ఢిల్లీలోనే ఎమర్జెన్సీ విధిస్తారేమో: కేజ్రీవాల్
న్యూఢిల్లీ:దేశంలో మరోసారి ఎమర్జెన్సీ దాపురించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్ధించారు. అద్వానీ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 'అవును. ఎమర్జెన్సీ పై అద్వానీ జీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది.అయితే ఎమర్జెన్సీకి ఢిల్లీ తొలి ప్రయోగ వేదిక అవుతుందా?' అని కేజ్రీవాల్ చమత్కరించారు.
ఇందిర హయాంలో వచ్చిన ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో దేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై అద్వానీ ఆందోళ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి మళ్లీ రాదని తాను గట్టిగా చెప్పలేనని అద్వానీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే, రాజ్యాంగం-న్యాయరక్షణలకు విఘాతం కలిగించే శక్తులు చాలా బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉందని ఈ సందర్భంగా అద్వానీ పేర్కొన్నారు.
Advani ji is correct in saying that emergency can't be ruled out. Is Delhi their first experiment?
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 18, 2015