కాంగ్రెస్‌పై లోక్‌సభలో రాజ్‌నాథ్ ధ్వజం
రాజ్యాంగ విలువలకే పాతర వేయజూశారు
రాజ్యాంగాన్ని అవమానించిన వారే ఇప్పుడు దాని ప్రతిని చేత పట్టుకు తిరుగుతున్నారు
రాహుల్ తదితరులపై రక్షణ మంత్రి విసుర్లు
లోక్‌సభలో అధికార, విపక్షాల వాగ్వాదం
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్‌సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు.
రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది.
జేబులో పెట్టుకోవడమే నైజం
రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్‌మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి.
వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో!
భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్‌గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు.
Comments
Please login to add a commentAdd a comment