లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్. అయితే గత రెండు పర్యాయాల్లోనూ (2014, 2019) సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ క్రమంలో బుధవారం మోదీ 2.0లో చివరి కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. అదే మంచిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం నంబర్స్ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్‌లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రధాని పదవికి రాజీనామా సమర్పించేందుకు రాష్ట్రపతి భవన్‌కు మోదీ బయలుదేరారు.
మోదీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు వరకు కొనసాగవలసిందిగా మోదీ, మంత్రిమండలిని కోరినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment