![What is aap Plan after Defeat in Delhi Manish Sisodia Told](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/manish-main.jpg.webp?itok=dhNMlVuf)
న్యూఢిల్లీ: ఢ్లిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు ఘోర పరాభవం ఎదురయ్యింది. పార్టీలోని పెద్ద నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో వారంతా దక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆప్ జాతీయ కన్వనీర్ అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. పార్టీ ఓటమి పాలయిన తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నకు సిసోడియా సమాధానమిచ్చారు.
మనీష్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై తమ నేత కేజ్రీవాల్ అందరితో చర్చించారని, తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, తాము ఏవిధంగానైతే ఢ్లిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోరాటం సాగించామో, అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యలోనే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు, చీరలు, చివరికి మద్యం కూడా పంపిణీ చేశారని, ఎన్నికల వ్యవస్థను దురుపయోగం చేశారని సిసోడియా ఆరోపించారు. ఈ తరహాలో జరిగిన ఎన్నికల్లో పోటీ అంత సులభం కాలేదన్నారు. అయినప్పటికీ ఆప్ తన పోరాటాన్ని ఆపలేదన్నారు.
ఓటమి పాలయిన నేతలకు అరవింద్ కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారని.. వారు పోటీ చేసిన ఆయా ప్రాంతాల్లోని ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల అనంతరం నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలుగన్న ఆప్‌కు నిరాశ ఎదురయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
Comments
Please login to add a commentAdd a comment