
జెంటిల్మన్ క్రికెటర్
బైలైన్:
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఇప్పుడు మాజీ కెప్టెన్‌గా మారిన హషీమ్ ఆమ్లాకు జేజేలు పలకండి. కపటత్వంతో కృత్రిమ వినమ్రతను ప్రదర్శించకుండా, తానెంత మంచివాడో చాటుతూ ఉపన్యాసం దంచకుండా తన గురించి తాను నిజాయితీగా చెప్పుకున్న మనిషి ఆమ్లా. కల లాంటి ఆ పదవికి ఎవరూ కోరకుండానే ఆయన రాజీనామా చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల వల్ల జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా తాను నిర్వహించాల్సిన కృషికి నష్టం వాటిల్లుతోందనే నిర్ణయానికి రావడంతో ఆమ్లా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు.
క్రికెట్ కెప్టెన్‌లలో చాలా మంది బ్యాట్స్‌మెన్‌లే. బ్యాటింగ్, ఆ క్రీడలోని ఏదో ఒక అగ్రకుల అంతస్తుకు చెందినది కావడం అందుకు కారణం కాదు. బాధ ఎక్కువ, గ్లామర్ తక్కువైన బౌలింగ్, కఠోర శ్రమతో కూడిన పని. ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బెనాడ్, మన కపిల్‌దేవ్‌లాంటి గొప్ప బౌలర్ కెప్టెన్లూ ఉన్నారు (ఇమ్రాన్ ఖాన్ , ఇయాన్ బోథామ్‌లాంటి ఆల్‌రౌండర్లు పూర్తిగా భిన్న శ్రేణికి చెందిన వారు). అయినా సెలెక్టర్లు బ్యాట్స్‌మెన్‌నే ఎక్కువగా కెప్టెన్లుగా ఎంచుకోవడానికి సజావైన కారణమే ఉంది. సుదీర్ఘమైన ఆ క్రీడలో కెప్టెన్‌గా మొత్తం ఆట నిర్వహణను అత్యంత అనుకూల దృష్టితో చూసే అవకాశం బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉంటుంది.
ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో మాత్రమే ఒక కెప్టెన్‌ను సరిగ్గా పరీక్షించగలం. 20 ఓవర్ల ఆటలో కెప్టెన్ పాత్ర ఫుట్‌బాల్ కెప్టెన్‌లాంటిదే. ఇకఒక రోజు మ్యాచ్‌కు వస్తే, కెప్టెన్ ఆల్‌రౌండర్ అయితే మంచిదనడానికి సమంజసమైన కారణాలే ఉన్నాయి. కానీఅది వేరే కథ.
అతి సుతారమైన ఆటగా క్రికెట్ (టెస్ట్ మ్యాచ్) మెల్లగా సాగే ఆట. ఎత్తుగడలపరమైన మార్పులతోపాటూ వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. టెస్ట్ కెప్టెన్, ఆట పురోగతిని నిరంతరం విశ్లేషించడం అవసరం. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రతి మూడు నాలుగు ఓవర్లకు అలా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. తన జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగుల వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదించినప్పటి నుంచి హషీం ఆమ్లా ఆడుతున్న తీరునుబట్టి చూస్తే అతను ఆలోచనాపరుడైన మనిషి. ఎప్పుడూ క్రీజ్‌కు నడుచుకుంటూ వెళ్తూనే... ఆయన ఆ ఆటలో పెద్దమనిషిగా మంచి గుర్తింపును సంపాదించుకు న్నాడు. ఇంగ్లండుతో జరుగుతున్న క్లిష్టమైన సిరీస్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చినప్పటి నుంచి ఆయన నడక సుదీర్ఘంగా సాగింది. అదే ఆయన జ్ఞాపకాన్ని నిర్వచించేది.
ఆమ్లా నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఆట అధ్వానంగా సాగింది. ఇటీవల భారత్‌లో జరిగిన సిరీస్‌లో ఆఫ్రికన్లు చిత్తుగా ఓడారు. పిచ్‌పై వివాదాలు ఆ వాస్తవాన్ని పూర్తిగా దాచలేవు. ఏదిఏమైనా పిచ్‌ను ఒక ఆధారంగా ఉపయోగించుకోవడం ఆసక్తికరం. రెండు జట్లూ అదే పిచ్‌పై ఆడాల్సి ఉంటుంది. అది బాగా లేకపోతే ఇద్దరికీ బాగా లేకుండా ఉండాలి. గ్రీన్-టాప్ పిచ్ పేస్ బౌలర్లకు సహాయపడితే పిచ్‌ని ‘‘చెడగొట్టారని’’ ఎవరూ ‘‘ఆరోపించరు’’. అలాంటప్పుడు బ్రౌన్-టాప్ పిచ్ స్పిన్నర్లకు తోడ్పడి నప్పుడు కామెంటేటర్లు తీవ్రంగా ఎందుకు స్పందిస్తారు? భారత్‌తో సిరీస్‌ను కోల్పోయినప్పుడు ఆమ్లా... అయాచితంగా దొరికే అలాంటి సాకులను చూపలేదని గుర్తుంచుకోవడం సముచితం.
తన స్కోర్లు స్వల్పంగా ఉండటంతో ఆమ్లా సమస్యలు రెట్టింపయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు జరుగుతున్న సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పుడూ అదే వరుస కొనసాగింది. రెండవ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఆటలోని అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మొదటి ఇన్నింగ్స్ స్కోర్‌ను సాధించింది. అయితే ఆమ్లా బ్యాటింగ్‌కు వచ్చేసరికి ఆ జట్టు దాదాపుగా ఓటమి అంచున ఉంది. అతను సాధించిన డబుల్ సెంచరీ బ్యాట్స్‌మన్‌గా ఆయన విలువను పునరుద్ధరించడమే కాదు, కెప్టెన్‌గా విశ్వసనీయతను కూడా కాపాడింది. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా బాక్స్‌లో కూచుని కెప్టెన్ చేసేది ఏమీ ఉండదని ఎన్నడూ అనుకోకండి. ఇన్నింగ్స్ పొడవునా అతను ప్రతి ఆటగాడి పాత్రను నిర్వచిస్తుంటాడు. కెప్టెన్ అంటే ఒక్క చేతి సంజ్ఞతోనే నియంత్రించే కాపరి.
హషీమ్ ఆమ్లా సరిగ్గా తనపై ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసిన సమయంలోనే రాజీనామా చేశాడు. అటు ఆటగాడిగా, ఇటు నాయకునిగా తిరిగి అగ్రస్థానానికి వచ్చాకనే నాయకత్వ బాధ్యతల నుంచి నిష్ర్కమించాడు. కొద్దికాలంపాటూ ఆట బాగోనందుకే సెలెక్టర్లు కెప్టెన్‌ను శిక్షించేట్టయితే, ఏ కెప్టెనూ మహా అయితే రెండు లేదా మూడు సీజన్లకు మించి మనజాలడు. పోటీ క్రూరంగా ఉండే ఫుట్‌బాల్‌లో సైతం యజమానులు, జట్టు విఫలమౌతున్నా మేనేజర్లను మార్చడానికి సమయం తీసుకుంటారు. ఆమ్లాను ఎవరూ ఒత్తిడి చేయకున్నా, తమ జట్టు ప్రయోజనాలకు మంచిదని తనంత తానే అనుకుని రాజీనామా చేశాడు. అలాంటి ఉదాహరణలు ఎన్నో కనబడవు. పేర్లు వద్దుగానీ, కెప్టెన్లకు వారి అధికారం ద్వారా బహిరంగంగానూ, చాటుమాటుగానూ ఆర్థిక ప్రతిఫలాలు లభిస్తాయి. కాబట్టే వారు తమ అధికారాన్ని పట్టుకు వేలాడుతారు.
క్రికెట్‌ను విచిత్రంగా ‘‘పెద్దమనుషుల ఆట’’ అని అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు అది అలాగే ఉన్నదని గట్టిగా చెప్పడం తీవ్ర అతిశయీకరణే. ఎక్కడైనా ఉండేట్టే ఇప్పుడు క్రికెట్‌లో కూడా ఎందరు పెద్దమను షులున్నారో అందరు ఆకతాయిలూ ఉన్నారు. ఇది మంచీ కాదు, చెడూ కాదు. రిపబ్లికన్ యుగంలో విలు వలు లేదా విలువల రాహిత్యం అనేవి ఒక వర్గానికి సం బంధించినవి కావు. ఎవరు ఉత్పత్తులను అమ్ముకోగలి గితే వారికే భారీగా డబ్బు వచ్చిపడుతుంది. అందుకే క్రీడలో ఒక పెద్ద మనిషి కనిపిస్తే అది సంబరపడటానికి కారణమవుతుంది. విధి ప్రతి ఒక్కరికీ వారు ధరించాల్సిన పాత్రను కేటాయిస్తుంది. ఒక ఆదర్శ నమూనా కాగలగడం మాత్రం ఆ వ్యక్తి సాధించాల్సినదే.
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి: ఎం.జె. అక్బర్