అరాచకానికి విరుగుడు ఆశ | the details of the election campaign | Sakshi
Sakshi News home page

అరాచకానికి విరుగుడు ఆశ

Published Sun, Apr 20 2014 1:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అరాచకానికి విరుగుడు ఆశ - Sakshi

అరాచకానికి విరుగుడు ఆశ

అరాచకత్వం తారస్థాయికి చేరడాన్ని 1960లలో చూశాం. మనం ఆ దివాలాకోరు దశాబ్దం నుంచి ఎంతో దూరం వచ్చేశాం. కానీ యువతలోని ఆగ్రహం భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యం అత్యంత సామాన్యమైనది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉపాధి కల్పన, పేదల జీవితాలు మెరుగయ్యేలా భారీగా పెట్టుబడులు పెట్టడం.
 
చిన్న చిన్న వాస్తవాలు తరచూ పెద్ద సత్యాన్ని వెలుగు లోకి తెస్తుంటాయి. గత సోమవారం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో అలాంటి ఓ బంగారు ఇటుక ప్రత్యక్షమైంది. ఆ రోజు ఆ పత్రిక పలు పొరలుగా  ప్రచురించిన ఎన్నికల వార్తల్లో ఒక కథనం అది. అంతకు ముందటి రోజన ప్రధాన ఎన్నికల ప్రచార సారధులు ఎవరెవరు ఎక్కడున్నారనే వివరాలను అది ఆ కథనంలో ప్రచురించింది. కర్ణాటకలో బీజేపీ గత కొన్నేళ్లుగా అల్లకల్లోలానికి గురైంది. ఎగుడు దిగుడులను చవి చూసింది. ఆ రాష్ట్రంలో పార్టీని పునరుజ్జీవితం చేయడం కోసం నరేంద్రమోడీ ఆ రోజంతా హెలికాప్టర్లో గిరగిరా తిరిగారు.
 
ఎల్‌కే ఆద్వానీ గుజరాత్‌లో ఉండగా, అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రోడ్లపై రోడ్‌షోలతో దుమ్ము రేపుతున్నారు.ఇంకా ఇలాంటి వివరాలే చాలా ఇచ్చింది.ఇంతకూ రాహుల్ గాంధీ ఎక్కడున్నట్టు? ‘బహిరంగ కార్యక్రమాలేవీ లేవు’ అని ఆ పత్రిక సరళంగానూ, ఒకింత చప్పగానూ తెలిపింది. అది ప్రశ్నకు సమాధానమే గానీ వివరణ కాదు. ఆ రోజు ఆదివారం కాబట్టి రాహుల్‌కు సెలవు దినం. నాటకీయమైన ఎన్నికల ప్రచార కాలంలో రాహుల్ బహిరంగ చర్చ నుంచి అంతర్థానమైపోతున్నట్టు అనిపించడానికి చాలానే కారణాలుండొచ్చు.కానీ కాంగ్రెస్ స్టార్ నాయకునికి ఎక్కువ పని ఒత్తిడి గిట్టదేమోననే అనుమానం వేధించక మానదు. లేకపోతే రాహుల్‌కు ఉపన్యాసాలు రాసిచ్చేవాళ్లు అక్కడక్కడా చిలకరించిన అర్థరహితమైన పంక్తులకు మించి ఆయనకు మాట్లాడటానికి ఎక్కువ ఏమీ ఉండదేమో.
 
వేగంగా తిరుగుతున్న ఇరుసుపై దేశం ముందుకు దూసుకు పోతూనే ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికరమైన గణాంకం తాజా ‘ఇండియా టుడే’ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. బీహార్‌లో నరేంద్ర మోడీ ఆశ్యర్యకరమైన రీతిలో 23 శాతం ముస్లిం ఓట్లను సంపాదించుకోబో తున్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఢిల్లీ గద్దెనెక్కే అవకాశం గురించి భారత ముస్లింల గుండెల్లో భయం, కారు మబ్బులు గూడు కట్టుకున్నాయనే  కథనాన్ని  కాంగ్రెస్ అదే పనిగా వల్లె వేస్తోంది. ఆ కథనం కుప్పకూలిపోనున్నదనే దానికి ఈ వాస్తవమే సంకేతం.
 
