దేశం కోసం వచ్చిన చిత్రాలు.. | Independence day special :Special story to telugu movies | Sakshi
Sakshi News home page

సిటిజెన్‌

Published Wed, Aug 15 2018 12:54 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

Independence day special :Special story to telugu movies - Sakshi

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడే!అన్ని త్యాగాల చరిత్ర ఉన్న మన స్వాతంత్య్ర సమరానికిమనం ఎటువంటి నీరాజనాలు అర్పిస్తున్నాం. మన దేశాన్ని మన ఇంటిలాగా శుభ్రంగా ఉంచుకోగలమా!మహిళల్ని మన చెల్లెళ్లలాగా కాపాడుకోగలమా!దేశానికి విముక్తి ఇచ్చినవాడు ఫ్రీడమ్‌ ఫైటర్‌ అయితే..దేశాన్ని కాపాడుతున్నవాడు సైనికుడు అయితే..దేశాన్ని గౌరవిస్తున్నవాడిని ఏమనాలి? ది.. సిటిజెన్‌!!

మన్యం గర్జించింది. ‘ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు’ అని ‘అల్లూరి సీతారామరాజు’ గురి తప్పని విల్లును ఎక్కుపెట్టాడు. తెల్లదొరల ఎర్రటోపీలు గడగడ వణికాయి. విక్టోరియా రాణి సింహాసనపు ప్రతినిధుల ఆసనాలు దొర్లి పడబోయాయి. ‘కాల్చరా కాల్చు... దమ్ముంటే కాల్చు’ అని ‘ఆంధ్రకేసరి’ ఛాతీ ఎదురొడ్డి నిలిచాడు. ఎందరో మహనీయులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రాణాలొడ్డి త్యాగాలు చేశారు. చివరకు ఆగస్టు 15, 1947న ఆ త్యాగాలు ఫలించాయి. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారత భూభాగం బ్రిటిష్‌ సంకెళ్ల నుంచి విముక్తి పొందింది. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. జేజేలు పలికారు.

మన పాలన మొదలైంది
మన దేశం కోసం మనం పాలించుకోవడం మొదలైంది. పరిపాలన, చట్ట వైఖరి, న్యాయరీతి, సైన్యం... ఇవన్నీ దేశనడకలో భాగమయ్యి ముందుకు నడిచాయి. ప్రతి పౌరుడు వీటి కోసం పని చేశాడు. ఇవన్నీ ప్రతి పౌరుడి కోసం పని చేశాయి.కాని అన్నీ సజావుగా అన్నిసార్లు లేవు. కొన్ని చోట్ల లోపాలు... కొన్ని చోట్ల పొరపాట్లు... మరికొన్ని చోట్ల అలక్ష్యాలు... వీటిని హెచ్చరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వ్యక్తిత్వం లేని పౌర సమాజం అన్ని అవలక్షణాలకు మూలం అవుతుంది.దీనిని వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. వెండితెర అందుకు తన ప్రతిధ్వనులు వినిపించింది. మొదట కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ (1954) తీశారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్లు సంఘాన్ని ఎలా పీల్చుకుతింటున్నారో చూపించారు. పెద్ద మనుషుల బుద్ధులు సరిగ్గా ఉంటే బడుగుల జీవితాలు బాగు పడతాయి. కాని నాటికీ నేటికీ పరిస్థితిలో మార్పు లేదు. అదే సమయంలో వ్యవసాయ భూములను గుప్పిట్లలో పెట్టుకుని పేద రైతుల ఉసురు పోసుకునే దుర్మార్గులను నిరసిస్తూ ‘రోజులు మారాయి’ (1955) వచ్చింది. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు నిజంగా బాగుంటున్నారా? రైతుల కోసం సాటి పౌరులు ఆలోచిస్తున్నారా? సానుభూతి వ్యక్తం చేస్తున్నారా?

