సాక్షి, నిజామాబాద్ :
జిల్లావ్యాప్తంగా సుమారు 15 చోట్ల ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం మంజీరా నదిలో బిచ్కుంద మండలం పుల్కల్, గుండెనెమ్లి, వా జీద్‌నగర్, బీర్కూర్ మండలంలో బీర్కూర్, బరంగెడి, కోటగిరి మండలం పోతంగల్‌లో అధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రెంజల్ మండలంలో పదుల సంఖ్యలో అనధికారిక క్వారీల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. బా ల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలుమండలాల పరిధిలో, పెద్దవాగులో కూడా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.
మామూళ్ల పర్వం..
ఇసుక దందాలో ‘రెవెన్యూ’ది కీలక పాత్ర. నదిలో ఇసుక తవ్వుకునేందుకు రెవెన్యూశాఖ ఇచ్చిన అనుమతుల మేరకే గనులశాఖ నుంచి పర్మిట్లు మంజూరవుతాయి. ఒక్కోసారి 1,500 నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారులు అనుమతిస్తారు. ఈ సమయంలో అధికారులు, క్షేత్ర సిబ్బంది స్థాయిని బట్టి మామూళ్లు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు నిబంధనలను నదిలో తొక్కి ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. చీకటి పడితే చాలు భారీ యంత్రాలను నదిలోకి దించి నదీ గర్భాన్ని తొలిచేసినా అటువైపు కన్నెత్తి చూడరు. అనుమతించిన సరిహద్దులను చెరిపేసి నదిలోకి తవ్వకాలు జరుగుతున్నా పట్టదు.
చిన్నపాటి లోపాలకు వాహనదారుల వద్ద వేలల్లో జరిమానాలు వసూలు చేసే ఆర్టీఏ అధికారులకు అధికలోడుతో వెళుతున్న ఇసుక లారీలు కంటికి కూడా కనిపించవు. ఒక్కో వాహనంలో 20 నుంచి 30 టన్నుల ఇసుకతో పురాతన బ్రిడ్జిలపై నుంచి వెళుతున్నా.. వాటిని ఆపి జరిమానా విధించిన దాఖలాలు తక్కువే. అధిక లోడుతో వెళుతున్న ఈ వాహనాలు రహదారులను చిధ్రం చేస్తున్నా ఏమాత్రం పట్టింపు ఉండదు. ఒక్కో లారీకి.. ట్రిప్పుల వారీగా లెక్క చూసుకునే కొందరు ఆర్టీఏ అధికారులు వరుస పెట్టి చీమల దండులా వెళ్లే ఇసుక లారీల జోలికి అసలు వెళ్లరు.
ఇసుక అక్రమ రవాణా పోలీసుల కనుసన్నల్లో సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లోని స్టేషన్లే కాకుండా, ఇసుక లారీలు వెళ్లే దారిలో ఉండే పోలీసుస్టేషన్లకు నెలవారీ మామూళ్లు ముట్టుతాయనే ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మామూళ్లు పుచ్చుకుంటున్న పొలీసు అధికారులే దగ్గరుండీ సెటిల్‌మెంట్లు చేస్తారని పలువరు పేర్కొంటున్నారు.
కలెక్టర్ దృష్టిసారిస్తేనే
అందరూ భాగస్వాములు కావడంతో ఇసుక అక్రమ దందాకు చెక్‌పెట్టే నాథుడే లేకుండా పోయాడు. తప్పిదారిన ఎవరైన ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళుతున్నా.. ఆ సమాచారం క్షణాల్లో ఆ క్వారీల నిర్వాహకులకు చేరిపోతోంది. దీంతో వారు ఎక్కడికక్కడ సర్దేస్తున్నారు. కలెక్టర్ ప్రద్యుమ్న, ఇటీవల బోధన్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరినారాయణన్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఈ ఇసుక అక్రమ రవాణాకు చెక్ పడే అవకాశాలున్నాయి. అర్ధరాత్రి ఆకస్మిక దాడులు చేస్తేనే అక్రమ తవ్వకాల బాగోతం వెలుగులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలో అక్రమ ఇసుక దందా
Published Sun, Sep 15 2013 6:40 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement