ఇష్టపడటమే కాదు.. తోకలు కూడా తగిలిస్తున్నారు!
‘‘హైదరాబాద్‌లోని అమీర్‌పేట సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు, ‘ఈ సినిమా చేస్తే అదే సత్యం థియేటర్‌లో కూర్చొని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తానా? లేదా?’ అని ఆలోచిస్తా. ఓ ప్రేక్షక్షుడిగా ఆలోచించి కథలు ఎంచుకుంటా’’ అని హీరో నాని అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మన్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు...
ఇందులో నా పాత్ర పేరు జై. కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని. నా పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌తో పాటు మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నా పాత్ర చూస్తే వీడు మంచా? చెడా? అన్నది తెలియదు. ఈ రెండు కోణాలకు చక్కటి ముగింపు ఉంటుంది. నేనింతకుముందు చేసిన చిత్రాలతో పోల్చితే కథాబలమున్న చిత్రమిది. అందుకే ప్రేమించి చేశా. వాస్తవానికి కథ విన్నప్పుడు ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే సందేహం కలిగింది. తెలుగు పరిశ్రమలో ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలెక్కువ.
ఇవన్నీ ఉంటూనే, ఇందులో బలమైన కథ కూడా ఉంది. వదులుకుంటే మళ్లీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదనిపించి చేశా. ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా? అని డిస్కస్ చేసుకునేవాళ్లం. శివలెంక కృష్ణప్రసాద్‌గారు ‘జెంటిల్‌మన్’ వంటి టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు అవసరాల శ్రీనివాస్‌ని ‘జెంటిల్‌మన్’ పదానికి తెలుగులో మరో పదం ఏదైనా ఉందా? అని అడిగితే, ‘జెంటిల్‌మన్’ అని ఎందుకు పెట్టకూడదని అన్నాడు. అందరికీ నచ్చింది. సినిమా చూస్తే ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులు అంటారు.
మోహనకృష్ణ ఇంద్రగంటిగారు నాతో ‘అష్టా చమ్మా’ సినిమా తీస్తుంటే.. ‘వీళ్లు అమాయకుల్లా ఉన్నారు. నాతో సినిమా తీస్తున్నారు, ఎవరు చూస్తారులే’ అనుకున్నా. అంటే దర్శక- నిర్మాతలకు నాపై నమ్మకం ఉన్నా, నాపై నాకే నమ్మకం లేదు. ‘అష్టా చమ్మా’ చేసేసి, మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్‌గా వెళ్లిపోదాం అనుకున్నా. ఫ్యూచర్‌లో ఓ ఇరవై ఏళ్ల తర్వాత వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో చూసుకోవాలంటే ‘అష్టా చమ్మా’ డీవీడీ ఉంటుందనే ఆలోచనతో ఆ సినిమా చేశా.
ఆ చిత్రం సక్సెస్ కావడంతో, ప్రేక్షకులు నన్ను కూడా ఇష్టపడుతున్నార నే నమ్మకం పెరిగింది. న్యాచురల్ స్టార్ అని తోకలు కూడా పెట్టేస్తున్నారు. ‘అష్టా చమ్మా’ చేస్తున్నప్పుడు ఇంద్రగంటిగారు ఓ మంచి రైటర్. ఆ తర్వాతే డెరైక్టర్. బట్, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆయన అంతే మంచి రైటర్, అంతకుమించి మంచి డెరైక్టర్. టెక్నికల్ నాలెడ్జ్ అప్పటికీ ఇప్పటికీ చాలా పెరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో అవసరాల శ్రీనివాస్ ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘పిల్ల జమీందార్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత మేం కలిసి చేసిన సినిమా ఇదే.
త్వరలో మేమిద్దరం మరో సినిమా చేయబోతున్నాం. శ్రీను చాలా మంచి నటుడు. తనకు తగ్గ పాత్ర ఇప్పటికీ దొరకలేదు. శివలెంక కృష్ణప్రసాద్‌గారంటే ముందు నాకు ఎవరో తెలియదు. మోహనకృష్ణ గారు ఫోన్ చేసి ఆయన గురించి చెప్పారు. ఓ సందర్భంలో ‘ఆదిత్య 369’ చిత్రం గురించి చెప్పడంతో.. ఆ రోజుల్లోనే అంత రిచ్‌గా ఆ చిత్రం చేశారంటే... ఇప్పుడైతే ఇంకెంత బాగా తీస్తారో అనిపించింది.
నాకు స్టయిలిష్‌గా కంటే సింపుల్‌గా ఉండటమే ఇష్టం. కానీ, మా ఇంట్లో వాళ్ల ప్రభావంతో నా పంథా మార్చుకుని ఇకపై చేసే చిత్రాల్లో స్టయిలిష్‌గా కనిపించాలని అనుకుంటున్నా. విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ నిర్మించే ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే చిత్రం చేస్తా.