నాయకత్వంపై అద్వానీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిర హయాంలో వచ్చిన ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో దేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై ఆయన పైవిధంగా స్పందించారు.
దేశంలో ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి మళ్లీ రాదని తాను గట్టిగా చెప్పలేనని అద్వానీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే, రాజ్యాంగం-న్యాయరక్షణలకు విఘాతం కలిగించే శక్తులు చాలా బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉందని, ఆ నాయకత్వంపై తనకు నమ్మకం లేదంటూ నరేంద్ర మోదీపై అద్వానీ పరోక్షంగా చురకలింటించారు.
ప్రస్తుత ప్రజాస్వామ్యంలో నిబద్ధత కొరవడిందని, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన చాలా అంశాలు కనిపించడం లేదన్నారు. మౌలిక, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భంగం కలగవచ్చన్నారు. ఎమర్జెన్సీ విధించడం అంత తేలికైన విషయం కాదనీ, అయితే రాదని మాత్రం నమ్మకం లేదన్నారు. ఓవైపు సుష్మా స్వరాజ్-లలిత్‌మోడీ-వసుంధర రాజే వివాదం కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.