ఈ భయం, కారు మబ్బులే త్వరత్వరగా విచ్ఛిన్నమైపోతున్న కాంగ్రెస్, దాని మిత్రులైన లాలూ ప్రసాద్, నితీష్‌కుమార్‌ల ఆయుధాగారంలోని చిట్టచివరి ఆయుధం.జోస్యాలు చెప్పడం ఎప్పుడూ ప్రమాదకరమే. అయితే లోక్‌సభకు 88 మంది ఎంపీలను పంపే బీహార్, మహారాష్ట్రల నుంచి అత్యంత ఆశ్చర్య కరమైన ఫలితాలు వెలువడబోతున్నాయని గణాంకపరమైన, స్వీయకథనాల పరమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఒకప్పుడు లాలూకు మౌలిక పునాదిగా ఉండిన యాదవులు, ముస్లింలు ఎన్డీయే వైపు గణనీయంగా వలసపోతున్నారు.
 
ఇది సాంప్రదాయకమైన దేశ కుల, మత రాజకీయాల చీలికలకు అతీతమైన పరివర్తనను ప్రతిఫలిస్తుంది. లాలూ, కాంగ్రెస్‌లకు ముస్లింల మద్దతు 52 శాతంనుంచి 40 శాతానికి పడిపోగా,  బీజేపీ దాని మిత్రులకు వారి మద్దతు రెట్టింపైందనీ, 12 శాతం నుంచి 23 శాతానికి చేరిందని ‘ఇండియా టుడే’ ప్రజాభిప్రాయ సేకరణ ధ్రువీకరిస్తోంది. ఇక యాదవులలో వారికి మద్దతు 40 శాతం నుంచి 29 శాతానికి క్షీణించగా, బీజేపీ దాని మిత్రులకు మద్దతు 22 శాతం నుంచి 47 శాతానికి పెరిగింది. ఎందువలన?
 
 ఈ ఎన్నికలు జరుగుతున్నది అభివృద్ధి, సంక్షేమాల గురించి. భ్రమాత్మక రాజకీయాలు ఉత్తర భారత ఎన్నికల్లోని ప్రధానాంశం. అవి ఓడిపోయాయి. మన ప్రజలు ఆకలి కడుపుల కోసం ఓటు వేసినప్పుడల్లా వాళ్లు బలమైన ప్రభుత్వాన్నే ఎన్నుకున్నారు. భావోద్వేగాలు ప్రధానమైనప్పుడల్లా ఎవరికీ పూర్తి ఆధిక్యతలేని పార్లమెంటును ఎన్నుకున్నారు. ‘‘వాళ్లు ఇందిరాగాంధీని తొలగించాలని అనుకుంటున్నారు. నేను పేదరికాన్ని తొలగించాలని అనుకుంటున్నాను’’ అనే సందేశంతో ఇందిరాగాంధీ 1971లో తన ప్రత్యర్థులందరినీ చిత్తు చేశారు. అదే ఆ 1971 తిరిగి ప్రతిధ్వనిస్తోంది.
 
 నాడు ఆమె నిర్ణయాత్మక ప్రభావాన్ని నెరపేలా తన వాగ్దానాన్ని వ్యక్తిగతీకరించారు. నరేంద్రమోడీ ఆమె జ్ఞాపకాన్ని గుర్తుకు తేవడం కాకతాళీయం కాదు. ‘‘మీరు ఒకప్పుడు ఇందిరాగాంధీకి అధికారం కట్టబెట్టారు. యువతరానికి ఆమె గుర్తుండి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆమెలాంటి వారు ఎవరూ లేరు. నన్ను ప్రధానిగా ఎన్నుకుంటే ఆమె చేసిన దానికి పదిరెట్లు ఎక్కువ చేసి చూపిస్తా’’ అని ఆయన కర్ణాటకలోని ఒక ఎన్నికల ప్రచార సభలో అన్నారు.
 
 పార్టీ ప్రణాళికలను ఎవరూ చదవరు అనేది ప్రస్తుతం వాడు కలో ఉన్న ఎన్నికల నానుడులలో ఒకటి. అయితే అత్యున్నత అంతస్తులకు చెందిన వ్యాఖ్యాతలు వాటితో తలమునకలవుతూ ఉండొచ్చు. ఓటర్లు మాత్రం పార్టీలు ఏమి ఇవ్వదలచుకున్నాయి అనే  విషయాన్ని విశాల అర్థంలో స్వీకరిస్తారు. బీజేపీ ప్రణాళిక మైనారిటీలకు ఉద్యోగాలు, విద్య, సంపాదన కల్పించగల నైపు ణ్యాలపై పెట్టుబడులకు అగ్ర తాంబూలమిచ్చింది. అది ఆడ శిశు వులపై ప్రత్యేక శ్రద్ధను కోరింది. మైనారిటీల వారసత్వసంపద రక్షణను, ఉర్దూ భాషకు ప్రోత్సాహాన్ని వాగ్దానం చేసింది. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం అండదండలతో వక్ఫ్ ఎండోమెంట్ ఆస్తు లను కొల్లగొట్టడాన్ని అంతం చేయాలని కోరింది.
 
  అమోధ్యలో రామాలయ నిర్మాణం డిమాండును అది గుర్తించింది. అయితే దాన్ని అది సాంస్కృతికపరమైన అంశంగానే తప్ప ఎన్నికల అంశంగా వర్గీకరించలేదు. ఇవి ఆ పార్టీ చేసిన చెప్పుకోదగిన వాగ్దానాలు.
 
 ప్రతి ఎన్నికలకు ప్రధాన కథావస్తువుతో పాటూ ఒక ఉప కథావస్తువు కూడా ఉంటుంది. విజయాన్ని పసి గట్టిన పార్టీలు తమ పునాది మద్దతును సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మెల్లగా వేరెక్కడి నుంచైనా ఓట్లను రాబట్టుకునే క్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అవి రెండూ ఇప్పుడు కూడా జరుగుతుండటాన్ని మనం చూడొచ్చు.
 
 1971లో ఇందిరాగాంధీ ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని పరిపక్వానికి తెచ్చి ఆశలు ఉప్పొంగేట్టుగా చేశారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముందుకు పెద్ద గంతు వేయగలిగింది. అరాచకానికి విరుగుడు ఆశ. అరా చకత్వం పెరిగి 1960లలో తారస్థాయికి చేరడాన్ని మనం చూశాం. నక్సలైట్ ఉద్యమం వ్యాపించడమే కాదు పలు పెడ ధోరణి సంఘర్షణలు దేశ సామా జిక ఉపరితలానికి తూట్లు పొడుస్తున్నాయి. 2014 ఎన్నికలు 1960 ఎన్నికల ప్రతిబింబం కాజాలదు. ఎందుకంటే మనం ఆ దివాలాకోరు దశాబ్దం నుంచి ఎంతో దూరంగా వచ్చేశాం.
 
 కానీ ఆగ్రహానికి నేటికీ భారీ ఎత్తున నష్టాన్ని కలిగించే శక్తి ఉంది. యువతలో ప్రశాంతతను పునరుద్ధరించడానికి ఉన్న ఏకైక మార్గం ఉద్యోగాలను కల్పించడమే. ఆలోచనలేని ప్రభుత్వం పదేళ్ల కాలంలో వారిని పనిలేకుండా ఉంచేసింది. మరో కొన్ని వారాల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది. దాని తక్షణ ప్రాధాన్యం అత్యంత సామాన్యమైనది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉపాధి కల్పన, పేదల జీవితాలు మెరుగయ్యే విధంగా భారీ పెట్టుబడులు.

బైలైన్: ఎంజే అక్బర్  (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement