∙దాల్ సరస్సులో తేలియాడుతున్న చెత్తను తొలగిస్తున్న జన్నత్
జమ్మూకశ్మీర్ పర్యటనలో శ్రీనగర్‌లోని దాల్ లేక్ విహారం ఓ మధురానుభూతి. దాల్ లేక్‌లో శికార్ రైడ్ చేసి ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకునే వాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆ ఫొటోలకు వస్తున్న లైక్‌లకూ లెక్కే ఉండటం లేదు. ఫొటో తీసుకుని, లైక్ చూసుకుని మురిసిపోతే చాలా? సరస్సు శుభ్రంగా ఉండొద్దా? అనుకుందో ఐదేళ్ల పాపాయి. తండ్రితోపాటు పడవ ఎక్కి పొడవాటి కర్రకు వల కట్టి సరస్సులో తేలుతున్న ఖాళీ కూల్‌డ్రింక్ బాటిళ్లు, స్నాక్స్ తిని పారేసిన అల్యూమినియం రేపర్లు, పాలిథిన్ కవర్లు... ఒకటేమిటి పర్యాటక ప్రియులు బాధ్యతారహితంగా సరస్సులోకి విసిరేసిన చెత్తను అందిన వరకు పడవలోకి చేర్చింది. ఒడ్డుకు కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోయిన చెత్తను మడమల వరకు కూరుకుపోతున్న బురదలో దిగి మరీ ఏరి పారేసింది. ఆ తర్వాత పెద్దవాళ్లందరికీ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. నిజానికి ఆ పాపాయి ఇచ్చిన సందేశం పిల్లలకే. కానీ పెద్దవాళ్లకూ అందే సందేశం.
‘‘ఫ్రెండ్స్! దాల్ సరస్సు చాలా అందమైన సరస్సు. చెత్త లేకపోతే ఇంకా అందంగా ఉంటుంది. అందుకే మన సరస్సును మనం శుభ్రంగా ఉంచుకుందాం. మీరు కూడా మీ పడవల్లో వచ్చి దాల్ సరస్సులో చేరుతున్న చెత్త తొలగించండి. మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి’’ అని చెప్పింది. ఇదంతా ఆమె తండ్రి స్మార్ట్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది దేశాన్ని చుట్టే లోపే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిలో పడింది. స్వచ్ఛభారత్‌కు ఓ బుల్లి అంబాసిడర్ దొరికిందని మురిసిపోయారు. ‘ఈ పాపాయి మన సూర్యోదయాలను మరింత అందంగా మారుస్తోంది. స్వచ్ఛత మీద ఆమెకున్న అభిరుచి చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.
ఇంతకీ ఈ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పేరేంటో తెలుసా? జన్నత్... అంటే స్వర్గం. కశ్మీర్ భూతల స్వర్గం అంటారు. అలాంటి స్వర్గంలో పుట్టిన తన బిడ్డ అంతకంటే అపురూపమైన స్వర్గాన్ని ఆవిష్కరించాలని ఆ తండ్రి ఆమె పుట్టినప్పుడే అనుకున్నాడేమో! ఆమెకు అంత స్వచ్ఛమైన ఆలోచన రావడానికి ఆ పేరు కూడా కారణమేనేమో!ఆమె పేరు కారణం అయినా కాకపోయినా జన్నత్ సందేశాన్ని మాత్రం అందరం పాటించాల్సిందే. మనం ఒక సమస్యను సృష్టించడంలో భాగస్వాములం కావద్దు, పరిష్కారం వెతకడంలో భాగస్వాములవుదాం.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment