![How did aap become a National Party in 12 Years](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/kejriwal-main.jpg.webp?itok=jkomjaOJ)
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2012లో ఏర్పడిన ఈ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీగా ఎలా అవతరించింది? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఆప్ ఎదుగుదల వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి.
దేశంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాటి సర్కారు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి అన్నా హజారే నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారు. లోక్‌పాల్ బిల్లుకు సంబంధించి ఢిల్లీ నుండి ప్రారంభమైన ఉద్యమం దేశంలోని ప్రతి మూలకు వ్యాపించింది. ఉద్యమం ముగిసిన తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.
2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి కన్వీనర్ అయ్యారు. రాజకీయ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు పార్టీని ఏర్పాటు చేయడంలో భాగస్వాములయ్యారు. తరువాత వారందరూ వేర్వేరు కారణాలతో పార్టీని వీడారు.
2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి అందించిన మద్దతుతో ఢిల్లీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ తర్వాత 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. నాడు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది.
కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవలేకపోయింది. బీజేపీ కేవలం మూడు సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. దీని తరువాత పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment