కలం ..నిరసన గళం
సిటీలో కదం తొక్కిన జర్నలిస్టులు
ఏపీలో సాక్షి మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్
రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీ.. గవర్నర్‌కు వినతిపత్రం
కలం గళమెత్తింది. ఆంక్షలను వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యానికి పునాది వంటి మీడియాపై నియంత్రణ వద్దంటూ నినదించింది. ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ నగరంలో బుధవారం జర్నలిస్టులు, వివిధ సంఘాలు, సంస్థల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. పద్ధతి మారకపోతే మూల్యం తప్పదని హెచ్చరించారు. ‘మీడియాకు సంకెళ్లా.. సిగ్గు సిగ్గు’.. ‘ప్రజాస్వామ్యంతో పరిహాసమా!’ అన్న నినాదాలు హోరెత్తాయి. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నేతలతోపాటు కవులు, కళాకారులు కూడా పాల్గొని మద్దతు ప్రకటించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం ఏమాత్రం సబబుకాదని పేర్కొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో
సాక్షి టీవీ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో నిలిపివేయడాన్ని నిరసిస్తూ బుధవారం జర్నలిస్టులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారులు తమ పాటలతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు.