కుర్రాళ్లంతా జెంటిల్‌మన్‌లే.. - హీరో నాని
విజయవాడ (గాంధీనగర్) : నేటితరం కుర్రాళ్లంతా జెంటిల్‌మన్‌లే అని హీరో నాని అన్నారు. శ్రీదేవి బ్యానర్‌పై శివలెంక కృష్ణమోహన్ నిర్మించిన ‘జెంటిల్‌మెన్’ సినిమా విజయోత్సవంలో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. చిత్రం ప్రదర్శిస్తున్న కపర్ధి థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య ఉత్సాహంగా గడిపింది. చిత్రాన్ని ఆదరించి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ తాను చల్లపల్లి అబ్బాయినేనని, తనకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన బంధువులంతా విజయవాడలోనే ఉంటారని చెప్పారు. జెంటిల్‌మెన్ చిత్రానికి కుర్రాళ్లే బాక్సాఫీస్ హిట్ అందిం చారని పేర్కొన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ తాను, నాని కాంబినేషన్‌లో మూడేళ్ల క్రితం నిర్మించిన ‘అష్టాచెమ్మా’ చిత్రం విజయం సాధించిందని, ఇప్పుడు జెంటిల్‌మెన్ అంతకన్నా ఘనవిజయం సాధించిందన్నారు. హీరోయిన్‌లు నివేదా థామస్, సురభి మాట్లాడుతూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తమకెంతో సంతోషానిచ్చిందన్నారు. సినిమాలో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఏపీ ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసాద్, గీతా పిక్చర్స్ మేనేజర్ గిరి, కపర్ధి థియేటర్ మేనేజర్ మోహన్‌రావు, చిత్ర పంపిణీదారులు రాజేష్ పాల్గొన్నారు.
బస్టాండ్‌లో థియేటర్ ఆలోచన బాగుంది
విజయవాడ (బస్‌స్టేషన్) : విజయవాడలో సినిమాలకు ఒక ప్రత్యేకత ఉందని, ఏ సినిమా అయినా ఇక్కడ హిట్ అంటే.. మిగతా ప్రాంతాల్లోనూ అదే టాక్ తెచ్చుకుంటుందని హీరో నాని తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎరైవల్ బ్లాక్‌లోని వైస్క్రీన్ థియేటర్‌లో జెంటిల్‌మెన్ చిత్రబృందం సోమవారం సందడి చేసింది. యూనిట్‌కు థియేటర్ అధినేత యార్లగడ్డ వెంకటరత్నకుమార్ స్వాగతం పలికారు. సినిమా విజయోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా హీరో నాని విలేకరులతో మాట్లాడుతూ జెంటిల్‌మెన్ సినిమాను ఆదరించి విజయం చేకూర్చిన ప్రేకక్షులకు రుణపడి ఉంటానన్నారు. బస్టాండ్‌లో సినిమా థియేటర్ నిర్మించాలన్న ఆలోచన బాగుందన్నారు.