కాంబినేషన్ కుదిరింది
అక్కినేని నాగచైతన్య ఓ కొత్త చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ‘జెంటిల్మన్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సోమవారం దర్శకుడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘గ్రహణం’తో జాతీయ అవార్డు అందుకున్న ఇంద్రగంటి, ఆ తర్వాత ‘అష్టా చమ్మా’తో అందర్నీ నవ్వించారు.
తాజాగా ‘జెంటిల్మన్’తో ఉత్కంఠనూ కలిగించారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘ఊహలు గుసగుసలాడే’, తాజాగా ‘మనమంతా’, ‘జ్యో అచ్యుతానంద’.. ఇలా సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వారాహి సంస్థలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా పూర్తయిన తర్వాత ఇంద్రగంటి సినిమా ప్రారంభం కానుందని వినికిడి. చైతూ నటించిన తాజా చిత్రం ‘ప్రేమమ్’ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్ మీనన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు రెడీగా ఉంది.