ఆడవాళ్ల కోసం ఆలోచన
దేశం బాగుండాలంటే దేశంలో సగం మందైనా స్త్రీలు బాగుండాలి. ‘కన్యాశుల్కం’ పేరుతో వారిపై సాగుతున్న పీడన, బాల్య వివాహాల వల్ల వితంతువులై జీవితాలు నాశనం చేసుకుంటున్న స్త్రీల వేదన... వీటిపై రచయిత గురజాడ రచించిన నాటకం ‘కన్యాశుల్కం’ సినిమాగా 1955లోనే వచ్చింది. కుటుంబంలో సంస్కరణ జరిగితే సమాజంలో సంస్కరణ దానికదే జరుగుతుందని ఈ సినిమా చెబుతుంది. జనం సరే పాలకులు ఎలా ఉన్నారు... వీళ్లను దారిలో పెట్టాలి కదా అని దర్శకుడు తిలక్‌కు అనిపించింది. పాలకులపై చురకలు వేస్తూ ఆయన తీసిన సినిమా ‘ఎం.ఎల్‌.ఏ’ (1957). ఆ తర్వాత అలాంటి ఎన్నో సినిమాలకు అది ఆదిగా నిలిచింది. అదే సమయంలో సమాజంలో పతనమవుతున్న విలువలు, నైతిక వర్తన, అశ్లీలత వీటి గురించి మొదటిసారి ‘సుడిగుండాలు’ (1968) గొంతెత్తింది. జువైనల్‌ నేరాలను మొదటిసారి చూపించిన తెలుగు సినిమా ఇది. ఈ సందర్భంలో దేశం కోసం పని చేసే సైనికులు కథ కాకుండా ఉంటారా? సైనికుల త్యాగాలను గుర్తించి వారిని గౌరవించాలని ‘జై జవాన్‌’ (1970) సినిమా చెప్పింది.

చలి చీమల చేత చిక్కి
అయితే నిత్యం దోపిడీకి గురయ్యే పీడితులు కలిసి కట్టుగా తిరగబడకపోతే అన్యాయం అలాగే కొనసాగుతుందని కూడా సినిమా చెప్తూ వచ్చింది. ‘చలి చీమలు’ (1978) ఇందుకు ఉదాహరణ. అలాగే నోటు పుస్తకాలతో కాలక్షేపం చేయకుండా యువకులు కూడా చైతన్యవంతులై సమాజాన్ని సంస్కరించాలని కోరుతూ మాదాల రంగారావు ‘యువతరం కదిలింది’ (1980) కూడా వచ్చింది. కాని అదే సమయంలో దేశంలో పేరుకుపోతున్న నిరుద్యోగ సమస్యను, దాని వల్ల దేశం పట్ల యువతకు పెరుగుతున్న అసహనాన్ని కూడా సినిమా చర్చకు పెట్టింది. ‘ఆకలి రాజ్యం’ (1981), ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ (1982) ఆ పనిని విజయవంతంగా చేశాయి. అప్పుడే దర్శకుడు టి.కృష్ణ రంగంలోకి వచ్చి సినిమాతో ఎంత చైతన్యం తేవచ్చో నిరూపిస్తూ దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుపుతూ ‘నేటి భారతం’ (1983), ‘దేశంలో దొంగలు పడ్డారు’ (1985) చిత్రాలు తీశారు. ఇవి చిన్న సినిమాలు కాగా పెద్ద హీరోలతో కూడా దేశ పరిస్థితిని కామెంట్‌ చేయవచ్చని దాసరి ‘సర్దార్‌ పాపారాయుడు’ (1980)తో నిరూపించారు. దేశానికి తెల్లపాలకుల నుంచి లభించిన విముక్తితో పాటు నల్ల పెత్తందార్ల నుంచి కూడా విముక్తి ముఖ్యమని ఈ సినిమా చూపించింది. అలాగే దేశం బయట ఉన్న శత్రువుల సంహారం కంటే దేశం లోపల ఉన్న శత్రువుల సంహారం ముఖ్యమని ‘బొబ్బిలిపులి’(1982) చాలా శక్తిమంతంగా చెప్పింది.

రౌడీల రాజ్యం
ఈ సమయంలోనే దేశంలో రౌడీయిజం పెరిగింది. ‘తొండలు ముదిరి ఊసరవెల్లులయినట్టు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు’గా మారుతున్న కాలం అది. ఈ పరిస్థితిని ఖండఖండాలుగా నరకాలి అని ‘ప్రతిఘటన’ (1985) సినిమా వచ్చింది. వచ్చిన స్వతంత్రం ఎంత మందిని చీకట్లోకి తోస్తూ ఉందో ఎంత మంది పట్టెడు మెతుకుల కోసం ఘర్షణ పడి తుపాకులు పట్టాల్సి వస్తోందో చూపుతూ ‘అర్ధరాత్రి స్వతంత్రం’ (1986) వచ్చింది. సాయుధ పోరాటం వైపు సమాజం ఆశలు పెట్టుకోవాల్సిన స్థితిని ‘అడవి దివిటీలు’ (1990) వంటి సినిమాలు చూపించాయి. అదే సమయంలో పోలీసు వ్యవస్థ సంస్కరణను ఆశిస్తూ నిజాయితీ కలిగిన ఆఫీసర్ల అవసరాన్ని చెబుతూ ‘అంకుశం’ (1989), ‘కర్తవ్యం’ (1990) సినిమాలు వచ్చాయి.  ఇక చీటికి మాటికి బంద్‌లు చేస్తూ పౌర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పరిస్థితిని విమర్శిస్తూ ‘భారత్‌ బంద్‌’ (1991) వచ్చింది.

రాజ్య పీడన దొర పీడన
రాజ్య వ్యవస్థను ధిక్కరిస్తూ పోరాడేవాళ్లను రాజ్యం మాయం చేస్తుంది. అలా మాయం చేసినప్పుడు రాజ్యాన్ని ప్రశ్నించాల్సింది పౌరులే. ఆ కర్తవ్యాన్ని అద్భుతంగా గుర్తు చేస్తూ ‘అంకురం’ (1993) వచ్చింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో దొర పీడన ఎలా ఉందో చెప్పే ‘ఒసేయ్‌ రాములమ్మ’ (1997) సినిమా వచ్చి సంచలనం రేపింది.

జెంటిల్‌మన్‌తో మొదలు
సినిమాను దేశ హితం కోసం వాడాలి. పౌర సమాజంలో చైతన్యం తేవాలి అని బలంగా నమ్మి ఆ తర్వాతి కాలంలో పేరు గడించిన దర్శకుడు శంకర్‌. ఇతడు తీసిన  తమిళ సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అయ్యి దాదాపు తెలుగు సినిమాలుగా చలామణి అయ్యాయి. విద్యా వ్యవస్థ డొనేషన్‌ సిస్టమ్‌ వల్ల ఎంత లోప భూయిష్టంగా ఉందో, దాని వల్ల యోగ్యులు ఎలా నష్టపోతున్నారో చూపుతూ శంకర్‌ ‘జెంటిల్‌మన్‌’ (1994) తీశాడు. పాలనా వ్యవస్థలు ఎంత లంచగొండులుగా మారాయో చూపుతూ ‘భారతీయుడు’ (1996) తీశాడు. ప్రభుత్వాధినేతలు సక్రమంగా పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చూపుతూ ‘ఒకే ఒక్కడు’ (1999) తీశాడు. సమాజంలో బాధ్యతా రాహిత్యం ఎటువంటి దుష్ఫలితాలు ఇస్తుందో చూపుతూ ‘అపరిచితుడు’ (2005) తీశాడు. నల్లధనం పేరుకు పోవడం వల్ల అట్టడుగు వర్గాలకు ఎలా ఫలాలు అందకుండా పోతున్నాయో చూపుతూ ‘శివాజీ’ (2007) తీశాడు. అదే సమయంలో తెలుగులో కూడా ‘ఠాగూర్‌’ (2003) వంటి సినిమాలు లంచగొండి వ్యవస్థను తూర్పార బట్టాయి.

అందరి బాధ్యత
దేశానికి స్వాతంత్య్రం రావడమే సరిపోదు. అన్ని వ్యవస్థలూ, పౌర సమాజమూ సక్రమంగా పని చేస్తేనే బంగారు భారతదేశం ఏర్పడుతుంది. స్త్రీలు, బాలలు, వృద్ధులు, వన్యప్రాణులు, పర్యావరణం... ఇవన్నీ సంతోషంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది గొప్ప దేశం అనిపించుకుంటుంది. పాలకులు, పోలీసులు, న్యాయవవస్థ, అధికారగణం ఈ దేశం నాది.. ఈ సమాజపు భవిష్యత్తు కోసం బాధ్యతగా పని చేస్తాను అనుకున్నప్పుడు దేశం మరింతగా సమర్థంగా తయారవుతుంది.సినిమాలో హీరో మాత్రమే హీరో. బయట బాధ్యత ఉన్న ప్రతి పౌరుడూ హీరోనే.
– కె 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement