ఎమర్జెన్సీ మళ్లీ రావచ్చు
ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలంగా ఉన్నాయి
* మౌలిక స్వేచ్ఛకు భంగం కలగవచ్చు: అద్వానీ సంచలన వ్యాఖ్యలు
* మోదీనే అన్నారన్న విపక్షాలు: ఢిల్లీలో ప్రయోగిస్తున్నారన్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాదని గట్టిగా చెప్పలేమని బీజేపీ కురువృద్ధ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్తమాన కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి రాజ్యాంగ, న్యాయ పరిరక్షణలకు విఘాతం కలిగించే శక్తులు బలంగా ఉన్నాయంటూ అద్వానీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా జాతీయ రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి చేసినవేనంటూ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) మాత్రం తేలిగ్గా కొట్టిపారేసింది.
1975-77 నాటి ఎమర్జెన్సీకి 40 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అద్వానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గురువారం ప్రచురితమైన ఆ ఇంటర్వ్యూలో అద్వానీ మాట్లాడుతూ దేశంలో ప్రజల మౌలిక స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికి భంగం కలగదని రూఢీగా చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్న నాయకత్వం తనకు కనిపించటం లేదన్నారు. దేశంలో రాజకీయ నాయకత్వం పరిణతి చెందలేదని మాత్రం తాను అనటం లేదని, అయితే దానిలో ఉన్న బలహీనత వల్ల తనకు విశ్వాసం లేకుండా పోయిందని అద్వానీ వ్యాఖ్యానించారు.
అందువల్లే దేశంలో మరోసారి ఎమర్జెన్సీ రాదన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ మార్గదర్శక మండల్ సభ్యుడిగా ఉన్న అద్వానీ ఎమర్జెన్సీ కాలంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న విపక్ష నేతల్లో ఒకరు. అద్వానీ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి అయిన ఎంజీ వైద్య మాట్లాడుతూ అద్వానీ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడనీ, ఆయన మోదీకి సంకేతాలు పంపి ఉంటారని తాను అనుకోవటం లేదని అన్నారు.
బీజేపీ మార్గదర్శక మండల్‌లో సభ్యుడిగా ఉన్న అద్వానీ నేరుగా మోదీతో మాట్లాడగలరనీ.. ఇంటర్వ్యూ ద్వారా మోదీకి సంకేతం పంపించాల్సిన ఉద్దేశం అద్వానీకి ఉందని తాను భావించటం లేదని ఆయన అన్నారు. బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. ‘‘నేను అద్వానీ అభిప్రాయాలను గౌరవిస్తాను. అయితే ప్రస్తుతం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తుతాయని మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేద’’న్నారు.
అద్వానీ ఆందోళన సబబే: కాంగ్రెస్
మరోవైపు కాంగ్రెస్ అద్వానీ వ్యాఖ్యలను సమర్థించింది. పార్టీ ప్రతినిధి టామ్ వదక్కన్ మాట్లాడుతూ అద్వానీ దేశంలో ఓ సీనియర్ రాజనీతిజ్ఞుడని..తాను దేని గురించి మాట్లాడుతున్నదీ, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నదీ, ప్రధానమంత్రి ఎవరన్నదీ ఆయనకు స్పష్టంగా తెలుసన్నారు. అద్వానీ, ప్రధాని పేరును ఇంటర్వ్యూలో ప్రస్తావించదలచుకోలేదనీ, అయితే ఇంటర్వ్యూ చదివిన వారందరికీ అద్వానీ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవేనని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ సంకేతాలు వస్తున్నాయంటూ సీనియర్ నాయకుడైన అద్వానీ అభిప్రాయం సరైనదేనని అన్నారు.
వ్యవస్థలపై మోదీ చిన్నచూపు
పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ సర్కారు చిన్నచూపు చూస్తోందని సీపీఐ ఎంపీ డి.రాజా ఆరోపించారు. తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో, అద్వానీ వెంటనే బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ భయం ఇంకా ఉందని లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అన్నారు.
ఢిల్లీలోనే ప్రయోగం చేస్తున్నారేమో: కేజ్రీవాల్
ఎమర్జెన్సీపై అద్వానీ వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎమర్జెన్సీకి సంబంధించి ఢిల్లీలోనే తొలి ప్రయోగం చేస్తున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అద్వానీ వ్యాఖ్యలు మోదీ రాజకీయాలపై చేసిన విమర్శలేనని, మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా లేదని ఆమ్‌ఆద్మీపార్టీ నేత అశుతోష్ ట్విటర్‌లో విమర్శించారు.
రోజూ ఎమర్జెన్సీ చూస్తున్నాం: నితీశ్
అద్వానీ మాటలకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూడా బాసటగా నిలిచారు. తాము బిహార్‌లో ప్రతిరోజూ ఎమర్జెన్సీ తరహా రోజులను అనుభవిస్తున్నామని నితీశ్ తీవ్రంగా ఆరోపించారు. అద్వానీ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడని ఆయన ఆందోళనను తీవ్రంగా పరిగణలోకి తీసుకోవలసి ఉందని నితీశ్ అన్నారు.