కథను నమ్మి కమిట్ అయ్యాడు
‘‘నాని, నా కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా’ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని మేం క్యాష్ చేసుకోవాలనుకోలేదు. దాన్ని మించిన చిత్రం తీయాలని మంచి కథ కోసం ఎనిమి దేళ్లు వెయిట్ చేశాం. నిర్మాత కృష్ణప్రసాద్ గారు డేవిడ్ నాథన్‌ను నా దగ్గరకు తీసుకొచ్చి ఓ కథ ఉంది వినమన్నారు. కథ నచ్చడంతో నేను నానీకి చెప్పా. ఇటువంటి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనుకోకుండా కథను నమ్మి నాని ధైర్యంగా ఒప్పుకున్నాడు. మా నమ్మకం వమ్ము కాలేదు. ‘మా సినిమా పది, పదిహేను, ఇరవై రోజులు ఆడింది’ అంటూ విజయోత్సవాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో మా ‘జంటిల్‌మన్’ యాభై రోజులు ఆడటం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అన్నారు.
నాని, నివేదా థామస్, సురభి ముఖ్య తారలుగా మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మన్’. ఈ సినిమా యాభై రోజుల వేడుకను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ డేవిడ్‌నాథన్ ఇచ్చిన కథ ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. మా ‘జంటిల్‌మన్’ ఇరవై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు ఆడటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం విజయంతో ఇకపైన మరిన్ని మంచి చిత్రాలు తీస్తా. మణిశర్మ సంగీతం, మోహనకృష్ణ దర్శకత్వం మా సినిమాకు హైలెట్. అరకులో షూటింగ్ ఉండటంతో నాని ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు’’ అని తెలిపారు. కథా రచయిత డేవిడ్ నాథన్ పాల్గొన్నారు.