జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ? | Aam Aadmi party goes towards Janatha | Sakshi
Sakshi News home page

జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ?

Published Sat, Jan 18 2014 11:27 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ? - Sakshi

జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ?

బైలైన్: ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు

అవినీతి నిర్మూలన  ఆమ్ ఆద్మీ వద్ద ఇంకా మిగిలి ఉన్న పోత బంగారపు తురుపు ముక్క. దానికి సమయం పడుతుందని ప్రజలు కూడా అంగీక రిస్తారు. కానీ రాజకీయాల్లో కాలం అనంతమైనది కాదు. కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉన్నారంటేనే అధికార కాలరేఖ మరింత చిన్నదిగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ కూడా జనతా పార్టీలాగే ముగిసిపోతే పట్టించుకోనవసరం లేదు. కాకపోతే అది మిగిల్చే నిరుత్సాహాన్ని మాత్రం పట్టించుకోవాల్సి ఉంటుంది.

వీధి అలజడుల నుంచి పుట్టిన ఏ పార్టీలోనైనా వైవిధ్యభరితమైన దాని జనన స్వభావం ప్రతిఫలించక మానదు. గాంధీ టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ గాంధీ అయిపోరు. స్వభావరీత్యానే పట్టణ తిరుగుబాటు తన నాయకత్వాన్ని ప్రాథమిక పరీక్షకు నిలబెడుతుంది. నాయకులు అతి త్వరగా ఊకను, బియ్యాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. లేక పోతే చివరికి అంతా ఊకే మిగులుతుంది. ఊకను బుక్కిన రాజకీయవేత ్త ఎవరికైనాగానీ కడుపు నొప్పి తప్పదు.

1977లో జనతాపార్టీ ప్రజాస్వామిక తిరుగుబాటును సమర్థవంతంగా విజయవంతం చేసి అధికార  ప్రాసాదంలోకి ప్రవేశాన్ని సంపాదించగలిగింది. దాని అధికారం గారాలపట్టి లాంటి దేశ రాజధాని నగరపు మునిసిపల్ పరిధికి పరిమితం కాలేదు. వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న ప్రతి రాష్ట్రానికి విస్తరించింది. అందువల్లనే దానికి లోక్‌సభలో ఎలాంటి ఇబ్బందీ కలగని మంచి ఆధిక్యత లభించింది. మూడు రంగుల చెక్క కాళ్లను తగిలించుకోవాల్సిన అగత్యం లేకుండానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆ పార్టీ అనుభవానికి గుణపాఠాలను నేర్పగలిగే స్వభావం ఉంది.

ఎన్నో ఆశలను రేకెత్తించిన జనతాపార్టీ తన శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించక ముందే ఆ అశలనన్నిటినీ వమ్ము చేస్తూ విచ్ఛిన్నమైపోయింది. ఆ పార్టీ నేతలు మొదటి రెండు వారాల్లోనే ప్రమాదకరమైన తప్పు చేశారు. దాన్నుంచి ఆ పార్టీ మరెన్నటికీ కోలుకోలేదు. బాధ్యతారహితంగా, అడ్డూఅదుపూ లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే తిరుగుబాటుదార్లను అణచివేసే అధికారం ఉన్నా గానీ వారికి లొంగిపోయారు.

 వ్యక్తిత్వపరంగానూ, తాత్వికపరంగానూ ఏమంత తేడాలేని ఇద్దరు వ్యక్తులు జనతా పార్టీలోని రెండు భిన్న ధృవాలకు ప్రాతినిథ్యం వహించారు. ఒకరు, ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యం ఇచ్చే గాంధేయవాది, కాంగ్రెస్ ప్రముఖుడు మొరార్జీదేశాయ్. 1966లో లాల్‌బహదూర్
శాస్త్రి హఠాన్మరణం తదుపరి ఇందిరాగాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఆయన సవాలు చేశారు. నాడు మొరార్జీ ఓడిపోయారు. కానీ ఆ విషయాన్ని మాత్రం మరువలేదు.

తొలుత డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా సోషలిస్టు ఉద్యమంలో పనిచేసిన రాజ్‌నారాయణ్... తనకు తానుగానే ఒక టపాకాయల గోదాముగా మారారు. ఒక్కో చిచ్చును రాజేసే కొద్దీ ఆయన గొల్లున నవ్వడం పెరుగుతూ వచ్చింది. మొరార్జీ ఎప్పుడైనా నవ్వారేమోగానీ చూసినవారు లేరు. అలాగే రాజ్‌నారాయణ్ ఉల్లాసంగా లేకుండా స్తబ్ధుగా ఉండటాన్ని గమనించినవాళ్లు లేరు. రాజ్‌నారాయణ్  1979 నాటికి చరణ్‌సింగ్‌కు మద్దతుగా నిలిచి, కాంగ్రెస్‌తో కుట్ర పన్ని జనతా ప్రభుత్వాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేశారు.

రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి 1971లో ఇందిరాగాంధీ ఎన్నిక కావడాన్ని రాజ్‌నారాయణ్ పిటిషన్ వేసి సవాలు చేశారు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఆ ఎన్నికను కొట్టిపారేయడంతో ఆయన సుప్రసిద్ధు
డ య్యారు. ఆ కేసులో రాజ్‌నారాయణ్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్...ఆమ్ ఆద్మీ నేత ప్రశాంత్‌భూషణ్ తండ్రి.

అంతమాత్రాన ఇది రెండు పార్టీల మధ్య ప్రవర్తనాపరమైన అనుబందాన్ని రూఢిపరచజాలదు. కానీ ఆ అనుబంధానికి ఆధారాలు తమ కథను చెప్పడం ప్రారంభమైంది.

అరవింద్ కేజ్రీవాల్, మొరార్జీలోని సత్ప్రవర్తనకు రాజ్‌నారాయణ్‌లోని బాధ్యతారహితమైన తొందరపాటు విన్యాసాలను జోడించాలని చూస్తున్నారు. ఆయన మంత్రులు వాస్తవికతతో సంబంధం కోల్పోయిన చపలచిత్తులుగా మారుతున్నారు. వారు రోజులో కొన్ని గంటలు మాత్రమే తమ శాఖలకు బాధ్యులుగా ఉంటూ మిగతా సమయంలో తమ అధికారులకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు.

జనాకర్షక విధానం ఒక ప్రమాదకరమైన ప్రలోభం. అది, బిల్లులు చెల్లించ నిరాకరించినవారికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఫిర్యాదూ సమంజసమైనదేనని, ఎల్లప్పుడూ పోలీసులదే తప్పని, అధికారులు ఎప్పుడూ నైతికంగా దివాలా తీసినవారేనని భావించే నిఘా కార్యకర్త ప్రవర్తనకు దారి తీస్తుంది. ఉద్రేకపూరితమైన వాగాడంబరం మిమ్మల్ని ప్రమాదకర స్థాయిలలోని ఆగ్రహం అంచులకు తీసుకుపోతుంది. కేజ్రీవాల్ తన రాష్ట్ర పోలీసులకే వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు కూచుంటానని బెదిరిస్తుంటే ఇక అరాచకపు గందరగోళానికి వేదికలు ఇంకెక్కడా మిగలవు. ఢిల్లీ ఓటర్లు మార్పుకు ఓటేశారే గానీ అరాచకానికి కాదు. ఢిల్లీ పోలీసుల్లో పదుల సంఖ్యలో తప్పులున్నాయి. ఆ నగరంలో బతుకుతున్న వారిలో అత్యధికులకు అది ఏదో ఒక రూపంలో అనుభవైక వేద్యమవుతూనే ఉంది. అలా అని వారి స్థానంలో పార్టీ కార్యకర్తలు ఆ బాధ్యతలను నెరవేర్చగలరా?

తేడాలను చూసే ప్రయత్నం ఏదైనా జరిగితే విపరీత పరిశుద్ధవాదులు ఆగ్రహిస్తారు. ఇదేమీ లెనినిస్టు విప్లవం కాదని, ప్రజాస్వామిక సవాలని మరచిపోతారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులనందరినీ తొలగించి పార్టీ క్యాడర్లతో నింపలేరు.

నక్సలైట్లు కావడానికి తగిన ధైర్యంలేక ఆమ్ ఆద్మీ పార్టీ వీధి విప్లవవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీ వైఖరులను తెలివిగా ఎవరూ ఒక తార్కిక చట్రంలో ఉంచలేదు. కాబట్టి దాన్ని ప్రణాళిక అని ఎవరూ అనలేరు. కానీ ఆ పార్టీ వైఖరి మాత్రం ప్రభుత్వాధికార వ్యవస్థపైనా, ప్రైవేటు రంగంపైనా రాజకీయవర్గ అధికారాన్ని విస్తరింపజేసే వ్యవస్థ సామాజికీకరణ, జాతీయకరణ దిశగా సాగుతున్నాయి. మీ కంటే నేనే పవిత్రుడ్ని అనే ధోరణిని ఆ పార్టీ ఎంతగా ఒంట బట్టించుకుందంటే దాని మంత్రి ఒకరు తప్పు చేశారని న్యాయమూర్తి వెల్లడిస్తే... న్యాయ వ్యవ స్థదే తప్పయి తీరాలి. అంతేగానీ పార్టీ తప్పు కావడానికి వీల్లేదు. లెనిన్, మావోలూ అంగీకరిస్తారు.

అధికారం ఒక బాధ్యత. చౌకగా విద్యుత్తును, నీటిని అందించడం ద్వారా మాత్రమే ఢిల్లీ బాధలనన్నిటినీ తీర్చేసి, జనాదరణను పొందగలిగేట్టయితే షీలా దీక్షిత్ ఆ పని ఎందుకు చేయలేదు?

ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి నిర్మూలన  ఆమ్ ఆద్మీ వద్ద ఇంకా మిగిలి ఉన్న పోత బంగారపు తురుపు ముక్క. అది తేలికేమీ కాదనేది స్పష్టమే. కాబట్టే దానికి సమయం పడుతుందని ప్రజలు కూడా అంగీక రిస్తారు. అయితే రాజకీయాల్లో కాలం అనంతమైనది కాదు. అధికారం కాలపరిమితికి లోబడి ఉంటుంది. మీరు కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉన్నారంటేనే ఆ కాలరేఖ మరింత చిన్నదై ఉంటుంది. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా తన వద్ద 300 పేజీల ఆధారాలున్నాయని కేజ్రీవాల్ అన్నారు. అందువల్లనే ఆయన అన్ని సీట్లు గెలవగలిగారు. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని చదవడానికి ఆయనకు సమయం ఉన్నదా? అని త్వరలోనే ఎవరైనా అడిగే అవకాశం ఉంది.

ఆమ్ ఆద్మీ కూడా జనతా పార్టీలాగే ముగిసిపోతే పట్టించుకోనవసరం లేదు. కాకపోతే అది మిగిల్చే నిరుత్సాహాన్ని మాత్రం పట్టించుకోవాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement