
జునైల్ జఫార్ ఖాన్ (PC: Social Media)
ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పాకిస్తాన్‌కు చెందిన క్లబ్ లెవల్ క్రికెటర్ జునైల్ జఫార్ ఖాన్ (Junail Zafar Khan) దుర్మరణం పాలయ్యాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలిన అతడు.. అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎండ వేడిమి తట్టుకోలేకే జఫార్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది.
ఆలస్యంగా వెలుగులోకి
కాగా నలభై ఏళ్ల జఫార్ ఖాన్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే వయసు పైబడుతున్నా లెక్కచేయక క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. గత శనివారం ప్రిన్స్ అల్‌ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు.
నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన జఫార్ ఖాన్.. ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. పదహారు పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఉన్న వేళ అతడు కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ డే లైట్ టైమ్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మైదానంలో కుప్పకూలిపోయాడు.
తీవ్ర విషాదంలో మునిగిపోయాం
ఈ విషాదకర ఘటనపై ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ‘‘మా క్లబ్‌కు చెందిన విలువైన ఆటగాడు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఘటనతో మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే మా క్లబ్ సభ్యుడు మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తోంది.
అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతడి కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి ’’ అని సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
అడిలైడ్‌లో ఉద్యోగం?
కాగా 2013లో వరకు పాకిస్తాన్‌లోనే ఉన్న జఫార్ ఖాన్.. ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే క్రమంలో ఆస్ట్రేలియాకు మకాం మార్చినట్లు సమాచారం. అడిలైడ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు క్లబ్ క్రికెట్ కూడా ఆడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాగా దక్షిణ ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.
గరిష్టంగా 40కి పైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలంతగా అప్రమత్తంగా ఉండాలని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత మించినట్లయితే..మ్యాచ్‌లు రద్దు చేస్తామని పేర్కొంది.
చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్
Comments
Please login to add a commentAdd a comment