వచ్చే ఏడాది మోదీ పదవి నుంచి వైదొలుగుతారు
2 నెలల్లో యోగినీ మార్చేస్తారు
ప్రతిపక్షనేతలంతా జైలుకే
కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ.. అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోదీ ‘ఒక దేశం, ఒకే నాయకుడు’ పేరిట ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభించారని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను మోదీ ప్రభుత్వం కచి్చతంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నియంతృత్వ పాలన తీసుకురావాలన్నదే ప్రధాని లక్ష్యమని చెప్పారు. బీజేపీలోని తన ప్రత్యర్థులను రాజకీయంగా అంతం చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు.
మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నిపుణులతో, ప్రజలతో మాట్లాడానని, ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవడం ఖాయమని పేర్కొ న్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ‘ఆప్’ చేరుతుందని, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇంకా ఏం చెప్పారంటే..
ఎందుకు రాజీనామా చేయలేదంటే...
ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు. నాపై కేసు నమోదైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఢిల్లీలో భారీ మెజారీ్టతో మేము గెలిచాం. అందుకే మాపై కక్షగట్టారు. తప్పుడు కేసులో ఇరికించి, నన్ను బలవంతంగా పదవి నుంచి దింపేయడానికి కుట్ర జరిగింది. కుట్రను ఛేదించి, బీజేపీపై పోరాటం కొనసాగించడానికే పదవికి రాజీనామా చేయొద్దని నిర్ణయించుకున్నా.
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేస్తే పరిపాలన ఆగదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన నడిపిస్తే బాగుండేది. దొంగలు, దోపిడీదారులకు బీజేపీ అడ్డాగా మారింది. అవినీతిపై పోరాటం ఎలా చేయాలో ప్రధాని మోదీ నిజంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. అవినీతిపరులను మేము జైలుకు పంపించాం. ఈ విషయంలో మా మంత్రులనూ వదిలిపెట్టలేదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
హనుమాన్ ఆలయంలో పూజలు
అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు. హనుమాన్‌జీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అమిత్ షా కోసం ఓట్లడుగుతున్న మోదీ
‘‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను మోదీ తీసుకొచ్చారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్ వంటి నేతలను పక్కనపెట్టారు.
శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియా, మనోహర్‌లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ వంటి నాయకుల రాజకీయ జీవితానికి మోదీ ముగింపు పలికారు. ఇక తర్వాతి వంతు యోగి ఆదిత్యనాథ్‌దే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలల్లోనే యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి తెరపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారు.
యోగిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. వచ్చే ఏడాది మోదీ కూడా పదవి నుంచి తప్పుకుంటారు. అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారు. మోదీ ఇప్పుడు అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. మోదీ ఇచి్చన గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా? ఒక దేశంలో ఒకే నాయకుడు ఉండాలన్నదే మోదీ విధానం. ఇదే నియంతృత్వం. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం నా ఒక్కడితో సాధ్యం కాదు. అందుకు 140 మంది కోట్ల ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలి’’
Comments
Please login to add a commentAdd a comment