లాటరీ విధానమే తప్పంటూ ఆగ్రహించిన మంత్రి, ఎమ్మెల్యేలు
రీచ్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌పై చిందులు తొక్కిన అమాత్యుడు
నెల్లూరు జిల్లాలో ఇదీ పరిస్థితి
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక రీచ్‌ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లాలో గురువారం నాలుగు ఓపెన్ ఇసుక రీచ్‌లకు టెండర్లు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవడంతో కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురికి అనుమతులు ఇచ్చారు. మెట్ట నియోజకవర్గంలో ఒక రీచ్ దక్కిన కాంట్రాక్టర్‌పై మంత్రి వీరంగం వేశారు. ఆ కాంట్రాక్టర్‌ను పిలిపించుకుని.. నా ఇలాఖాలో ఎలా టెండర్ వేస్తావంటూ బూతులు తిట్టారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా ఇసుక టెండర్లనే రద్దుచేయించారు.
జరిగింది ఇలా..
జిల్లాలోని పెన్నానదిలో నాలుగుచోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇహ్వాది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరుల్లో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల ఏడో తేదీన టెండర్లు ఆహ్వానించారు. ఆ రీచ్‌లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కలెక్టర్ ఆనంద్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లు కేటాయించారు.
రీచ్‌లను పంచుకునేందుకు..
నాలుగు ఓపెన్ రీచ్‌లను పంచుకునేందుకు ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ షాడోలతో టెండర్లు దాఖలు చేయించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి తమ షాడోలకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90–100 చొప్పున చెల్లించారు. ఇప్పుడు అదే ధరతో టెండర్లు ఆహ్వానించినా.. తమ్ముళ్లు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా గిట్టుబాటు చూడకుండానే టన్నుకు రూ.36 మాత్రమే కోట్ చేశారు.
అంత తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని భావించి టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించిన కలెక్టర్ లాటరీతో ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపికచేసి ప్రథమస్థానంలో ఉన్నవారికి రీచ్ కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. తమ అనుచరులకు టెండర్లు దక్కలేదని ఆ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు టెండర్ల ప్రక్రియ జరిగినప్పుడు లాటరీ విధానంలో ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్లనే రద్దుచేయించారు.
నా ఇలాఖాలోకి వస్తావా.. తాట వలిచేస్తా..
లాటరీ విధానంలో ఇసుక రీచ్ దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్‌పై మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మంత్రి చిందులు తొక్కారు. తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్‌కు తన అనుమతి లేకుండా టెండర్ ఎలా దాఖలు చేస్తావంటూ గురువారం రాత్రి బండబూతులతో రెచి్చపోయారు. ‘నా ఇలాఖాలోకి వచ్చి ఇసుక రీచ్‌కు టెండరు వేస్తావా.. నీ తాట తీస్తా..’ అంటూ మంత్రి కన్నెర్ర చేయడంతో వణికిపోయిన కాంట్రాక్టర్ తాను రీచ్ నుంచి తప్పుకుంటానని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment