breaking news
Janatha
-
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర శిబిరంలో మంగళవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విలువల కోసం వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైఎస్ అడుగుజాడల్లో జగన్ నడుస్తున్నారని, తిరిగి రాజన్న రాజ్యం రావడం ఖాయం అన్నారు. ఆనాడు ఎన్జీ రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ తరఫున తనతోపాటు 62 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, తర్వాత ఇందులో 61 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌లు పాల్గొన్నారు. నారాయణ స్వామి 1978 నుంచి 1983 వరకు టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆచార్య ఎన్జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నలకు ముఖ్య అనుచరుడు. -
స్వచ్ఛ జన్నత్
జమ్మూకశ్మీర్ పర్యటనలో శ్రీనగర్‌లోని దాల్ లేక్ విహారం ఓ మధురానుభూతి. దాల్ లేక్‌లో శికార్ రైడ్ చేసి ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకునే వాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆ ఫొటోలకు వస్తున్న లైక్లకూ లెక్కే ఉండటం లేదు. ఫొటో తీసుకుని, లైక్ చూసుకుని మురిసిపోతే చాలా? సరస్సు శుభ్రంగా ఉండొద్దా? అనుకుందో ఐదేళ్ల పాపాయి. తండ్రితోపాటు పడవ ఎక్కి పొడవాటి కర్రకు వల కట్టి సరస్సులో తేలుతున్న ఖాళీ కూల్‌డ్రింక్ బాటిళ్లు, స్నాక్స్ తిని పారేసిన అల్యూమినియం రేపర్లు, పాలిథిన్ కవర్లు... ఒకటేమిటి పర్యాటక ప్రియులు బాధ్యతారహితంగా సరస్సులోకి విసిరేసిన చెత్తను అందిన వరకు పడవలోకి చేర్చింది. ఒడ్డుకు కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోయిన చెత్తను మడమల వరకు కూరుకుపోతున్న బురదలో దిగి మరీ ఏరి పారేసింది. ఆ తర్వాత పెద్దవాళ్లందరికీ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. నిజానికి ఆ పాపాయి ఇచ్చిన సందేశం పిల్లలకే. కానీ పెద్దవాళ్లకూ అందే సందేశం. ‘‘ఫ్రెండ్స్! దాల్ సరస్సు చాలా అందమైన సరస్సు. చెత్త లేకపోతే ఇంకా అందంగా ఉంటుంది. అందుకే మన సరస్సును మనం శుభ్రంగా ఉంచుకుందాం. మీరు కూడా మీ పడవల్లో వచ్చి దాల్ సరస్సులో చేరుతున్న చెత్త తొలగించండి. మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి’’ అని చెప్పింది. ఇదంతా ఆమె తండ్రి స్మార్ట్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది దేశాన్ని చుట్టే లోపే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిలో పడింది. స్వచ్ఛభారత్‌కు ఓ బుల్లి అంబాసిడర్ దొరికిందని మురిసిపోయారు. ‘ఈ పాపాయి మన సూర్యోదయాలను మరింత అందంగా మారుస్తోంది. స్వచ్ఛత మీద ఆమెకున్న అభిరుచి చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పేరేంటో తెలుసా? జన్నత్... అంటే స్వర్గం. కశ్మీర్ భూతల స్వర్గం అంటారు. అలాంటి స్వర్గంలో పుట్టిన తన బిడ్డ అంతకంటే అపురూపమైన స్వర్గాన్ని ఆవిష్కరించాలని ఆ తండ్రి ఆమె పుట్టినప్పుడే అనుకున్నాడేమో! ఆమెకు అంత స్వచ్ఛమైన ఆలోచన రావడానికి ఆ పేరు కూడా కారణమేనేమో!ఆమె పేరు కారణం అయినా కాకపోయినా జన్నత్ సందేశాన్ని మాత్రం అందరం పాటించాల్సిందే. మనం ఒక సమస్యను సృష్టించడంలో భాగస్వాములం కావద్దు, పరిష్కారం వెతకడంలో భాగస్వాములవుదాం. – మంజీర -
జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ?
బైలైన్: ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు అవినీతి నిర్మూలన ఆమ్ ఆద్మీ వద్ద ఇంకా మిగిలి ఉన్న పోత బంగారపు తురుపు ముక్క. దానికి సమయం పడుతుందని ప్రజలు కూడా అంగీక రిస్తారు. కానీ రాజకీయాల్లో కాలం అనంతమైనది కాదు. కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉన్నారంటేనే అధికార కాలరేఖ మరింత చిన్నదిగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ కూడా జనతా పార్టీలాగే ముగిసిపోతే పట్టించుకోనవసరం లేదు. కాకపోతే అది మిగిల్చే నిరుత్సాహాన్ని మాత్రం పట్టించుకోవాల్సి ఉంటుంది. వీధి అలజడుల నుంచి పుట్టిన ఏ పార్టీలోనైనా వైవిధ్యభరితమైన దాని జనన స్వభావం ప్రతిఫలించక మానదు. గాంధీ టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ గాంధీ అయిపోరు. స్వభావరీత్యానే పట్టణ తిరుగుబాటు తన నాయకత్వాన్ని ప్రాథమిక పరీక్షకు నిలబెడుతుంది. నాయకులు అతి త్వరగా ఊకను, బియ్యాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. లేక పోతే చివరికి అంతా ఊకే మిగులుతుంది. ఊకను బుక్కిన రాజకీయవేత ్త ఎవరికైనాగానీ కడుపు నొప్పి తప్పదు. 1977లో జనతాపార్టీ ప్రజాస్వామిక తిరుగుబాటును సమర్థవంతంగా విజయవంతం చేసి అధికార ప్రాసాదంలోకి ప్రవేశాన్ని సంపాదించగలిగింది. దాని అధికారం గారాలపట్టి లాంటి దేశ రాజధాని నగరపు మునిసిపల్ పరిధికి పరిమితం కాలేదు. వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న ప్రతి రాష్ట్రానికి విస్తరించింది. అందువల్లనే దానికి లోక్‌సభలో ఎలాంటి ఇబ్బందీ కలగని మంచి ఆధిక్యత లభించింది. మూడు రంగుల చెక్క కాళ్లను తగిలించుకోవాల్సిన అగత్యం లేకుండానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆ పార్టీ అనుభవానికి గుణపాఠాలను నేర్పగలిగే స్వభావం ఉంది. ఎన్నో ఆశలను రేకెత్తించిన జనతాపార్టీ తన శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించక ముందే ఆ అశలనన్నిటినీ వమ్ము చేస్తూ విచ్ఛిన్నమైపోయింది. ఆ పార్టీ నేతలు మొదటి రెండు వారాల్లోనే ప్రమాదకరమైన తప్పు చేశారు. దాన్నుంచి ఆ పార్టీ మరెన్నటికీ కోలుకోలేదు. బాధ్యతారహితంగా, అడ్డూఅదుపూ లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే తిరుగుబాటుదార్లను అణచివేసే అధికారం ఉన్నా గానీ వారికి లొంగిపోయారు. వ్యక్తిత్వపరంగానూ, తాత్వికపరంగానూ ఏమంత తేడాలేని ఇద్దరు వ్యక్తులు జనతా పార్టీలోని రెండు భిన్న ధృవాలకు ప్రాతినిథ్యం వహించారు. ఒకరు, ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యం ఇచ్చే గాంధేయవాది, కాంగ్రెస్ ప్రముఖుడు మొరార్జీదేశాయ్. 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తదుపరి ఇందిరాగాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఆయన సవాలు చేశారు. నాడు మొరార్జీ ఓడిపోయారు. కానీ ఆ విషయాన్ని మాత్రం మరువలేదు. తొలుత డాక్టర్ రామ్మనోహర్ లోహియా సోషలిస్టు ఉద్యమంలో పనిచేసిన రాజ్‌నారాయణ్... తనకు తానుగానే ఒక టపాకాయల గోదాముగా మారారు. ఒక్కో చిచ్చును రాజేసే కొద్దీ ఆయన గొల్లున నవ్వడం పెరుగుతూ వచ్చింది. మొరార్జీ ఎప్పుడైనా నవ్వారేమోగానీ చూసినవారు లేరు. అలాగే రాజ్‌నారాయణ్ ఉల్లాసంగా లేకుండా స్తబ్ధుగా ఉండటాన్ని గమనించినవాళ్లు లేరు. రాజ్‌నారాయణ్ 1979 నాటికి చరణ్‌సింగ్‌కు మద్దతుగా నిలిచి, కాంగ్రెస్‌తో కుట్ర పన్ని జనతా ప్రభుత్వాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేశారు. రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి 1971లో ఇందిరాగాంధీ ఎన్నిక కావడాన్ని రాజ్‌నారాయణ్ పిటిషన్ వేసి సవాలు చేశారు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఆ ఎన్నికను కొట్టిపారేయడంతో ఆయన సుప్రసిద్ధు డ య్యారు. ఆ కేసులో రాజ్‌నారాయణ్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్...ఆమ్ ఆద్మీ నేత ప్రశాంత్‌భూషణ్ తండ్రి. అంతమాత్రాన ఇది రెండు పార్టీల మధ్య ప్రవర్తనాపరమైన అనుబందాన్ని రూఢిపరచజాలదు. కానీ ఆ అనుబంధానికి ఆధారాలు తమ కథను చెప్పడం ప్రారంభమైంది. అరవింద్ కేజ్రీవాల్, మొరార్జీలోని సత్ప్రవర్తనకు రాజ్‌నారాయణ్‌లోని బాధ్యతారహితమైన తొందరపాటు విన్యాసాలను జోడించాలని చూస్తున్నారు. ఆయన మంత్రులు వాస్తవికతతో సంబంధం కోల్పోయిన చపలచిత్తులుగా మారుతున్నారు. వారు రోజులో కొన్ని గంటలు మాత్రమే తమ శాఖలకు బాధ్యులుగా ఉంటూ మిగతా సమయంలో తమ అధికారులకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు. జనాకర్షక విధానం ఒక ప్రమాదకరమైన ప్రలోభం. అది, బిల్లులు చెల్లించ నిరాకరించినవారికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఫిర్యాదూ సమంజసమైనదేనని, ఎల్లప్పుడూ పోలీసులదే తప్పని, అధికారులు ఎప్పుడూ నైతికంగా దివాలా తీసినవారేనని భావించే నిఘా కార్యకర్త ప్రవర్తనకు దారి తీస్తుంది. ఉద్రేకపూరితమైన వాగాడంబరం మిమ్మల్ని ప్రమాదకర స్థాయిలలోని ఆగ్రహం అంచులకు తీసుకుపోతుంది. కేజ్రీవాల్ తన రాష్ట్ర పోలీసులకే వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు కూచుంటానని బెదిరిస్తుంటే ఇక అరాచకపు గందరగోళానికి వేదికలు ఇంకెక్కడా మిగలవు. ఢిల్లీ ఓటర్లు మార్పుకు ఓటేశారే గానీ అరాచకానికి కాదు. ఢిల్లీ పోలీసుల్లో పదుల సంఖ్యలో తప్పులున్నాయి. ఆ నగరంలో బతుకుతున్న వారిలో అత్యధికులకు అది ఏదో ఒక రూపంలో అనుభవైక వేద్యమవుతూనే ఉంది. అలా అని వారి స్థానంలో పార్టీ కార్యకర్తలు ఆ బాధ్యతలను నెరవేర్చగలరా? తేడాలను చూసే ప్రయత్నం ఏదైనా జరిగితే విపరీత పరిశుద్ధవాదులు ఆగ్రహిస్తారు. ఇదేమీ లెనినిస్టు విప్లవం కాదని, ప్రజాస్వామిక సవాలని మరచిపోతారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులనందరినీ తొలగించి పార్టీ క్యాడర్లతో నింపలేరు. నక్సలైట్లు కావడానికి తగిన ధైర్యంలేక ఆమ్ ఆద్మీ పార్టీ వీధి విప్లవవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీ వైఖరులను తెలివిగా ఎవరూ ఒక తార్కిక చట్రంలో ఉంచలేదు. కాబట్టి దాన్ని ప్రణాళిక అని ఎవరూ అనలేరు. కానీ ఆ పార్టీ వైఖరి మాత్రం ప్రభుత్వాధికార వ్యవస్థపైనా, ప్రైవేటు రంగంపైనా రాజకీయవర్గ అధికారాన్ని విస్తరింపజేసే వ్యవస్థ సామాజికీకరణ, జాతీయకరణ దిశగా సాగుతున్నాయి. మీ కంటే నేనే పవిత్రుడ్ని అనే ధోరణిని ఆ పార్టీ ఎంతగా ఒంట బట్టించుకుందంటే దాని మంత్రి ఒకరు తప్పు చేశారని న్యాయమూర్తి వెల్లడిస్తే... న్యాయ వ్యవ స్థదే తప్పయి తీరాలి. అంతేగానీ పార్టీ తప్పు కావడానికి వీల్లేదు. లెనిన్, మావోలూ అంగీకరిస్తారు. అధికారం ఒక బాధ్యత. చౌకగా విద్యుత్తును, నీటిని అందించడం ద్వారా మాత్రమే ఢిల్లీ బాధలనన్నిటినీ తీర్చేసి, జనాదరణను పొందగలిగేట్టయితే షీలా దీక్షిత్ ఆ పని ఎందుకు చేయలేదు? ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి నిర్మూలన ఆమ్ ఆద్మీ వద్ద ఇంకా మిగిలి ఉన్న పోత బంగారపు తురుపు ముక్క. అది తేలికేమీ కాదనేది స్పష్టమే. కాబట్టే దానికి సమయం పడుతుందని ప్రజలు కూడా అంగీక రిస్తారు. అయితే రాజకీయాల్లో కాలం అనంతమైనది కాదు. అధికారం కాలపరిమితికి లోబడి ఉంటుంది. మీరు కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉన్నారంటేనే ఆ కాలరేఖ మరింత చిన్నదై ఉంటుంది. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా తన వద్ద 300 పేజీల ఆధారాలున్నాయని కేజ్రీవాల్ అన్నారు. అందువల్లనే ఆయన అన్ని సీట్లు గెలవగలిగారు. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని చదవడానికి ఆయనకు సమయం ఉన్నదా? అని త్వరలోనే ఎవరైనా అడిగే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ కూడా జనతా పార్టీలాగే ముగిసిపోతే పట్టించుకోనవసరం లేదు. కాకపోతే అది మిగిల్చే నిరుత్సాహాన్ని మాత్రం పట్టించుకోవాల్సి ఉంటుంది.