Gentleman
-
30 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. నెక్స్ట్ హైదరాబాద్‌లోనే
శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.టి.కుంజుమోన్ 1993లో నిర్మించిన జెంటిల్మన్ చిత్రం సంచలన విజయం సాధించింది. 30 ఏళ్ల తరువాత కె.టి.కుంజుమోన్ ఆ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు, కథానాయకుడు, సంగీత దర్శకుడు అందరూ మారిపోయారు. ఈ చిత్రానికి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్, నయనతార చక్రవర్తి జంటగా నటిస్తున్న ఇందులో 50 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అజయ్ విన్సెంట్ చాయాగ్రహణం, వైరముత్తు పాటలను, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది. తొలి షెడ్యూల్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ షూటింగ్లో పలు కీలక సన్నివేశాలను, భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా రెండో షెడ్యూల్‌ను నవంబర్ మూడో వారంలో మొదలుపెట్టి చైన్నె, హైదరాబాద్, పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ముంబై, మలేషియా, శ్రీలంకలలో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. చదవండి: తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య ఇక లేరు -
జెంటిల్మన్లో భాగమవడం సంతోషం – ప్రాచీ తెహ్లాన్
‘‘జెంటిల్మన్ 2’ సినిమాలో నటించాలని నిర్మాత కేటీ కుంజుమోన్ గారు ఫోన్ చేసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఫ్రాంచైజీలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ ప్రాచీ తెహ్లాన్ అన్నారు. అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. కేటీ కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమా 1993లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జెంటిల్మన్ 2’ నిర్మిస్తున్నారు కుంజుమోన్. చేతన్ చీను హీరోగా ఎ.గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంపైప్రాచీ తెహ్లాన్ మాట్లాడుతూ–‘‘జెంటిల్మన్ 2’ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర చేస్తున్నాను. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించబోతున్నాను. ఈ సీక్వెన్స్ లో నటించటం సవాల్‌తో కూడుకున్నది.. ఇందుకోసం శిక్షణ తీసుకున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు. -
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
'జెంటిల్ మేన్ 2'కి మరో హీరోయిన్.. నిర్మాత ప్రకటన
Gentleman 2 Movie Producer Kunjumon Announces Second Heroine: 1993లో విడుదలై సంచలన విజయం సాధించిన యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రం 'జెంటిల్ మేన్'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జెంటిల్ మేన్ 2' రానుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ 2020లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఇటీవల మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఎంపిక చేశారు. తాజాగా ఈ చిత్రం కోసం మరో హీరోయిన్ను సెలెక్ట్ చేసినట్లు ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'జెంటిల్ మేన్ 2' మూవీలో మరో హీరోయిన్గా ప్రియాలాల్ నటించనుందని అధికారికంగా తెలిపారు. 'జెంటిల్ మేన్ 2' మూవీలో ఇంకా హీరో ఎవరనేది వెల్లడికాలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిచనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. కాగా ఇదివరకు వచ్చిన 'జెంటిల్ మేన్' చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. మరీ ఈ సీక్వెల్ మూవీకి దర్శకత్వ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం. The enthusiastic @PriyaaLal will be the another lead actress in our Mega movie #Gentleman2#ஜென்டில்மேன்2 #जेंटलमेन2 #ജെന്റിൽമാൻ2 #ಜಂಟಲ್ಮನ್2 #జెంటిల్మాన్2@mmkeeravaani #GentlemanFilmInternational@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @PRO_SVenkatesh @Fridaymedia2 pic.twitter.com/3mHPuvQ4jz — K.T.Kunjumon (@KT_Kunjumon) April 13, 2022 -
'జెంటిల్మెన్ 2' చిత్రానికి హీరోయిన్గా బేబీ నయనతార..
Gentleman 2 Movie Heroine Is Nayanthara Chakravarthy: అప్పట్లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన 'జెంటిల్మెన్' సినిమా సంచలన విజయం సాధించింది. కె.టి. కుంజుమోన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం డైరెక్టర్‌గా శంకర్ పేరు ఏ రేంజ్లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు 'జెంటిల్మెన్' సినిమాతో అర్జున్‌కు కూడా మంచి పేరు వచ్చింది. 1993లో విడుదలైన ఈ సినిమాలో అర్జున్‌తోపాటు మధుభాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు. ఇప్పటికీ ఈ మూవీ సినీ లవర్స్ మదిలో ఎవర్గ్రీన్ చిత్రం అని చెప్పవచ్చు. జెంటిల్మెన్ చిత్రం తర్వాత పలు భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.టి. కుంజుమోన్ చాలా కాలం గ్యాప్ తర్వాత జెంటిల్మెన్ 2 సినిమా తీస్తున్నట్లు 2020లో ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎం.ఎం. కీరవాణిని ప్రకటిస్తూ మీడియా ద్వారా వెల్లడించారు నిర్మాత కుంజుమోన్. తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ నడుస్తోంది. మొదట్లో ఈ చిత్రంలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతారను సెలెక్ట్ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ప్రస్తుతం వాటన్నింటికి చెక్ పెడుతూ హీరోయిన్ను వెల్లడించారు నిర్మాత కుంజుమోన్. సోషల్ మీడియా వేదికగా 'జెంటిల్మెన్ 2' చిత్రంలో హీరోయిన్ పేరును ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని కథానాయికగా ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు కుంజుమోన్. మాలీవుడ్‌లో ఈ బ్యూటీని బేబీ నయనతార అని కూడా పిలుస్తారట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. Happy to Introduce #NayantharaaChakravarthy as the lead actress in #Gentlemen2#ஜென்டில்மேன்2 #ജെന്റിൽമാൻ2#జెంటిల్మాన్2#ಜಂಟಲ್ಮನ್2@mmkeeravaani #GentlemanFilmInternational@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @Fridaymedia2 Another lead actress will be revealed soon pic.twitter.com/2MMkuCHF6N — K.T.Kunjumon (@KT_Kunjumon) March 23, 2022 -
జెంటిల్మెన్-2 చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారు
MM Keeravani To Compose Music For Gentleman-2: గతంలో జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కె.టి.కుంజుమోన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయం కావడం గమనార్హం. ఆ తరువాత పలు భారీ చిత్రాలను నిర్మించిన కె.టి.కుంజుమోన్ కొంత గ్యాప్ తరువాత తాజాగా జెంటిల్మెన్ –2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరన్నది గెస్ చేసిన వారికి బంగారు నాణేన్ని బహుమతిగా అందించనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పలువురు తమకు తోచిన సంగీత దర్శకుల పేర్లను తెలియచేశారు. వారిలో జెంటిల్ మెన్ –2కు సంగీత దర్శకుడు ఎవరన్నది కరెక్టుగా తెలిపిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలను బహుమతిగా త్వరలో అందించనున్నట్లు నిర్మాత చెప్పారు. కాగా ఆదివారం ఆయన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని కుంజుమోన్ వెల్లడించారు. -
‘సెకండ్ జెంటిల్మన్’ : భార్యతో డగ్లాస్ ఎంహాఫ్
అంతా మగ సంతే ఉన్న ఇంట్లోకి మొదటిసారిగా ‘మహాలక్ష్మి’ అడుగు పెడితే ఆ ఇల్లు తీరే మారిపోతుంది! కొత్త కోడలు లేక, లేకలేక కలిగిన ఒక ఆడశిశువు ప్రవేశంతో ఇంటికి కొత్త కళ వస్తుంది. ఇల్లు శుభ్రమౌతుంది. మనుషులు, మాటలు కూడా సంస్కారవంతం అవుతాయి. కొత్త బంధాలూ ఏర్పడతాయి. ఆ బంధాలు కొత్త భాషనూ నేర్పుతాయి. ఇన్నేళ్లూ ఆడకూతురి భాగ్యం లేక ‘కడు పేదరికం’లో ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు ఉపాధ్యక్షురాలిగా వచ్చిన కమలా హ్యారిస్ రాకతో సంతోషంగా, సందడిగా ఉంది. ఆమె భర్తతో బంధుత్వం కలుపుకుంది. ఆ బంధుత్వానికి ‘సెకండ్ జెంటిల్మన్’ అనే కొత్త వరసను కనిపెట్టింది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న అమెరికావాళ్ల అతి ప్రాచీన ‘మెరియం వెబ్‌స్టర్’ డిక్షనరీ తాజా ప్రచురణలో కూడా ‘సెకండ్ జెంటిల్మన్’ అనే మాట కనిపించ బోతోంది! ఇప్పటి వరకు అమెరికాలో గానీ, అమెరికా డిక్షనరీలలో గానీ ‘సెకండ్ జెంటిల్మన్’ అనే మాట అధికారికంగా లేదు. అమెరికా అధ్యక్షుyì సతీమణిని ‘ఫస్ట్ లేడీ’ అనడం వంటిదే... అమెరికా ఉపాధ్యక్షురాలి భర్తను ‘సెకండ్ జెంటిల్మన్’ అనడం. జార్జి వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షుడు అయిన నాటి నుంచీ ఈ 232 ఏళ్లలోనూ ఆ అగ్రరాజ్యానికి పురుష అధ్యక్షులు, పురుష ఉపాధ్యక్షులు మాత్రమే ఉండటంతో వారి సతీమణి ‘ఫస్ట్ లేడీ’ (ప్రథమ మహిళ)గా, ‘సెకండ్ లేడీ’ (ద్వితీయ మహిళ) గా ఉంటూ వచ్చారు. ఈ ఫస్ట్ లేడీ, సెకండ్ లేడీ అనే మాటలు కూడా డిక్షనరీలలో ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు రెండు శతాబ్దాల తర్వాత తొలిసారి ఆ అగ్రరాజ్యానికి కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా వచ్చారు. దాంతో ఆమె భర్త ‘సెకండ్ జెంటిల్మన్’ (ద్వితీయ పురుషుడు) అయ్యారు. సంప్రదాయం ప్రకారం అవడానికైతే అయ్యారు. అధికారికంగా మాత్రం అలాంటి ఒక ప్రాణి (సెకండ్ జెంటిల్మన్) అమెరికా పాలన పత్రాల్లో గానీ, అమెరికా వారి 190 ఏళ్ల ఘన చరిత్ర గల ‘మెరియం వెబ్‌స్టర్’ నిఘంటువులో గానీ లేదు. ఇప్పుడిక ఉండబోతోంది. Second gentlemanకి మెరియం ఇచ్చిన అర్థం : The Husband of a vice-president or second in command of a country or jurisdiction. అంటే.. వైస్ ప్రెసిడెంట్ లేదా దేశ పాలనలో, దేశ పరిధిలో ద్వితీయ హోదాలో ఉన్న వ్యక్తికి భర్త.. అని మీనింగ్. ఇక మెల్లిమెల్లిగా అధికారిక పత్రాల్లోకీ ఈ మాట వచ్చేస్తుంది. కమలా హ్యారిస్ కనుక భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలు అయితే అప్పుడు ‘ఫస్ట్ జెంటిల్మన్’ అనే మాట కూడా ఆవిర్భవిస్తుంది. కమలా హ్యారిస్ భర్త డగ్లాస్ ఎంహాఫ్. ఇద్దరి ఏజ్ ఒకటే. 56. ఇద్దరూ అక్టోబర్‌లోనే పుట్టారు. డగ్లాస్ ఎంటర్టైన్మెంట్ లాయర్. స్క్రీన్ ఇండస్ట్రీ వివాదాల్ని పరిష్కరిస్తుంటారు. వ్యక్తిగా ఆయనకుండే పేరు ఆయనకు ఉన్నా కమల భర్తగా ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరుకు (సెకండ్ జంటిల్మన్) కు ఆనందం పట్టలేకపోతున్నారు. ‘వెల్, నౌ ఇటీజ్ అఫిషియల్’ అంటూ.. గాల్లో తేలినట్లుందే.. అన్నంతగా ట్వీట్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాయర్‌గా ఆయన ఉద్యోగం లాజ్ ఏంజెలిస్‌లో. సెకండ్ జెంటిల్మన్గా ఆయనా వైట్ హౌస్‌లోనే ఉండొచ్చు కానీ.. వద్దనుకున్నారు. జార్జిటౌన్లో ‘లా’ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పడానికి వెళ్లిపోతున్నారు. అలాగని మరీ పట్టనట్లు ఏమీ ఉండరు. సెకండ్ జెంటిల్మన్ నెరవేర్చవలసిన బాధ్యతలు లేకున్నా, ధర్మాలు కొన్ని ఉన్నాయి. సామాజిక న్యాయం, ఇతర సంఘహిత కార్యక్రమాల్లో బైడెన్ పాలనాయంత్రాంగ ప్రతినిధిగా ఈయన ఒక చెయ్యి వేయవలసి ఉంటుంది. వేస్తానని బైడెన్ ప్రమాణ స్వీకార సందర్భంలో ట్వీట్ చేశారు డగ్లాస్ ఎంహాఫ్. ‘లా’ టీచర్‌గా సర్వ సాధార ణమైన జీవితాన్ని గడిపేందుకు ఈ సెకండ్ జెంటిల్మన్కు స్ఫూర్తి, ప్రేరణ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కాకపోయినప్పటికీ, ఎన్నికల ముందే ఆమె.. ‘తన భర్త అమెరికా అధ్యక్షుడు అయినా, నేను టీచర్‌గానే కొనసాగుతాను’ అని ప్రకటించడంతో డగ్లాస్ను, జిల్ బైడెన్‌తో పోలుస్తున్నారు. ఇద్దరివీ ఒకేవిధమైన ఔన్నత్యాలు అని. ఆయన మాత్రం ఒక మంచి మాట అన్నారు. ‘‘నా కన్నా ముందు ఎందరో మహిళలు ‘ద్వితీయులు’గా (ఉపాధ్యక్షుల భార్యలు) తమ బాధ్యతలను నిశ్శబ్దంగా, వెలుగులోకి రాకుండా నిర్వర్తించారు. వారి గౌరవాన్ని నిలిపేందుకు సెకండ్ జెంటిల్మన్గా అంకితభావంతో పని చేస్తాను’’ అన్నదే ఆ మాట. గురువారం ఆయన వాషింగ్టన్ డీసీలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇక తను సెకండ్ జెంటిల్మన్ అవడంపైన కూడా ఆయన కామెంట్ ఉన్నతంగానే ఉంది. ‘‘నేను రెండవ వ్యక్తిని కావచ్చు. చివరి వ్యక్తినైతే కాదు’’ అన్నారు. ద్వితీయ పురుషులు, ప్రథమ పురుషులు ఇకముందు కూడా ఉంటారని చెప్పడం ఆయన భావన. అంటే మున్ముందు మరింత మంది మహిళలు పాలన పగ్గాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. -
జెంటిల్‌మేన్ 2
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ కేటీ కుంజుమోన్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. 1993లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. ఈ సినిమా విడుదలైన 27ఏళ్లకు ‘జెంటిల్‌మేన్2’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత కేటీ కుంజుమోన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జెంటిల్‌మేన్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనువదించిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రాబట్టుకుంది. తొలి భాగానికి రెండింతలు గొప్పగా ‘జెంటిల్‌మేన్ 2’ని తెరకెక్కించనున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తాం. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
దేశం కోసం వచ్చిన చిత్రాలు..
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడే!అన్ని త్యాగాల చరిత్ర ఉన్న మన స్వాతంత్య్ర సమరానికిమనం ఎటువంటి నీరాజనాలు అర్పిస్తున్నాం. మన దేశాన్ని మన ఇంటిలాగా శుభ్రంగా ఉంచుకోగలమా!మహిళల్ని మన చెల్లెళ్లలాగా కాపాడుకోగలమా!దేశానికి విముక్తి ఇచ్చినవాడు ఫ్రీడమ్ ఫైటర్ అయితే..దేశాన్ని కాపాడుతున్నవాడు సైనికుడు అయితే..దేశాన్ని గౌరవిస్తున్నవాడిని ఏమనాలి? ది.. సిటిజెన్!! మన్యం గర్జించింది. ‘ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు’ అని ‘అల్లూరి సీతారామరాజు’ గురి తప్పని విల్లును ఎక్కుపెట్టాడు. తెల్లదొరల ఎర్రటోపీలు గడగడ వణికాయి. విక్టోరియా రాణి సింహాసనపు ప్రతినిధుల ఆసనాలు దొర్లి పడబోయాయి. ‘కాల్చరా కాల్చు... దమ్ముంటే కాల్చు’ అని ‘ఆంధ్రకేసరి’ ఛాతీ ఎదురొడ్డి నిలిచాడు. ఎందరో మహనీయులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రాణాలొడ్డి త్యాగాలు చేశారు. చివరకు ఆగస్టు 15, 1947న ఆ త్యాగాలు ఫలించాయి. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారత భూభాగం బ్రిటిష్ సంకెళ్ల నుంచి విముక్తి పొందింది. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. జేజేలు పలికారు. మన పాలన మొదలైంది మన దేశం కోసం మనం పాలించుకోవడం మొదలైంది. పరిపాలన, చట్ట వైఖరి, న్యాయరీతి, సైన్యం... ఇవన్నీ దేశనడకలో భాగమయ్యి ముందుకు నడిచాయి. ప్రతి పౌరుడు వీటి కోసం పని చేశాడు. ఇవన్నీ ప్రతి పౌరుడి కోసం పని చేశాయి.కాని అన్నీ సజావుగా అన్నిసార్లు లేవు. కొన్ని చోట్ల లోపాలు... కొన్ని చోట్ల పొరపాట్లు... మరికొన్ని చోట్ల అలక్ష్యాలు... వీటిని హెచ్చరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వ్యక్తిత్వం లేని పౌర సమాజం అన్ని అవలక్షణాలకు మూలం అవుతుంది.దీనిని వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. వెండితెర అందుకు తన ప్రతిధ్వనులు వినిపించింది. మొదట కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ (1954) తీశారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్లు సంఘాన్ని ఎలా పీల్చుకుతింటున్నారో చూపించారు. పెద్ద మనుషుల బుద్ధులు సరిగ్గా ఉంటే బడుగుల జీవితాలు బాగు పడతాయి. కాని నాటికీ నేటికీ పరిస్థితిలో మార్పు లేదు. అదే సమయంలో వ్యవసాయ భూములను గుప్పిట్లలో పెట్టుకుని పేద రైతుల ఉసురు పోసుకునే దుర్మార్గులను నిరసిస్తూ ‘రోజులు మారాయి’ (1955) వచ్చింది. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు నిజంగా బాగుంటున్నారా? రైతుల కోసం సాటి పౌరులు ఆలోచిస్తున్నారా? సానుభూతి వ్యక్తం చేస్తున్నారా? ఆడవాళ్ల కోసం ఆలోచన దేశం బాగుండాలంటే దేశంలో సగం మందైనా స్త్రీలు బాగుండాలి. ‘కన్యాశుల్కం’ పేరుతో వారిపై సాగుతున్న పీడన, బాల్య వివాహాల వల్ల వితంతువులై జీవితాలు నాశనం చేసుకుంటున్న స్త్రీల వేదన... వీటిపై రచయిత గురజాడ రచించిన నాటకం ‘కన్యాశుల్కం’ సినిమాగా 1955లోనే వచ్చింది. కుటుంబంలో సంస్కరణ జరిగితే సమాజంలో సంస్కరణ దానికదే జరుగుతుందని ఈ సినిమా చెబుతుంది. జనం సరే పాలకులు ఎలా ఉన్నారు... వీళ్లను దారిలో పెట్టాలి కదా అని దర్శకుడు తిలక్‌కు అనిపించింది. పాలకులపై చురకలు వేస్తూ ఆయన తీసిన సినిమా ‘ఎం.ఎల్.ఏ’ (1957). ఆ తర్వాత అలాంటి ఎన్నో సినిమాలకు అది ఆదిగా నిలిచింది. అదే సమయంలో సమాజంలో పతనమవుతున్న విలువలు, నైతిక వర్తన, అశ్లీలత వీటి గురించి మొదటిసారి ‘సుడిగుండాలు’ (1968) గొంతెత్తింది. జువైనల్ నేరాలను మొదటిసారి చూపించిన తెలుగు సినిమా ఇది. ఈ సందర్భంలో దేశం కోసం పని చేసే సైనికులు కథ కాకుండా ఉంటారా? సైనికుల త్యాగాలను గుర్తించి వారిని గౌరవించాలని ‘జై జవాన్’ (1970) సినిమా చెప్పింది. చలి చీమల చేత చిక్కి అయితే నిత్యం దోపిడీకి గురయ్యే పీడితులు కలిసి కట్టుగా తిరగబడకపోతే అన్యాయం అలాగే కొనసాగుతుందని కూడా సినిమా చెప్తూ వచ్చింది. ‘చలి చీమలు’ (1978) ఇందుకు ఉదాహరణ. అలాగే నోటు పుస్తకాలతో కాలక్షేపం చేయకుండా యువకులు కూడా చైతన్యవంతులై సమాజాన్ని సంస్కరించాలని కోరుతూ మాదాల రంగారావు ‘యువతరం కదిలింది’ (1980) కూడా వచ్చింది. కాని అదే సమయంలో దేశంలో పేరుకుపోతున్న నిరుద్యోగ సమస్యను, దాని వల్ల దేశం పట్ల యువతకు పెరుగుతున్న అసహనాన్ని కూడా సినిమా చర్చకు పెట్టింది. ‘ఆకలి రాజ్యం’ (1981), ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ (1982) ఆ పనిని విజయవంతంగా చేశాయి. అప్పుడే దర్శకుడు టి.కృష్ణ రంగంలోకి వచ్చి సినిమాతో ఎంత చైతన్యం తేవచ్చో నిరూపిస్తూ దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుపుతూ ‘నేటి భారతం’ (1983), ‘దేశంలో దొంగలు పడ్డారు’ (1985) చిత్రాలు తీశారు. ఇవి చిన్న సినిమాలు కాగా పెద్ద హీరోలతో కూడా దేశ పరిస్థితిని కామెంట్ చేయవచ్చని దాసరి ‘సర్దార్ పాపారాయుడు’ (1980)తో నిరూపించారు. దేశానికి తెల్లపాలకుల నుంచి లభించిన విముక్తితో పాటు నల్ల పెత్తందార్ల నుంచి కూడా విముక్తి ముఖ్యమని ఈ సినిమా చూపించింది. అలాగే దేశం బయట ఉన్న శత్రువుల సంహారం కంటే దేశం లోపల ఉన్న శత్రువుల సంహారం ముఖ్యమని ‘బొబ్బిలిపులి’(1982) చాలా శక్తిమంతంగా చెప్పింది. రౌడీల రాజ్యం ఈ సమయంలోనే దేశంలో రౌడీయిజం పెరిగింది. ‘తొండలు ముదిరి ఊసరవెల్లులయినట్టు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు’గా మారుతున్న కాలం అది. ఈ పరిస్థితిని ఖండఖండాలుగా నరకాలి అని ‘ప్రతిఘటన’ (1985) సినిమా వచ్చింది. వచ్చిన స్వతంత్రం ఎంత మందిని చీకట్లోకి తోస్తూ ఉందో ఎంత మంది పట్టెడు మెతుకుల కోసం ఘర్షణ పడి తుపాకులు పట్టాల్సి వస్తోందో చూపుతూ ‘అర్ధరాత్రి స్వతంత్రం’ (1986) వచ్చింది. సాయుధ పోరాటం వైపు సమాజం ఆశలు పెట్టుకోవాల్సిన స్థితిని ‘అడవి దివిటీలు’ (1990) వంటి సినిమాలు చూపించాయి. అదే సమయంలో పోలీసు వ్యవస్థ సంస్కరణను ఆశిస్తూ నిజాయితీ కలిగిన ఆఫీసర్ల అవసరాన్ని చెబుతూ ‘అంకుశం’ (1989), ‘కర్తవ్యం’ (1990) సినిమాలు వచ్చాయి. ఇక చీటికి మాటికి బంద్‌లు చేస్తూ పౌర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పరిస్థితిని విమర్శిస్తూ ‘భారత్ బంద్’ (1991) వచ్చింది. రాజ్య పీడన దొర పీడన రాజ్య వ్యవస్థను ధిక్కరిస్తూ పోరాడేవాళ్లను రాజ్యం మాయం చేస్తుంది. అలా మాయం చేసినప్పుడు రాజ్యాన్ని ప్రశ్నించాల్సింది పౌరులే. ఆ కర్తవ్యాన్ని అద్భుతంగా గుర్తు చేస్తూ ‘అంకురం’ (1993) వచ్చింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో దొర పీడన ఎలా ఉందో చెప్పే ‘ఒసేయ్ రాములమ్మ’ (1997) సినిమా వచ్చి సంచలనం రేపింది. జెంటిల్మన్తో మొదలు సినిమాను దేశ హితం కోసం వాడాలి. పౌర సమాజంలో చైతన్యం తేవాలి అని బలంగా నమ్మి ఆ తర్వాతి కాలంలో పేరు గడించిన దర్శకుడు శంకర్. ఇతడు తీసిన తమిళ సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యి దాదాపు తెలుగు సినిమాలుగా చలామణి అయ్యాయి. విద్యా వ్యవస్థ డొనేషన్ సిస్టమ్ వల్ల ఎంత లోప భూయిష్టంగా ఉందో, దాని వల్ల యోగ్యులు ఎలా నష్టపోతున్నారో చూపుతూ శంకర్ ‘జెంటిల్మన్’ (1994) తీశాడు. పాలనా వ్యవస్థలు ఎంత లంచగొండులుగా మారాయో చూపుతూ ‘భారతీయుడు’ (1996) తీశాడు. ప్రభుత్వాధినేతలు సక్రమంగా పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చూపుతూ ‘ఒకే ఒక్కడు’ (1999) తీశాడు. సమాజంలో బాధ్యతా రాహిత్యం ఎటువంటి దుష్ఫలితాలు ఇస్తుందో చూపుతూ ‘అపరిచితుడు’ (2005) తీశాడు. నల్లధనం పేరుకు పోవడం వల్ల అట్టడుగు వర్గాలకు ఎలా ఫలాలు అందకుండా పోతున్నాయో చూపుతూ ‘శివాజీ’ (2007) తీశాడు. అదే సమయంలో తెలుగులో కూడా ‘ఠాగూర్’ (2003) వంటి సినిమాలు లంచగొండి వ్యవస్థను తూర్పార బట్టాయి. అందరి బాధ్యత దేశానికి స్వాతంత్య్రం రావడమే సరిపోదు. అన్ని వ్యవస్థలూ, పౌర సమాజమూ సక్రమంగా పని చేస్తేనే బంగారు భారతదేశం ఏర్పడుతుంది. స్త్రీలు, బాలలు, వృద్ధులు, వన్యప్రాణులు, పర్యావరణం... ఇవన్నీ సంతోషంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది గొప్ప దేశం అనిపించుకుంటుంది. పాలకులు, పోలీసులు, న్యాయవవస్థ, అధికారగణం ఈ దేశం నాది.. ఈ సమాజపు భవిష్యత్తు కోసం బాధ్యతగా పని చేస్తాను అనుకున్నప్పుడు దేశం మరింతగా సమర్థంగా తయారవుతుంది.సినిమాలో హీరో మాత్రమే హీరో. బయట బాధ్యత ఉన్న ప్రతి పౌరుడూ హీరోనే. – కె -
జెంటిల్మన్ బ్యూటీతో రోహిత్
జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి నివేదా థామస్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటుంది. జెంటిల్మన్ తరువాత నిన్నుకోరి, జై లవ కుశ సినిమాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన తరువాత మరో సినిమా అంగీకరించేందుకు చాలా సమయం తీసుకుంది. తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతన్న ‘శబ్దం’ సినిమాలో నివేదాను హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడిగా నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. -
విద్యావ్యాపారంపై దొంగ దెబ్బ ‘జెంటిల్‌మేన్’
