Manjeera Project
-
గుంతలో మొసలి.. జడుసుకున్న కూలీలు!
మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో షెడ్డు నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలోకి మొసలి వచ్చింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. బిల్కల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫాంహౌస్ ఉంది. అందులో షెడ్డు నిర్మాణం కోసం కూలీలు పిల్లర్ గుంతలు తీస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 కిలోల బరువున్న మొసలి ఉదయం ఓ పిల్లర్ గుంతలో కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫారెస్టు అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లర్ గుంతలో ఉన్న మొసలిని పైకి తీసి తాళ్లతో బంధించారు. బంట్వారం ఫారెస్టు సెక్షన్ అధికారి ఫరీద్ ఆధ్వర్యంలో మొసలిని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టుకు తరలించి అందులో వదిలేశారు. బిల్కల్ గ్రామ సమీపంలోని మిలిగిరిపేట్ చెరువులోంచి మొసళ్లు వస్తున్నాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫారెస్టు అధికారులు మొసళ్లను బంధించి ప్రాజెక్టులో వదిలేశారని పేర్కొన్నారు. మొసళ్లు గ్రామాల్లోకి రాకుండా మిలిగిరిపేట్ చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి -
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : ఉత్తమ్
సాక్షి, సంగారెడ్డి: ప్రజల పక్షాన, రైతుల సమస్యలపై పోరాటం చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టు సంద ర్శనకు వస్తున్న ఆయనను పటాన్చెరు సమీపం లోని టోల్గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి బీడీఎల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేసిన అనంతరం స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంద ర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. విపక్షాలు ప్రజల పక్షాన పోరాటం చేసే క్రమంలో బయటకు వెళ్తే చాలు.. అక్రమంగా, అవమాన కరంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రతిపక్ష పార్టీ నేతగా, టీపీసీసీ అధ్యక్షుడిగా, ఓ ఎంపీగా ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్తే అరె స్టులు చేస్తారా?’అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ పది మందిమి.. ఎండిపోయిన మంజీరా డ్యామ్ సందర్శనకు స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా సింగూరు, మంజీరలను నింపు తామన్న కేసీఆర్ హామీ ఏమైందని అన్నారు. కొండ పోచమ్మ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు వెళుతు న్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ తప్ప మిగతా ప్రాంతాల్లో సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నా రు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను సందర్శిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి సరికాదన్నారు. కల్వకుంట్ల సైన్యంలా పోలీసులు.. పోలీసుల తీరుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే అరెస్టులు చేస్తారా అని ధ్వజమెత్తారు. ‘డీజీపీని ప్రశ్నిస్తున్నా.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? కేసీఆర్ పదివేల మందితో కలసి కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎలాంటి ఆంక్షలు ఉండవు.. అదే మేము పది మందితో కలసి ప్రాజెక్టులు సందర్శిస్తే అడ్డుకుంటారా’అని మండిపడ్డారు. హోం మినిస్ట్రీ నోటిఫికేషన్ ప్రకారం అరెస్టులు చేస్తున్నామని డీజీపీ చెబుతున్నారని, వేలాది మందితో ప్రారంభోత్సవాలు, వ్యవసాయ సభలు పెడుతున్న కేసీఆర్‌కు, ఆయన అనుచరులకు ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. దేశంలోనే తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఈ కార్యక్రమంలో సంగా రెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి), కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఉత్తమ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు పెట్టారు. -
సీఎం కేసీఆర్ మాట తప్పారు
-
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. సీఎం ఈనెల 11, 12, 13, 14 తేదీలలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మంగళవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల శివారులో ఉన్న మంజీర నదిపైన రూ. 476.2 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే.. ఈ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పట్టణం నుంచి బస్సు ద్వారా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ మార్గాన్ని కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, హరితహారం మొక్కలు నాటడం, వాటి చుట్టూ ట్రీగార్డుల ఏర్పాటు పనులపై అధికారులకు సూచనలిచ్చారు. వారి వెంట బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో పర్బన్న, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్, కోమలంచ సర్పంచ్ అనురాధ, ఎంపీటీసీ బండారు లక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఎడారిలా మంజీరా
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ నదులు ప్రాజెక్టులు నిండుతున్నాయి. కానీ మంజీరా నది మాత్రం నీరు లేక బోసిపోతోంది. నది గర్భం ఎడారిని తలపిస్తోంది. పరీవాహక ప్రాంతంలోని బోర్లన్నీ వట్టిపోయాయి. లక్షల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు ఉత్తగానే ఉన్నాయి. వందలాది ఎకరాల సాగు భూమి బీడుగా మారింది. వ్యవసాయమే జీవనాధారమైన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పరీవాహక ప్రాంత రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాక్షి, టేక్మాల్/ మెదక్: మండలంలోని కుసంగి, దనూర, ఎలకుర్తి, శేర్పల్లి, ఎలకుర్తి, లక్ష్మణ్‌తండా, చంద్రుతండా, అచ్చన్నపల్లి తదితర గ్రామాలు మంజీర నది పరివాహక గ్రామాలు. నదిని ఆధారంగా చేసుకొనిఒక్కో గ్రామంలో సుమారు 1200 ఎకరాలకు పైగా వరి సాగు చేసేవారు. ఎత్తిపోతల పథకాలతో నిండిన చెరువులు, కుంటలను ఆసరా చేసుకొని పంటలు సాగు చేసుకున్నారు. ఒక్కో రైతు 20 నుంచి 30 ఎకరాల వరకు కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవారు. అయితే గతేడాదికి ఇప్పటికి పరిస్థితి తారుమారైంది. అయితే నదీ పరివాహక ప్రాంత సాగు భూములన్నీ బీడు భూములను తలపిస్తున్నాయి. పిచ్చిమొక్కలు మొలిచి వెక్కిరిస్తున్నాయి. కొంతమంది రైతులు ఆశతో పత్తి పంటను సాగు చేసినా ఎదుగదల తగ్గి పెట్టుబడి అధికమవుతుందని రైతులు వాపోతున్నారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో సింగూరు వెలవెలబోయింది. మంజీరలో చుక్క నీరులేక ఇసుకదిబ్బలు తేలాయి. లక్షల వ్యయంతో కోరంపల్లి, అచ్చన్నపల్లి శివారుల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు వృథాగా మారి దయనీయ స్థితికి చేరుకున్నాయి. రైతులకు నిరాశే.. గత పదిహేను రోజుల క్రితం కురిసిన కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మంజీర నది జలజలా పారుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. చిటపట చినుకులకు ఖరీఫ్‌లో వేసిన పంటలకు తాత్కాలిక ఊరట లభిస్తున్నా, భవిష్యత్తు నీటి అవసరాల విషయంలో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయె రోజుల్లో అయినా గట్టి వర్షాలు కురవకుంటే తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నా చిరుజల్లులతో సరిపెడుతున్నాయి. ఇప్పటికిప్పుడే ప్రమాద ఘంటికలు లేకున్నా, ఖరీఫ్ చివరి దశలో, రబీలో పంటల సాగుకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే మంచినీటి కొరతతో రోజువిడిచి రోజు పద్ధతి, మరికొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని నెలల్లో మంచినీటి కొరత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు సాగు, తాగునీటిని అందించాలని వేడుకుంటున్నారు. 25 ఎకరాలు సాగు చేసేటోన్ని.. సమృద్ధిగా వర్షాలు కురిస్తే కౌలుకు 25 ఎకరాలు తీసుకొని వరి సాగు చేసేవాన్ని. సరిపడా నీరు లేనందున కేవలం రెండెకరాల్లో మాత్రమే పంట వేశాను. ఆశలన్నీ ఈ పంటపైనే.. నేటికీ మంజీరా నదిలో చుక్క నీరు లేదు. పంటలు పండకపోతే వలసే గతి. – యాదయ్య, రైతు, కోరంపల్లివృథాగానే ఎత్తిపోతల రెండెళ్ల క్రితం మా ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చాలా సంబరపడ్డాం. ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకొని రెండు పంటలు వేసుకోవచ్చు అనుకున్నాం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కడా చుక్క నీరులేదు. ఎత్తిపోతలు నిర్మించినా ఉత్తగనే ఉన్నాయి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – సర్దార్‌నాయక్, చంద్రుతండా -
‘మంజీర’కు కొత్త లైన్లు!
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీటినిసరఫరా చేసేందుకు సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి తాగునీటి పైపులైన్లు వేశారు. పైపులు శిథిలావస్థకు చేరుకుంటుం డడంతో లీకేజీల మూలంగాతాగునీరు వృథాగా పోతోంది. పాత పైపులైన్ల స్థానంలో రూ.30 కోట్లతో కొత్త లైన్లువేయాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు ప్రతిపాదనలుసమర్పించింది. మున్సిపల్ విభాగం నుంచి అధికారిక ఉత్తర్వు ్డలు వెలువడిన వెంటనే పనులు చేపట్టేందుకు మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంజీర జలాశయంలో నీరు అడుగంటిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా నిలిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మంజీర నది నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు సుమారు నాలు గు దశాబ్దాల క్రితం పైపులైన్లు వేశారు. వీటి నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు చూస్తోంది. ప్రస్తుతం మంజీర ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లోని 3.22లక్షల జనాభాకు తాగునీరు అందుతోంది. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. లీకేజీల మూలంగా జనావాసాలకు నీటి సరఫరా ఆలస్యం కావడం, తక్కువ మొత్తంలో నీటి సరఫరా జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు పటాన్చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పైపులైన్ల మీదుగా రోడ్లు వేయగా, పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో రోడ్లు కుంగే ప్రమాదం ఉందని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకుంటున్న పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాలని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.30 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, పురపాలక శాఖ నుంచి అధికారిక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వెలువడిన రెండు మూడు వారాల వ్యవధిలోనే 900 మి.మీ వ్యాసం కలిగిన పైపులైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల రోడ్లను తవ్వాల్సి ఉండడం, ట్రాఫిక్‌ను దారి మళ్లించాల్సి రావడంతో అనుమతి కోసం ఇప్పటికే వాటర్ వర్క్స్ బోర్డు జీహెచ్ఎంసీకి లేఖ రాసింది. ఆరు నెలల్లో పైపులైను పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రస్తుతమున్న విధానంలోనే తాగునీటిని సరఫరా చేస్తారు. ఎడారిని తలపిస్తున్న ‘మంజీర’ మంజీర , సింగూరు జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేందుకు నాలుగు దశల్లో పైపులైన్లు నిర్మించారు. సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి ఫేజ్–1, ఫేజ్–2లో పైపులైన్లు వేశారు. తర్వాతి కాలంలో మంజీర జలాలకు డిమాండ్ పెరగడంతో సింగూరు జలాశయం నుంచి ఫేజ్–3, ఫేజ్–4 పేరిట మరో రెండు పైపులైన్లు నిర్మించారు. వర్షాభావంతో సింగూరు, మంజీర జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఫేజ్ 1, 2 ద్వారా 150 ఎంఎల్డీ, ఫేజ్ 3, 4 ద్వారా 860 ఎంఎల్డీ నీరు ప్రతీ రోజూ హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. 29.91 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న సింగూరు జలాశయంలో ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. 1990 ఫిబ్రవరి నాటి జీఓఎంఎస్ 93 ప్రకారం సింగూరు జలాశయంలో కనీసం 518 అడుగుల మేర నీరుంటేనే హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 512 అడుగులకు నీటి మట్టం పడిపోయినా, మంజీర పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఏప్రిల్ నాటికి మంజీర జలాశయం పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉండడంతో ఒకటి రెండు రోజుల్లో మంజీర ఫేజ్–1, ఫేజ్–2 ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఘనపురం పరవళ్లు
పాపన్నపేట(మెదక్): బీళ్లు వారిన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూరు నుంచి మంగళవారం విడుదల చేసిన 1.6 టీఎంసీల నీరు వరదై పోటెత్తింది. మంజీర బ్యారేజి నుంచి 2 గేట్లు ఎత్తి వదిలిన నీరు 9,800 క్యూసెక్కుల పరిమాణంలో పరుగులు తీస్తోంది. ఎడారిలా మారిన మంజీర గర్భాన్ని తడుపుకుంటూ.. మార్గం మ«ధ్యలో చిన్న చిన్న మడుగులు నింపుకుంటూ.. గురువారం రాత్రికి ఘనపురం ప్రాజెక్టులోకి ప్రవేశించాయి. దీంతో ఘనపురం ఆనకట్ట కింద.. మంజీర తీరం వెంట వేసిన వరి పంటకు ప్రాణం పోసినట్లయింది. ఇక ఘనపురం ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాల పంటలు గట్టెక్కినట్లేనని రైతన్నలు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రైతన్నల ఆశలకతీతంగా సింగూరు నుంచి విడిచిన 1.6 టీఎంసీల నీటితో ఘనపురం ప్రాజెక్టు కింద వేసిన పంటలతో పాటు, నిజాంసాగర్ ఆయకట్టుకు కూడా ప్రయోజనం కలగనుంది. సుమారు టీఎంసీ నీరు దిగువన ఉన్న నిజాంసాగర్‌కు చేరనుంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన వర్షాలు కురువలేదు. అయినా ఆశ చావని రైతన్నలు జూన్ నెలలోనే మంజీర మడుగుల్లో నిలవ ఉన్న నీటిని.. బోరుబావుల ఊటలను నమ్ముకొని 18 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. కింది పొలాలను దృష్టిలో ఉంచుకొని.. సింగూరు ఎగువన సైతం వర్షాలు పడక పోవడంతో సింగూరు నిండలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.17 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో మిషన్ భగీరథకే 6 టీఎంసీల నీరు అవసరం కానుంది. దీంతో సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా విడుదల కాలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 3 వేల ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందదర్‌రెడ్డి అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారు. సాధారణంగా అయితే ఘనపురం ప్రాజెక్టుకు ప్రస్తుత తరుణంలో 0.4 టీఎంసీలు సరిపోతాయని అంచనా. అయినప్పటికీ ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను, నిజాంసాగర్ ఆయకట్టు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ 1.6 టీఎంసీల నీటి విడుదల కోసం జీఓ విడుదల చేశారు. విడుదల చేసిన నీరు, రెండు రోజుల పాటు, ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగి పొర్లనుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరదలు ఉదృతంగా ఉండే అవకాశం ఉన్నందున నది వైపు ఎవరూ వెళ్లొద్దని ఇరిగేషన్ ఈఈ యేసయ్య సూచించారు. -
బొట్టు బొట్టు కూడబెట్టు!
‘‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’’ అంటాడు ఓ సినిమాలో హీరో. ‘‘నీటి చుక్కే కదా అని వృథా చేస్తే.. గుక్కెడు నీళ్లు కూడా దొరకని గడ్డు కాలం వస్తుందని’’ హెచ్చరిస్తోంది గర్విత. ఈ అమ్మాయి సినిమా హీరోయిన్ కాదు. నీరు ఎంత విలువైనదో చెప్పడానికి ఒక ఉద్యమమే నడుపుతోన్న వాటర్ వారియర్! భోజనానికి కూర్చుంటాం, పక్కనే గ్లాసు నిండా నీటిని పెట్టుకుంటాం. తాగినన్ని తాగి మిగిలిన వాటిని వదిలేస్తాం. హోటళ్లలో అయితే ఇది మరీ ఎక్కువ. భోజనానికి ముందే నీటిని పెడతారు, భోజనం చేస్తున్నంత సేపు వెయిటర్లు గ్లాసు నింపుతూనే ఉంటారు. భోజనం చివరికి వచ్చిన తర్వాత కూడా గ్లాసు సగానికి తగ్గితే వెంటనే నింపేస్తుంటారు. ఇది వాళ్లకు ఆదేశించిన ఉద్యోగ నియమావళి. కస్టమర్లు తాగినన్ని తాగి మిగిలినవి వదిలేస్తారు సహజంగానే. అయితే కేవలం ఈ ఒక్క కారణంగానే ఏడాదికి రెస్టారెంట్లో 14 మిలియన్ లీటర్ల నీరు వృథా అవుతోంది. మొదట ఎవరూ వినలేదు ఇక ఇళ్లలో మంచి నీటిని ఒక బిందెలో పట్టుకుంటాం. ఆ రోజు వాడినన్ని వాడి మరుసటి రోజు ఉదయం వాటిని పారబోసి బిందె కడిగి తాజా నీటిని పట్టుకుంటాం. అలా పారబోసేటప్పుడు కనీసం ఆ నీటిని మరో బకెట్లోకి మార్చుకుని ఇతర అవసరాలకు వాడుకోవడం కొంతమంది మాత్రమే చేస్తారు. చాలామంది నీటిని వృథా చేస్తున్నామనే స్పృహ ఏ మాత్రం లేకుండా ‘నీళ్లే కదా’ అన్నంత ఈజీగా పారబోసేస్తారు. ఈ పారబోతకు ఇంకా ఎవరూ లెక్కకట్టలేదు. అయితే రెస్టారెంట్లలో వృథా అయ్యే నీటి మీద బెంగళూరు అమ్మాయి గర్విత ‘వై వేస్ట్’ అంటూ ఒక ఉద్యమాన్ని లేవదీసింది. బెంగళూరులోని రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లి నీటిని వృథా చేయవద్దని చెప్పి చూసింది. ‘నీరు అత్యంత విలువైన వనరు, దానిని పొదుపుగా వాడుకోవాలి’ అని వారి మైండ్‌కి ఎక్కించే ప్రయత్నం చేసింది. అయితే నీటి పరిరక్షణ అనే సామాజిక బాధ్యత నిర్వర్తించడం కంటే తమ వ్యాపారాన్ని పరిరక్షించుకోవడమే తమకు ముఖ్యం అని ఆ రెస్టారెంట్లు చెప్పకనే చెప్పేశాయి. దాంతో ఆమె తన ఉద్యమాన్ని ‘చేంజ్ డాట్ ఓఆర్జీ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇదే భావసారూప్యం కలిగిన వారితో పంచుకుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి వెయ్యి మంది ఆన్లైన్లో తోడయ్యారు. వారంతా 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు వారే. అలాగని పట్టు వదల్లేదు ఆన్లైన్ మిత్రులు ఇచ్చిన నైతిక మద్దతులో గర్విత తన ఉద్యమాన్ని కొనసాగించింది. రెస్టారెంట్లకు వెళ్లి మళ్లీ చెప్పి చూసింది. వెళ్లిన రెస్టారెంట్‌కే మళ్లీ మళ్లీ వెళ్లేది. తానొక్కతే ఎంత చెప్పినా కంఠశోష తప్ప విన్న వాళ్లలో చలనం కనిపించట్లేదని తన స్నేహితులను కలుపుకుంది. అలా రెండేళ్లు నగరమంతా పర్యటించింది. ఆడపిల్లలు అదే పనిగా చెప్తుండటం, ‘ఒక్కసారి ట్రై చేయండి అంకుల్’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో క్రమంగా కొందరిలో ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆలోచన రేకెత్తింది. 2015లో మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఒక గాడిన పడటానికి రెండేళ్లు పట్టిందని చెబుతోంది గర్విత. ఈ రెండేళ్లలో ఆమె స్కూలు దాటి కాలేజ్కొచ్చింది. పరీక్షలు, ఎంట్రన్స్ టెస్ట్‌ల సమయంలో కొంత విరామం తీసుకుంటూ, అవి పూర్తి కాగానే మళ్లీ ‘వై వేస్ట్’ నినాదాన్ని బయటకు తీస్తున్నారీ అమ్మాయిలు. ఇంట్లో కూడా పాటించాలి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సామాజికోద్యమా లను నిర్వహిస్తున్న 60 మందిని ‘గ్లోబల్ చేంజ్ మేకర్స్’ అవార్డుతో సత్కరించింది చేంజ్ డాట్ ఓఆర్జీ. స్విట్జర్లాండ్, జ్యూరిక్‌లో గడచిన ఆగస్టు నెలలో 12 నుంచి 18 వరకు జరిగిన వర్క్‌షాప్‌లో ఈ అరవై మందిని సత్కరించారు. వారిలో ఇండియా అమ్మాయి గర్విత ఒక్కరే. పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నట్లు రాబోయే తరాలు నీటి యుద్ధాలు చేయకుండా, భూమి పొరల్లో నీటిని నాలుగు కాలాలపాటు పరిరక్షించుకోవాలంటే.. రెస్టారెంట్లే కాదు, ఇళ్లలో కూడా నీటిని నీళ్లే కదా అని పారబోయకుండా జాగ్రత్తగా వాడటం అలవరచుకోవాలి. రెస్టారెంట్లలో మార్పు వచ్చింది! గర్విత చేపట్టిన ఉద్యమ ప్రభావంతో చాలా రెస్టారెంట్లు గ్లాసు సైజు తగ్గించాయి. కొన్ని రెస్టారెంట్లు కస్టమర్ రాగానే గ్లాసు నిండా నీటిని పెట్టకుండా అరగ్లాసు నీటినే పెట్టడం, భోజనం చేస్తున్నప్పుడు కూడా గ్లాసును సగం వరకే నింపడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కస్టమర్‌కి చిరాకు కలగకుండా ఉండటానికి అందుబాటులో జగ్ని ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు బెంగళూరులో ముప్పై రెస్టారెంట్లు ‘వై వేస్ట్’ ఉద్యమంలో భాగమయ్యాయి. నీటి వినియోగం గణనీయంగా తగ్గిందని, వేలాది లీటర్ల తేడా వచ్చిందని చెబుతున్నాయి ఆ రెస్టారెంట్లు. అంతకు ముందు ఈ అమ్మాయిలను ‘మీకు టైమ్ వేస్ట్ తప్ప, ఈ ప్రచారంతో మీరు సాధించేదేమిటి’ అన్న రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ఇప్పుడు ‘మంచి పని చేస్తున్నారు’ అంటూ గర్విత బృందాన్ని ప్రశంసిస్తున్నారు. – మంజీర -
సాయం చేయబోతే...
‘‘సస్పెన్స్, ప్రేమ అంశాలను మేళవిస్తూ నిర్మించిన ‘అలా జరిగింది’ చిత్రం పాటలు బాగున్నాయి. ‘అలా మొదలైంది’ సినిమాలాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి. ఇలాంటి చిన్న సినిమాలు హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ అన్నారు. మహేశ్ కుమార్, మంజీర జంటగా వెల్లంకి దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.రవికుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అలా జరిగింది’. ఈ చిత్రం టీజర్‌ని సాయివెంకట్ రిలీజ్ చేయగా, పాటలను చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. అనసూయాదేవి రిలీజ్ చేశారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్, ట్విస్ట్‌లతో ఆసక్తిగా సాగుతుంది. సాయం చేయబోయిన హీరో ఒక ఆరోపణకు గురవుతాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అతను ఏం చేశాడన్నదే కథ. ఈ నెల 22న సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రవికుమార్ రెడ్డి, అనసూయాదేవి. -
కన్నుల పండుగగా మంజీరా మహా కుంభమేళ
-
తెలుసుకో మిస్టర్!
భార్యకు గౌరవం... భర్త ఇవ్వక్కర్లేదు ఒకరు ఇవ్వాలనుకుని ఇస్తే వచ్చేది కాదు గౌరవం గౌరవం మనసులో ఉంటే అది మాటలో వినిపిస్తుంది ఎక్కడైతే గౌరవం ఉండదో...అక్కడ ప్రేమ లేమి ఉన్నట్లే మరి భార్యను గౌరవించకపోతే... ఆ భార్య ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? విడిపోకుండా ఉండడానికి... మార్గం ఏదన్నా ఉందా? ఉంది! ‘‘ఏంటీ! పంటి నొప్పా. రోజూ ఏదో ఒక న్యూసెన్స్’’ విసుక్కుంటూ, భార్య మీద ధుమధుమలాడుతూ హాస్పిటల్‌కి వెళ్లి పోయాడు డాక్టర్ రాజేశ్. భార్య పడుతున్న బాధకు భర్తగా హృదయంతో స్పందించలేదు, పోనీ ఒక డాక్టర్‌గా కూడా రెస్పాండ్ కాలేదతడు. మౌనంగా బాధను అదిమి పెట్టింది స్వప్న పంటిబాధతోపాటు మనసు బాధను కూడా. ఇలాంటి మనిషి కోసమా డాక్టర్‌గా తన కెరీర్‌ను వదులుకున్నది. రాజేశ్ పీజీ చేస్తానంటే తాను ఉద్యోగం చేస్తూ అతడిని చదివించింది. ఆ సంగతులేవీ గుర్తులేవు కాబోలు. పిల్లల కోసం తాను కెరీర్‌కి దూరమైంది. ఇవేవీ అతడికి పట్టడమే లేదు. రాజేశ్ వెళ్లి పోయిన తర్వాత మెల్లగా లేచి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది స్వప్న. పిల్లలకు స్కూలు వదిలేలోపు పన్ను తీయించుకుని, వాళ్లను స్కూలు నుంచి ఇంటికి తీసుకురావాలి. అందుకే ఆమె భోజనం కూడా చేయకుండా కదిలింది. ‘రూట్ కెనాల్ చేయాలి’ అన్నాడు పంటిని పరీక్షించిన డెంటిస్ట్. ‘పన్ను తీసేయండి’ అన్నది స్వప్న నిర్లిప్తంగా. డెంటిస్ట్ తలెత్తి ఆమెను చూశాడు, తాను విన్నది నిజమేనా అన్నట్లు. మెల్లగా ‘పన్ను తీయాల్సిన అవసరం లేదు’ రూట్‌కెనాల్ చేసి క్యాప్ వేసి పంటిని కాపాడుకోవచ్చు’ వివరించాడు. ‘పన్ను తీసేయండి డాక్టర్’ అన్నది స్వప్న. మరో మాటకు తావులేదన్నట్లు. ‘మీరు చెప్పిన ట్రీట్మెంట్కి కావలసినంత డబ్బు నా భర్త ఇవ్వడు’ అని చెప్పలేక. ‘నేనూ డాక్టర్నే, నాకూ తెలుసు’ అని చెప్పుకోలేక. కుటుంబం కోసం చేజేతులా తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌ని జారవిడుచుకుంది. ఆ త్యాగమే ఇప్పుడు తనను చూసి నవ్వుతోంది. ‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పన్ను ఠాప్ మని విరిగిన శబ్దం. తీసిన పంటిని ట్రేలో పెట్టి, ఖాళీలో దూదిని నింపి దవడను పైకి అదుముతూ ‘అదిమి పట్టుకో’మని చెప్పాడు డాక్టర్. ‘‘పిల్లలిద్దరూ చిన్నవాళ్లు, ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టడం, ఉద్యోగంలో చేరడం రెండూ కష్టమే. ఆలోచించుకో’’ స్వప్నకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది ఆమె తల్లి. ‘‘నా అవసరాలను మానుకున్నాను, పిల్లల అవసరాలు తప్పవు కదా. అతడు చికాగ్గా విదిలించే డబ్బుతో ఎన్నాళ్లని’’ నిలదీసినట్లే ఉంది స్వప్న మాట. ‘‘ఆ ప్రాక్టీసో, ఉద్యోగమో ఏదైనా నీ భర్తతో కలిసి ఉంటూనే చేసుకోవచ్చుగా’’ ప్రత్యామ్నాయం ఆలోచించు అన్నట్లుగా ఉందామె మాటలో అర్థింపు. ‘‘ఆయనకు అమర్చి పెట్టి, పిల్లల పనులు చూసి, వాళ్లను స్కూల్లో దించి, స్కూలు నుంచి తీసుకువచ్చి... కెరీర్లో కొనసాగడం అయ్యే పని కాదమ్మా. అన్నీ అయ్యాక నాకు ఉద్యోగానికి మిగిలేది మూడు గంటలే’’ పుల్ల విరుపుగానే ఉన్నాయి స్వప్న మాటలు. స్వప్న విసిగిపోయి ఉందని అర్థమవుతోంది. కన్నీళ్ల కాపురాన్ని కూతురు వద్దనుకున్నంత సులువుగా తల్లి అనుకోలేదు, చక్కదిద్దాలని చూస్తుంది. ‘‘స్వప్నా! నేనూ హైదరాబాద్‌కి వస్తాను’’ అని లోపలికి వెళ్లిపోయింది. ‘‘బాబూ రాజేశ్! స్వప్నకి ఒంట్లో బాగోలేదు. పిల్లల్ని నేను రెడీ చేస్తాను, నువ్వు హాస్పిటల్‌కి వెళ్తూ స్కూల్లో దింపి వెళ్లాలి’’ అన్నది అత్తగారు. ‘‘అలాగే అత్తయ్యగారూ’’ అన్నాడు చికాకును అణుచుకుంటూ.ఇద్దరు పిల్లలు, రెండు స్కూలు బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్‌ల బాస్కెట్లు రెండు. ‘‘నాకేమైనా ఆరు చేతులున్నాయా’’ నోటి దాకా వచ్చింది రాజేశ్‌కి. ఎదురుగా ఉన్నది స్వప్న కాదు అత్తగారు. స్కూల్ బ్యాగ్‌లు బైక్ హ్యాండిల్‌కి తగిలించాడు. అత్తగారు పిల్లల్ని ముందు ఒకరిని వెనుక ఒకరిని కూర్చోబెట్టింది. ఇక లంచ్ బాస్కెట్లు ఎలా? రాజేశ్ కళ్లలో అసహనం కనిపిస్తోంది కానీ అదేమీ పట్టనట్లు అల్లుడి చేతికి అందించిందామె. ‘‘హే... నాన్న బైక్‌లో తీసుకెళ్తున్నాడు’’ కేరింతలతో పిల్లలు ముఖాలు వెలిగిపోతున్నాయి. ‘‘స్కూలు వదిలే టైమ్‌కి మీరు వెళ్తారు కదా’’ బలవంతంగా వినయాన్ని పలికించాడు గొంతులో. ‘‘నాకు మోకాళ్ల నొప్పులు. పైగా ఇంత బరువుతో అడుగు వేయలేను. స్వప్నకు ఓపిక వస్తే వెళ్తుంది. అమ్మాయి లేవలేకపోతే మీకు ఫోన్ చేస్తాను’’ అందామె. ఆమె మాటల్లో అర్థం సహేతుకంగా ఉన్నప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ‘నీ చావు నువ్వే చావు’ అన్నట్లుగా అర్థమవుతోంది రాజేశ్‌కి. బైక్ కదిలించాడు. ‘‘నాన్నా! అమ్మకు స్కూటీ కొనివ్వు నాన్నా! మమ్మల్ని రోజూ ఇలాగే స్కూల్‌కి తీసుకెళ్తుంది’’ అడిగింది వెనుక నుంచి రాజేశ్‌ని చుట్టుకుని కూర్చున్న పాపాయి. ‘‘అమ్మ స్కూటీ అడిగితే నువ్వు కొననన్నావు కదా’’ రాజేశ్‌కి ముందు కూర్చున్న కొడుకు మాటల్లో ‘నువ్వింతే’ అనే ఆరోపణ ధ్వనిస్తోంది. ‘స్వప్న వీటన్నింటినీ ఎలా పట్టుకునేది’ ఆలోచన మెదిలిందే తడవుగా పాపాయిని అడిగాడు. ‘‘అమ్మ ఈ బ్యాగ్‌లను వీపుకు తగిలించుకుని, ఒక చేతిలో బాస్కెట్లను పట్టుకుని మరో చేత్తో తమ్ముడిని పట్టుకుంటుంది. చేయి వదిలితే వాడు రోడ్డు మీదకు పరుగెత్తుతాడు. నేను అమ్మ పక్కనే నడుస్తాను’’ పాపాయి చెప్తుంటే రాజేశ్‌కి గుండె మెలిపెట్టినట్లయింది. ‘‘మన కాలనీలో ఉన్న పాలీక్లినిక్‌లో జాయిన్ అవుతున్నాను. మా అమ్మ వచ్చి మూడు వారాలైంది. ఊరికి వెళ్తానంటోంది’’ అన్నది స్వప్న కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెడుతున్న రాజేశ్‌తో.స్వప్న క్లినిక్‌లో చేరడానికి, అత్తగారు ఊరికి వెళ్లిపోవడానికి మధ్య లింక్ ఎక్కడో ఏమీ తెలియలేదతడికి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.‘‘నిన్ననే అత్తయ్యకు చెప్పాను. రోజంతా ఇంట్లో ఉండి పిల్లల పనులు, వంట చేసి పెట్టడానికి మనిషిని చూసి పంపించమని’’ అని స్వప్న చెబుతుండగానే రాజేశ్‌కి పై మొదటి రెండు స్టేట్మెంట్ల లింక్ దొరికింది.‘‘జీతం ఎంత’’ రాజేశ్ జీతమొక్కటే అడిగాడు కానీ ఊరి నుంచి వచ్చినామెకి గది ఇవ్వాలంటే పెద్ద ఇంటికి మారాలి. ఆమెకి మూడు సార్లు భోజనం ఆ పైన జీతం... అంకెలు వేలల్లో తిరుగుతున్నాయి.‘‘పది వేలు ఇవ్వందే రారు. ఊరిని వదిలి రావాలి కదా. అత్తయ్యకు వీలు కాకపోతే మా ఊరి నుంచి పంపించమని అమ్మకు చెబుతాను’’ రాజేశ్‌కి మరో మాటకు చోటివ్వకుండా లోపలికి వెళ్లిపోయింది. ‘‘స్వప్నకు కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చిన మాట నిజమే. మరో రెండేళ్లు టైమివ్వండి. పిల్లలు కొంచెం పెద్దవుతారు’’ స్వప్న పిల్లలను స్కూలుకి తీసుకెళ్లిన గ్యాప్ చూసి అత్తగారిని అడిగాడు రాజేశ్. ‘‘వంద, రెండొందలకు చేయి చాస్తూ బతకడం తనకూ కష్టమే. ఇంత చదివించి మా అమ్మాయి డాక్టర్ అని గర్వంగా చెప్పుకున్న, మాక్కూడా అమ్మాయి ఇలా చేయి చాచాల్సి రావడం కష్టంగానే ఉంటుంది. రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కి చేతిలో డబ్బులేక పన్ను పీకించుకుందని వాళ్ల నాన్నకు తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది’’ ఆమె మెల్లగానే అంటున్నప్పటికీ సూటిగానే తగులుతున్నాయి రాజేశ్‌కి.పిల్లల్ని స్కూల్లో వదిలి ఇంటికొచ్చిన స్వప్న... రాజేశ్ హాస్పిటల్‌కి వెళ్లకుండా ఇంకా ఇంట్లో ఉండడంతో విచిత్రంగా చూసి గదిలోకి వెళ్లిపోయింది.స్వప్నతోపాటు గదిలోకి వెళ్లి ‘సారీ స్వప్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ. హాస్పిటల్‌కి వెళ్తున్నాను. ఈవెనింగ్ మాట్లాడుతాను’ అని అంతే వేగంగా ఇంట్లో నుంచి బయట పడ్డాడు.‘‘ఏమైంది’’ హాల్లోకి వచ్చి తల్లిని అడిగింది.‘‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ అని నువ్వన్నప్పుడు నేనేమన్నాను?’’ కూతుర్ని ప్రశ్నించింది.‘‘ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నావు’’ ‘‘ఇప్పుడు జరిగింది అదే’’ అని వంటగదిలోకి వెళ్లింది స్వప్న తల్లి. కష్టమేంటో తెలిసేలా చేస్తే... గౌరవం లేని చోట చూరుపట్టుకుని వేళ్లాడ్డం ఎవరికైనా కష్టమే. ఈ డాక్టర్ల విషయంలో భర్త బయట ప్రెషర్స్‌తో సున్నితత్వాన్ని కోల్పోయాడు, భార్య ఇంట్రావర్ట్ అయిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడవుతుందని విడాకులు తీసుకుని పిల్లలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం... ‘తాము పడుతున్న ఆవేదన, కష్టం ఎదుటి వారికి ఆచరణలో తెలిసేలా చేయడమే’. స్వప్న విషయంలో ఆమె తల్లి ఆ పని చేసింది. భార్యాభర్తలిద్దరితో విడి విడిగా మాట్లాడడం వల్ల మనసులో గూడు కట్టుకున్న ఆవేదన బయటకు వస్తుంది. భర్త కోసం భార్య పడిన శ్రమ, భార్య కోసం భర్త చేసుకున్న సర్దుబాట్లు తెలిశాక... ఇద్దరూ ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచిస్తారు. ఈ సూత్రం... కరడు గట్టిన వాళ్లకు పని చేయదు, కానీ చాలా మందిలో గ్యాప్‌ను పూరిస్తుంది. స్వప్న మళ్లీ కెరీర్ ప్రారంభించే వరకు ఆమె అకౌంట్లో నెలనెలా డబ్బు వేశాడు రాజేశ్. అంతకంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య గ్యాప్ తొలగిపోయింది. పదేళ్లు ఉనికి కోసం పోరాడిన స్వప్న ఇప్పుడు తన ప్రయారిటీస్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. – చెరువు వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్ – మంజీర -
‘మహా’ దోపిడీ మళ్లీ షురూ!
మంజీర తీరంలో ‘మహా’ అలజడి మొదలైంది.. మన భూభాగంలో ఇసుక దోపిడీ మళ్లీ షురువైంది.. అనుమతుల ముసుగులో మహారాష్ట్ర కాంట్రాక్టర్లు అంతర్రాష్ట్ర సరి‘హద్దులు’ దాటుతున్నారు. జిల్లా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. మరోవైపు, మన వారే ‘మహా’ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఆ ఇసుకను దెగ్లూర్, మద్నూర్ మీదుగా హైదరాబాద్, బీదర్ తదితర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఇలాగే ఇసుక తరలిస్తుండగా, జిల్లా అధికారులు దాడి చేసి జేసీబీని పట్టుకున్నారు. సుమారు 16 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించుకు పోయినట్లు అధికారులు నిర్ధారించారు. తరచూ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుక తవ్వేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారి తీస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘మహా’ దోపిడీ మళ్లీ షురువైంది. మహారాష్ట్ర క్వారీల పేరుతో తెలంగాణ భూభాగంలోని మంజీర నదిలో ఇసుకను తోడేస్తున్నారు. నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. శాఖాపూర్ (మహారాష్ట్ర) ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమంగా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతుండగా.. నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం గురువారం దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తోడేస్తున్న భారీ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నదిలో రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా.. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నాలుగు ఎకరాల లోనికి సరిహద్దు లు దాటి తెలంగాణ భూభాగంలో అక్ర మంగా ఇసుక తోడేసినట్లు గుర్తించారు. ఈ ఒక్కచోటే సుమారు 16 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తవ్వుకు పోయినట్లు ప్రాథమికంగా గుర్తించా రు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. మంజీర న ది వెడల్పులో సగ భూభా గం తెలంగాణది.. మరోసగం మహారాష్ట్రకు ఉంటుంది. అయితే తెలంగాణ భూభాగంలో ఇసుక తోడేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారితీస్తోంది. రాత్రయితే చొరబాట్లు.. చీకటి పడితే చాలు మహారాష్ట్ర జేసీబీలు తెలంగాణ భూభాగంలోకి వచ్చి అక్రమంగా చొరబడుతున్నాయి. భారీ జేసీబీలతో రాత్రికి రాత్రి వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేయడం పరిపాటిగా మారింది. స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికార యంత్రాంగం ఈ అక్రమ చొరబాట్ల గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఇసుక వనరులు దోపిడీకి గురవుతుండగా.. ఈ క్వారీల ఆదాయంతో మహారాష్ట్ర సర్కారు ఖజనా నిండుతోంది. మన వారే ‘మహా’ కాంట్రాక్టర్లు.. మహారాష్ట్ర క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి తెర లేపిన కాంట్రాక్టర్లు మన రాష్ట్రం వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు మహారాష్ట్ర వ్యక్తులను తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీకి తెర లేపుతున్నారు. పైగా ఇక్కడి ఇసుకను దెగ్లూర్ (మహారాష్ట్ర), మద్నూర్ మీదుగా హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఇసుక వాహనాలు ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయి. మన ఇసుకను మహారాష్ట్ర క్వారీల పేరుతో తోడేసి.. మళ్లీ మన తెలంగాణలోనే విక్రయిస్తూ.. మహారాష్ట్ర సర్కారు ఖజానాను నింపుతున్న అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.కోట్లల్లో ఆదాయం ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నదిలో తమ వైపు ఉన్న ఇసుక క్వారీలకు టెండర్లు పిలుస్తుంది. ఈ ఏడాది సుమారు పది క్వారీలకు టెండర్లు పిలిచారు. ఒక్కో క్వారీకి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు మహారాష్ట్ర సర్కారు ఆదాయాన్ని గడిస్తోంది. అక్కడి గనుల శాఖ ద్వారా నాందేడ్ జిల్లా అధికారులు ఈ క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్వారీల్లో ప్రస్తుతానికి శాఖాపూర్, షెల్గాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే, ఆయా క్వారీల కాంట్రాక్టర్లు తమకు నిర్దేశించిన మహారాష్ట్ర భూభాగంలో కాకుండా.. అక్రమంగా తెలంగాణ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి ఇసుకను తోడేస్తున్నారు. అటువైపు నిండుకున్న ఇసుక నిల్వలు.. మంజీర నదికి అవతలి వైపు క్వారీలకు ఏటా టెండర్లు పిలిచి భారీగా తవ్వేస్తుండడంతో అటువైపు ఇసుక నిల్వలన్నీ అయిపోయాయి. నాణ్యత లేని నల్ల ఇసుక, మట్టితో కూడిన ఇసుక మాత్రమే మిగిలింది. దీంతో కాంట్రాక్టర్లు రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ భూభాగం పరిధిలోకి చొచ్చుకొచ్చి తవ్వకాలు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. -
స్వచ్ఛ జన్నత్
జమ్మూకశ్మీర్ పర్యటనలో శ్రీనగర్‌లోని దాల్ లేక్ విహారం ఓ మధురానుభూతి. దాల్ లేక్‌లో శికార్ రైడ్ చేసి ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకునే వాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆ ఫొటోలకు వస్తున్న లైక్లకూ లెక్కే ఉండటం లేదు. ఫొటో తీసుకుని, లైక్ చూసుకుని మురిసిపోతే చాలా? సరస్సు శుభ్రంగా ఉండొద్దా? అనుకుందో ఐదేళ్ల పాపాయి. తండ్రితోపాటు పడవ ఎక్కి పొడవాటి కర్రకు వల కట్టి సరస్సులో తేలుతున్న ఖాళీ కూల్‌డ్రింక్ బాటిళ్లు, స్నాక్స్ తిని పారేసిన అల్యూమినియం రేపర్లు, పాలిథిన్ కవర్లు... ఒకటేమిటి పర్యాటక ప్రియులు బాధ్యతారహితంగా సరస్సులోకి విసిరేసిన చెత్తను అందిన వరకు పడవలోకి చేర్చింది. ఒడ్డుకు కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోయిన చెత్తను మడమల వరకు కూరుకుపోతున్న బురదలో దిగి మరీ ఏరి పారేసింది. ఆ తర్వాత పెద్దవాళ్లందరికీ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. నిజానికి ఆ పాపాయి ఇచ్చిన సందేశం పిల్లలకే. కానీ పెద్దవాళ్లకూ అందే సందేశం. ‘‘ఫ్రెండ్స్! దాల్ సరస్సు చాలా అందమైన సరస్సు. చెత్త లేకపోతే ఇంకా అందంగా ఉంటుంది. అందుకే మన సరస్సును మనం శుభ్రంగా ఉంచుకుందాం. మీరు కూడా మీ పడవల్లో వచ్చి దాల్ సరస్సులో చేరుతున్న చెత్త తొలగించండి. మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి’’ అని చెప్పింది. ఇదంతా ఆమె తండ్రి స్మార్ట్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది దేశాన్ని చుట్టే లోపే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిలో పడింది. స్వచ్ఛభారత్‌కు ఓ బుల్లి అంబాసిడర్ దొరికిందని మురిసిపోయారు. ‘ఈ పాపాయి మన సూర్యోదయాలను మరింత అందంగా మారుస్తోంది. స్వచ్ఛత మీద ఆమెకున్న అభిరుచి చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పేరేంటో తెలుసా? జన్నత్... అంటే స్వర్గం. కశ్మీర్ భూతల స్వర్గం అంటారు. అలాంటి స్వర్గంలో పుట్టిన తన బిడ్డ అంతకంటే అపురూపమైన స్వర్గాన్ని ఆవిష్కరించాలని ఆ తండ్రి ఆమె పుట్టినప్పుడే అనుకున్నాడేమో! ఆమెకు అంత స్వచ్ఛమైన ఆలోచన రావడానికి ఆ పేరు కూడా కారణమేనేమో!ఆమె పేరు కారణం అయినా కాకపోయినా జన్నత్ సందేశాన్ని మాత్రం అందరం పాటించాల్సిందే. మనం ఒక సమస్యను సృష్టించడంలో భాగస్వాములం కావద్దు, పరిష్కారం వెతకడంలో భాగస్వాములవుదాం. – మంజీర -
మంజీరా కాలుష్య ధార
పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకుండానే విడుదల చేస్తుండడంతో మంజీర నది కాలుష్య కాసారంగా మారుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని మాత్రం అరికట్టలేక పోతోంది. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, నీటి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. మంజీర పరిసర గ్రామాల్లో మాత్రం పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు కాలుష్య భూతం బారిన పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. -- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో పుడుతున్న మంజీర కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లా మనూరు మండలం గౌడ్గావ్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. మంజీర ప్రవహించే మార్గంలో కాలుష్య వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో నదీ జలాలు హానికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో థేర్నా వాగు ద్వారా ఉస్మానాబాద్, లాతూరు ప్రాంతాల పారిశ్రామిక వ్యర్థాలు మంజీరాలోకి చేరుతున్నాయి. కర్ణాటకలోని బీదర్ పరిసరాల్లోని చక్కెర కర్మాగారాలు సైతం మంజీరలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత హుగెల్లి చక్కెర కర్మాగారాం, దిగ్వాల్ ఔషధ కంపెనీల రసాయన వ్యర్థాలు చిల్కపల్లి చెరువు మీదుగా సింగూరు ఎగువన మంజీరలోకి చేరుతున్నాయి. గంగకత్వ పరీవాహక ప్రాంతంలో ఉన్న పలు రసాయన కంపెనీల ద్వారా కూడా నది కలుషితమవుతోంది. మంజీర బ్యారేజీ దిగువన చక్కెర, బీరు కర్మాగారం నుంచి వెలువడే కాలుష్య జలాలు నిశ్శబ్దంగా మంజీరా ప్రవాహంలో కలిసిపోతున్నాయి. వందల సంఖ్యలో రసాయన, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు కలిగిన పటాన్చెరు, పాశమైలారం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచి విడుదలవుతున్న విషపూరిత రసాయనలు నక్కవాగు ద్వారా మంజీరలో కలుస్తున్నాయి. ఫార్మా, పెట్రో కెమికల్, రంగులు, అద్దకం, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా భూ గర్భంలోకి వెళ్లి స్థానికంగా పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు, మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిషన్ భగీరథ పథకంతో పాటు సింగూరు, ఘణపురం, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు కూడా ఇస్తుండడంతో కాలుష్య ప్రభావం విస్తరించే అవకాశం ఉంది. విషం చిమ్ముతున్న నక్కవాగు.. పటాన్చెరు, గడ్డపోతారం, పాశమైలారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు ఉసికెవాగు నుంచి నక్కవాగులోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారు గౌడిచర్ల వద్ద మంజీరలోకి వ్యర్థాలు చేరుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి వదిలేందుకు పటాన్చెరు ఎన్విరోటెక్ లిమిటెడ్ (పీఈటీఎల్) ఆధ్వర్యంలో కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేశారు. పీఈటీఎల్ పనితీరుపై విమర్శలు రావడంతో 2009లో పటాన్చెరు నుంచి మూసీ ఒడ్డున ఉన్న అంబర్‌పేట ట్రీట్మెంట్ ప్లాంటు వరకు పైప్‌లైన్ వేసి, రసాయన వ్యర్థాలను తరలిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం పీఈటీఎల్‌కు వ్యర్థాలను నామమాత్రంగా తరలిస్తూ.. అవకాశం చిక్కినప్పుడల్లా వివిధ చెరువుల ద్వారా నక్కవాగులోకి విడుదల చేస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నక్కవాగు, మంజీరలో రసాయన వ్యర్థాలు డంప్ చేస్తున్న ఘటనలు పలుమార్లు వెలుగు చూశాయి. వర్షాకాలంలో విడుదలైన వ్యర్థాలతో గండిగూడెం, గడ్డపోతారం చెరువుల్లో చేపలు మృత్యువాత పడగా, పరిశ్రమల నుంచి రూ.1.30 కోట్ల పరిహారం మత్స్యకారులకు చెల్లించారు. నక్కవాగులో చేరుతున్న వ్యర్థాలతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలం కలుషితమవుతోంది. పరిసర గ్రామాలవాసులు తీవ్ర దుర్గంధం పీల్చుకుంటుండగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం మంజీర పరీవాహక ప్రాంతంలో ఉన్న హత్నూర మండలం గుండ్ల మాచునూరులో రసాయన పరిశ్రమలు ప్రత్యేక ఔట్లెట్లు ఏర్పాటు చేసి రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. ఇవి భూగర్భంలోకి చేరుకుని తాగు, సాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. దిగువన ఉన్న మంజీరలోకి కాలుష్య జలాలు చేరుకుంటుండడంతో పరిసర గ్రా మాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొ లా లను నష్టపోతున్నా పరిహారం అందించడంలో అటు అధికారులు, ఇటు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. – కే.భద్రేశ్, వ్యవస్థాపకుడు, మెదక్ పర్యావరణ పరిరక్షణ సమితి నమూనాలు సేకరిస్తున్నాం నక్కవాగు మంజీరలో కలిసే చోట గౌడిచర్ల, బచ్చుగూడెం తదితర గ్రామాల్లో తరచూ నీటి నమూనాలు సేకరిస్తున్నాం. పుల్కల్ మండలం శివ్వంపేటలోని ఓ బ్రూవరేజెస్ ఫ్యాక్టరీ నదిలోకి కాలుష్య జలాలను వదులుతుందనే ఫిర్యాదులు రావడంతో గతంలో మూసివేతకు నోటీసులు కూడా జారీ చేశాం. దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో తిరిగి తెరిచేందుకు అనుమతులు ఇచ్చాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహిస్తూ.. కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నాం. – భద్రగిరీష్, ఈఈ, టీఎస్‌పీసీబీ, సంగారెడ్డి జిల్లా జన్మస్థానం : బాలాఘాట్ కొండలు (మహారాష్ట్ర) ప్రవహించే మార్గం : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మంజీర నది పొడవు : 724 కి.మీ పరివాహక ప్రాంతం : 30,844 చ.కి.మీ ప్రధాన ప్రాజెక్టులు : సింగూరు, ఘణపురం, నిజాంసాగర్ గోదావరిలో కలిసే చోటు : కందకుర్తి (నిజామాబాద్ జిల్లా) -
మంజీరా’ వద్ద జింకల వేట
► నదీ పరీవాహక పరిధిలో పట్టుబడిన వేటగాళ్లు ► నిందితుల వద్ద రైఫిల్, పిస్టల్, కత్తులు స్వాధీనం మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మంజీరా పరీవాహకంలో కర్ణాటకలోని బీదర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వేటగాళ్లు జింకలను, ఇతర వన్యప్రాణులను వేటాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు.. బీదర్ ప్రాంతం నుంచి డస్టర్ వాహనం (ఏపీ 11ఏఆర్ 3600)లో మోర్గి మీదుగా నాగల్గిద్ద వైపు ఓ వేటగాళ్ల ముఠా వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనాన్ని మోర్గి మోడ్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా పెద్దఎత్తున ఆయుధాలు లభించాయి. వాహనంలో ముగ్గురు వ్యక్తులతోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. వారిలో బీదర్‌కు చెందిన సయ్యద్ ఓవైసీ ఖాద్రి (31), హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ నజీరుద్దీన్ తాపక్ (48), మహ్మద్ నయీమొద్దీన్ (40)ను విచారించి.. వణ్యప్రాణుల వేటకు వచ్చినట్టు నిర్ధారించారు. వాహనంలో 0.22 రైఫిల్, ఒక మ్యాగ్జిన్ తుపాకీ, పిస్టల్, టార్చిలైట్, రెండు కత్తులు, కటింగ్ ప్లేయర్, తదితర పరికరాలు లభించాయి. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ యాదగిరి రాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సైదానాయక్ మాట్లాడుతూ.. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. కాగా, నాగల్గిద్ద మండలం బీదర్‌కు సమీపంలో ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
రాష్ట్రాల మధ్య ఇసుక చిచ్చు
⇒ మంజీర నదిలో తేలని సరిహద్దులు ⇒ మహారాష్ట్ర అనుమతులు... మన భూభాగంలో తవ్వకాలు ⇒ సరిహద్దు గ్రామాల్లో తరుచూ ఘర్షణలు కోటగిరి (బాన్సువాడ) : మంజీర నదిలో ఇసుక తవ్వకా లు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల మధ్య వివాదం రేపుతోంది. నదిలో సరిహద్దుల కొలతలు లేకపోవడంతో పలుమార్లు ఇసుక వివాదాలు తెరపైకి వస్తున్నాయి. నిర్మాణరంగంలో అతిముఖ్యమైన ఇసుక క్వారీ ల నిర్వహణ ఈ వివాదాలకు దారితీస్తోంది. నదిలోని మహారాష్ట్ర భూభాగంలో ఇసుక క్వారీలకు అనుమతులు పొంది తెలంగాణ పరిధి నుంచి ఇసుక తరలిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతాయనే కారణంతో మం జీరలో నుంచి ఇసుక తవ్వకాలకు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. అయితే ప్రతిఏటా మహా రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తోంది. కాంట్రాక్టర్లు మన భూభాగంలోకి కూడా చొచ్చుకొని ఇసుకను తోడుకెళ్తున్నారు. దీంతో కోట్లాది రూపాయిల నష్టం జరగుతోంది. ఈ క్రమంలోనే కోటగిరి మండలంలోని సుంకిని గ్రామస్తులకు, మహారాష్ట్రలోని శాఖాపూర్ గ్రామస్తుల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఇరువురి మధ్య ఘర్ష ణ తలెత్తడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు రంగప్రవేశం చేశారు. శాఖాపూర్ ఇసుక క్వారీ నిర్వాహకులు ఓదశలో మన అధికారులు, సుంకిన గ్రామస్తులపై చేయి చేసుకున్నంత పని చేశారు. ఒకేసారి పోలీసులు, రెవె న్యూ సిబ్బంది, గ్రామస్తులు ఎదురు దాడి చేయడంతో వారు పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తీస్తున్న జేసీబీని సీజ్చేసిన పోలీసులు కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇలా ప్రతిసారి మహారాష్ట్ర ఇసుక నిర్వాహకులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోకి చొరబడుతూ ఇసుకను తోడేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. గతంలో కూడా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన షెల్గావ్ వద్ద కాంట్రాక్టర్లు క్వారీ అనుమతులు పొంది మన భూభాగంలోని ఇసుకను కొల్లగొట్టారు. సరిహద్దులు నిర్ధారించక పోవడంతో మన భూభాగంలోకి చొరబడి ఇసుకను తరలిస్తున్నారు. -
హద్దులు తేలకున్నా..
నిజామాబాద్ : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల మ«ధ్య ప్రవహిస్తున్న మంజీర నదిలో సరిహద్దు వివాదం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది. గతంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సరిహద్దులను తేల్చేందుకు సంయుక్త సర్వేలు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. తాజాగా మంజీర నదిలో మహారాష్ట్ర సర్కారు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల సరిహద్దుల్లోని మండలాలకు ఆనుకుని ఈ నది ప్రవహిస్తోంది. మన జిల్లాలకు అవతలివైపు ఉన్న 12 ఇసుక క్వారీలకు ఈ సారి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం టెండరు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే మహారాష్ట్ర క్వారీల పేరిట నదిలో జిల్లా భూభాగంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు జరిగాయి. దీంతో జిల్లా భూభాగంలోని ఇసుక తరలిపోగా.. ఈ ఇసుకపై రూ.కోట్లలో ఆదాయం మహారాష్ట్ర సర్కారుకు వెళ్లింది. సరిహద్దు వివాదం పరిష్కారమైతేనే మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని సరిహద్దు రైతాంగం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం మూడేళ్ల క్రితం రెండు రాష్ట్రాల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఈ క్వారీలకు గత నెల 5న నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 నుంచి ఈ–ఆక్షన్ నిర్వహిస్తోంది. మంజీరలో 12 క్వారీలకు ‘మహా’ ప్లాన్ నాందేడ్ జిల్లా దెగ్లూర్, బిలోలి, ధర్మాబాద్ తాలూకాల పరిధిలో మంజీర నదిలో 12 ఇసుక క్వారీల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. శెల్గాం, శావ్లా, శాఖాపూర్, గంజ్‌గాం, హున్గుందా, కార్లా (బీకే), బొలేగాం, మచ్నూర్, సగ్రోలి, హెస్గీ, నాగిని, సంగం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే జుక్కల్ నియోజకవర్గం పరిధిలో ప్రవహించే లెండి నదిలో సంగ్వి ఉమార్, సంగడి, తంతార్, మెదన్కలూర్, హవార్గా క్వారీలకు కూడా అక్కడి కలెక్టరేట్ అనుమతులు మంజూరు చేసింది. ప్రతిసారి నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఇసుక క్వారీలకు వేలం పాటలు నిర్వహించి అనుమతి ఇస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా కొనసాగించింది. ఈ రెండు నదులతో పాటు పెన్‌గంగా, గోదావరి, రవాంగన్నాలాలపై కూడా ఇసుక క్వారీలకు మహారాష్ట్ర సర్కారు తెరలేపింది. కాగా, మహారాష్ట్ర అనుమతుల పేరిట ఇసుకాసురులు మంజీర నదిలోని మన ప్రాంత ఇసుకను య«థేచ్ఛగా తరలించారు. ఈ క్రమంలో నకిలీ వేబిల్లులు కూడా సృష్టించి తెలంగాణ సర్కారుకు కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్ర క్వారీల ఇసుక రవాణా సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా రాష్ట్రంలోకి తరలించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణాకు పాల్పడిన పలువురు కాంట్రాక్టర్లపై జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. అప్పట్లో రైతుల ఆందోళనలు నదిలో మహారాష్ట్ర క్వారీలకు ఇవతల వైపు కోటగిరి, బోధన్ మండలాల గ్రామాలు సుంకిని, మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గాం, బిక్నెల్లి గ్రామాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాల ఆధారంగా ఉన్న పలు ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి. ఆయా మండలాల వాసుల తాగునీటి అవసరాలు తీర్చే ఈ పథకాలు పని చేయలేదు. దీనికి తోడు ఈ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో బోరుబావులు అడుగంటిపోయాయని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇసుక క్వారీలకు అనుమతిస్తే ఇంకేన్ని దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందోనని రైతుల్లో కలవరం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చేప కాదు.. కొండ చిలువ చిక్కింది!
కొల్చారం: చేపలు పట్టేందుకు ఓ జాలరి వల విసరగా కొండచిలువ చిక్కింది. ఈ అరుదైన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ సమీపంలోని మంజీర వాగులో చేపలు పడుతున్న ఓ జాలరి వలకు కొండచిలువ చిక్కింది. దాదాపు 10 ఫీట్ల వరకు ఉన్న కొండచిలువను మరికొందరు వ్యక్తులతో కలిసి గట్టుపైకి చేర్చారు. సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలేసినట్లు స్థానికలు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
చేపల వేటకు వెళ్లి..
మెదక్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతిచెందిన సంఘటన మెదక్ జల్లా రంగంపేట ఎత్తిపోతల వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దుర్గయ్య(32) చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. నీట మునిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. -
నిండా ముంచిన వరదలు
ఇంకా నీటిలోనే పంటలు పరిశీలనకే పరిమితమైన అధికారులు ఆందోళనలో మంజీర తీర రైతులు రాయికోడ్: మంజీర నది తీరానికి ఆనుకుని ఉన్న పంట పొలాలను వరద నీరు ముంచుతోంది. పొలాల్లో వారాల తరబడి వరద నీరు నిలుస్తోంది. కొన్ని పొలాల్లో మట్టి, ఇసుక మేటలు వేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. మంజీర నదితో పాటు, చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లాయి. మంజీర నదికి ఆనుకుని ఉన్న ఖాంజమాల్‌పూర్, మాటూర్, ఇటికేపల్లి, శాపూర్, పాంపాడ్, సిరూర్, దౌల్తాబాద్, మోరట్గా, మామిడిపల్లి, ఇందూర్, కర్చల్, తదితర 18 గ్రామాల్లో వేల ఎకరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిదంగా రాయికోడ్, నాగ్వార్, యూసుఫ్పూర్, ధర్మాపూర్, అల్లాపూర్, హుల్గేర, కుసునూర్, రాయిపల్లి గ్రామాల వాగులు, సింగితం, జంమ్గి, కర్చల్, ఇందూర్, హస్నాబాద్, నాగన్‌పల్లి, ఔరంగానగర్, కుసునూర్ తదితర గ్రామాల్లోని చెరువులు పొంగిపొర్లడంతో పొలాలన్నీ నీట మునిగి నష్టాల పాలయ్యారు. ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న పత్తి, మినుము, సోయాబీన్, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంజీర నది, నీటి వనరులు ఉప్పొంగి వరద నీటిలో మునిగి మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచన వేశారు. ఈ నెల ఒకటిన కురిసిన 20 సెంటీమీటర్ల వర్షానికి మంజీర నది సమీప ప్రాంతాల్లోని పంటపొలాల్లో వరద నీరు చేరింది. ఇంకా పంటలు నీటిలోనే ఉన్నాయి. పంటలు చేతికందే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలతో పంటలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చామని ఈ క్రమంలో అకాల భారీ వర్షాలు తమకు కోలుకోలేని నష్టాలను మిగిల్చాయని రైతులు తమ కష్టనష్టాలను వివరిస్తున్నారు. మండలంలో సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షాపాతం 190 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా 362 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అక్టోబర్‌లో సాధారణ వర్షాపాతం 80 మిల్లీమీటర్లకుగాను.. ఒక్క రోజులోనే 200 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులవుతున్నా పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. నీటమునిగిన పంటలు జీవం కోల్పోయాయని ఏఓ తెలిపారు. అభిప్రాయాలు.. చేతికొచ్చిన గింజలు నీటిపాలు నాకున్న ఎకరంన్నర పొలంలో కంది, పత్తి సాగు చేశాను. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుతూ వచ్చాను. మొక్కలు పూత దశకు చేరుకున్నాయి. కొన్ని రోజుల్లో గింజలు చేతికందుతాయని ఆశించాను. కానీ అకాల కుంభవృష్టితో పంటంతా నీటిలో మునిగిపోయింది. వారం రోజులుగా పొలం వరద నీటిలోనే ఉంది. ఎం చేయాలో పాలుపోవడంలేదు. - నర్సింలు రైతు ఇందూర్ గ్రామం. పరిహారం చెల్లించాలి పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లించాలి. అప్పు చేసి సాగు చేశారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయా. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. -బీ. వెంకట్రావ్ పాటిల్ ఎంపీపీ రాయికోడ్. పంట నష్టంపై అంచనా వేస్తున్నాం రెండు వారాలుగా ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అంచనా వేస్తున్నాం. పంటల రకాలు, సర్వే నంబర్లు, రైతు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నాం. త్వరలో ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తాం. - అభినాష్ వర్మ, మండల వ్యవసాయ అధికారి -
ఉధృతంగానే..
ఉప్పొంగుతున్న మంజీర, గోదావరి నదులు ఇద్దరు మృత్యువాత పడగల్లో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం జిల్లాలో 25 వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు నేడు ఎస్సారెస్పీకి రానున్న ముఖ్యమంత్రి వర్షం, వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్న సీఎం సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వరుణుడు జోరు తగ్గించినా వరద ఉధృతి మాత్రం ఉగ్రంగానే కొనసాగుతోంది. మంజీర, గోదావరి నదులు ఉధృతంగా పారుతున్నాయి. సోమవారం జిల్లాలో 26.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ధర్పల్లిలో 7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా 25 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టును వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సందర్శించారు. అధికారులతో మాట్లాడి వరద ప్రభావం గురించి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బోధన్, ఆర్మూర్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. పంటనష్టంపై వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని, తక్షణమే సహాయం అందేలా చూస్తామన్నారు. పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు ప్రతిపాదనల సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాలూర పునరావాస కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ సందర్శించారు. కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, అధికార యంత్రాంగం పనితీరును మెచ్చుకున్నారు. కలెక్టర్ నేతృత్వంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టారంటూ అభినందించారు. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీట మునిగాయి. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. తుంగవాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యం సదాశివనగర్‌లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మరణించారు. ఈ సంఘటన మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. సదాశివనగర్‌కు చెందిన కోతి విష్ణువర్ధన్ రెడ్డి(21), పోలబోయిన రంజిత్‌కుమార్(23) గిద్దలో ఉన్న బంధువుల వద్దకు వెళ్లి శనివారం రాత్రి బైక్‌పై తిరిగి వస్తూ సదాశివనగర్ శివారులోని తుంగవాగులో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు సోమవారం కనిపించాయి. దెబ్బతిన్న ఇళ్లు.. కోటగిరి మండలంలో 18 ఇళ్లు పూర్తిగా, 55 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్ని మండలంలో ఏడు ఇళ్లు పూర్తిగా, 74 ఇళ్లు పాక్షికంగా, బీర్కూర్ మండలంలో రెండు ఇళ్లు పూర్తిగా, 29 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది .మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీటమునిగాయి. సోయా, చెరుకు, వరి పంటలు నీటమునిగాయి. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆదివారం రాత్రి గ్రామంలో తహసీల్దారు, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పర్యటించారు. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలను ఆదివారం అర్ధరాత్రి నుంచే పునరావాస కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. సుమారు 200 మంది వరకు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సాలూర ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భోజన వసతి, తాగు నీటి సౌకర్యం కల్పించారు. బోధన్ మండలంలోని హున్పా, మందర్న , ఖాజాపూర్ గ్రామాల ప్రత్యేక అధికారి, స్టెప్ సీఈవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ వినోద్ కుమార్, టౌన్ సీఐ వెంకన్న, ఎస్సై ప్రభాకర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో మూడు గ్రామాల్లో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి నదిలో మంజీర నది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. కందకుర్తి శివారులో 1,500 ఎకరాలలోని సోయా, పత్తి, పొగాకు పంటలు నీట మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నవీపేట మండలంలోని బినోల గ్రామంలో పెద్ద చెరువు కట్ట మళ్లీ కోతకు గురైంది. నీళ్లు వృథాగాపోతున్నాయి. బాన్సువాడ దిగువన ఉన్న మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటల కట్టలు ప్రమాదకరంగా మారాయి. చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉండడంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వర్షం తగ్గుముఖం పట్టింది. సోమవారం వర్షం కురవ లేదు. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ వద్ద, ఆర్మూర్ మండలం రాంపూర్‌లో కాలువలకు పడిన గండ్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో పూజలు చేశారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాల్కొండ నియోజక వర్గంలోని మోర్తాడ్ కమ్మర్పల్లి, బాల్కొండ, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో సోయా పంట పూర్తిగా తడిసి ముద్దఅయ్యింది. పంటకు చేనులోనే మొలకలు వచ్చాయి. పంట ఎంత మాత్రం పనికిరాకుండా పోతుంది. రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేసిన సీడ్ వల్లనే నష్టం ఏర్పడింది. చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. పెద్దవాగు ప్రవాహం జోరుగా ఉంది. నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలో సోమవారం సాధారణ వర్షపాతం నమోదైంది. డిచ్పల్లి మండలం ఘన్పూర్ రాజేశ్వర్ చెరువు కట్ట కోతకు గురైంది. ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేశారు. జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లో పంటలు నీటిలోనే ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టులోకి 29 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. బోధన్-హైదరాబాద్ రోడ్డుపై నీరు అలాగే ఉండడంతో రాకపోకలు సాగడం లేదు. వరద నష్టాలను అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. నాలుగైదు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండలా మారగా.. చెరువులు, కుంటలు నిండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇంకా నాలుగు లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 41 వరద గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే నిజాంసాగర్ తదతర ప్రాజెక్టులు సైతం నిండిపోయాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలాచోట్ల పంటలు, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ యోగితారాణా.. అనంతరం ఎస్పీ విశ్వప్రసాద్, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్అండ్బీ, పీఆర్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో కలిసి సోమవారం రాత్రి పోచంపాడ్ వెళ్లి, హెలిపాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా సందర్శిస్తారన్న సమాచారం మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో కలిసి సోమవారం రాత్రి నిజాంసాగర్ వెళ్లి, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. నూటికి నూరు శాతం వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారానే సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని, లేదంటే రోడ్డుమార్గంలోనైనా వస్తారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
ఆగని వర్షం.. వరద
నిజామాబాద్‌లో 25 వేల హెక్టార్లలో పంటలు నష్టం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆర్మూరు, బోధన్, బాన్సువాడ తదితర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యటించారు. జిల్లావ్యాప్తంగా 26.3 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. 25వేల హెక్టార్ల పంట నష్టం జరగా.. రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. సదాశివనగర్‌లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందగా, మూడు రోజుల తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కోటగిరి, వర్ని, బీర్కూర్ మండలాల్లో మొత్తం 158 ఇళ్లు పూర్తిగా, 27 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. మంజీర నది తీరంలో ఉన్న బోధన్ మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామ శివారులో వరద నీరు చేరింది. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కందకుర్తి శివారులోని సోయా, పత్తి, పొగాకు పంటలు 1,500 ఎకరాల వరకు నీటి మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల మండల స్థాయి అధికారులు సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోచారం ప్రాజెక్టుకు 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1.4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 19 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 14 గేట్ల గోదావరికి 2 లక్షల అవుట్‌ఫ్లో, 2.4లక్షల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా, మంగళవారం సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించనున్నారు. కరీంనగర్లో నష్టం రూ.24కోట్లు కరీంనగర్ అగ్రికల్చర్/మెదక్: కరీంనగర్ జిల్లాలో వరద నష్టం రూ.24 కోట్లుగా అంచనా వేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 34 గేట్లు ఎత్తి 2.57 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండీలో నీటిమట్టం 20 టీఎంసీలకు చేరింది. మిడ్‌మానేరుకు ఆదివారం రాత్రి 20మీటర్ల మేర పడిన గండి సోమవారం ఉదయం వరకు 130 మీటర్లకు పెరిగింది. మెదక్ జిల్లాలో 50 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 9 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. సింగూరు, మంజీర రిజర్వాయర్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. -
‘మంజీరా’ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
న్యాల్కల్: మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్తానని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంజీర పరీవాహక ప్రాంతాలైన చీకూర్తి, హుస్సెన్‌నగర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజీరా బ్యాక్ వాటర్ వలన కొంత మేర నష్టం జరిగిందని, ఈ మేరకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ముంపు ఏమేరకు జరిగిందనే విషయాన్ని సర్వే చేపట్టి, అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. నివేదికలను సర్వే చేసి అందజేయాలని ఆయన ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో కురిసిన వర్షాల వలన ప్రాథమిక అంచనా ప్రకారం 50వేల హెక్టార్లలో పంట నష్ట జరిగిందన్నారు. 9600 ఇళ్లు దెబ్బతిన్నాయని, అందులో 247 పూర్తిగా దెబ్బతినగా మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28టీఎంసీలుగా ఉందన్నారు. మంజీరకు ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలామన్నారు. తాము మంజీర బ్యాక్ వాటర్ వలన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు శాశ్విత పరిష్కారం చూపాలని స్థానికులు ఈ సందర్భంగా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. బ్యాక్ వాటర్ ఇళ్ల వద్దకు రావడంతో విష పురుగులు ఇండ్లలోకి వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు మంజీర నది పరీవాహక ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. -
వీడిన జల ‘చెర’
సాక్షి, హైదరాబాద్/పాపన్నపేట: మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీర నదిలో చిక్కుకున్న 24 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. వీరిని రక్షించడానికి సీఎం కేసీఆర్ చూపిన చొరవ ఫలిం చింది. సీఎం విజ్ఞప్తి మేరకు ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్‌తో కూలీ లంతా ఒడ్డుకు చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్.. ఏడుపాయల్లోనే మకాం వేసి ప్రభుత్వ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో మాట్లాడుతూ, బాధిత కూలీలకు సెల్‌ఫోన్ ద్వారా ధైర్యం చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 8.45 గంటలకు ఆపరేషన్ ప్రారంభించిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు 50 నిమిషాల్లో 24 మంది బాధితులను జల‘చెర’ నుంచి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాయి. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు పొట్టకూటి కోసం నెల రోజుల కిందట మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ప్రాంతానికి వచ్చారు. మంజీర పాయల మధ్య టేకుల బొడ్డెపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో కూలీ పనులు చేసుకుంటూ.. అక్కడే రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు మంజీర వరదగా మారి ఘనపురం ప్రాజెక్టు నుంచి పొంగిపొర్లుతూ టేకుల బొడ్డెను చుట్టుముట్టింది. దీంతో కూలీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బాధితులను రక్షించేందుకు శనివారం జాతీయ విపత్తుల సహాయక సిబ్బంది రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శనివారం విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చింది. దీంతో కేసీఆర్ అక్కడికి ప్రభుత్వ హెలికాప్టర్ పంపడానికి ప్రయత్నించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ అయితే తప్ప మనుషులను లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో కేసీఆర్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడి.. హెలికాప్టర్లను పంపించారు. కూలీలను సురక్షితంగా బయటకు తేవడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 50 నిమిషాల్లోనే..: కూలీలను రక్షించేందుకు వైమానిక దళం శనివారం రెండు సార్లు ప్రయత్నించగా భారీ వర్షం, మేఘాలు, ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. అయితే ఆదివారం మరోమారు ఆపరేషన్ చేపట్టి.. 50 నిమిషాల్లోగా పని పూర్తి చేశాయి. రెండు హెలికాప్టర్లు ఉదయం 7.45 గంటలకు టేకులబొడ్డెపై ల్యాండ్ అయ్యాయి. 4 విడతలుగా రెండేసి హెలికాప్టర్లు ఒక్కోసారి ముగ్గురు బాధితులను ఏడుపాయల వైపు తీసుకొచ్చాయి. బాధితులంతా సురక్షితంగా ఇవతలి వైపునకు చేరగానే డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అల్పాహారం అందజేశారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించారు. ఆపై వారికి ఏడుపాయల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులంతా తమ స్వస్థలాలకు వెళ్తామని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
నగరానికి మంజీరా పరుగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులకు శుభవార్త. సుమారు ఆరునెలలుగా నగరానికి నిలిచిపోయిన మంజీరా జలాల పంపింగ్ ఆదివారం మొదలైంది. తొలివిడతగా ఈ జలాశయం నుంచి 16 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నీటి తరలింపుతో లింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు గోదావరి జలాల రివర్స్ పంపింగ్ కష్టాలు తీరినట్లు తెలిపాయి. కాగా ఇటీవలి భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండల్లా మారడంతో ఈ రెండు జలాశయాల నుంచి నగర తాగునీటి అవసరాలకు నిత్యం 120 ఎంజీడీల నీటిని తరలించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. సింగూరు, మంజీరా జలాల తరలింపుతో కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి గ్రేటర్‌కు తరలిస్తున్న గోదావరి జలాల పంపింగ్‌ను 86 ఎంజీడీల నుంచి 28 ఎంజీడీలకు క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. తద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయాలని జలమండలి నిర్ణయించింది.