జెంటిల్... సస్పెన్స్ థ్రిల్లర్
సహజంగా అభినయించే నటుడు, సాహిత్యం - సినిమా రెంటినీ శ్రద్ధగా చదువుకొని మరీ పద్ధతిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు, సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా భావించని నిర్మాత - ఇలాంటి ‘జెంటిల్ మన్’లు కలిసినప్పుడు ఎలాంటి సినిమా వస్తుంది? నాని, ఇంద్ర గంటి మోహనకృష్ణ, సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (‘ఆదిత్య 369’ ఫేమ్)ల కాంబినే షన్‌లో వచ్చిన ‘నాని... జెంటిల్ మన్’ అలాంటిదే! కాంబినేషన్‌తో పాటు ‘హీరో? ఆర్ విలన్?’ అని ప్రశ్నించిన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఒక విధమైన ఆసక్తిని ఈ సినిమా రేకెత్తించింది.
నిజానికి, ఈ చిత్ర కథ కూడా అలాంటి ఆసక్తికరమైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లరే!
విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ విమానంలో సహ ప్రయాణికులైన ఐశ్వర్య (సురభి), కేథరిన్ (నివేదా థామస్) పరిచయ మవుతారు. కాలక్షేపానికి ఒకరి ప్రేమకథ మరొకరికి చెప్పుకుంటారు. గ్రాఫిక్స్ నిపుణురాలైన కేథరిన్‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు గౌతమ్ (నాని). కానీ, ఆమె మీద మోజున్న మేనమామ డేవిడ్ వారి ప్రేమకు విలన్ అవుతాడు.
నాలుగు నెలల ప్రేమ పెళ్ళిగా మారాల్సిన టైమ్‌లో కేథరిన్ తన ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళి, ఇప్పుడా ఫ్లైట్‌లో వెనక్కి తిరిగి వస్తోందన్న మాట! ఇక, ఐశ్వర్య కొన్ని వేల కోట్ల కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఏకైక వారసురాలు. యువ పారి శ్రామికవేత్త జైరామ్ ముళ్ళపూడి అలియాస్ జై (నాని ద్విపాత్రాభినయం)తో ఆమె పెళ్ళి చేయాలనుకుంటారు పెద్దలు. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసు కోవడానికి జై, ఐశ్వర్యలు రెండు రోజుల పాటు డబ్బు, ఫోన్ లేని కొడెకైనాల్ సాహసయాత్రకు వెళతారు. ప్రేమ బంధం బలపడుతుంది. విదేశానికి వెళ్ళా ల్సొచ్చిన ఐశ్వర్య ఇప్పుడు కేథరిన్ ఉన్న ఫ్లైట్‌లోనే ఇండియాకు తిరిగొస్తోంది.
ఐశ్వర్య, కేథరిన్‌లిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. కేథరిన్ అచ్చం తన ప్రేమికుడిలా ఉన్న రెండో హీరోని చూసి అవాక్కవుతుంది. మనిషిని పోలిన మనిషి అని సరిపెట్టుకొని తన లవర్ గౌతమ్ ఇంటికెళుతుంది. అక్కడ పెద్ద షాక్. గౌతమ్‌కు ఏమైంది? జై కథ ఏంటన్నది మిస్టరీతో సాగే మిగతా కథ.
సరదాగా ఉండే గౌతమ్‌గా, సీరియస్‌గా - కాస్తంత నెగటివ్ షేడ్స్ నిండిన జైగా రెండు విభిన్న తరహా పాత్రల్లో నాని మెప్పి స్తారు. సహజంగా ప్రవర్తిస్తూ, కొన్ని మామూలు డైలాగ్స్, సన్నివేశాలు, సందర్భాల్ని కూడా ఓ మెట్టు పైకి తీసుకెళ్ళారు. ఇక, కేథరిన్ పాత్రతో తెలుగు తెరకు తొలి పరిచయమైన మలయాళ నటి నివేదా థామస్ తన అభినయ ప్రతిభతో ఆ పాత్రకూ, ఈ కథకూ పెద్ద ఎస్సెట్ అయ్యారు. సెకండాఫ్‌లో హీరో, ఆమె కలసి బావురుమనే దృశ్యంలో నటన బాగుం టుంది.