ఉదయం ఎనిమిది గంటలకు వ్యాన్ వస్తుంది. ఆయా తోడు ఉండి తీసుకువెళుతుంది. మధ్యాహ్నం స్కూల్లోనే లంచ్ ఇస్తారు. సాయంత్రం ఇంటర్వెల్‌కు ముందు స్నాక్ ఇస్తారు. క్యాంపస్ కాస్త పరిశుభ్రంగా ఉంటుంది. పాఠాలు కొంచెం నదురుగా చెప్తారు. ఈ మాత్రం దానికి హైదరాబాద్‌లో ఎల్.కె.జిలో జాయిన్ అయ్యి చదవాలంటే ఎనభై వేలు అవుతుంది. ఇంకా మంచి స్కూల్ అంటే లక్షన్నర. ఆ పైస్థాయికి రెండు లక్షలు. అందరూ పిల్లలే. అందరికీ ఈ మాత్రం స్కూల్, చదువు అందుబాటులో ఉండాలి. కాని పేదవాడి పిల్లలు ఇలాంటి స్కూల్‌ను ఊహించలేరు. డబ్బున్న పిల్లలకు పగిలిపోయిన పలకతో వచ్చే పిల్లాడి దుఃఖం ఎప్పటికీ తెలియదు. 2018లో అంతే. 1993లో అంతే. అయితే కాలం కలకాలం దోచుకునేవాళ్ల చేతిలో కరవాలం కాదు. తిరగబడేవాడు వస్తాడు. బందిపోటులా దాడి చేస్తాడు. ఇనప్పెట్టెలను ఖాళీ చేసి పట్టుకుపోయి పేదవాళ్లకు పంచి పెడతాడు. గతంలో అతణ్ణి రాబిన్‌హుడ్ అన్నారు. తమిళ సినిమాలో ‘జెంటిల్‌మేన్’ అన్నారు. ఇప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వచ్చాయి. సీట్లు దొరుకుతున్నాయి. కాని మెడికల్ సీట్లు ఇప్పుడూ కష్టం. 1990ల కాలంలో ఇంకా కష్టం. బి.ఏ, బి.కాం, బిఎస్సీలు దివాలా తీసిన కాలం అది. ఆ డిగ్రీలకు విలువ లేదు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేయాలి. ప్రతిభావంతులైన అందరు విద్యార్థుల కల అదే. అలాంటి కాలంలో వినీత్, అర్జున్‌లు ఇంటర్లో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులలో పాస్ అవుతారు. డాకర్లు కావాలనేది వారి కల. కాని మెడికల్ కాలేజీలో సీటు రాదు. దాని కోసం మంత్రిని కలుస్తారు. మెడికల్ కాలేజీ సీటంటే బజారులో దొరికే బొరుగుముద్ద కాదనీ ఒక్క సీటుకు లక్షన్నర కట్టాలని చెప్తాడు. లక్షన్నర. వెయ్యి రూపాయల జీతంతో మధ్యతరగతి జీవితం గడిచిపోయే రోజులు అవి. వీళ్లు పేదవాళ్లు. లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి. వినీత్‌కు మెడికల్ కాలేజీ అంటే పిచ్చి. కానీ తండ్రి దాని మీద ఆశలు వదలుకొమ్మని అప్పడాలు అమ్ముకురమ్మని చెప్తాడు. వినీత్ భరించలేకపోతాడు. కదిలే బస్సు కింద తలను పరుస్తాడు. ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉన్న మెదడు ఆ కఠినమైన లోక వాస్తవం కింద చితికిపోతుంది. మరోవైపు స్కూల్లో వంటామెగా పని చేసే అర్జున్ తల్లి నష్టపరిహారం ఏదైనా వచ్చి కొడుకు చదువుకు ఉపయోగపడుతుందని చెప్పి ఒంటికి నిప్పు పెట్టుకుంటుంది. ఇద్దరు విద్యార్థుల న్యాయమైన కోరిక వికృత వ్యాపార క్రీడ వల్ల రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వ్యవస్థను న్యాయంగా ఎదుర్కోలేనప్పుడు దొంగదెబ్బ తీసి మెడలు వొంచాలి. అర్జున్ అదే నిర్ణయించుకుంటాడు. గజదొంగగా మారుతాడు. పగలు అప్పడాల కంపెనీ నడిపే యజమానిగా రాత్రిళ్లు ప్రభుత్వ సొమ్మును, బలిసినవాళ్ల ధనాన్ని దోచుకెళ్లే దొంగగా మారతాడు. 50 కోట్ల రూపాయల లక్ష్యం. ఎందుకు? ప్రజా విశ్వవిద్యాలయం నిర్మించడానికి. రాజైనా పేదైనా పెద్ద కులం వాడైనా చిన్న కులం వాడైనా హిందువైనా ముస్లిం అయినా అర్హమైన చదువు చదువుకోవాలంటే ఆ విశ్వవిద్యాలయంలో ఉచితం. అలాంటి విశ్వవిద్యాలయం కడతాడు. కాని చట్టం ఊరికే ఉండదు. తన పని తాను చేసుకుపోతుంది. అర్జున్ను అరెస్ట్ చేస్తుంది. ఆరేళ్ల జైలు శిక్ష. కాని ఒక ఉదాత్తమైన ఆశయం ఎదుట ఆ శిక్ష ఏపాటి? అర్జున్ విడుదలవుతాడు. ప్రజా విశ్వ విద్యాలయం ఉనికిలోకి వస్తుంది. కాని అదొక్కటే ఏం సరి పోతుంది? ఎక్కడని సరిపోతుంది. యోగ్యులైన విద్యార్థులు అర్హమైన విద్య కోసం ఆక్రందనలు చేస్తూనే ఉన్నారు. బహుశా చేస్తూనే ఉంటారు. ఎస్.ఏ.చంద్రశేఖర్ అని తమిళంలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న విజయ్ తండ్రి. తమిళంలో ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ అనే సినిమా తీశాడు. హీరో తన తల్లిదండ్రులను చంపిన హంతకులను చట్టానికి దొరక్కుండా చంపుతాడు. అదీ కథ. పెద్ద హిట్టయ్యి ఆ సినిమాలో నటించిన విజయ్‌కాంత్‌ని హీరోని చేసింది. తెలుగులో ‘చట్టానికి కళ్లులేవు’గా, హిందీలో ‘అంధా కానూన్’గా పెద్ద హిట్ అయ్యింది. ఆ చంద్రశేఖర్ శిష్యుడే దర్శకుడు ఎన్.శంకర్. చట్టం లొసుగులను గురువు పర్సనల్ కారణాలకు వాడుకుంటే శిష్యుడు సంఘపరమైన కారణాలకు వాడుతూ తన తొలి సినిమాగా ‘జెంటిల్‌మేన్’ తీశాడు. ఆ తర్వాత శంకర్ ధోరణి అంతా ఈ బాణీలోనే సాగింది. సమాజానికి మేలు చేయడం కోసం చట్టం అంగీకరించని పద్ధతిలో హీరో తిరగబడటమే అతడి కథలు. ‘జెంటిల్‌మేన్’ మొదటిసారి ఒక సామాజిక దురవస్థను చర్చించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే నీతిని కూడా రంజింప చేస్తూ చెప్పాలి. శంకర్ అలా చెప్పడం వల్లే సినిమా నిలిచింది. ‘జెంటిల్‌మేన్’లో గగుర్పాటు కలిగించే సన్నివేశాలున్నాయి. వినీత్ ఆత్మహత్య చేసుకుని మరణించాక అర్జున్ నిశ్చేష్టుడై వచ్చి శవానికి చుట్టిన బ్యాండేజ్ విప్పితే తల నుంచి మెదడు బయటకు వస్తుంది. దానిని పట్టుకుని తిరుగుతూ అందరికీ చూపుతూ విలపిస్తాడు అర్జున్. అలాగే ఆత్మహత్య చేసుకోబోయే ముందు మనోరమ ఒకసారి కొడుకుని పిలిచి కళ్లారా చూసుకోవడం కంటిచెమ్మను తెప్పిస్తుంది.ఇలాంటి సన్నివేశాలు రాసుకున్న శంకరే హీరోయిన్ మధుబాల చెల్లెలుగా శుభశ్రీని ప్రవేశపెట్టి కుర్రాళ్లకు హుషారు కలిగించే సన్నివేశాలు అల్లుతాడు. హాస్యజంట గౌండర్‌మణి, సెంథిల్ తమ చెణుకులతో నవ్విస్తారు. సూపర్మాల్లో దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు వెంటపడితే గౌండర్ మణి హడావిడిగా ఒక బట్టలషాపులో దూరగా సేల్స్ గర్ల్ వచ్చి ‘వాడ్డూయు వాంట్ సార్’ అంటుంది. గౌండర్ మణి చటుక్కున ‘పీస్ ఆఫ్ మైండ్’ అంటాడు. దీనిని త్రివిక్రమ్ వాడాడు. శంకర్‌కు పదార్థం వండటం తెలుసు. దాని మీద ఆకర్షణగా తగరపు కాగితం అద్దడం కూడా తెలుసు. ఈ రెండూ కలిసి రుచి కలిగించిన సినిమా ‘జెంటిల్‌మేన్’. ఫిబ్రవరి మార్చ్ నెలలు వస్తే న్యూస్ పేపర్లలో తల్లి దండ్రుల సంఘాలు ‘స్కూళ్ల ఫీజులు తగ్గించమని’ ప్రభుత్వానికి వినతి చేస్తున్న వార్తలు కనిపిస్తాయి. ప్రభుత్వం కూడా తగిస్తాం, చర్యలు తీసుకుంటాం అంటూ ఉంటుంది. స్కూలు యాజమాన్యాలు మాత్రం చక్కగా కాఫీలు తాగుతూ సెల్ఫోన్లు చూసుకుంటూ దండాల్సిన దానికి రూపాయి తగ్గకుండా దండుకుంటూ ఉంటాయి. ఖరీదైన వస్తువును కొనుక్కున్నంత కష్టంగా మెరుగైన చదువును కొనుక్కునే దురవస్థ మారలేదు. లాంగ్ కోట్ వేసుకొని నల్ల కళ్లద్దాలతో ‘జెంటిల్‌మేన్’ వస్తే బాగుండు. కొల్లగొడితే బాగుండు. కమాన్ జెంటిల్‌మేన్. శంకర్ ఫార్ములా తమిళంలో భారీ నిర్మాతగా పేరుబడ్డ కుంజుమోహన్ శంకర్‌కు దర్శకుడిగా అవకాశం ఇచ్చి 1993లో తీసిన సినిమా ‘జెంటిల్‌మేన్’. అదే పేరుతో ఏ.ఎం.రత్నం అనువదించగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటికి ఉన్న ఇతివృత్తాలకు భిన్నంగా ఈ సినిమా ఇతివృత్తం ఉండటంతో ప్రేక్షకులు సినిమాను భారీగా ఆదరించారు. దానికి తోడు భారీ ఖర్చు పెట్టి సినిమా తీయడం కూడా లాభించింది. షోలే తరహాలో సినిమా ప్రారంభంలోనే రైలు మీదుగా ఎగిరే మోటర్ సైకిళ్లు, జీపుల వంటి భారీ చేజ్ పెట్టి ప్రేక్షకులకు షాక్ ఇస్తాడు శంకర్. ఈ సినిమాతో మొదలైన శంకర్–ఏ.ఆర్.రెహమాన్ జోడి ఇప్పటికీ కొనసాగుతోంది. మొదటిసారి తెలుగువారు బాలూ గొంతు కాకుండా సురేశ్ పీటర్స్, షావుల్ హమీద్ వంటి ఇతర గాయకుల గొంతును విన్నారు. ఈ సినిమాలోని ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట సినిమా హిట్ కావడానికి ఒక ప్రధాన కారణమైంది. అందులో ప్రభుదేవా, ఐటమ్ గర్ల్‌గా గౌతమి కనిపించి ఊపు తెచ్చారు. పాట మధ్యలో రాజు సుందరం కనిపించి తన మార్కు స్టెప్పులు వేసి అలరిస్తాడు. ఈ సినిమా చిరంజీవి హీరోగా మహేశ్‌భట్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ అయిన సంగతి ఎంతమందికి గుర్తుందో చెప్పలేము. ఒకప్పుడు భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కుంజుమోహన్, ఏ.ఎం.రత్నంలు ఆ స్థాయి సినిమాలకు దూరమవడం ఒక వాస్తవం. శంకర్ 2.0 నుంచి ఏదో ఒకనాటికి విడుదలవుతాడనే ఆశిద్దాం. – కె -
మాస్ హీరోతో టాలెంటెడ్ హీరోయిన్
రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, త్వరలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. నేల టికెట్ తరువాత స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన నివేథా థామస్‌ను హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచన ఉన్నారు చిత్రయూనిట్. జెంటిల్మన్, నిన్నుకోరి సినిమాలతో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నివేథ.. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటోంది. వరుసగా హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయటం లేదు. రవితేజ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చటంతో నటించేందుకు అంగీకరించిందట నివేథ. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొంతకాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న శ్రీనువైట్ల ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
జెంటిల్మెన్ ఒప్పందం
అమలాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం వ్యవహారం రెండేళ్లు గణేష్‌కు, మిగిలిన కాలానికి సతీష్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయాలంటూ 29న హైకోర్టులో రిట్ నేటి కోర్టు విచారణపై ఉత్కంఠ ఓవైపు జెంటిల్మెన్ ఒప్పందం కోసం స్థానిక దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నివాసంలో చర్చలు జరుగుతుండగానే, పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు గారపాటి మార్తాండ 29న జరిగే చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలంటూ సోమవారం హైకోర్టులో రిట్ వేశారు. మున్సిపల్ చైర్మన్ మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన నాలుగో వార్డుకు ఎన్నిక నిర్వహించకుండా, చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించరాదని.. ఇది మున్సిపల్ బైలాకు విరుద్ధమంటూ కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై టీడీపీ కార్యకర్త మామిడిపల్లి సాయిబాబు కూడా చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలం టూ హైకోర్టులో రిట్ వేశారు. సాయిబాబు వేసిన రిట్‌పై దసరా సెలవుల తర్వాత విచారణకు వాయిదా వేస్తే, మార్తాండ వేసిన రిట్‌ను మంగళవారం విచారణ చేయనున్నట్టు హైకోర్టు పేర్కొంది. దీంతో చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెంటిల్మెన్ ఒప్పందాన్ని సూచించిన రాజప్ప మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరుగుతున్న కసరత్తు, గణేష్, సతీష్ మధ్య జరుగుతున్న పదవీ పందేరంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని, జెంటిల్మెన్ ఒప్పందంతో ఆ అంశానికి తెరదించారు. దీంతో ఎమ్మెల్యే ఆనందరావు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, కౌన్సిలర్లు, పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న గణేష్, సతీష్‌కు సోమవారం ఈ ఒ ప్పందాన్ని వివరించారు. ఇందుకు గణేష్, సతీష్ అంగీకరించారు. దీంతో 29న జరిగే చైర్మన్ ఎన్నికకు గణేష్ ఒక్కరినే చైర్మన్ అ భ్యర్థిగా ఎంపిక చేశారు. ఒకే అభ్యర్థి కావడంతో చైర్మన్‌గా గణేష్ ఎన్నిక ఇక లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఎన్నిక నిలిపివేతపై వేసిన రిట్‌తో ఉత్కంఠ అనివార్యమైంది. నాలుగో వార్డు నుంచి మల్లేశ్వరరా వు తనయుడు సతీష్ ఎన్నికై, చైర్మన్ పదవి చేపట్టాలని ఆశించారు. మూడేళ్లు మల్లేశ్వరరావు, రెండేళ్లు గణేష్ చైర్మన్లుగా పనిచేసేం దుకు 2014 మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన ఒప్పందంతో పాటు మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన చైర్మన్ పీఠాన్ని గణేష్ ఆశించారు. 29న జరిగే ఎన్నికలో గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారో, మంగళవారం నాటి హైకోర్టు విచారణతో ఎన్నిక వాయిదా పడుతుందో, ఎన్నిక నిర్వహించుకోవచ్చో తేలాలంటే వేచిచూడాల్సిందే. -
అఖిల్ సరసన మలయాళీ భామ..?
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు ఏడాది కాలంగా సరైన కథ, దర్శకుడి కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరో ఇటీవల విక్రమ్ కుమార్‌తో రెండో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సినిమా ఏ జానర్లో ఉంటుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్గా మలయాళీ బ్యూటి నివేదా థామస్ నటించనుందట. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా, తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అఖిల్ లాంటి క్రేజ్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
కాంబినేషన్ కుదిరింది
అక్కినేని నాగచైతన్య ఓ కొత్త చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ‘జెంటిల్మన్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సోమవారం దర్శకుడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘గ్రహణం’తో జాతీయ అవార్డు అందుకున్న ఇంద్రగంటి, ఆ తర్వాత ‘అష్టా చమ్మా’తో అందర్నీ నవ్వించారు. తాజాగా ‘జెంటిల్మన్’తో ఉత్కంఠనూ కలిగించారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘ఊహలు గుసగుసలాడే’, తాజాగా ‘మనమంతా’, ‘జ్యో అచ్యుతానంద’.. ఇలా సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వారాహి సంస్థలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా పూర్తయిన తర్వాత ఇంద్రగంటి సినిమా ప్రారంభం కానుందని వినికిడి. చైతూ నటించిన తాజా చిత్రం ‘ప్రేమమ్’ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్ మీనన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు రెడీగా ఉంది. -
అక్కినేని హీరోతో ఇంద్రగంటి సినిమా..?
జెంటిల్మన్ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే చైతూకు లైన్ వినిపించిన ఇంద్రగంటి కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రకటించిన నాగచైతన్య, రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. చైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు అక్టోబర్ నవంబర్ నెలల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
నాని నాలుగు సినిమాలు
ఈ జనరేషన్ హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఓ యంగ్ హీరో మాత్రం ఈ ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన ఈ హీరో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. గతంలో అల్లరి నరేష్ ఇదే స్పీడులో సినిమాలో చేసినా వరుస ఫ్లాప్‌లతో కాస్త స్లో అయ్యాడు. సీనియర్ హీరో రవితేజ కూడా ఫాం కోల్పోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్లేస్‌ను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, జూన్‌లో జెంటిల్మన్గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన చంద్ర విలన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాని. -
కథను నమ్మి కమిట్ అయ్యాడు
‘‘నాని, నా కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా’ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని మేం క్యాష్ చేసుకోవాలనుకోలేదు. దాన్ని మించిన చిత్రం తీయాలని మంచి కథ కోసం ఎనిమి దేళ్లు వెయిట్ చేశాం. నిర్మాత కృష్ణప్రసాద్ గారు డేవిడ్ నాథన్‌ను నా దగ్గరకు తీసుకొచ్చి ఓ కథ ఉంది వినమన్నారు. కథ నచ్చడంతో నేను నానీకి చెప్పా. ఇటువంటి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనుకోకుండా కథను నమ్మి నాని ధైర్యంగా ఒప్పుకున్నాడు. మా నమ్మకం వమ్ము కాలేదు. ‘మా సినిమా పది, పదిహేను, ఇరవై రోజులు ఆడింది’ అంటూ విజయోత్సవాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో మా ‘జంటిల్మన్’ యాభై రోజులు ఆడటం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అన్నారు. నాని, నివేదా థామస్, సురభి ముఖ్య తారలుగా మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఈ సినిమా యాభై రోజుల వేడుకను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ డేవిడ్‌నాథన్ ఇచ్చిన కథ ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. మా ‘జంటిల్మన్’ ఇరవై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు ఆడటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం విజయంతో ఇకపైన మరిన్ని మంచి చిత్రాలు తీస్తా. మణిశర్మ సంగీతం, మోహనకృష్ణ దర్శకత్వం మా సినిమాకు హైలెట్. అరకులో షూటింగ్ ఉండటంతో నాని ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు’’ అని తెలిపారు. కథా రచయిత డేవిడ్ నాథన్ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ సినిమాలో 'జెంటిల్మన్' బ్యూటి
ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న మళయాలి ముద్దుగుమ్మ నివేదా థామస్. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నివేదా. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న ఈ భామ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. అందం, అభినయం రెండు ఉండటంతో స్టార్ హీరోలు కూడా నివేదాతో జతకట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది నివేదా. పస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న జూనియర్, ఆ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నటించనున్నాడు. హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నివేదా థామస్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే నివేధా పాత్రపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
కుర్రాళ్లంతా జెంటిల్మన్లే.. - హీరో నాని
విజయవాడ (గాంధీనగర్) : నేటితరం కుర్రాళ్లంతా జెంటిల్మన్లే అని హీరో నాని అన్నారు. శ్రీదేవి బ్యానర్‌పై శివలెంక కృష్ణమోహన్ నిర్మించిన ‘జెంటిల్మెన్’ సినిమా విజయోత్సవంలో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. చిత్రం ప్రదర్శిస్తున్న కపర్ధి థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఉత్సాహంగా గడిపింది. చిత్రాన్ని ఆదరించి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ తాను చల్లపల్లి అబ్బాయినేనని, తనకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన బంధువులంతా విజయవాడలోనే ఉంటారని చెప్పారు. జెంటిల్మెన్ చిత్రానికి కుర్రాళ్లే బాక్సాఫీస్ హిట్ అందిం చారని పేర్కొన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ తాను, నాని కాంబినేషన్లో మూడేళ్ల క్రితం నిర్మించిన ‘అష్టాచెమ్మా’ చిత్రం విజయం సాధించిందని, ఇప్పుడు జెంటిల్మెన్ అంతకన్నా ఘనవిజయం సాధించిందన్నారు. హీరోయిన్లు నివేదా థామస్, సురభి మాట్లాడుతూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తమకెంతో సంతోషానిచ్చిందన్నారు. సినిమాలో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఏపీ ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసాద్, గీతా పిక్చర్స్ మేనేజర్ గిరి, కపర్ధి థియేటర్ మేనేజర్ మోహన్‌రావు, చిత్ర పంపిణీదారులు రాజేష్ పాల్గొన్నారు. బస్టాండ్‌లో థియేటర్ ఆలోచన బాగుంది విజయవాడ (బస్‌స్టేషన్) : విజయవాడలో సినిమాలకు ఒక ప్రత్యేకత ఉందని, ఏ సినిమా అయినా ఇక్కడ హిట్ అంటే.. మిగతా ప్రాంతాల్లోనూ అదే టాక్ తెచ్చుకుంటుందని హీరో నాని తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎరైవల్ బ్లాక్‌లోని వైస్క్రీన్ థియేటర్లో జెంటిల్మెన్ చిత్రబృందం సోమవారం సందడి చేసింది. యూనిట్‌కు థియేటర్ అధినేత యార్లగడ్డ వెంకటరత్నకుమార్ స్వాగతం పలికారు. సినిమా విజయోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా హీరో నాని విలేకరులతో మాట్లాడుతూ జెంటిల్మెన్ సినిమాను ఆదరించి విజయం చేకూర్చిన ప్రేకక్షులకు రుణపడి ఉంటానన్నారు. బస్టాండ్‌లో సినిమా థియేటర్ నిర్మించాలన్న ఆలోచన బాగుందన్నారు. -
నాని దర్శకత్వంలో బాహుబలి
బాహుబలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేయాల్సిన సినిమాకు నాని దర్శకత్వం వహించటం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం జెంటిల్మన్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని, బాహుబలి సెట్స్‌లో సందడి చేశాడు. హీరో నానికి ఈ జనరేషన్ హీరోలతో మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా రానా ఏర్పాటుచేసే పార్టీల్లో నాని తప్పకుండా కనిపిస్తుంటాడు. బాహుబలి దర్శకుడు రాజమౌళితో కూడా నానికి మంచి అనుబంధం ఉంది. ఈగ సినిమాతో తనకు జాతీయస్థాయి గుర్తింపు ఇచ్చినందుకు జక్కన్నకు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నాడు నాని. అందుకే అంత ఈజీగా ఎవరికీ అనుమతి లభించని బాహుబలి సెట్లో అడుగుపెట్టే అదృష్టాన్ని పొందాడు నాని. అంతేకాదు కాసేపు హీరో వేషాలు పక్కన పెట్టి రాజమౌళి చేతిలో మెగాఫోన్ అందుకొని దర్శకుడి అవతారం ఎత్తేశాడు. బాహుబలి సెట్స్‌లో నాని చేసిన హడావుడిని చిత్రయూనిట్ ట్విట్టర్ లో షేర్ చేశారు. -
జెంటిల్మన్.., శర్వా చేయాల్సిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సి సినిమా మరో హీరో దగ్గరకు వెళ్లటంతో తరువాత అది మంచి సక్సెస్ సాధించటంతో గతంలో కాదన్న హీరో బాధ పడటం చాలా కామన్. తాజాగా జెంటిల్మన్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాను ముందుగా మరో యంగ్ హీరో శర్వానంద్ వినిపించాడట దర్శకుడు. అయితే సినిమాలో హీరో పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనతో శర్వా, జెంటిల్మన్ ప్రాజెక్ట్ కు నో చెప్పాడు. ప్రస్తుతం కామెడీ టచ్ ఉన్న పాత్రలు చేస్తున్న శర్వానంద్, కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా సీరియస్ పాత్రలన్లోనే నటించాడు. అందుకే జెంటిల్మన్ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రకు శర్వా అయితే కరెక్ట్ అని ఫీల్ అయ్యారు చిత్రయూనిట్. కానీ శర్వా మాత్రం కామెడీ జానరే సేఫ్ అని ఇంద్రగంటికి నో చెప్పాడు. అలా ఓ యంగ్ హీరో కాదన్న కథ, నాని ఖాతాలో హిట్ సినిమాగా నిలిచింది. -
మేం టచ్‌లోనే ఉన్నాం!
‘‘కథ వింటా. నచ్చితే హీరో, డెరైక్టర్ ఎవరని ఆలోచిస్తా. కథ ఎంపికలో తుది నిర్ణయం నాదే. తర్వాత వచ్చే గెలుపోటములకు నా బాధ్యత కూడా ఉందని భావిస్తా. ఓటమి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. దానివల్లే చిత్రాలు విజయవంతం అవుతాయన్నది నేను నమ్మను. గ్లామర్ కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే నా ప్రాధాన్యం’’ అని కథానాయిక నివేదా థామస్ అన్నారు. నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమయ్యారామె. ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిందని నివేదా థామస్ చెబుతూ - ‘‘కో-డెరైక్టర్ సురేష్‌గారు నేను నటించిన మలయాళం, తమిళ చిత్రాలు చూసి మోహనకృష్ణగారికి చెప్పారు. ఆయనకు కూడా ఈ చిత్రంలో క్యాథరిన్ పాత్రకు సరిపోతానని అనిపించడంతో తీసుకున్నారు. మోహనకృష్ణసార్ కథ చెప్పగానే నచ్చి, ఎలాగైనా ఈ చిత్రం చేయాలనుకున్నా. నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. కమల్‌హాసన్‌గారి ‘పాపనాశం’లో మంచి పాత్ర చేశా. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత నాకిష్టమైన యాక్టర్ నానీనే. తన సినిమాలన్నీ చూశాను. నాని నటన సహజంగా ఉంటుంది. ఈ చిత్రం చేసేటప్పుడు హీరోయిన్ సురభితో మంచి స్నేహం కుదిరింది. నేను చెన్నై, తను ఢిల్లీలో ఉంటాం. ఫోన్ ద్వారా టచ్‌లోనే ఉన్నాం. ఈ చిత్రం షూటింగ్‌లోనే తెలుగు నేర్చుకున్నా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. పరీక్షలు ఉండటంతో కుదరలేదు. నెక్ట్స్ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెబుతా. ప్రస్తుతం ఆర్కిటెక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, మలయాళంలో కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు’’ అన్నారు. -
జెంటిల్... సస్పెన్స్ థ్రిల్లర్
సహజంగా అభినయించే నటుడు, సాహిత్యం - సినిమా రెంటినీ శ్రద్ధగా చదువుకొని మరీ పద్ధతిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు, సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా భావించని నిర్మాత - ఇలాంటి ‘జెంటిల్ మన్’లు కలిసినప్పుడు ఎలాంటి సినిమా వస్తుంది? నాని, ఇంద్ర గంటి మోహనకృష్ణ, సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (‘ఆదిత్య 369’ ఫేమ్)ల కాంబినే షన్లో వచ్చిన ‘నాని... జెంటిల్ మన్’ అలాంటిదే! కాంబినేషన్‌తో పాటు ‘హీరో? ఆర్ విలన్?’ అని ప్రశ్నించిన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఒక విధమైన ఆసక్తిని ఈ సినిమా రేకెత్తించింది. నిజానికి, ఈ చిత్ర కథ కూడా అలాంటి ఆసక్తికరమైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లరే! విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ విమానంలో సహ ప్రయాణికులైన ఐశ్వర్య (సురభి), కేథరిన్ (నివేదా థామస్) పరిచయ మవుతారు. కాలక్షేపానికి ఒకరి ప్రేమకథ మరొకరికి చెప్పుకుంటారు. గ్రాఫిక్స్ నిపుణురాలైన కేథరిన్‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు గౌతమ్ (నాని). కానీ, ఆమె మీద మోజున్న మేనమామ డేవిడ్ వారి ప్రేమకు విలన్ అవుతాడు. నాలుగు నెలల ప్రేమ పెళ్ళిగా మారాల్సిన టైమ్‌లో కేథరిన్ తన ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళి, ఇప్పుడా ఫ్లైట్‌లో వెనక్కి తిరిగి వస్తోందన్న మాట! ఇక, ఐశ్వర్య కొన్ని వేల కోట్ల కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏకైక వారసురాలు. యువ పారి శ్రామికవేత్త జైరామ్ ముళ్ళపూడి అలియాస్ జై (నాని ద్విపాత్రాభినయం)తో ఆమె పెళ్ళి చేయాలనుకుంటారు పెద్దలు. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసు కోవడానికి జై, ఐశ్వర్యలు రెండు రోజుల పాటు డబ్బు, ఫోన్ లేని కొడెకైనాల్ సాహసయాత్రకు వెళతారు. ప్రేమ బంధం బలపడుతుంది. విదేశానికి వెళ్ళా ల్సొచ్చిన ఐశ్వర్య ఇప్పుడు కేథరిన్ ఉన్న ఫ్లైట్‌లోనే ఇండియాకు తిరిగొస్తోంది. ఐశ్వర్య, కేథరిన్లిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. కేథరిన్ అచ్చం తన ప్రేమికుడిలా ఉన్న రెండో హీరోని చూసి అవాక్కవుతుంది. మనిషిని పోలిన మనిషి అని సరిపెట్టుకొని తన లవర్ గౌతమ్ ఇంటికెళుతుంది. అక్కడ పెద్ద షాక్. గౌతమ్‌కు ఏమైంది? జై కథ ఏంటన్నది మిస్టరీతో సాగే మిగతా కథ. సరదాగా ఉండే గౌతమ్‌గా, సీరియస్‌గా - కాస్తంత నెగటివ్ షేడ్స్ నిండిన జైగా రెండు విభిన్న తరహా పాత్రల్లో నాని మెప్పి స్తారు. సహజంగా ప్రవర్తిస్తూ, కొన్ని మామూలు డైలాగ్స్, సన్నివేశాలు, సందర్భాల్ని కూడా ఓ మెట్టు పైకి తీసుకెళ్ళారు. ఇక, కేథరిన్ పాత్రతో తెలుగు తెరకు తొలి పరిచయమైన మలయాళ నటి నివేదా థామస్ తన అభినయ ప్రతిభతో ఆ పాత్రకూ, ఈ కథకూ పెద్ద ఎస్సెట్ అయ్యారు. సెకండాఫ్‌లో హీరో, ఆమె కలసి బావురుమనే దృశ్యంలో నటన బాగుం టుంది. నిత్యా మీనన్ ఫక్కీలో నటన తెలిసిన హీరోయిన్ మరొకరు తెలుగు తెరకు దొరికినట్లయింది. మరో హీరోయిన్ సురభి ఓ.కె. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించే అవసరాల శ్రీని వాస్ అవసరాన్ని బట్టి నాణేనికి మరో వైపు చూపించగలనని నిరూపించుకున్నారు. ఆఫీసులో అనుమాన పక్షి అయిన మేనేజర్ సుదర్శనం అలియాస్ దర్శనంగా ‘వెన్నెల’ కిశోర్ వినోదంతో మెప్పించారు. జనం గుర్తుపెట్టుకొనేదిగా చాలా రోజులకు దక్కిన ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కలిసొస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే హీరో - నివేదా థామస్‌ల ‘‘సినిమాటిక్ ప్రేమకథ’’, హీరో - మరో హీరోయిన్ సురభి మధ్య సాగే ‘అంతకు ముందు - ఆ తరువాత’ సినిమా తరహా డేటింగ్ ప్రేమ ప్రయాణం లవ్స్టోరీల్ని మెచ్చే యువతరాన్ని ఆకట్టు కుంటాయి. ఇంటర్వెల్‌కు కాసేపటి ముందు నుంచి వేగం, ఉత్కంఠ పెరుగుతాయి. ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంట ర్వెల్ కార్డ్ పడుతుంది. అనూహ్యమైన షాక్ నుంచి తేరుకున్న హీరోయిన్ నివేదా థామస్ మిస్టరీని ఛేదించే క్రమం అంతా ఇక సెకండాఫ్. మిస్టరీ కేసును డీల్ చేసిన జర్నలిస్ట్ నిత్య (టీవీ యాంకర్ శ్రీముఖి) పాత్ర, హీరో తల్లి, రెండో హీరో తండ్రి లాంటి పాత్రలేవీ చివరలో కనిపించక పోయినా, సినిమా ముగిసే హడావిడిలో అవేవీ గుర్తుపట్టలేం. అలాగే, హీరో పనిచేస్తున్నది తన సంస్థలోనా, హీరోయిన్ కంపెనీలోనా అన్నదీపట్టించుకోం. సెకండాఫ్‌లో అవసరాల దగ్గరకు హీరో వెళ్ళే సీన్ లాంటివి బిగువుగా సాగా ల్సిన కథలో గుట్టుగా ఉండాల్సిన సస్పెన్స్ ముడి విప్పేందుకు ఉప్పందించే స్తాయి. చివరలో జరిగిందంతా హీరో డైలాగ్స్‌లో కన్నా విజువల్‌గా చూపించ గలిగి ఉంటే, మరింత పట్టుగా ఉండేదనిపిస్తుంది. సస్పెన్స్ గుట్టు విప్పే క్రమంలో వేగం, ఉత్కంఠ దీన్ని చిరకాలం చెప్పుకొనే సినిమాగా మార్చేవి. మొత్తం మీద చిన్నాచితకా లోటుపాటుల్ని మరిచిపోనిచ్చే నాని నేచురల్ యాక్టింగ్, ఉన్నంతలో ఆయన - ఇతర కమెడియన్లు చేసే వినోదం, మంచి డైలాగ్స్, కట్టి పడేసే నివేద నటన, మణిశర్మ రీరికార్డింగ్, ముఖ్యంగా సినిమా థీమ్ మ్యూజిక్, పి.జి. విందా కెమేరా పనితనం, ‘చలిగాలి..’ పాట, చిత్ర నిర్మాణ విలువలు - ఈ సినిమాను ‘జెంటిల్’ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని చేశాయి. దర్శకుడు ఇంద్రగంటి , హీరో నాని - ఇద్దరూ తమకు అలవాటైన పనికి పూర్తి భిన్నమైన వర్క్‌తో ముందుకు రావడం నిజంగానే థ్రిల్లింగ్ అనుభవం! అసభ్యత, హింస, రక్తపాతాలేవీ లేక పోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అనుభూతి! చిత్రం: ‘నాని... జెంటిల్మన్’, కథ - సినేరియో: డేవిడ్‌నాథన్, కెమేరా: పి.జి. విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, సంగీతం: మణిశర్మ, నిర్మాత: కృష్ణప్రసాద్, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, రిలీజ్: జూన్ 17 -
'జెంటిల్మన్' మూవీ రివ్యూ
టైటిల్ : జెంటిల్మన్ జానర్ : థ్రిల్లర్ తారాగణం : నాని, నివేదా థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాధ్ వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా, అతడిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్మన్. వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నాని ఈ సినిమాతో కూడా మరోసారి అదే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ టైమ్ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో నాని కనిపించటంతో, పాటు దర్శకుడు మోహనకృష్ణ కూడా తొలిసారిగా థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను డీల్ చేశాడు. మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఫలించిందా..? నాని జెంటిల్మన్గా అభిమానులను మెప్పించాడా.? కథ : జయరామ్ ముళ్లపూడి (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, జైగౌరీ కంపెనీ అధినేత. మంచి బిజినెస్ మన్ గానే కాదు.. మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్‌ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో కలిసిన క్యాథరిన్(నివేదా)కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలవుతుంది. ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్‌ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్‌కు, గౌతమ్‌కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..? విలనా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : జయరామ్‌గా రిజర్వర్డ్గా, గౌతమ్‌గా ఎనర్జిటిక్‌గా రెండు పాత్రల్లోనూ నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని నేచురల్ స్టార్‌గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ ఆకట్టుకుంది. బాయ్ ఫ్రెండ్‌ను పొగొట్టుకొని, ఆ బాధలోనే అతని మరణం వెనక రహాస్యాన్ని ఛేదించే అమ్మాయిగా మంచి నటన కనబరిచింది. సురభి పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో అందంతో అభినయంతో మెప్పించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రలలో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్‌లు తమ పరిధి మేరకు పాత్రలకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత లాంటి క్లాస్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారిగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్లో నడిపించిన మోహనకృష్ణ, సెకండ్ హాఫ్‌లో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ముఖ్యంగా నాని పాత్రను మలచిన తీరు ఆకట్టుకుంటుంది. లాస్ట్ సీన్ వరకు అభిమానులను కట్టి పడేసేలా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు మోహనకృష్ణ. సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంట్రస్టింగ్‌గా మలిచాడు, అయితే పాటల విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పిజి విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి. ప్లస్ పాయింట్స్ : నాని పర్ఫామెన్స్ స్క్రీన్‌ప్లే నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ పాటలు ఓవరాల్‌గా జెంటిల్మన్ నాని స్థాయిని పెంచే పర్ఫెక్ట్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఇష్టపడటమే కాదు.. తోకలు కూడా తగిలిస్తున్నారు!
‘‘హైదరాబాద్‌లోని అమీర్‌పేట సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు, ‘ఈ సినిమా చేస్తే అదే సత్యం థియేటర్లో కూర్చొని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తానా? లేదా?’ అని ఆలోచిస్తా. ఓ ప్రేక్షక్షుడిగా ఆలోచించి కథలు ఎంచుకుంటా’’ అని హీరో నాని అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు... ఇందులో నా పాత్ర పేరు జై. కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని. నా పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌తో పాటు మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నా పాత్ర చూస్తే వీడు మంచా? చెడా? అన్నది తెలియదు. ఈ రెండు కోణాలకు చక్కటి ముగింపు ఉంటుంది. నేనింతకుముందు చేసిన చిత్రాలతో పోల్చితే కథాబలమున్న చిత్రమిది. అందుకే ప్రేమించి చేశా. వాస్తవానికి కథ విన్నప్పుడు ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే సందేహం కలిగింది. తెలుగు పరిశ్రమలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలెక్కువ. ఇవన్నీ ఉంటూనే, ఇందులో బలమైన కథ కూడా ఉంది. వదులుకుంటే మళ్లీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదనిపించి చేశా. ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా? అని డిస్కస్ చేసుకునేవాళ్లం. శివలెంక కృష్ణప్రసాద్‌గారు ‘జెంటిల్మన్’ వంటి టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు అవసరాల శ్రీనివాస్‌ని ‘జెంటిల్మన్’ పదానికి తెలుగులో మరో పదం ఏదైనా ఉందా? అని అడిగితే, ‘జెంటిల్మన్’ అని ఎందుకు పెట్టకూడదని అన్నాడు. అందరికీ నచ్చింది. సినిమా చూస్తే ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులు అంటారు. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు నాతో ‘అష్టా చమ్మా’ సినిమా తీస్తుంటే.. ‘వీళ్లు అమాయకుల్లా ఉన్నారు. నాతో సినిమా తీస్తున్నారు, ఎవరు చూస్తారులే’ అనుకున్నా. అంటే దర్శక- నిర్మాతలకు నాపై నమ్మకం ఉన్నా, నాపై నాకే నమ్మకం లేదు. ‘అష్టా చమ్మా’ చేసేసి, మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్‌గా వెళ్లిపోదాం అనుకున్నా. ఫ్యూచర్లో ఓ ఇరవై ఏళ్ల తర్వాత వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో చూసుకోవాలంటే ‘అష్టా చమ్మా’ డీవీడీ ఉంటుందనే ఆలోచనతో ఆ సినిమా చేశా. ఆ చిత్రం సక్సెస్ కావడంతో, ప్రేక్షకులు నన్ను కూడా ఇష్టపడుతున్నార నే నమ్మకం పెరిగింది. న్యాచురల్ స్టార్ అని తోకలు కూడా పెట్టేస్తున్నారు. ‘అష్టా చమ్మా’ చేస్తున్నప్పుడు ఇంద్రగంటిగారు ఓ మంచి రైటర్. ఆ తర్వాతే డెరైక్టర్. బట్, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆయన అంతే మంచి రైటర్, అంతకుమించి మంచి డెరైక్టర్. టెక్నికల్ నాలెడ్జ్ అప్పటికీ ఇప్పటికీ చాలా పెరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో అవసరాల శ్రీనివాస్ ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘పిల్ల జమీందార్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత మేం కలిసి చేసిన సినిమా ఇదే. త్వరలో మేమిద్దరం మరో సినిమా చేయబోతున్నాం. శ్రీను చాలా మంచి నటుడు. తనకు తగ్గ పాత్ర ఇప్పటికీ దొరకలేదు. శివలెంక కృష్ణప్రసాద్గారంటే ముందు నాకు ఎవరో తెలియదు. మోహనకృష్ణ గారు ఫోన్ చేసి ఆయన గురించి చెప్పారు. ఓ సందర్భంలో ‘ఆదిత్య 369’ చిత్రం గురించి చెప్పడంతో.. ఆ రోజుల్లోనే అంత రిచ్‌గా ఆ చిత్రం చేశారంటే... ఇప్పుడైతే ఇంకెంత బాగా తీస్తారో అనిపించింది. నాకు స్టయిలిష్‌గా కంటే సింపుల్‌గా ఉండటమే ఇష్టం. కానీ, మా ఇంట్లో వాళ్ల ప్రభావంతో నా పంథా మార్చుకుని ఇకపై చేసే చిత్రాల్లో స్టయిలిష్‌గా కనిపించాలని అనుకుంటున్నా. విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ నిర్మించే ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే చిత్రం చేస్తా. -
నమ్మితేనే చేస్తా : నాని
వరుసగా మూడు సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం జెంటిల్‌మేన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి ప్రయోగం చేయనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల తరువాత కొంత మంది మిత్రులు, కమర్షియల్ సినిమాలు చేయాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. నేను ప్రయోగాలు చేయటం నచ్చని వాళ్లు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు కూడా తీసుకువచ్చారు. కానీ నేను మాత్రం నేను నమ్మిన సబ్జెక్ట్ తోనే సినిమా చేస్తా'నంటూ తెలిపాడు. 'జెంటిల్‌మేన్ సినిమా అంగీకరించిన సమయంలో కొంత మంది వద్దన్నారు. నిజంగానే వాళ్లు అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ కాకపోవచ్చేమో.. కానీ నేను మాత్రం నమ్మిన సినిమా చేశాననే సంతృఫ్తి పొందుతా. అంతేకానీ నేను నమ్మని కథతో సినిమా చేసి ఇబ్బంది పడలేను'. అంటూ తను జెంటిల్‌మేన్ అంగీకరించటంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న జెంటిల్‌మేన్ సినిమాలో నాని సరసన సురభి, నివేదితా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఈ సారి పవన్ అభిమానిగా..!
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ శుక్రవారం జెంటిల్‌మేన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించాడు. చేతి మీద జై బాలయ్య టాటూతో కనిపించిన నాని, ఎంతోమంది నందమూరి అభిమానులు ఆ టాటూ వేయించుకోవడానికి కారణమయ్యాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య పేరు వాడుకోవటం నానికి కూడా బాగానే కలిసొచ్చింది. నందమూరి అభిమానుల సాఫ్ట్ కార్నర్‌తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాకు మరో స్టార్ హీరో పేరును వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ తన ప్రతీ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు జపిస్తూ పవర్ స్టార్ అభిమానులను బుట్టలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే పేరును వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని. గతంలో బాలయ్య అభిమానిగా నటించిన నాని, ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జెంటిల్‌మేన్ రిలీజ్ తరువాత సెట్ మీదకు వెళుతోంది. -
సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా!
‘‘ ‘చిన్నోడు-పెద్దోడు’ సినిమాతో మా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ను స్థాపించాను. ఇప్పటికి 28 ఏళ్లు అయింది. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చేసినా ‘ఆదిత్య-369’ సినిమా నిర్మాతగా ఇప్పటికీ గుర్తుపట్టడం నా అదృష్టం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావా లనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ నా బేనర్లో సినిమా తీయలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌ను మంచి సినిమాతో ప్రారంభించాననే అనుకుంటున్నా’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏడేళ్ల విరామం తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ ‘జెంటిల్మన్’ కథను తమిళ రచయిత డేవిడ్ నాథన్ కొన్నేళ్ల క్రితం చెప్పారు. బాగా నచ్చింది. ఎప్పటినుంచో నా మైండ్‌లో ఈ కథ నలుగుతూనే ఉంది. మోహనకృష్ణ ‘బందిపోటు’ సినిమా అంగీకరించక ముందే నేనాయనతో సినిమా చేయాలనుకున్నాను. కానీ, ఆ సినిమా మొదలైంది. సర్లే.. తర్వాత చేద్దా మనుకున్నా. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో రిస్క్ అవుతుందని మోహన్ అన్నారు. కానీ ఫ్లాప్‌లు ఎవరికైనా సహజం. అందుకే పర్లేదని చెప్పగానే కొన్ని కథలు వినిపించారు. అప్పుడు చాన్నాళ్ల క్రితం విన్న కథ గురించి ఆయనకు చెప్పా. నిజానికి మోహనకృష్ణకు సొంతగా కథలు రాసుకోవడం ఇష్టం. అందుకే అయిష్టంగానే వినడానికి అంగీకరించారు. కానీ కథ నచ్చి, సినిమాకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. నాని చేసిన నెగటివ్ షేడ్ పాత్ర కథకు కీలకం. రొమాంటిక్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలోని ప్రతి సీన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో సాంకేతికత పెరిగింది. ప్రేక్షకుల అభిరుచిలో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంచి సినిమాలు తీయాలన్నది నా ఆలోచన’’ అని చెప్పారు. -
జెంటిల్‌మేన్‌కు యు సర్టిఫికేట్
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జెంటిల్‌మేన్. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చాలా కాలం తరువాత నాని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లలో నాని హీరోనా..? విలనా..? అంటూ, ప్రశ్నలతో అభిమానులకు సినిమా మీద ఆసక్తిని పెంచేస్తున్నారు. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిని థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ సొంతం చేసుకున్న జెంటిల్‌మేన్, ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. -
మంచోడే కానీ...!
‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు లక్కీగా నవ్విస్తే, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో ప్రేమ కోసం ధైర్యంగా పోరాడే కృష్ణగా నవ్వించి, ఏడ్పించారు నాని. ఇప్పుడు జెంటిల్మన్గా అలరించడానికి రెడీ అయ్యారు. అప్పట్లో సహాయ దర్శకునిగా ఉన్న నానీతో ‘అష్టా-చమ్మా’ ఆడించేసి, అతన్ని హీరోని చేశారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్మన్’. పేరుకి జెంటిల్మన్ అయినా హీరో వ్యక్తిత్వానికి నెగటివ్ షేడ్ కూడా ఉంది. మరి.. జెంటిల్మన్ ఎలా అవుతాడు అనుకుంటున్నారా? ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ నెల 17న విడుదల కానున్న ‘జెంటిల్మన్’ సినిమా చూడాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అందమైన రొమాంటిక్ ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది’’అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, కెమేరా: పీజీ విందా. -
నేచురల్ స్టార్‌తో రాక్ స్టార్
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే మంచి మార్కెట్ సాధించిన ఈ యంగ్ హీరో సినిమాకు స్టార్ టెక్నీషియన్స్ యాడ్ అవుతున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్‌మేన్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు నాని. ఈ సినిమా రిలీజ్ తరువాత సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. నాని మంచి ఫాంలో ఉండటంతో పాటు దిల్‌రాజు బ్యానర్ సినిమా కావటంతో దేవీ కూడా వెంటనే ఒప్పేసుకున్నాడు. జెంటిల్‌మేన్ రిలీజ్ తరువాత ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అవుతాయి. -
పెళ్లి చేసుకోవాలి... చంపాలి!
అతను చాలా స్మార్ట్ అండ్ సింపుల్...పెద్ద పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని పక్కింటి అబ్బాయిలా.. చెప్పాలంటే పక్కా జెంటిల్మన్లా ఉంటాడు.. పైకి మంచిగా కనిపించే ఈ కుర్రాడికి ఓ లక్ష్యం ఉంటుంది. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఆమెను తెలివిగా చంపాలి? ఇంతకీ ఆమె ఎవరు...? ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఈ కుర్రాడు ఈ కథకు హీరోనా... విలనా...? అని ట్రైలర్ ద్వారా ‘జెంటిల్మన్’ సినిమాలోని నాని పాత్రకు నెగటివ్ టచ్ కూడా ఉందని చూపించేశారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, నివేదా థామస్, సురభి ముఖ్య తారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుంది. మణిశర్మ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. -
నాని ఫాంలోకి వచ్చాడు
యంగ్ హీరో నాని ఫాంలోకి వచ్చాడు. కొద్ది రోజులుగా ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ సహజ నటుడు, ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న ఈ యంగ్ హీరో ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో డీసెంట్ సక్సెస్ సాధించిన నాని, మరో రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో జెంటిల్‌మేన్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు నాని. ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్న నాని, వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు. జెంటిల్‌మేన్ ప్రమోషన్ కోసం చిన్న గ్యాప్ తీసుకొని వెంటనే సినిమా చూపిస్తా మామ ఫేం నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా 2016లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు నాని. -
నానితో శైలజ
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. స్టార్ వారసులిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ టాలీవుడ్లో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న నానికి జోడీగా నటించనుంది కీర్తి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెంటిల్‌మేన్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం. అందుకే గ్లామర్‌తో పాటు నటిగా కూడా మంచి మార్కులు సాధించిన కీర్తి సురేష్‌ను ఈ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. నేచురల్ స్టార్‌గా మంచి ఇమేజ్ ఉన్న నానితో కలిసి నటించడానికి కీర్తి సురేష్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోలోగా వస్తున్న జెంటిల్‌మేన్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్‌లకు సరైన టైం దొరకటమే కష్టంగా మారింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడక తప్పటం లేదు. భారీ హైప్ క్రియేట్ చేసే సినిమాలు రిలీజ్ ఉంటే ఆ సినిమాకు ఒక వారం ముందు, ఒక వారం తరువాత ఎలాంటి రిలీజ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సొలోగా బరిలో దిగే చాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నాని. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపిస్తున్న నాని, తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. జెంటిల్‌మేన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, నివేదితా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని హీరోనా..? విలానా..? అంటూ ప్రమోషన్‌తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు. ముందుగా జూన్ 10నే రిలీజ్ చేయాలని భావించినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయంలో హడావిడి ఉండకూడదన్న కారణంతో వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అయితే నాని సినిమాకు దరిదాపుల్లో స్టార్ హీరోల సినిమాలే కాదు, మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ కావటం లేదు. దీంతో మరోసారి నాని కలెక్షన్ రికార్డ్‌లు సాధించటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
నాలో హీరోనీ... విలన్నీ గుర్తించింది ఆయనే!
‘‘2007లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్న నాలో హీరోను చూసింది ఇంద్రగంటి మోహన్‌కృష్ణ గారే. మళ్లీ 2016లో విలన్‌ను చూసింది కూడా ఆయనే. నాలో ఏదైనా కొత్త యాంగిల్ బయటకు రావాలంటే ఆయనతోనే సినిమా చేయాలేమో’’ అని హీరో నాని అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హీరో రానా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ- ‘‘చిన్నతనంలో ఓ సారి రెండు ఆడియో సీడీలు కొనడానికి వెళ్లాను. ఒకటి మణిశర్మ, ఇంకోటి ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన పాటల సీడీ. ఏ.ఆర్.రెహమాన్‌గారి సీడీ రేట్ పెంచేయడంతో నా దగ్గర ఉన్న డబ్బులు చాల్లేదు. అప్పుడు మణిశర్మగారి సీడీ దొంగతనం చేశా. నా ఫేవరేట్ మూవీ ‘ఆదిత్య 369’ నిర్మించిన కృష్ణప్రసాద్గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనేదో టైమ్ మెషీన్ ఎక్కి, ఈ సినిమా చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో నేను హీరోనా? విలనా? అని అందరికీ కన్ఫ్యూజన్గా ఉంది. అదేంటో తెలియాలంటే జూన్ 17 వరకూ వెయిట్ చే యాల్సిందే’’ అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూశాను. ‘అష్టాచమ్మా’ తర్వాత నానీతో మళ్లీ సినిమా చేయాలంటే ఇంకా మంచి కథ కావాలి. అతన్నీ, నన్ను బాగా ఎగ్జైట్ చేయాలి. గత ఏడాది మార్చిలో నానీకి ఈ కథ వినిపించాను. ఈ సినిమా నానీకే సెట్ అవుతుందని నమ్మి అతని కోసం డిసెంబరు వరకూ వెయిట్ చేశాను. నేనెందుకు వెయిట్ చేశానో ఈ సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. మణిశర్మగారితో పని చేయడం ఇదే తొలిసారి. చాలా మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. రానా మాట్లాడుతూ- ‘‘ఇంత పాజిటివ్‌గా ఉండే నాని విలన్‌గా ఎలా చేస్తాడో అని డౌట్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో శివలెంక కృష్ణప్రసాద్, మణిశర్మ, సురభి, నివేదా థామస్, ఈషా, దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, మారుతి, అవసరాల శ్రీనివాస్, నిర్మాత కె.అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జెంటిల్మన్ చిత్రం ఆడియో విడుదల
-
పాటలతో సిద్ధమైన థ్రిల్లర్
నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జెంటిల్మన్’. బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చాలా విరామం తర్వాత ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులూ చూసేలా తీర్చిదిద్దుతున్నాం. ఇటీవల విడుదలైన మా చిత్రం తొలి టీజర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెల 22న పాటలు విడుదల చేస్తాం. జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిశోర్, రోహిణి, ‘సత్యం’ రాజేష్, రమాప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా. -
నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా: కమెడియన్
'ఏయ్ అల్లుడి చెప్పింది చేయ్' అంటూ 'అరుణాచలం' సినిమాలో రజనీకాంత్ వెంట ఉంటూ నవ్వులు పంచిన తమిళ సీనియర్ కామెడియన్ సెంథిల్ చనిపోయాడనే వార్త శుక్రవారం ఇంటర్నెట్ లో దావానలంలా పాకింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. తమిళ చిత్ర పరిశ్రమ నటులు కూడా కలవరం చెందారు. తాను చనిపోయినట్టు వార్తలు గుప్పుమనడంతో తాజాగా సెంథిల్ వివరణ ఇచ్చారు. 'నేను చాలా బాగున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి వచ్చిన వదంతుల్ని పట్టించుకోకండి' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమిళ చిత్రాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సెంథిల్. ఆయన 500లకు పైగా చిత్రాల్లో నటించాడు. 'జెంటిల్మన్', 'నరసింహ', 'ముత్తు', 'అరుణాచలం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆయన విశేషంగా నవ్వించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఆయన మద్దతు పలికారు. ఇక, ఈ మధ్యకాలంలో సీనియర్ నటులు చనిపోయారంటూ ఇంటర్నెట్ లో వదంతులు పుట్టడం తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటిమొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తదితరులు చనిపోయినట్టు వదంతులు గుప్పుమన్నాయి. -
జెంటిల్మన్ క్రికెటర్
బైలైన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఇప్పుడు మాజీ కెప్టెన్‌గా మారిన హషీమ్ ఆమ్లాకు జేజేలు పలకండి. కపటత్వంతో కృత్రిమ వినమ్రతను ప్రదర్శించకుండా, తానెంత మంచివాడో చాటుతూ ఉపన్యాసం దంచకుండా తన గురించి తాను నిజాయితీగా చెప్పుకున్న మనిషి ఆమ్లా. కల లాంటి ఆ పదవికి ఎవరూ కోరకుండానే ఆయన రాజీనామా చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల వల్ల జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా తాను నిర్వహించాల్సిన కృషికి నష్టం వాటిల్లుతోందనే నిర్ణయానికి రావడంతో ఆమ్లా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. క్రికెట్ కెప్టెన్లలో చాలా మంది బ్యాట్స్మెన్లే. బ్యాటింగ్, ఆ క్రీడలోని ఏదో ఒక అగ్రకుల అంతస్తుకు చెందినది కావడం అందుకు కారణం కాదు. బాధ ఎక్కువ, గ్లామర్ తక్కువైన బౌలింగ్, కఠోర శ్రమతో కూడిన పని. ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బెనాడ్, మన కపిల్దేవ్లాంటి గొప్ప బౌలర్ కెప్టెన్లూ ఉన్నారు (ఇమ్రాన్ ఖాన్ , ఇయాన్ బోథామ్లాంటి ఆల్‌రౌండర్లు పూర్తిగా భిన్న శ్రేణికి చెందిన వారు). అయినా సెలెక్టర్లు బ్యాట్స్‌మెన్‌నే ఎక్కువగా కెప్టెన్లుగా ఎంచుకోవడానికి సజావైన కారణమే ఉంది. సుదీర్ఘమైన ఆ క్రీడలో కెప్టెన్‌గా మొత్తం ఆట నిర్వహణను అత్యంత అనుకూల దృష్టితో చూసే అవకాశం బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉంటుంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో మాత్రమే ఒక కెప్టెన్‌ను సరిగ్గా పరీక్షించగలం. 20 ఓవర్ల ఆటలో కెప్టెన్ పాత్ర ఫుట్‌బాల్ కెప్టెన్లాంటిదే. ఇకఒక రోజు మ్యాచ్‌కు వస్తే, కెప్టెన్ ఆల్‌రౌండర్ అయితే మంచిదనడానికి సమంజసమైన కారణాలే ఉన్నాయి. కానీఅది వేరే కథ. అతి సుతారమైన ఆటగా క్రికెట్ (టెస్ట్ మ్యాచ్) మెల్లగా సాగే ఆట. ఎత్తుగడలపరమైన మార్పులతోపాటూ వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. టెస్ట్ కెప్టెన్, ఆట పురోగతిని నిరంతరం విశ్లేషించడం అవసరం. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రతి మూడు నాలుగు ఓవర్లకు అలా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. తన జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగుల వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదించినప్పటి నుంచి హషీం ఆమ్లా ఆడుతున్న తీరునుబట్టి చూస్తే అతను ఆలోచనాపరుడైన మనిషి. ఎప్పుడూ క్రీజ్‌కు నడుచుకుంటూ వెళ్తూనే... ఆయన ఆ ఆటలో పెద్దమనిషిగా మంచి గుర్తింపును సంపాదించుకు న్నాడు. ఇంగ్లండుతో జరుగుతున్న క్లిష్టమైన సిరీస్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చినప్పటి నుంచి ఆయన నడక సుదీర్ఘంగా సాగింది. అదే ఆయన జ్ఞాపకాన్ని నిర్వచించేది. ఆమ్లా నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఆట అధ్వానంగా సాగింది. ఇటీవల భారత్‌లో జరిగిన సిరీస్‌లో ఆఫ్రికన్లు చిత్తుగా ఓడారు. పిచ్‌పై వివాదాలు ఆ వాస్తవాన్ని పూర్తిగా దాచలేవు. ఏదిఏమైనా పిచ్‌ను ఒక ఆధారంగా ఉపయోగించుకోవడం ఆసక్తికరం. రెండు జట్లూ అదే పిచ్‌పై ఆడాల్సి ఉంటుంది. అది బాగా లేకపోతే ఇద్దరికీ బాగా లేకుండా ఉండాలి. గ్రీన్-టాప్ పిచ్ పేస్ బౌలర్లకు సహాయపడితే పిచ్‌ని ‘‘చెడగొట్టారని’’ ఎవరూ ‘‘ఆరోపించరు’’. అలాంటప్పుడు బ్రౌన్-టాప్ పిచ్ స్పిన్నర్లకు తోడ్పడి నప్పుడు కామెంటేటర్లు తీవ్రంగా ఎందుకు స్పందిస్తారు? భారత్‌తో సిరీస్‌ను కోల్పోయినప్పుడు ఆమ్లా... అయాచితంగా దొరికే అలాంటి సాకులను చూపలేదని గుర్తుంచుకోవడం సముచితం. తన స్కోర్లు స్వల్పంగా ఉండటంతో ఆమ్లా సమస్యలు రెట్టింపయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు జరుగుతున్న సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పుడూ అదే వరుస కొనసాగింది. రెండవ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఆటలోని అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మొదటి ఇన్నింగ్స్ స్కోర్‌ను సాధించింది. అయితే ఆమ్లా బ్యాటింగ్‌కు వచ్చేసరికి ఆ జట్టు దాదాపుగా ఓటమి అంచున ఉంది. అతను సాధించిన డబుల్ సెంచరీ బ్యాట్స్‌మన్‌గా ఆయన విలువను పునరుద్ధరించడమే కాదు, కెప్టెన్‌గా విశ్వసనీయతను కూడా కాపాడింది. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా బాక్స్‌లో కూచుని కెప్టెన్ చేసేది ఏమీ ఉండదని ఎన్నడూ అనుకోకండి. ఇన్నింగ్స్ పొడవునా అతను ప్రతి ఆటగాడి పాత్రను నిర్వచిస్తుంటాడు. కెప్టెన్ అంటే ఒక్క చేతి సంజ్ఞతోనే నియంత్రించే కాపరి. హషీమ్ ఆమ్లా సరిగ్గా తనపై ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసిన సమయంలోనే రాజీనామా చేశాడు. అటు ఆటగాడిగా, ఇటు నాయకునిగా తిరిగి అగ్రస్థానానికి వచ్చాకనే నాయకత్వ బాధ్యతల నుంచి నిష్ర్కమించాడు. కొద్దికాలంపాటూ ఆట బాగోనందుకే సెలెక్టర్లు కెప్టెన్‌ను శిక్షించేట్టయితే, ఏ కెప్టెనూ మహా అయితే రెండు లేదా మూడు సీజన్లకు మించి మనజాలడు. పోటీ క్రూరంగా ఉండే ఫుట్‌బాల్‌లో సైతం యజమానులు, జట్టు విఫలమౌతున్నా మేనేజర్లను మార్చడానికి సమయం తీసుకుంటారు. ఆమ్లాను ఎవరూ ఒత్తిడి చేయకున్నా, తమ జట్టు ప్రయోజనాలకు మంచిదని తనంత తానే అనుకుని రాజీనామా చేశాడు. అలాంటి ఉదాహరణలు ఎన్నో కనబడవు. పేర్లు వద్దుగానీ, కెప్టెన్లకు వారి అధికారం ద్వారా బహిరంగంగానూ, చాటుమాటుగానూ ఆర్థిక ప్రతిఫలాలు లభిస్తాయి. కాబట్టే వారు తమ అధికారాన్ని పట్టుకు వేలాడుతారు. క్రికెట్‌ను విచిత్రంగా ‘‘పెద్దమనుషుల ఆట’’ అని అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు అది అలాగే ఉన్నదని గట్టిగా చెప్పడం తీవ్ర అతిశయీకరణే. ఎక్కడైనా ఉండేట్టే ఇప్పుడు క్రికెట్లో కూడా ఎందరు పెద్దమను షులున్నారో అందరు ఆకతాయిలూ ఉన్నారు. ఇది మంచీ కాదు, చెడూ కాదు. రిపబ్లికన్ యుగంలో విలు వలు లేదా విలువల రాహిత్యం అనేవి ఒక వర్గానికి సం బంధించినవి కావు. ఎవరు ఉత్పత్తులను అమ్ముకోగలి గితే వారికే భారీగా డబ్బు వచ్చిపడుతుంది. అందుకే క్రీడలో ఒక పెద్ద మనిషి కనిపిస్తే అది సంబరపడటానికి కారణమవుతుంది. విధి ప్రతి ఒక్కరికీ వారు ధరించాల్సిన పాత్రను కేటాయిస్తుంది. ఒక ఆదర్శ నమూనా కాగలగడం మాత్రం ఆ వ్యక్తి సాధించాల్సినదే. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి: ఎం.జె. అక్బర్ -
ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!
‘‘నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు. అప్పటినుంచి ఆయన పరిచయం. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో మంచి విజయవంతమైన చిత్రాలు తీశారు. అజిత్‌తో ఇది మూడో సినిమా. తమిళంలో లాగే తెలుగులో కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో ఎ.ఎమ్.రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకుడు. ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో గోపీచంద్‌కు అందజేశారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ -‘‘ఏయమ్ రత్నంగారు నిర్మించిన ‘జెంటిల్‌మ్యాన్’ చూసి ఆయనకు అభిమానిగా మారాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన తెలుగులో మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఏయం రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్ర‘వరుడు కావలెను’
జెంటిల్మన్ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా... పెళ్లాం ఎంత అందంగా ఉన్నా సరే, మరో పడతిని పక్కచూపులు చూడటం చాలామందికి అలవాటు. అలాంటిది... కట్టుకున్న భార్య సాదాసీదాగా ఉండి... ఎదురుగా ఎంత ముద్దుగుమ్మ ఉన్నా కనీసం కళ్లు తిప్పట్లేదంటే... అతడు భార్యావిధేయుడన్నా అయి ఉండాలి, లేదా అపర ప్రవరాఖ్యుడన్నా అయి ఉండాలి. అన్నట్లు ప్రవరాఖ్యుడంటే ఎవరో కాదు, ప్రబంధనాయకుడు. అల్లసాని వారు అతడి గురించి ఏకంగా ఓ కావ్యాన్నే రచించారు. ఇంతకీ ఎవరీ ప్రవరుడు, ఏమిటతని గొప్పదనం అంటారా..! అతనిది అరుణాస్పదమనే ఊరు. డబ్బూ దస్కం... పాడీపంటా, ఇల్లూ వాకిలీ ఆచారమూ సంప్రదాయమూ, నిష్ఠా నియమమూ ఉన్నవాడు. వేదవిద్యాసంపన్నుడు. తాను నేర్చిన వేదపాఠాలను పదిమందికీ చెప్పే సుశిక్షితుడైన గురువు. నిరంతరం మాతాపితరుల సేవలో తరించేవాడు, నిత్యాగ్నిహోత్రుడు. అతిథికి అన్నం పెట్టనిదే పచ్చిగంగ కూడా ముట్టని ఆదర్శ గృహస్థు. అన్నింటికీ మించి చక్కదనాల చుక్క అయిన సోమిదమ్మకు ముద్దుల మగడు. అటువంటి ప్రవరుడు ఒక సిద్ధుడిచ్చిన పాదలేపనం సాయంతో హిమాలయాలకు వెళ్లాడు. అయితే ఆ లేపనం కరిగిపోవడంతో తిరిగి రాలేక దారికోసం వెతుకుతుండగా... ఓ అతిలోక సౌందర్యరాశి అతణ్ణి చూసి మనసు పారేసుకుంది. ఆ కాంత ఎవరో కాదు, వరూధిని అనే అప్సరస. ఆమె అందచందాలను అల్లసాని వారు ఎలా వర్ణించారంటే... మెరుపు తీగలాంటి ఒళ్లు, కలువల్లాంటి కళ్లు, నల్లద్రాక్ష గుత్తుల వంటి కనుగుడ్లు, తుమ్మెదలాంటి నల్లని జుట్టు, చంద్రబింబం లాంటి ముఖం, పగడాల్లాంటి పెదవులు, లోతైన నాభి. హంసలాంటి నడక. గరుడ పచ్చల భవనంలో... చంద్రకాంత మణులు పొదిగిన పీటపై కూర్చొని తామరతూళ్లలాంటి అందమైన వేళ్లతో వీణ తీగలను మీటుతూ... పాట పాడుతూ వుంటే పడి పోని వారుండరు. అంతటి అందాల భామ ప్రవరుణ్ణి చూసి... ‘ఆహా ఈ అందగాని కళ్లు కమలాలే! ఛాతీ మన్మధుని సింహాసనంలా ఉంది. పాదాలు ఎర్రని ముఖమల్ తివాచీని ధిక్కరిస్తున్నాయ్. సూర్యుణ్ని సానబట్టి పొడి తీసి ఆ బంగారు అడుసులో ఈ రజను కలిపి, దానిపై కాస్తంత అమృతాన్ని చిలకరించి మరీ ఆ బ్రహ్మ ఇతణ్ణి సృష్టించాడా అన్నంత అందంగా ఉన్నాడే... ఇతణ్ణి చూస్తూంటే నా మనసు, శరీరం వశం తప్పుతున్నాయే, మన్మధ తాపం నా మనస్సును వివశం చేసేస్తోంది... అసలింతటి సౌందర్యవంతుణ్ని నేను ఇన్నాళ్లూ చూడకుండా ఎలా ఉన్నానో...’ అని వాపోయిందట. అలా వాపోయి ఊరుకోలేదు. అతణ్ణి అనేక విధాలుగా కవ్వించింది. ఎంతో పుణ్యం చేస్తే తప్ప అందని స్వర ్గసుఖాలను ఇప్పుడే అందిస్తా రమ్మని రెచ్చగొట్టింది. చలించకపోయేసరికి తానుగా వచ్చి బిగి కౌగిట బంధింప జూసింది. అయినా అతను కేశమెత్త్తు కూడా కదల్లేదు. అపురూప లావణ్యవతి.. అమూల్యమైన మణిమాణిక్యాలకూ, అంతులేనంత సంపదకూ సామ్రాజ్ఞి అయిన వరూధిని క్రీగంటి చూపులకే కలల్లో తేలిపోయేవారున్నారుగానీ, తానుగా కోరి వచ్చినా కళ్లు తిప్పని నిష్ఠాగరిష్ఠుడు మన నాయకుడు. కళ్లు మిరుమిట్లు కొలిపే అందం రారమ్మంటూ కవ్విస్త్తుంటే... ‘‘అయ్యో! సాయం సంధ్య వార్చే సమయం మించిపోతున్నదే, శిష్యులకు వేదశిక్షణ ఇచ్చే వేళ మీరుతున్నదే! నా తలిదండ్రులు నాకోసం తల్లడిల్లుతుంటారే, నా ఇల్లాలు నా గురించి వెదుకుతుంటుందే’’ అని ఆలోచించాడంటే... అతనిలాంటి అందగాడు, యోగ్యుడు, గుణవంతుడు అయిన వరుడి కోసం అమ్మాయిలు వెయ్యి లెన్సులు పెట్టుకుని వెతికినా తప్పు లేదు కదా! ఈలోగా ప్ర‘వరుడు’ కావలెను అని ఓ ప్రకటన ఇచ్చేస్తే పోలా!? - డి.వి.ఆర్.