శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిదేళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కొండంత భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయడమే కాకుండా.. తరతరాలుగా తంపర భూముల్లో చేపలవేట కొనసాగిస్తున్న కండ్ర, ఇతర మత్స్యకారుల జీవనోపాధి కోసం.. ఆ భూములు వారికే దక్కేలా చూస్తాననిహామీ ఇచ్చారు. పవర్‌ప్లాంట్ కోసం సేకరించిన భూములను తమకివ్వాలని కోరుతూ దాదాపు 10 వేల మంది కండ్ర సామాజికవర్గంవారు గత 3,051 రోజులుగా చేస్తున్న నిరాహారదీక్ష శిభిరాన్ని గురువారం ఆయన సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 326వ రోజు గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కొనసాగింది. కోటబొమ్మాళి శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మాళి, బోరభద్రక్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డితాండ్ర, దండుగోపాలపురం వరకూ సాగింది. పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. పలువర్గాల ప్రజలు తమ సమస్యలను జగన్‌కు చెప్పుకొని భరోసా పొందారు.
దీక్షా శిబిరంలో జగన్
వడ్డితాండ్ర వద్ద దీక్షలు చేస్తున్న పవర్‌ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవర్‌ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దుచేయాలని.. ఆ మేరకు 1108 జీవోను రద్దు చేయాలని, తంపర భూముల లీజులను పునరుద్ధరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని, ఆ భూముల్లో రొయ్యల కుండీలను తొలగించాలని, తిత్లీ తుపానులో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇళ్లు నిర్మించాలంటూ.. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు జగన్‌ను కోరారు. తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఇటీవల తమ దీక్షా శిబిరానికి వచ్చి జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. తంపర భూముల్లో ఆరువేల మంది సంప్రదాయ మత్స్యకారులు పొట్టపోసుకుంటున్నారని తెలిపారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని, 2011 ఫిబ్రవరి 28న కాకరాపల్లి వద్ద జరిగిన కాల్పుల్లో మృతిచెందిన మూడు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తంపర భూములు సంప్రదాయ మత్స్యకారులకు దక్కేలా చూస్తానని, తిత్లీ తుపానులో దెబ్బతిన్న ఇళ్ల స్థానే కొత్తవి కట్టిస్తామని భరోసా ఇచ్చారు.
వేట నిషేధంలో రూ.10 వేలు సాయం..
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని మత్స్యకారులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. సంతబొమ్మాళి సమీపంలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకార ప్రతినిధులు వీరుపల్లి రాజశేఖర్, మైలపల్లి జగదీశ్వరరావు, సూరాడ జోగారావు, బి,రాధ, లక్ష్మి తదితరులు జగన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. మత్స్యకారులకు ఎస్టీ హోదా కల్పించాలని, వలసల నివారణకు జెట్టీలు నిర్మించాలని, మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై జగన్ స్పందిస్తూ కార్పొరేషన్ ఏర్పాటుచేయడమే కాకుండా ప్రతి కుటుంబంలో 45 ఏళ్లు దాటిన ఆడపడుచులకు వైఎస్సార్ చేయూత కింద రూ.75 వేలు వంతున ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారికి తక్షణ సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పొట్టచేతపట్టుకుని వలసలు పోతున్న మత్స్యకార యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలనే సంకల్పంతోనే ఇప్పుడున్న పరిశ్రమలతో పాటు.. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో సైతం 75శాతం స్థానిక రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఇందుకోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టాన్ని తెచ్చి.. ఉద్యోగాలిచ్చి వలసలను నివారిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వేటకు వెళ్లి సముద్రంలో మరణించిన 189 మందికి ఈ సర్కార్ ఇంతవరకు ఎటువంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని మత్స్యకార సంఘం నేతలు జగన్ దృష్టికి తెచ్చారు. ఎస్టీ హోదా కల్పించే విషయమై కేంద్రానికి సిఫార్సు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
మంత్రి అరాచకాలు మితిమీరాయి..
మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆయన వర్గీయుల అరాచకాలు మితిమీరాయని నిమ్మాడ వాసులు అనేక మంది వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట కాదన్న వారిని సామాజికంగా వెలివేస్తున్నారని వాపోయారు. ఒకప్పుడు ఎర్రన్నాయుడుకి ఈ గ్రామంలో 12 ఎకరాలు భూమి ఉండేదని, ఈవేళ ఎంత భూమి ఉందో లెక్కేలేదని ఆ ప్రాంతవాసులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి భూముల మధ్యలో ఒక రైతుకున్న ఒకటిన్నర ఎకరం భూమిని సాగు చేసుకోనివ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని, ఆ రైతుకు తెలియకుండానే ఆ భూమిని సెల్ టవర్‌ల నిర్మాణానికిచ్చి అద్దె కూడా మంత్రే కాజేస్తున్నారని చెప్పారు. సుమారు 22 కుటుంబాలపై అనాగరిక వెలి కొనసాగుతోందన్నారు. వీటిపై మంత్రిని, ఆయన అనుచరులను ప్రశ్నిస్తే.. భౌతిక దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ పాలనలో అంతా దగా
తిత్లీ తుపాను వచ్చి నెల దాటినా ఇంతవరకు పరిహారం అందలేదని వివిధ గ్రామాల ప్రజలు జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను నష్టపరిహారం అంచనాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అభిమానులమని నర్సాపురంలో 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న రేషన్‌షాపు లైసెన్సును టీడీపీ నాయకులు రద్దు చేయించారని బడే రాజేశ్వరి, పింఛన్‌లు తీసేస్తున్నారని అదే గ్రామానికి చెందిన నీలమ్మ, తమ ప్రాంతానికి రోడ్లు వేయడం లేదని, జన్మభూమి కమిటీల ఆగడాలు మితిమీరాయని ఉద్దండవానిపాలేనికి చెందిన చింతాడ రమణమ్మ, పాదయాత్రలో పాల్గొంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని పాలతలగాం గ్రామానికి చెందిన నారాయణమ్మ.. బావనపాడు పోర్టు పేరుతో ఊళ్లకు ఊళ్లే ఖాళీచేయించి వేలాది ఎకరాలను బలవంతంగా సేకరిస్తున్నారని బుడ్డా మోహనరెడ్డి, పోర్టుతో ఉపాధి అవకాశాలు అపారమని మభ్యపెట్టి పచ్చని పంట పొలాలు సేకరిస్తున్నారని పలువురు రైతులు.. ఇలా దారిపొడవునా గ్రామగ్రామానా ఎందరెందరో.. టీడీపీ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు.
పోర్టు పేరుతో ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేయిస్తున్నారన్నా..
భావనపాడు పోర్టు పేరుతో పలు గ్రామాలను ఏకంగా ఖాళీ చేయించి.. వేలాది ఎకరాలను బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నా.. పోర్టు నిర్మించి.. ఉపాధి కల్పిస్తామని మభ్యపెడుతూ ఇష్టారాజ్యంగా వేలాది ఎకరాలు సేకరిస్తున్నారు. దీంతో పచ్చని పంటపొలాలను కోల్పోతున్నాం. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఐదు పంచాయితీల పరిధిలో ఏడువేల కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలున్నా.. అవసరానికి మించి 5,700 ఎకరాలు అవసరమంటూ ఇబ్బందులు పెడుతున్నారు.
– బుడ్డా మోహనరెడ్డి, భావనపాడు
పాదయాత్రకు వెళ్తే.. సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ బెదిరించారు..
అయ్యా.. మీ పాదయాత్రలో పాల్గొనవద్దంటూ టీడీపీ నేతలు మా గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నారు. యాత్రకి వెళితే పింఛన్లు, సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు తిత్లీ తుపాను నష్ట పరిహారం ఇవ్వడం లేదు. ఇళ్లు కూలిపోయి నరకం చూస్తున్న వృద్ధులపై కూడా కనికరం చూపడం లేదన్నా.. న్యాయం జరిగేలా చూడండి..
–కవిత, నారాయణమ్మ, సాగిపిల్లి రవణమ్మ, పాలతలగాం
శిష్టకరణాలను ఓబీసీలో చే ర్చేందుకు కృషిచేయరూ
శిష్టకరణాలను ఓబీసీల్లో చేర్చాలి. మీ నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మా కులాన్ని ఓసీ కేటగిరి నుంచి బీసీల్లో చేర్చారు. మీరు సీఎం అయ్యాక ఓబీసీల్లోకి చేర్చాలి.
–శిష్టకరణాల సంఘం నేతలు సదాశివుని కృష్ణ, డబ్బీరు భవనీశంకర్, రఘుపాత్రుని చిరంజీవి, పెదపెంకి శ్రీరామ్‌కుమార్, ఆర్‌ఆర్ మూర్తి
ప్రజా సంకల్ప యాత్ర 326వ రోజు
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,494.1 కిలో మీటర్లు
326వరోజు నడిచిన దూరం
7.2 కిలో మీటర్లు
ప్రారంభం: ఉ. 7.30 గంటలకు దుర్గమ్మపేట
ముగింపు: సా. 5 గంటలకు
దండుగోపాలపురం
ముఖ్యాంశాలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం దుర్గమ్మపేట, సంతబొమ్మాళి మండలంలోని లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మాళి, బోరుబద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డితాండ్ర కూడలి, దండుగోపాలపురం గ్రామాల ప్రజలతో మమేకం.
నేటి పాదయాత్ర షెడ్యూల్
ప్రారంభం: ఉ. 7.30 గంటలకు దండుగోపాలపురం
ముఖ్యాంశాలు
టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం, కాశిపురం, దామోదరపురంక్రాస్ గ్రామాల ప్రజలతో మమేకం.
Comments
Please login to add a commentAdd a comment