భారతీయుడు | kamal hasan bharateeyudu special | Sakshi
Sakshi News home page

భారతీయుడు

Published Sun, Aug 14 2016 12:13 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

భారతీయుడు - Sakshi

భారతీయుడు


దేశానికి ప్రాణం ఇచ్చేవాళ్లూ ఉంటారు..
దేశానికి ప్రాణం పోసేవాళ్లూ ఉంటారు..
దేశాన్ని ప్రేమించేవాళ్లూ ఉంటారు..
దేశానికి దేశభక్తి కథ చెప్పేవాళ్లూ ఉంటారు..
అందరూ భారతీయులే. ఇంతమంది శ్వాస తానై మన జెండా రెపరెపలాడుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి సినిమాల్లో కెల్లా గొప్ప పేరు తెచ్చుకున్న ‘భారతీయుడు’ చిత్రనిర్మాత ఏఎం రత్నంతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.....


‘భారతీయుడు’ చిత్రం గురించి దర్శకుడు శంకర్ చెప్పినప్పుడు మీకేమనిపించింది?
యాక్చువల్‌గా అప్పటికి నా మైండ్‌లో తిరుగుతున్న ఆలోచనలకు తగ్గ లైన్ ఆయన చెప్పారు. రెగ్యులర్ లైఫ్‌లో మనం ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంటాం. ఉదాహరణకు చెన్నైలో మా ఆఫీసుకి ఓ అధికారి వచ్చి, ‘ఈ ఆఫీసుని కమర్షియల్ పర్పస్ కింద వాడుతున్నారు’ అన్నారు. ‘సరే.. ట్యాక్స్ కడతాను’ అని చెప్పా. అతను లంచం ఆశించాడు. నేను మాత్రం ట్యాక్సే కడతానన్నా. ‘పదేళ్ల నుంచీ ఈ ఆఫీసు వాడుతున్నారు. అప్పట్నుంచీ ట్యాక్స్ రాస్తా’ అన్నాడతను. అలా అంటే పదేళ్లు కట్టే బదులు ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటానని అతని ఫీలింగ్. స్వలాభం ఆశించాడు. దేశంలో ఇలాంటి కరప్షన్ చాలా ఉంది. సినిమా పవర్‌ఫుల్ మీడియా. కమర్షియల్‌గా సినిమాలు చేస్తూ, వాటి ద్వారా ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేది నా ఉద్దేశం. సరిగ్గా అదే టైమ్‌లో శంకర్ ‘భారతీయుడు’ కథ చెప్పారు. నా జీవితంలో గర్వించదగ్గ సినిమా.

     
కమల్‌హాసన్ వృద్ధ గెటప్‌కి వేసిన ప్రోస్థెటిక్ మేకప్ గురించి?
ఇందులో మెయిన్ క్యారెక్టరే తాతయ్య. కమల్‌కి హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్ వెస్ట్‌మోర్ తెలుసు. ఆయన్ను పిలిపించాం. మేకప్ వేయడానికి ఐదు గంటలు, తీయడానికి ఓ రెండు గంటలు. కమల్‌కి భార్యగా నటించిన సుకన్యకు మేకప్ వేయడానికి కూడా ఐదు గంటలు పట్టేది. ఇద్దరూ ఐదింటికి సెట్‌కి వచ్చేసేవాళ్లు. పదింటికి మేకప్ పూర్తయ్యేది. అన్నీ సెట్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేసేసరికి సాయంత్రం మూడు గంటలయ్యేది. ఐదింటికి లైటింగ్ పోతుంది. జస్ట్ రెండు మూడు గంటల షూటింగ్‌కి ఐదు గంటలు మేకప్ వేయడం, రెండు గంటలు తీయడం.


మీరు స్వతహాగా మేకప్‌మ్యాన్ కాబట్టి.. ప్రోస్థెటిక్ మేకప్ నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ ఉండేది కాదా?
ఇంట్రస్ట్ ఉంది కాబట్టే.. ఉదయం ఐదు గంటలకు నేనూ వెళ్లేవాణ్ణి. కమల్ చేతులకు నేనే మేకప్ వేసేవాణ్ణి. విగ్ అదీ సెట్ చేసేవాణ్ణి. రెండు గంటల షూటింగ్ కోసం ఐదు గంటలు మేకప్పా అని వేరేవాళ్లైతే అనుకునేవారేమో. నేను మేకప్‌మ్యాన్‌ని కాబట్టి, మేకప్ వేల్యూ తెలుసు. అందుకే ఈ సినిమా నిర్మించగలిగా. నేను గర్వంగా ఫీలయ్యేదేంటంటే... ‘మగధీర’, ‘బాహుబలి’, ‘రోబో-2’ వంటి చిత్రాలకు ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ చేస్తున్నవాళ్లు ఆల్రెడీ నా సినిమాలకు పని చేశారు. ‘భారతీయుడు’, ‘ప్రేమికుల రోజు’ వంటి సినిమాలకు గ్రాఫిక్స్ చేయించా. ఇప్పుడు మన కంట్రీలో సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) చేసేవాళ్లల్లో కమల్ కణ్ణన్, శ్రీనివాస్ మోహన్ వీళ్లే నం.1. మొన్నా మధ్య ‘బాహుబలి’ ఆడియోలో ‘మమ్మల్ని డెవలప్ చేసింది రత్నంగారే. అప్పట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు’ అని వాళ్లు చెప్పడం హ్యాపీగా అనిపించింది.

     
{పోస్థెటిక్ మేకప్ వాడిన తొలి భారతీయ సినిమా ఇదే కదా!

అవును. కొంచెం వ్యయప్రయాసలతో కూడుకున్నదే.  ప్రోస్థెటిక్ మేకప్ రిమూవ్ చేయడానికికొలడీ అని ఓ మెటీరియల్ ఉంది. ఇండియాలో దొరకదు. అది తెప్పించడానికి టైమ్ పట్టేది. అప్పట్లో  మైఖేల్ వెస్ట్‌మోర్ చాలా బిజీ. ‘ఓ వారం రోజులు అతణ్ణి పిలిపిద్దాం. తర్వాత ముంబై మేకప్‌మ్యాన్‌కి అలవాటు చేయిద్దాం’ అని కమల్ చెప్పారు. ఫస్ట్ డే చూసిన తర్వాత ‘ఇది మామూలు మేకప్ కాదు. ఇతను చేసి వెళిపోతే.. తర్వాత చేసేవాళ్లు సరిగ్గా చేయలేకపోతే’ అని నాకు భయం పట్టుకుంది. దాంతో షెడ్యూల్ మొత్తం 15 రోజులు ఉంటారా? అనడిగా. మైఖేల్ వెస్ట్‌మోర్ ఈ సినిమా కోసం ఇండియాకి ఐదుసార్లు వచ్చారు. ముసలి వ్యక్తిగా మేకప్ వేసినా, కమల్ యంగ్ కదా. అచ్చం ముసలివాళ్లు నడిచినట్లు నడవడం, చూడటంతో ఆ మేకప్‌కి న్యాయం జరిగింది.


‘భారతీయుడు’ మేకింగ్‌పరంగా ఏమైనా సమస్యలు?
ఏవీ లేవు. కమల్, శంకర్, ఏఆర్ రెహమాన్.. అందరూ ఇగో ఉన్నవాళ్లు. వీళ్లతో సినిమా అంటే అది మధ్యలోనే ఆగిపోతుంది? అని బయట అనుకున్నారు. కానీ, ఆ సినిమాకి పని చేసినట్లే తెలియలేదు. అంత హాయిగా పనిచేశాం. లైఫ్‌లో ‘భారతీయుడు’ నాకో మంచి మెమరీ.  ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ చేసిన థింగ్స్ చాలా ఉన్నాయి. 


