ఇటు ఐక్యత ప్రబోధం-అటు విమర్శల దాడి!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో మంగళవారం అరుదైన దృశ్యం కనిపించింది. ఇటు రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అటు లోక్‌సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏకకాలంలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చకు పెద్దల సభలో ప్రధాని మోదీ సమాధానమివ్వగా.. 'అసహనం'పై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.
రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 'విభజించడానికి ఎన్నైనా సాకులు ఉండొచ్చు కానీ మనం ఐక్యంగా ఉండటానికి అవసరమైన కారణాలపై దృష్టి పెట్టాలి' అని సూచించారు. ప్రతిపక్షాల పట్ల ఆయన రాజీ ధోరణి కనబర్చారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో కాంగ్రెస్ నేతల పాత్ర కూడా ఉందని గుర్తుచేశారు. కష్టకాలంలో మన ఐక్యత నిలబడేవిధంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయాలను పక్కనబెట్టి రాజ్యాంగ విలువల్ని ప్రతిబింబించాల్సి ఉంటుందని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.
మరోవైపు లోక్‌సభలో మాట్లాడిన రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నిరసన కూడా దేశద్రోహంగా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో జరిగిన హేతువాదుల హత్యలు, బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై మోదీ మౌనంగా ఉండటాన్ని రాహుల్ ప్రశ్నించారు. దళిత చిన్నారులను కుక్కతో పోలుస్తూ కేంద్రమంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై, దాద్రి ఘటనపై మోదీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.