అర్హులకు ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి
జేఎన్‌జే సొసైటీకి పేట్ బషీరాబాద్‌లోని స్థలపత్రాల అప్పగింత
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సొసైటీకి 70 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: నిజమైన పాత్రికేయులను అగౌరవపరిచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. వారికి అన్నివేళలా అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవస్థపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించిన 38 ఎకరాల భూపత్రాలను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాప్రభుత్వంలో పాత్రికేయులు’ కార్యక్రమంలో సొసైటీకి సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జేఎన్‌జే సొసైటీలో సభ్యులు కాని ఇతర జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సిటీ నిర్మాణంలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలని కోరారు. మీడియా అకాడమీకి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.
పాత్రికేయులకు స్వేచ్ఛ
యాజమాన్యాల విధానాలు ఏ విధంగా ఉన్నా, పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను అర్థం చేసుకొని, వారికి సంక్షేమం అందించడంలో ముందుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనేక ఆంక్షలుండేవని, తమ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, తమకు కష్టాన్ని తెచ్చేలా ఉండకూడదన్నారు. పత్రికా సమావేశాల్లో ఆ ట్యూబ్...ఈ ట్యూబ్ అంటూ నిజమైన పాత్రికేయులకన్నా వారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు.
ఏమన్నా అంటే పత్రికలపై దాడి అని అల్లరి చేస్తున్నారని, వారు ఏం అడుగుతారో.. ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఎవరిని జర్నలిస్ట్‌గా చూడాలో పాత్రికేయులే చెప్పాలన్నారు. పాత్రికేయుల ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త విధానాలు రూపొందించాలని మీడియా అకాడమీని సీఎం ఆదేశించారు. కొంతమంది పాత్రికేయులు విలువల్లేకుండా రాజకీయ పార్టీల యజమానులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నడుపుతున్న పత్రికల పోకడలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఉన్మాద ధోరణితో వెళుతున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని కోరారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల అప్పగింత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ విలేకరులకు కూడా స్థలాలు ఇవ్వాలన్నారు.
అనంతరం మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం సీఎం రేవంత్‌రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జేఎన్‌జే నాయకులు కిరణ్‌కుమార్, రవికాంత్‌రెడ్డి, వంశీశ్రీనివాస్, రమణారావు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment