![What are the 5 Reasons for aam admi Party for Bad Performence](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/aap-main.jpg.webp?itok=gRJzPFNV)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాటలో ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్ల కంటే వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. కానీ 2020లో ఈ సంఖ్య 62కి తగ్గింది. మరోవైపు బీజేపీ 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాట వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి:
1. అవినీతి ఆరోపణలు-చట్టపరమైన సమస్యలు:
పార్టీ అగ్ర నేతలు.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు.
2. నాయకత్వ అస్థిరత:
కేజ్రీవాల్ అరెస్టు.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ, నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. అరవింద్ కేజ్రీవాల్‌పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది.
3. ఓట్లను చీల్చిన కాంగ్రెస్:
వాస్తవానికి సీట్ల పరంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఒక సీటు మాత్రమే గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీలోని ఏడు సీట్లనూ కోల్పోవడం, పంజాబ్‌లో కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించడం కారణంగా పార్టీ బలహీనపడింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/34_33.png)
4. అంతర్గత కలహాలు- రాజీనామాలు:
పార్టీ లో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి.
5. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం:
ఆప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. మహిళలు, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment