‘ఎమర్జెన్సీ’ గురించి చెప్పండి!
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ సూచన
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నెల రోజుల పాటు జోరుగా ప్రచారం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మంగళవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ ప్రచారంలో చేయాల్సిన పనులపై చర్చించారు. కేంద్రం తీసుకున్న వివిధ నిర్ణయాల ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలు.. మరింత లాభం చేయాలనుకున్నా కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలు పలు పథకాల బిల్లులను అడ్డుకుంటున్న విధానాన్ని ప్రచారం చేయనున్నారు.
దీంతో పాటు ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో నేటి తరానికి తెలిసేలా వివరించాలని ప్రధాని మోదీ సూచించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. కేంద్ర మంత్రులు దేశంలోని 200 ముఖ్యమైన కేంద్రాలకు వెళ్లి ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాలను వివరిస్తారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి ప్రజలతో సమావేశమవుతారని తెలిపారు. ఈ సమావేశంలో.. ఇటీవలే రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ సుబ్రమణ్య స్వామి, నవజ్యోత్‌సింగ్ సిద్ధులను సభ్యులకు పరిచయం చేసినట్లు రూడీ వెల్లడించారు.