విమర్శలూ.. వివాదాలేమైనా...
బ్లూ క్రాస్‌తో ఓ సమస్య వచ్చింది. షూటింగ్‌కి ఒంటె పిల్ల అవసరమైంది. పిల్లతో పాటు తల్లిని కూడా కొనాల్సిందే అనడంతో జైపూర్ నుంచి ఓ ఒంటె పిల్ల, తల్లిని తీసుకొచ్చాం. షూటింగ్ పూర్తయ్యాక జూకి ఇచ్చేద్దామనుకుంటే... అక్కడ ఉన్నవాటికే తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈలోపు ఇక్కడి వాతావరణం ఒంటె పిల్లకి పడలేదు. మెడికల్ ట్రీట్‌మెంట్ ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది. చనిపోయింది. ‘సినిమాకి వాడుకుని, తిండి పెట్టకుండా చంపేశారు’ అని వార్తలు రాశారు. ఎవరో బూ ్లక్రాస్‌కి ఉత్తరం రాశారు. లక్కీగా ట్రీట్‌మెంట్ ఇప్పించిన మెడికల్ బిల్స్ ఉండడంతో బయటపడ్డాం.


‘భారతీయుడు’ విషయంలో కమల్ ఏమనేవారు?
ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాక ‘ఇది నాకు ఐదు సంవత్సరాల లైఫ్’ అన్నారు. ఆయన ఐదేళ్లు అన్నారు కానీ, పదేళ్ల లైఫ్ అయ్యింది. ఆ స్థాయిలో నటించారు. యాక్ట్ చేసిన కమల్‌కూ, తీసిన మీకూ పాదాభివందనాలు అని ఓ ప్రముఖ వ్యక్తి అన్నారు. అంతకన్నా తృప్తి ఏముంటుంది?


అసలు బడ్జెట్ ఎంత అయింది?
ఇప్పుడా బడ్జెట్ చెబితే నథింగ్ అన్పిస్తుంది. ‘భారతీయుడు’ని ఇప్పుడు తీయాలంటే వంద, రెండొందల కోట్లు చాలవు. సినిమా అంతా పూర్తయిందనుకున్నాక ‘తెప్పలెళ్లిపోయాకా.. ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా’ పాట తీద్దామని శంకర్ అన్నారు. సాంగ్ ఐడియా విని మూడు రోజులు నిద్రపట్టలేదు. 400 మంది డ్యాన్సర్లు, 1000మంది జనాలు, నైట్ ఎఫెక్ట్, లైటింగ్ కోసం 8 జనరేటర్లు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్... అప్పట్లో ఆ పాటకు కోటి రూపాయల బడ్జెట్ అయ్యింది. బాలీవుడ్‌లో ‘హమ్ ఆప్‌కే కౌన్ హై’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాలు తీస్తున్న టైమ్‌లో... ఇంత పెద్ద స్పాన్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా చూసి అక్కడివాళ్లు షాకయ్యారు. 

 
‘భారతీయుడు 2’ కూడా చేయాలనుకుంటున్నారట?

యాక్చువల్లీ... కమల్ అప్పట్లోనే సీక్వెల్ చేద్దామన్నారు. తర్వాత చేద్దామనుకున్నాం. ఈ మధ్య ఓసారి శంకర్ కూడా సీక్వెల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘రోబో 2’తో బిజీగా ఉన్నారాయన. చూద్దాం. 

‘రత్నం పట్టిందల్లా బంగారం’ అని ఒకప్పుడు మిమ్మల్ని అందరూ అనేవారు. కానీ, సడన్‌గా డౌన్ ఫాల్ అయ్యారు. దానికి కారణంగా నిలిచిన సినిమాలు..?
బాయ్స్, ప్రేమికుల రోజు, నాయక్.. ఈ మూడు సినిమాల కారణంగా ఆర్థికంగా డౌన్ అయ్యాను. ‘బాయ్స్’ తమిళనాడులో తప్ప ప్రపంచం మొత్తం హిట్. ఆ సినిమాలో కుర్రాళ్లు ఓ వేశ్యని ఇంటికి తీసుకొస్తారు. అక్కడ ఇబ్బందిపడే సీన్స్ ఉండవు. అయినప్పటికీ, ‘శంకర్, రత్నం ఇలాంటి సీన్స్ తీస్తారా?’ అని చెన్నైలో ఎవరో వివాదం మొదలుపెట్టారు. అది మైనస్ అయింది. ‘ప్రేమికుల రోజు’కి కూడా డబ్బులు పోయాయ్. తర్వాత ‘నాయక్’. ఇంతవరకూ ఏ హిందీ సినిమా టెలికాస్ట్ కానన్ని సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది. అయితే అప్పటి మార్కెట్ సరిగ్గా లేకపోవడంతో కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అప్పట్లో ఆ మూడు సినిమాలకు 65 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకసారి డౌన్ అయ్యాక.. రెండో సారి కూడా అదే కంటిన్యూ అయ్యి మూడోసారి కూడా అదే జరిగితే తేరుకోవడం కష్టమవుతుంది. ఆ తర్వాత కూడా తమిళంలో నేను సూపర్ హిట్ సినిమాలు చేసినా పుంజుకోవడం కష్టమైంది. దాంతో నిర్మాణం పరంగా గ్యాప్ వచ్చింది.


అజిత్ చాన్స్ ఇవ్వడంవల్లే మళ్లీ సినిమా నిర్మాణం మొదలుపెట్టారు.. ఆయనకు మీ మీద అంత అభిమానం ఎందుకు?
అజిత్ చేసిన ‘ప్రేమలేఖ’ను తెలుగులో రిలీజ్ చేసింది నేనే. స్ట్రయిట్ సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. శంకర్‌తో, విజయ్‌తో రత్నం సినిమాలు చేశాడు.. వాళ్లెవరూ డేట్స్ ఇవ్వలేదని వేరేవాళ్లు అనుకుంటున్నారు. కానీ, నేనలా అనుకోను. ఒకసారి చిరంజీవిగారు ఏమన్నారంటే.. ‘రత్నం.. ఆర్టిస్ట్‌గా నేను ఎవరో ఓ నిర్మాతకు సినిమా చేయాల్సిందే. నువ్వు సినిమాలు బాగా తీస్తావ్. నీకెందుకు చెయ్యను? నాకు సూట్ అయ్యే కథతో వస్తే కచ్చితంగా నీకు చేస్తా’ అన్నారు. నేను తీసిన సినిమాల ద్వారా ఆ నమ్మకం ఏర్పరచుకోగలిగాను. ఇప్పుడు అజిత్ సినిమా ఇవ్వడం నా కమ్‌బ్యాక్‌కి కారణం అయింది.

     
పవన్ కల్యాణ్‌తో ‘ఖుషీ’ వంటి హిట్టిచ్చారు.. మళ్లీ ఆయనతో సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట కదా?

అవును. దర్శకుడు నేసన్‌ని పవన్ కల్యాణ్‌గారితో కల్పించాను. ‘హీ ఈజ్ నైస్’ అని కల్యాణ్‌గారు అన్నారు.

 
దేశంలో ఎక్కడ చూసినా లంచగొండితనం. జనన మరణ ధృవీకరణ పత్రం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితిని ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ కమిషనర్‌ను హత్య చేస్తాడు భారతీయుడు.
మరోవైపు ఈ భారతీయుడి కొడుకు చందు ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో ఏజెంట్‌గా ఎక్కడ లేని అవినీతి చేస్తుంటాడు.
పోలీసు కాల్పుల్లో చెప్పులు కుట్టే వ్యక్తి చనిపోతే అతని భార్య దిక్కులేనిది అవుతుంది.
దేశభక్తుడైన సేనాపతి దీనికి ప్రతీకారంగా బ్రిటిష్ వారిని చంపుతాడు.
విదేశీ వస్త్రాల బహిష్కరణ ఉద్యమంలో విదేశీ వస్త్రాలు తగులబెట్టిన ఆడవాళ్లను వివస్త్రలు చేసి వారు సామూహిక ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు బ్రిటిష్‌వారు.
స్వాతంత్య్రం వచ్చాక భార్యతో కొడుకు కూతురుతో  జీవిస్తున్న భారతీయుడి వ్యవహార శైలి నచ్చక కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న కుమార్తెను కాపాడుకోవాలనుకున్నప్పుడే ఈ దేశంలో  ఎంత లంచగొండితనం పేరుకుని ఉందో భారతీయుడికి తెలుస్తుంది. ఒకప్పుడు చేసింది తెల్లవాళ్లతో పోరాటం. ఇప్పుడు చేయాల్సింది నల్లవాళ్లపై పోరాటం.
భారతీయుడి కోసం ఐపిఎస్ ఆఫీసర్  కృష్ణస్వామి వేట మొదలెడతాడు.
చంపుతున్నది ఒక డెబ్బై ఏళ్లు పై బడిన వృద్ధుడు అని గ్రహిస్తాడు.
అప్పటి నుంచి లంచగొండి ఆఫీసర్లను  హతమారుస్తున్న భారతీయుడు తన సొంత కొడుకును కూడా వదలడు. పనికిరాని బస్సుకు లెసైన్సు ఇచ్చి పిల్లల మరణానికి కారణమైన కొడుకు చందును కొడుకని కూడా చూడకుండా చంపుతాడు భారతీయుడు.
భారతీయుణ్ణి వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణస్వామికి భారతీయుడి గతం చెబుతుంది అతడి భార్య అమృతవల్లి. అతడి అసలు పేరు  సేనాపతి. స్వాతంత్య్ర సమరయోధుడు.
తాను బతికే ఉన్నానని ఎక్కడ లంచగొండితనం కనిపించినా తిరిగి వస్తానని అమెరికా నుంచి ఫోన్ చేసి  పోలీసులకు చెప్తాడు భారతీయుడు. భారతీయుడికి మరణం లేదు అంటూ కథకు శుభం పలుకుతాడు భారతీయుడు.
ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియాలో షూట్ చేసిన ఇండియన్ సినిమా ‘భారతీయుడు’. ఫారిన్ టెక్నీషియన్లు, లొకేషన్లు.. ఖర్చు ఎక్కువని అంతకు ముందు ఎవరూ వెళ్లలేదు.
ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ ఫారిన్ డ్యాన్సర్లను చూపించిన సినిమా ఇదే. ‘అదిరేటి డ్రెస్సు మీరేస్తే..’ పాటలో ఫారిన్ డ్యాన్సర్లు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఫారిన్ డ్యాన్సర్లు కామన్ అయ్యారు. అంతకు ముందు నేను చాలా పాటలు రాశాను. కానీ, ఫస్ట్ టైమ్ ‘అదిరేటి డ్రెస్సు..’ పాటకు రచయితగా పేరు వేసుకున్నాను.
అప్పట్లో హాలీవుడ్ నుంచి ఓ మేకప్‌మ్యాన్ ఇండియన్ సినిమాకి వర్క్ చేసింది ‘భారతీయుడు’కే.
ఫస్ట్ టైమ్ హాంకాంగ్‌లో గ్రాఫిక్స్ చేయించిన సినిమా ఇదే.
అన్నిటికంటే ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో షూట్ చేయాలి. ఫ్లైట్ కింద నుంచి కమల్‌హాసన్ రోల్ కావడం, ఎయిర్‌పోర్ట్‌లో గన్‌ఫైర్ చేయడం, ఫ్లైట్ ఎక్కి పారిపోవడం.. ఓ అరవై మంది యూనిట్ సభ్యులు, ఫైటర్స్‌తో సహా ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లి షూటింగ్ చేసిన చరిత్ర ‘భారతీయుడు’ మినహా ఇప్పటికీ ఏ సినిమాకీ లేదు.


‘కబాలి’కి ముందు ‘భారతీయుడి’దే ఆ రికార్డ్
అప్పట్లో మణిరత్నం ‘రోజా’ని హిందీ నిర్మాత 25 లక్షలకు కొన్నారు. అది 5 కోట్లు కలక్ట్ చేసింది. డబ్బింగ్ సినిమాల్లో ఆ రికార్డ్ సాధించిన తొలి సినిమా అది. ఆ తర్వాత ‘భారతీయుడు’ దాన్ని అధిగమించింది. ఆ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి, విడుదల చేస్తే 15 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ సినిమా ‘కబాలి’ వచ్చే వరకూ ‘రోజా’, ‘ముంబయ్’, ఆ రెండుకన్నా బిగ్గెస్ట్ రికార్డ్‌తో ‘భారతీయుడు’ ఉండేది.

- డి.జి.భవాని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement