నాయనా.. నా చిట్టితండ్రీ. నీవే కదరా మాకు దిక్కు. నీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మా ప్రాణం పోయాక నీవే తలకొరివి పెడతావనుకున్నాం. ఇప్పుడు మమ్మల్నే వదిలివెళ్లిపోయావా.. ఆ దేవుడు నా ఒక్క బిడ్డనీ తీసుకెళ్లాడే..
... ఇదీ ఓ తల్లి రోదన
కాయకష్టం చేశాం.. కడుపు కట్టుకుని పెంచాం. పెద్దచదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాం. కానీ ఆ దేవుడు మాపై పగబట్టాడేమో.. నా బిడ్డని మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. మమ్మల్ని ఎవరు చూస్తారు నాయనా..
... ఇదీ మరో తల్లి వేదన
తమ బిడ్డలు కళ్లెదుటే విగజీవులై పడి ఉండడం చూసి ఆ తల్లులు తట్టుకోలేకపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. వీరి రోదనలు పలువురికి కన్నీటిని తెప్పించాయి. ఈ విషాద ఘటన శుక్రవారం శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెలో చోటు చేసుకుంది.
శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెకు చెందిన కాళప్ప, నాగమణి ఎకైక కుమారుడు తులసీరాం(10), వెంకటరత్నం, సుబ్బలక్ష్మి కుమారుడు గంగాప్రసాద్(9)తోపాటు పది మంది పిల్లలు స్థానికంగా ఉన్న చెరువులో శుక్రవారం బడి వదిలిన తర్వాత ఈతకొట్టేందుకు వెళ్లారు. గంగాప్రసాద్, తులసీరాం ముందు చెరువులో దిగారు. ఆపై పైకిరాలేదు. తోటి స్నేహితులు సమీపంలోని గొర్రెల కాపరికి సమాచారం ఇచ్చారు. ఆయన చెరువులో చిక్కుకున్న పిల్లలిద్దరినీ బయటకు తీశాడు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. విషయం తెలుసుకున్న బంధువులు చిన్నారుల మృతదేహాలను గ్రామానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
పాడు గుంతే ప్రాణం తీసింది
ఇటీవల నీరు-చెట్టు పథకం పేరుతో ఎల్లంపల్లి చెరువులో పచ్చబాబులు పూడికతీత పనులు చేపట్టారు. చెరువులో అక్కడక్కడా చాలా గుంతలు తవ్వారు. వాటిలో కొన్ని ఏడు నుంచి పది అడుగుల లోతువరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరింది. గుంతలు.. లోతు తెలియక పోవడంతోనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పాడుగుంతలతోనే పిల్లల ప్రాణాలు పోయాయని పలువురు వాపోయారు.
ఆశలు మునిగి.. శోకం మిగిలె!
Published Sat, Jul 18 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement