కేంద్రంతో మా సంబంధాలను భారత్-పాక్‌లా మార్చారు
మోదీ, అమిత్ షా పై కేజ్రీవాల్ ధ్వజం
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై విమర్శలు గుప్పించారు. కేంద్రం-ఢిల్లీ ప్రభుత్వం మధ్య సంబంధాలను వారు భారత్-పాక్ సంబంధాలుగా మార్చేశారని విమర్శించారు. ‘బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరయోధులను చూసినట్లు కేంద్రం మమ్మల్ని చూస్తోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. సీబీఐని అమిత్ షా నియంత్రిస్తున్నారని ఆరోపించారు. 2015 బిహార్ ఎన్నికల సమయంలో అమిత్ షా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ గుజరాత్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే తనకు చెప్పారన్నారు.
‘దేశంలో నేనొక్కడినే అవినీతి ముఖ్యమంత్రిని అనేలా మోదీ చూస్తున్నారు. ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదాపై రెఫరెండం నిర్వహించమనీ, ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే చేపడతామని అరవింద్ స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా ముచ్చటించేందుకు రూపొందించిన ‘టాక్ టు ఏకే’ కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించి రెండు గంటలపాటు మాట్లాడారు.