నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా: కమెడియన్
'ఏయ్ అల్లుడి చెప్పింది చేయ్' అంటూ 'అరుణాచలం' సినిమాలో రజనీకాంత్ వెంట ఉంటూ నవ్వులు పంచిన తమిళ సీనియర్ కామెడియన్ సెంథిల్ చనిపోయాడనే వార్త శుక్రవారం ఇంటర్నెట్ లో దావానలంలా పాకింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. తమిళ చిత్ర పరిశ్రమ నటులు కూడా కలవరం చెందారు. తాను చనిపోయినట్టు వార్తలు గుప్పుమనడంతో తాజాగా సెంథిల్ వివరణ ఇచ్చారు.
'నేను చాలా బాగున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి వచ్చిన వదంతుల్ని పట్టించుకోకండి' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమిళ చిత్రాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సెంథిల్. ఆయన 500లకు పైగా చిత్రాల్లో నటించాడు. 'జెంటిల్మన్', 'నరసింహ', 'ముత్తు', 'అరుణాచలం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆయన విశేషంగా నవ్వించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఆయన మద్దతు పలికారు. ఇక, ఈ మధ్యకాలంలో సీనియర్ నటులు చనిపోయారంటూ ఇంటర్నెట్ లో వదంతులు పుట్టడం తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటిమొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తదితరులు చనిపోయినట్టు వదంతులు గుప్పుమన్నాయి.