నారాయణస్వామిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర శిబిరంలో మంగళవారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విలువల కోసం వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.
వైఎస్ అడుగుజాడల్లో జగన్ నడుస్తున్నారని, తిరిగి రాజన్న రాజ్యం రావడం ఖాయం అన్నారు. ఆనాడు ఎన్‌జీ రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ తరఫున తనతోపాటు 62 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, తర్వాత ఇందులో 61 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌లు పాల్గొన్నారు. నారాయణ స్వామి 1978 నుంచి 1983 వరకు టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆచార్య ఎన్‌జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నలకు ముఖ్య అనుచరుడు.
Comments
Please login to add a commentAdd a comment