తులతోని ఓ కమిటీ వేయాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆమె చెప్పారు. (చదవండి : మీటూ సంచలనం : ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు) మరోసారి వేధించే అవకాశం ఉంది! అయితే లైంగిక ఆరోపణలు చేసిన మహిళల సమ్మతి ఉన్న కేసుల్లోనే విచారణ జరపాలని రుత్ మనోరమా, అమ్మూ జోసఫ్, గీత లాంటి మహిళా సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఇలాంటి సంఘటలనకు సంబంధించి సరైన ఆధారాలు లభించక పోవచ్చని అలాంటి సందర్భాల్లో విచారణ నుంచి బయటపడే మగవాళ్లు ఫిర్యాదుదారులను వేధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విచారణ కమిటీలకన్నా మహిళల హక్కులను గౌరవించేలా మగవాళ్ల మనస్తత్వాన్ని మార్చే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదంతోపాటు మహిళలపై జరగుతున్న అన్యాయాలను ఏ నాగరిక ప్రపంచం సహించదంటూ పదే పదే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం నుంచి అక్బర్‌ను తొలగించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?! -
#మీటూ: 97మంది లాయర్లా..!
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలుఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ న్యాయపోరాటంలో న్యాయవాదుల సంఖ్య తెలిస్తే నోరు వెళ్లబెట్టక తప్పదు. ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా 97మంది న్యాయవాదులు ఈ జాబితాలో ఉన్నారు. జర్నలిస్టు ప్రియా రమణి లైంగిక ఆరోపణల నేపపధ్యంలో ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావాను 97మంది న్యాయవాదులు వాదించనున్నారు. ప్రముఖ సంస్థ కరంజావాలాకు చెందిన లాయర్లు ప్రియా రమణికి వ్యతిరేకంగా వాదించనున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై నేరపూరిత ఆరోపణ కేసును సోమవారం నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
#మీటూ : జర్నలిస్టుపై పరువునష్టం కేసు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ లో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తదుపరి చర్యలకుపక్రమించారు. ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టి పారేసిన ఆయన తాజాగా జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని చేశారంటూ క్రిమినల్ డిఫమేషన్ నమోదు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సోమవారం ఆయన ఈ కేసు దాఖలు చేశారు. సుదీర్ఘమైన, విలువైన తన కరియర్‌ను నాశనం చేసేందుకే ప్రియా రమణి తనపై తప్పుడు, హానికరమైన ఆరోపణలు చేశారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. విదేశీ పర్యటనముగించుకొని స్వదేశానికి చేరుకున్న కేంద్రమంత్రి తనపై వచ్చిన ఆరోపణలపై ఆదివారం స్పందించారు. జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఈయన తోసిపుచ్చారు. రాజకీయ కారణాలతో తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేస్తున్నవారు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ ఆయన చేశారు. లేదంటే తనపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు విప్పకపోవడంపై మండిపడుతోంది. కాగా ఎంజే అక్బర్ ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ లాంటి ప్రముఖ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. సంపాదకుడుగా ఉన్నప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ విదేశీ మహిళా జర్నలిస్టులతో సహా పలువురు మహిళా పాత్రికేయులు 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా జర్నలిస్టు ప్రియా రమణి తొలిసారిగా ట్విటర్ వేదికగా ఎంజే అక్బర్‌పై ఆరోపణలు చేసిన సంగతి విషయం తెలిసిందే. ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన 14మంది : ప్రియ రమణి, షుమా రాహా, ప్రేరణ సింగ్, కనికా గెహ్లాట్, సుపర్ణ శర్మ, హరీందర్ బవేజ, సబా నక్వి, షుతప పాల్, గజలా వహాబ్, అంజు భారతి, కాదంబరి వాడే, రూత్ డేవిడ్, మాలిని భూప్తా , మాజైల్ డి పే కంప్. -
అన్నీ అబద్ధాలు.. నిరాధారాలు
న్యూఢిల్లీ: జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు. వారు తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, అర్థరహితాలని, అవి తనను అమితంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో అధికారిక పర్యటనలో ఉన్నందువల్లనే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి తిరిగొచ్చిన కాసేపటికే ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని వెల్లడించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న కారణంగా, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయన్నారు. ’ఎన్నికలు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో ఈ తుపాను ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్ జ్వరంగా మారిందని అక్బర్ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్లో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం భారత్‌లోనూ ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంజే అక్బర్ జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో వివిధ సమయాల్లో ఆయనతో పాటు జర్నలిస్ట్‌గా పనిచేసిన 11 మంది మహిళలు ఇటీవల ముందుకువచ్చి.. తమపై అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో ప్రియా రమణి, గజాలా వాహెబ్, షుమ రాహ, అంజు భారతి, శుతుపా పాల్ల ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘ప్రియా రమణి ఏడాది క్రితం ఓ మ్యాగజీన్లో రాసిన ఓ కథనం ద్వారా ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అది అసత్య కథనమని ఆమెకూ తెలుసు. ఇటీవల ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆమె.. ఆయన ఏమీ చేయలేదు కాబట్టే, పేరు ప్రస్తావించలేదని సమాధానమిచ్చారు. నేను తనపై చేయి ఎప్పుడూ వేయలేదని శుతుపా పాల్ చెబ్తున్నారు. నిజానికి నేనేం చేయలేదని షుమ అంటున్నారు. స్విమింగ్ పూల్‌లో పార్టీ చేసుకున్నామని అంజు భారతి ఆరోపించారు. కానీ నాకు ఈతే రాదు. రమణి, వాహెబ్‌లు వారు పేర్కొన్న లైంగిక వేధింపుల ఘటన తరువాత కూడా నాతో కలిసి పనిచేశారు. దీన్ని బట్టి ఇవన్నీ అసత్యాలని తెలియడం లేదా?’ అని అక్బర్ వివరణ ఇచ్చారు. ప్రధాని స్పందించాలి: కాంగ్రెస్ మంత్రి ప్రకటనకు కొద్ది సేపటి ముందు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. సహచర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. ప్రధాని ఎలాంటి వారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ అంశం ప్రభుత్వ నైతికతకు సంబంధించిందే కాదు, ప్రధానికీ, ఆయన పదవీ గౌరవానికి సంబంధించింది కూడా’ అని అన్నారు.