నిత్యా మీనన్ ఫక్కీలో నటన తెలిసిన హీరోయిన్ మరొకరు తెలుగు తెరకు దొరికినట్లయింది. మరో హీరోయిన్ సురభి ఓ.కె. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించే అవసరాల శ్రీని వాస్ అవసరాన్ని బట్టి నాణేనికి మరో వైపు చూపించగలనని నిరూపించుకున్నారు. ఆఫీసులో అనుమాన పక్షి అయిన మేనేజర్ సుదర్శనం అలియాస్ దర్శనంగా ‘వెన్నెల’ కిశోర్ వినోదంతో మెప్పించారు. జనం గుర్తుపెట్టుకొనేదిగా చాలా రోజులకు దక్కిన ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కలిసొస్తుంది.
ఫస్టాఫ్‌లో వచ్చే హీరో - నివేదా థామస్‌ల ‘‘సినిమాటిక్ ప్రేమకథ’’, హీరో - మరో హీరోయిన్ సురభి మధ్య సాగే ‘అంతకు ముందు - ఆ తరువాత’ సినిమా తరహా డేటింగ్ ప్రేమ ప్రయాణం లవ్‌స్టోరీల్ని మెచ్చే యువతరాన్ని ఆకట్టు కుంటాయి. ఇంటర్వెల్‌కు కాసేపటి ముందు నుంచి వేగం, ఉత్కంఠ పెరుగుతాయి. ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంట ర్వెల్ కార్డ్ పడుతుంది. అనూహ్యమైన షాక్ నుంచి తేరుకున్న హీరోయిన్ నివేదా థామస్ మిస్టరీని ఛేదించే క్రమం అంతా ఇక సెకండాఫ్.
మిస్టరీ కేసును డీల్ చేసిన జర్నలిస్ట్ నిత్య (టీవీ యాంకర్ శ్రీముఖి) పాత్ర, హీరో తల్లి, రెండో హీరో తండ్రి లాంటి పాత్రలేవీ చివరలో కనిపించక పోయినా, సినిమా ముగిసే హడావిడిలో అవేవీ గుర్తుపట్టలేం.
అలాగే, హీరో పనిచేస్తున్నది తన సంస్థలోనా, హీరోయిన్ కంపెనీలోనా అన్నదీపట్టించుకోం. సెకండాఫ్‌లో అవసరాల దగ్గరకు హీరో వెళ్ళే సీన్ లాంటివి బిగువుగా సాగా ల్సిన కథలో గుట్టుగా ఉండాల్సిన సస్పెన్స్ ముడి విప్పేందుకు ఉప్పందించే స్తాయి. చివరలో జరిగిందంతా హీరో డైలాగ్స్‌లో కన్నా విజువల్‌గా చూపించ గలిగి ఉంటే, మరింత పట్టుగా ఉండేదనిపిస్తుంది. సస్పెన్స్ గుట్టు విప్పే క్రమంలో వేగం, ఉత్కంఠ దీన్ని చిరకాలం చెప్పుకొనే సినిమాగా మార్చేవి.
మొత్తం మీద చిన్నాచితకా లోటుపాటుల్ని మరిచిపోనిచ్చే నాని నేచురల్ యాక్టింగ్, ఉన్నంతలో ఆయన - ఇతర కమెడియన్లు చేసే వినోదం, మంచి డైలాగ్స్, కట్టి పడేసే నివేద నటన, మణిశర్మ రీరికార్డింగ్, ముఖ్యంగా సినిమా థీమ్ మ్యూజిక్, పి.జి. విందా కెమేరా పనితనం, ‘చలిగాలి..’ పాట, చిత్ర నిర్మాణ విలువలు - ఈ సినిమాను ‘జెంటిల్’ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని చేశాయి. దర్శకుడు ఇంద్రగంటి , హీరో నాని - ఇద్దరూ తమకు అలవాటైన పనికి పూర్తి భిన్నమైన వర్క్‌తో ముందుకు రావడం నిజంగానే థ్రిల్లింగ్ అనుభవం! అసభ్యత, హింస, రక్తపాతాలేవీ లేక పోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అనుభూతి!
చిత్రం: ‘నాని... జెంటిల్‌మన్’, కథ - సినేరియో: డేవిడ్‌నాథన్, కెమేరా: పి.జి. విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, సంగీతం: మణిశర్మ, నిర్మాత: కృష్ణప్రసాద్, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, రిలీజ్: జూన్ 17