ఆప్ అంటే మోదీకి భయం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పార్లమెంటరీ సెక్రటరీ’ చట్ట సవరణ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఆప్‌ను చూసి మోదీ భయపడుతున్నారన్నారు. మోదీ ప్రభుత్వ సిఫార్సులతోనే రాష్ట్రపతి తమ బిల్లును తిరస్కరించారని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకే ఆప్ ప్రభుత్వాన్ని మోదీ సజావుగా సాగనివ్వడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే తమ పాలనకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పార్లమెంటు సెక్రటరీలు ఉన్నారని, వారెవరిపైనా అనర్హత వేటు పడలేదన్నారు.
తమ ఎమ్మెల్యలు ఉచితంగానే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ కేవలం ఢిల్లీ ఎమ్మెల్యేలనే ఎందుకు అనర్హులుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఆప్ సర్కారు మార్చిలో 21 మంది ఎమ్మెల్లేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్ని చేపట్టారని, వారిపై అనర్హత వేటేయాలని అభ్యర్థనలు దాఖలయ్యాయి. అనర్హత వేటు నుంచి తప్పించడానికి ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన సవరణ బిల్లుకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ అనుమతి నిరాకరించారు. దీంతో ఆ 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది.