కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
ఇప్పటికీ పదేపదే గాయపరుస్తోంది
ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగిపోదు
రాజ్యాంగంపై చర్చకు బదులిస్తూ నిప్పులు
రాజ్యాంగ బలోపేతమే తమ లక్ష్యమన్న ప్రధాని
కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి.
దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని అన్నారు. ‘‘2014 నుంచి మా నిర్ణయాలు, విధానాలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం. దేశ శక్తి సామర్థ్యాలను, ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయం’’ అని చెప్పారు.
రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు
రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాజ్యాంగాన్ని నెహ్రూ సవరించారు. ఇక ఆయన కుమార్తె ఇందిర ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. పదవులు కాపాడుకోవడానికి రాజ్యాంగంలో సవరణ చేశారు. న్యాయ వ్యవస్థ గొంతు కోశారు. దేశాన్నే జైలుగా మార్చేశారు. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగేది కాదు.
ఆమె కుమారుడు రాజీవ్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానికి సవరణలు తెచ్చారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన తర్వాతి తరమూ రాజ్యాంగంపై అదే ఆట ఆడుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఓ అహంకారి (రాహుల్) ఏకంగా చించిపారేశారు. యూపీఏ హయాంలో సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించింది. ప్రధాని మన్మోహన్‌ను మించిన అధికారులు చలాయించింది. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మతం, విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం అధికార యావతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు.
ఆ నినాదం.. అతిపెద్ద మోసం
కాంగ్రెస్ ఇచి్చన గరీబీ హఠావో నినాదాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు. నాలుగు తరాలుగా దాన్నే నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభ పడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా ప్రభుత్వం వచ్చాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాం. కాంగ్రెస్ నాయకులు పేదలను, పేదరికాన్ని కేవలం టీవీల్లో, పేపర్లలో చూసుంటారంతే. అసలైన పేదలు, అసలైన పేదరికం అంటే ఏమిటో వారికి తెలియదు’’ అని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగమే ఐక్యతా సాధనం
సాధారణ కుటుంబాల్లో జని్మంచిన తనవంటి ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారంటే రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలుండేవి. వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా, అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిది. మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం. మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చింది. మహిళల ఆధ్వర్యంలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది’’ అని ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పుల్లేకుండా ఏనుగు వెంట నడిచా’’ అని గుర్తు చేసుకున్నారు.
11 తీర్మానాలు
ప్రధాని మోదీ లోక్‌సభలో 11 తీర్మానాలు ప్రతిపాదించారు.
1. ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి.
2. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
3. అవినీతిని తిరస్కరించాలి. దానిపై యుద్ధం చేయాలి. అవినీతిపరులకు సమాజంలో స్థానం లేదు.
4. మన చట్టాలను, నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి. దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలి.
5. వలసవాదానికి తలవంచే మనస్తత్వం నుంచి బయటకు పడాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం మనకు గర్వకారణం.
6. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. పాలనలో బంధుప్రీతిని పక్కనపెట్టి ప్రతిభావంతులకే అవకాశం కలి్పంచాలి.
7. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు.
8. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు. మతాధారిత రిజర్వేషన్లకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి.
9. లింగ సమనత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.
10. ప్రాంతీయాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇదే మన మంత్రం.
11. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి. ప్రజలంతా కలిసుంటేనే భారత్ గొప్పదేశంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment