తిరుపతి–నెల్లూరు మధ్య టీడీపీ నేత ప్రసాద్ హవా
తన కనుసన్నల్లోనే ఇసుక రవాణా సాగాలని హుకుం
టన్ను రూ.750 చొప్పున తనకే ఇవ్వాలని రూల్
లేదంటే లారీ ముందుకెళ్లకుండా అడ్డగింత
ఆపై శ్రీసిటీ, చెన్నైలో అధిక ధరకు విక్రయం
ప్రైవేట్ సైన్యం కాపలా.. అధికారుల వత్తాసు
ఇలాగైతే తమ సంగతేంటంటున్న పలువురు ఎమ్మెల్యేలు
సీఎం దగ్గర పంచాయితీకి సిద్ధమవుతున్న వైనం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. అధికార పార్టీ నేత మాత్రమే. ఇది చాలు దండుకోవడానికన్నట్లు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్లే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకు అన్‌లోడ్ చేసి వెళ్లాల్సిందేనని రూల్ పెట్డారు.
ఏకంగా నేషనల్ హైవేపై అనధికారికంగా టోల్‌గేట్ పెట్టి, తన ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలవ్వడం లేదు. లోకల్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో రీచ్‌ల నిర్వహణ సాగుతోంది.
ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ చార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగాప్రసాద్ కన్ను ఈ దందాపై పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేటు సైన్యం ద్వారా టోల్‌గేట్ పెట్టి, ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను రూ.750 చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు.
పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలెవరూ ఈయన వ్యవహారాన్ని నేరుగా ప్రశ్నించలేక పోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగాప్రసాద్.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది.
నెల్లూరు ఇసుక మాఫియా ఆయన కనుసన్నల్లోనే..
నెల్లూరు జిల్లా ఇసుక మాఫియాను కూడా గంగా ప్రసాద్ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవేపై ఏకంగా టోల్‌గేట్ పెట్టి, ప్రైవేటు సైన్యం చేత వాహనాలను తనిఖీలు చేయిస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకు సహకరిస్తుండటం విడ్డూరం.
తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళితే.. గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. టన్ను ఇసుక రూ.750 చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగాప్రసాద్... శ్రీసిటీలో నిర్మాణాలకు టన్ను రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీసిటీలో 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు.
ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఇసుక లారీలకు ఆరు నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment