మౌనం పాత్రికేయుని శస్త్రం | MJ akbar article on media | Sakshi
Sakshi News home page

మౌనం పాత్రికేయుని శస్త్రం

Published Mon, Oct 19 2015 12:37 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

మౌనం పాత్రికేయుని శస్త్రం - Sakshi

మౌనం పాత్రికేయుని శస్త్రం

బైలైన్
ఇంటర్వ్యూ చేయడం ఒక కళ. ఇంటర్వ్యూ ఇస్తున్న వారు దాటవేస్తున్నట్టయితే ఆ జవాబులోని పరస్పర విరుద్ధతను పట్టుకోగలిగే విధంగా  ప్రశ్నను మలచగలిగిన ప్రజ్ఞ జర్నలిస్టుకుండాలి. చెప్పకూడదని అనుకున్న దాన్ని కూడా రాబట్టగలిగే మార్గాలుంటాయి. కానీ అది  దూకుడుతనం కాదు. టీవీ ఇంటర్వ్యూ అధమ స్థాయికి చేరితే చర్చ కంటే కొట్లాటే ప్రేక్షకు లకు ఆసక్తికరమనే భ్రమతో కేకల పోటీగా  మారుతుంది. ప్రశ్నలు సంధించడం మీడియా విధేగానీ దాని స్ఫూర్తి బోనెక్కించి క్రూరంగా విచారించాలనే దుర్బుద్ధిగా దిగజారకూడదు.
 
ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా ప్రభుత్వానికి, మీడియాకు మధ్య సంబంధం అత్యంత ఉద్విగ్నభరితమైనదిగానే ఉండ టం ఖాయం. నిజానికి  ఆ రెండూ అధికారపు రెండు సమాంతర ధ్రువాలకు ప్రాతినిధ్యం వహించేవే. కానీ అవెన్నడూ నిజంగా విడివిడిగా వేరుపడిపోయి ఉండేవీ  కావు. పరిస్థితులను బట్టి వాటి మధ్య సంబంధాల తీరుతెన్నులు మారుతుంటాయి. పరస్పర మెచ్చుకోళ్ల నుంచి అనుమానం,  సంశయవాదం, నిరాశావాదం, అత్యంత అధ్వానమైన పరిస్థితుల్లో శత్రుత్వం వరకు అవి మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ  రెండింటి ప్రయోజనాల మధ్య సంఘర్షణ నెలకొంటుంది. ఇతర సందర్భాల్లో వ్యక్తి ప్రధానంగా మారడంతో వివేకరహితమైన అహం, నిర్ణయం  తీసుకోగల శక్తిలో జోక్యం చేసుకుంటుంది. అయితే ఈ రెండు శక్తుల మధ్య అంతర్నిహితమైన అవసరం ఎప్పుడూ ఉంటుంది.
 
ఆ అవసరం వ్యక్తిగతమైనది కావచ్చు లేదా సంస్థాగతమైనది కావచ్చు. అందువలన, ఈ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.  కానీ చాలా తరచుగా అది నిర్లక్ష్యం వల్ల దెబ్బ తినిపోతుంటుంది. ఈ చర్చను ఇంకా కొనసాగించడానికిముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం.  ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సెన్సార్‌షిప్  విధించడమనే అవకాశం ఉండదు. ‘అయితే’, ‘కానీ’లకు ఈ విషయంలో తావే లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ బేరసారాలకు అతీతమైన   హక్కు. జర్నలిజం ఒక వంచకుని నాలుకంత ‘పచ్చ’గా మారిపోయే సందర్భాలూ ఉంటాయి. మరోపక్క ప్రభుత్వాలకు కశ్మీర్ నుంచి కోచి  వరకు విస్తరించిన సమస్యల జాబితా ఉన్నా వాటిని చట్టం అనుమతించే ఏకైక రీతిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. క్రూరమైన సెన్సార్  కత్తెరను వాడే అవకాశమే ఉండదు. అయినా సెన్సార్‌షిప్ అనైతికమైనది, చట్టవిరుద్ధమైనది, ఆచరణసాధ్యం కానిది. ఇక చేయగలిగేది  ఏముంటుంది?
 
ప్రజాస్వామ్యంలో ప్రతి అడ్డంకినీ అధిగమించే చుట్టు తిరుగుడు మార్గాలను కనిపెట్టగల నిర్మాణాలుంటాయి. ‘దానికి బదులుగా ఇది’ అనే  పద్ధతి ద్వారా వ్యక్తిగతంగా పాత్రికేయులు స్వీయ సెన్సార్‌షిప్‌ను విధించుకోడానికి ప్రోత్సాహకాలను అందించడం వాటిలో అత్యంత  ప్రముఖమైనది. దీన్ని పట్టుకోవడం కష్టమనేది స్పష్టమే. అయితే ఒక్కసారి అది రుజువయ్యిందీ అంటే ఎప్పటికీ విశ్వసనీయతను  కోల్పోవాల్సిరావడమనే ముప్పు దీనితో ఉంది. కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించగల శస్త్ర చికిత్స నిపుణులు లేరు. ఒక మీడియా  ఉత్పత్తిపై ప్రేక్షకులు విశ్వాసాన్ని కోల్పోయారంటే, ఆ ప్రచురణ లేదా చానల్ జీవిత చక్రం ముగిసిపోయినట్టే.
 
మీడియాకుండే సాధనాల్లోకెల్లా అత్యంత మౌలికమైనదైన సంభాషణ ద్వారా జర్నలిస్టుకి, రాజకీయ నాయకునికి మధ్య ఉండే సాధారణ  సమీకరణం వడపోతకు గురవుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యంత ఉపయుక్తమైన సంభాషణ జనాంతికంగా సాగే  ముచ్చటే అవుతుంది.   అది కూడా హఠాత్తుగానూ, ఆశ్చర్యకరంగానూ జరగొచ్చు. పాత్రికేయునికి, రాజకీయవేత్తకు మధ్య ఉండే అత్యున్నతస్థాయి అనుబంధం ఈ  నమ్మకమే. ఈ నమ్మకాన్ని వమ్ముచేసిన ఏ పాత్రికేయుడైనాగానీ మరొక్క రోజు ఆ ఉద్యోగంలో ఉండటానికి కూడా అర్హుడు కాడు. అలాగే,  ప్రజాజీవితంలో ఉన్నవారెవరైనాగానీ జనాంతికమైన ముచ్చట పేరిట తప్పుదారి పట్టించడం అవివేకం. ఎందుకంటే అధికారంలో  ఉన్నవారెవరూ అన్ని విషయాలూ చెప్పరు. అలా అని  తప్పుదారి పట్టించడమో లేదా వక్రీకరించడమో చేయకూడదు. పాత్రికేయులు తమపై  ఉంచిన విశ్వాసాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలున్న మాట నిజమే. తద్వారా వారు తమపై నమ్మకం ఉంచిన వారికి చే యగల హాని  కంటే తమకే ఎక్కువ హాని చేసుకుంటారు.  
 
ఇక బహిరంగ ఇంటర్వ్యూలు మరింత సున్నితమైన సమస్య. దీనికి సంబంధించిన నియమాలు చాలా స్పష్టంగానే ఉంటాయి. అయినాగానీ  ఇంటర్వ్యూ చేయడం ఒక సున్నితమైన కళ. ఇంటర్వ్యూ ఇస్తున్న వారు దాటవేసే సమాధానమేదైనా చెప్పేట్టయితే అందులో ఉన్న పరస్పర  విరుద్ధతను పట్టుకోగలిగే విధంగా ప్రశ్నను మలచగలిగిన విషయ పరిజ్ఞానం జర్నలిస్టుకు ఉండాలి.
 
 స్థిరమైన ప్రశ్నల జాబితాతో వెళ్లి, వేసిన ప్రశ్నకు చెప్పిన సమాధానానికి కొనసాగింపుగా తిరిగి ప్రశ్నించగలిగే చాకచక్యం ఇంటర్వ్యూచేసే  జర్నలిస్టుకు ఉండాలి. లేకపోతే ఆ ఇంటర్వ్యూ చాలా నిస్సారమైనదిగా ఉంటుంది. ఇంట ర్వ్యూ ఇచ్చే వ్యక్తి తన  ప్రయోజనాలకు సరిపడే  మేరకే సమాచారాన్ని ఇవ్వ డానికి సిద్ధంగా ఉంటారని ఆశించడమే సమంజసం. ఆ వ్యక్తి చెప్పాలనుకొని దాన్ని కూడా రాబట్టగలిగేలా  ప్రేరేపించే మార్గాలుంటాయి. దూకుడుతనం అందుకు సమాధానం కాదు. ఆరోపణలతో కూడిన ప్రశ్నలు జాగరూకత లేకుండా  ప్రత్యుత్తరమిచ్చేలా రెచ్చగొడతాయి. కానీ అనుభవజ్ఞుడైన ఏ రాజకీ యవేత్తయినా ఆ బౌన్సర్లను అలవోకగా తప్పించుకోగలరు.  
 
 ఈ విషయంలో నాకు నచ్చే పద్ధతి వ్యూహాత్మక మౌనాన్ని ప్రయోగిం చడమే. చేతనైనంత మృదువుగా, స్పష్టంగా ప్రశ్నను అడగండి. దానికి  సమా ధానం లభిస్తుంది. ఆ సమాధానం సరిపోలేదని లేదా ఎంచుకుని చెప్పినదిగా ఉందని విశ్వసించేట్టయితే... ఆ సమాధానం పూర్తి  కావడం కోసం వేచి చూస్తున్నట్టుగా మౌనం రాజ్యం చేయనియ్యండి. ఈ మౌనంతో వ్యవహరిం చడం ఇంటర్వ్యూ ఇస్తున్నవారికి చాలా  కష్టమనిపిస్తుంది. దాదాపు అనివా ర్యంగానే వారు ఆ నిశ్శబ్ద శూన్యాన్ని ఏదో ఒక విషయంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ఏదో ఒక  విషయమే పరిశీలన అవుతుంది లేదా ఇంట ర్వ్యూకి జీవాన్ని తెచ్చే కథనం అవుతుంది.
 
 ప్రింట్ మీడియా ప్రధానమైనదిగా ఉన్న కాలంలో ఈ పద్ధతిని ప్రయో గించడం ఎక్కువ సులువైనదిగా ఉండేది. ప్రచురణకు ఉద్దేశించిన ఇంట  ర్వ్యూ విషయంలో కాలం దాని పక్షాన ఉంటుంది. టెలివిజన్‌కున్న శక్తులు అపారమైనవనే మాట నిజమే. కానీ తీవ్ర దుష్ప ర్యవసానాలకు  దారితీ యగల ఘోరమైన లోపం కూడా దానికి ఉంది. టీవీలో మౌనానికి స్థలంగానీ, కాలంగానీ ఉండదు. జర్నలిస్టే అనివార్యంగా ఏదో ఒకటి  చెబుతూ ఉండక తప్పదు. దీంతో అనివార్యంగానే ఆమె లేదా అతడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి తప్పించుకుపోవడానికి అవకాశాన్ని  కల్పించక తప్పదు. టెలివిజన్ ఇంటర్వ్యూ అధ్వాన స్థితికి చేరినప్పుడు శ్రోతలకు చర్చ కంటే కొట్లాటే ఎక్కువ ఆసక్తికరమనే భ్రమతో  గావుకేకల పోటీని ప్రోత్సహిస్తుంది.
 
 ప్రశ్నలు అడగడం మీడియా విధేగానీ ఆ విచారణ స్ఫూర్తి బోనెక్కించి క్రూరంగా విచారించాలనే దుర్బుద్ధిగా దిగజారకూడదు. హేళన  చేసేవాడికి ఇంటర్వ్యూ ఇచ్చేవారందరిలాగే రాజకీయవేత్తలు కూడా సహజంగానే దీన్ని అసహ్యించుకుంటారు. జర్నలిస్టు అడిగిన వాటి కంటే  తర్వాత చింతిం చాల్సివచ్చే విషయాలను చెప్పాలని తాపత్రయపడటం కూడా రాజకీయ వేత్తలకు ఉంటుంది. ఈ పరిస్థితికి అది కూడా అంతే  కారణమని వారికీ బహుశా  అర్థమవుతుందని అనుకుంటాను.
 
 ‘‘చురక’’ (ఆమోదయోగ్యమైన చురక) అనే పదం నాకు ఆనందం కలిగిస్తుంది. అది  ధ్వన్యనుకరణను ప్రతిధ్వనించే సరసమైన పదం. అది  సునిశితమైనది, చుర్రుమనిపించేది, అభిరుచికి ఆహ్లాదకరమైనదిగా ఉండేది. అయినాగానీ కుడుతుంది. అలా అని ‘‘చురక’’ కోపం  తెప్పించేదిగానీ, చికాకు పుట్టించేదిగానీ, ఆగ్రహం రేకెత్తించేదిగానీ కాదు. దానికి అత్యుత్త మమైన సమాధానం ఏమిటి? నిబ్బరంతో శాంతంగా  ఉండటమే. దాన్ని కోల్పోయిన వారు ఇంటర్వ్యూలో చిత్తయినట్టే.
 వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి
 

ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement