న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.
రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్‌సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్‌నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.
స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్సే లక్ష్యంగా..
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.
ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.
కౌంటర్‌కి ఇండియా కూటమి రెడీ..
రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్‌ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్‌లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.
అటు పెద్దల సభలోనూ..
ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్‌కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్‌ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment