Gangaprasad
-
ఇది 'గంగా' దందా
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. అధికార పార్టీ నేత మాత్రమే. ఇది చాలు దండుకోవడానికన్నట్లు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్లే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకు అన్లోడ్ చేసి వెళ్లాల్సిందేనని రూల్ పెట్డారు. ఏకంగా నేషనల్ హైవేపై అనధికారికంగా టోల్గేట్ పెట్టి, తన ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలవ్వడం లేదు. లోకల్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో రీచ్‌ల నిర్వహణ సాగుతోంది. ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ చార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగాప్రసాద్ కన్ను ఈ దందాపై పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేటు సైన్యం ద్వారా టోల్గేట్ పెట్టి, ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను రూ.750 చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలెవరూ ఈయన వ్యవహారాన్ని నేరుగా ప్రశ్నించలేక పోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగాప్రసాద్.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది.నెల్లూరు ఇసుక మాఫియా ఆయన కనుసన్నల్లోనే..నెల్లూరు జిల్లా ఇసుక మాఫియాను కూడా గంగా ప్రసాద్ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవేపై ఏకంగా టోల్గేట్ పెట్టి, ప్రైవేటు సైన్యం చేత వాహనాలను తనిఖీలు చేయిస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకు సహకరిస్తుండటం విడ్డూరం. తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళితే.. గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. టన్ను ఇసుక రూ.750 చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగాప్రసాద్... శ్రీసిటీలో నిర్మాణాలకు టన్ను రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీసిటీలో 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు. ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఇసుక లారీలకు ఆరు నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది. -
ఆశలు మునిగి.. శోకం మిగిలె!
నాయనా.. నా చిట్టితండ్రీ. నీవే కదరా మాకు దిక్కు. నీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మా ప్రాణం పోయాక నీవే తలకొరివి పెడతావనుకున్నాం. ఇప్పుడు మమ్మల్నే వదిలివెళ్లిపోయావా.. ఆ దేవుడు నా ఒక్క బిడ్డనీ తీసుకెళ్లాడే.. ... ఇదీ ఓ తల్లి రోదన కాయకష్టం చేశాం.. కడుపు కట్టుకుని పెంచాం. పెద్దచదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాం. కానీ ఆ దేవుడు మాపై పగబట్టాడేమో.. నా బిడ్డని మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. మమ్మల్ని ఎవరు చూస్తారు నాయనా.. ... ఇదీ మరో తల్లి వేదన తమ బిడ్డలు కళ్లెదుటే విగజీవులై పడి ఉండడం చూసి ఆ తల్లులు తట్టుకోలేకపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. వీరి రోదనలు పలువురికి కన్నీటిని తెప్పించాయి. ఈ విషాద ఘటన శుక్రవారం శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెకు చెందిన కాళప్ప, నాగమణి ఎకైక కుమారుడు తులసీరాం(10), వెంకటరత్నం, సుబ్బలక్ష్మి కుమారుడు గంగాప్రసాద్(9)తోపాటు పది మంది పిల్లలు స్థానికంగా ఉన్న చెరువులో శుక్రవారం బడి వదిలిన తర్వాత ఈతకొట్టేందుకు వెళ్లారు. గంగాప్రసాద్, తులసీరాం ముందు చెరువులో దిగారు. ఆపై పైకిరాలేదు. తోటి స్నేహితులు సమీపంలోని గొర్రెల కాపరికి సమాచారం ఇచ్చారు. ఆయన చెరువులో చిక్కుకున్న పిల్లలిద్దరినీ బయటకు తీశాడు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. విషయం తెలుసుకున్న బంధువులు చిన్నారుల మృతదేహాలను గ్రామానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాడు గుంతే ప్రాణం తీసింది ఇటీవల నీరు-చెట్టు పథకం పేరుతో ఎల్లంపల్లి చెరువులో పచ్చబాబులు పూడికతీత పనులు చేపట్టారు. చెరువులో అక్కడక్కడా చాలా గుంతలు తవ్వారు. వాటిలో కొన్ని ఏడు నుంచి పది అడుగుల లోతువరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరింది. గుంతలు.. లోతు తెలియక పోవడంతోనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పాడుగుంతలతోనే పిల్లల ప్రాణాలు పోయాయని పలువురు వాపోయారు. -
ఏటీఎం కేంద్రంలో బురిడీ
నగదు డ్రా చేయడం తెలియని ఇద్దరిని మోసం చేసిన గుర్తుతెలియని వ్యక్తి రూ.7 వేలతో పరారు మేదరమెట్ల : ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేయడం ఎలాగో తెలియని ఇద్దరు వ్యక్తులను మరో వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఈ సంఘటన మేదరమెట్ల బస్టాండ్‌లోని ఏటీఎం కేంద్రంలో గురువారం జరిగింది. ఆ వివరాల్లోకెళ్తే... ఖమ్మం జిల్లాకు చెందిన బి.సీతారాములు, బి.నల్లశ్రీనులు సపోటా కాయలు కోసే పనికి కొరిశపాడు గ్రామానికి వచ్చారు. గ్రామానికి చెందిన గోలి గంగాప్రసాద్‌తో కలిసి పనులకు వెళ్తున్నారు. ముగ్గురూ స్నేహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీతారాములు, నల్లశ్రీనులకు డబ్బు ఇవ్వాల్సిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వీరిని బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పమని అడిగాడు. దీంతో వారు గంగాప్రసాద్ అకౌంట్ నంబర్ ఇచ్చారు. రూ.7 వేలు నగదు జమ చేశానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్‌చేసి చెప్పడంతో డ్రా చేసుకునేందుకు గంగాప్రసాద్ వద్ద ఏటీఎం కార్డు తీసుకుని గురువారం మేదరమెట్ల బస్టాండ్‌లోని ఏటీఎం కేంద్రానికి వచ్చారు. అయితే, నగదు డ్రా చేయడం ఎలాగో తెలియకపోవడంతో వీరిని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. తాను డ్రాచేసి ఇస్తానని చెప్పి కార్డు తీసుకుని పిన్‌నంబర్ అడిగి తెలుసుకున్నాడు. కానీ, వారిని బురిడీ కొట్టించి అతని వద్ద ఉన్న మరో నకిలీ కార్డును మిషన్‌లోపెట్టి చూసి అకౌంట్లో నగదు లేవని నమ్మించాడు. అదే కార్డును వారికి అందజేశాడు. వారు ఏటీఎం కేంద్రంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను దాచిన అసలు కార్డు ద్వారా రూ.7 వేలు నగదు డ్రా చేసుకుని పరారయ్యాడు. గంగాప్రసాద్ సెల్‌ఫోన్‌కు నగదు డ్రాచేసినట్లు మెసేజ్ రావడంతో ఫోన్‌చేసి అసలు విషయం తెలుసుకున్న సీతారాములు, నల్లశ్రీను లబోదిబోమన్నారు.