ఉచిత ఇసుకకు ‘టెండర్‌’! | Tenders for 108 sand reaches | Sakshi
Sakshi News home page

ఉచిత ఇసుకకు ‘టెండర్‌’!

Published Sat, Oct 12 2024 3:00 AM | Last Updated on Sat, Oct 12 2024 3:00 AM

Tenders for 108 sand reaches

గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు ఖరారు 

పండుగ వేళ ఇసుక దోపిడీకి సర్కారు పెద్దల ‘పచ్చ’ జెండా

బిడ్లు దాఖలు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రెండు రోజులే గడువు 

ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తూ.. మరోవైపు ఇసుక మాఫియాకు గ్రీన్‌సిగ్నల్‌

అసలు ఇసుక పాలసీనే ప్రకటించకుండా రీచ్‌లలో తవ్వకాలు జరుపుతారా? 

ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి, టీడీపీ నేతలకు మాత్రమే అవకాశం 

రహస్యంగా వారితోనే దాఖలు చేయించి.. వారికే ఖరారు చేసిన అధికారులు 

టెండర్లు వేయడానికి వెళ్లిన వారిని అడ్డుకున్న స్థానిక టీడీపీ నేతలు 

ఏకపక్షంగా వ్యవహరించిన కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు 

16వ తేదీ నుంచి తవ్వకాలు

ఇసుక ఉచితం అంటూనే ఈ టెండర్లు ఏమిటి? 

ఇంత రహస్యం ఎందుకు? రెండు రోజులే గడువు ఏమిటి? 

దేశంలో ఏ టెండర్‌ అయినా ఇలా జరిగి ఉంటుందా? 

షార్ట్‌ టెండర్‌ అయినా కనీసం వారం రోజులు గడువు ఇవ్వాలి కదా? 

ఇది పండుగ పూట ప్రజలను ఏమార్చి దోపిడీకి దారి వేసుకోవడం కాదా? 

పాలసీ ప్రకటిస్తామని చెప్పి ఇలా ఎందుకు చేశారు?

‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ వాక్యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇసుకను అడ్డు పెట్టుకుని ఎన్ని విధాలా డబ్బులు పిండుకోవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో సమకూర్చిన 80 లక్షల టన్నుల ఇసుకను అడ్డగోలుగా దోచేసి జేబులు నింపుకున్నది చాలదన్నట్లు.. తాజాగా దొడ్డి దారిలో అంతకు మించి దోపిడీకి భారీ స్కెచ్‌ వేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేశారు.   

సాక్షి, అమరావతి :  ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.

సీఎంవోలో ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి రీచ్‌లను కట్టబెట్టేశాయి. ఇందుకోసం గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియనీయకుండా అత్యంత రహస్యంగా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. లక్షల రూపాయల విలువ ఉండే చిన్న టెండర్లకే వారం రోజుల వ్యవధి ఇవ్వాల్సివుండగా, రూ.వందల కోట్ల విలువైన ఇసుక టెండర్లను ఎటువంటి ప్రచారం లేకుండా, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా రెండు రోజుల్లోనే గోప్యంగా తన వాళ్లకు కట్టబెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

రెండు రోజుల్లోనే టెండర్లు పిలవడం, ఖరారు చేసేయడం భారతదేశ టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని నిపుణులు సైతం విస్తుపోతున్నారు. అసలు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలుస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్‌ చేశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం దానికి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటి? అది కూడా షార్ట్‌ టెండర్లు ఎందుకు పిలవాల్సివచ్చింది? ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద వాటిని ఎందుకు ఖరారు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.  
 
అడ్డగోలుగా తవ్వేయొచ్చనే అతి తక్కువ ధరకు.. 
టన్ను ఇసుక ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120 వరకు వివిధ జిల్లాల్లో బేస్‌ ధరగా నిర్ణయించారు. చాలా జిల్లాల్లో టన్ను ఇసుకను రూ.50 నుంచి రూ.60కే తవ్వుతామని బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. అధికారం ఉండడంతో ఎలాగైనా టెండర్‌ దక్కించుకుని, ఆ తర్వాత అడ్డగోలుగా తవ్వేయొచ్చనే ఉద్దేశంతో అతి తక్కువకు కోట్‌ చేసి రీచ్‌లు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. 

ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్‌లుగా ఉన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రభుత్వం చెప్పిన వారికి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాయి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రశ్నించినా వారిని దబాయించి, బెదిరించి పంపించేశారు. రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఇసుక టెండర్లు ఖరారైపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించనున్నారు.  

తూ.గోలో అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ  
తూర్పుగోదావరి జిల్లాలోని 17 రీచ్‌లకు 7వ తేదీన టెండరు పిలిచి 9వ తేదీ సాయంత్రం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించారు. 48 గంటల్లోనే అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ వారి నుంచి బిడ్లు స్వీకరించి 9వ తేదీ రాత్రికల్లా ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో విషయం తెలుసుకుని కొందరు టెండర్లు వేయడానికి వస్తే వారిని బెదిరించి కలెక్టరేట్‌ లోపలికి సైతం వెళ్లనీయలేదు. 

మరికొందరు ఎలాగోలా టెండరు దాఖలు చేసినా, బిడ్లు ఓపెన్‌ చేసే సమయంలో వారిని కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే ఉండనీయకుండా పంపేశారు. వారంతా గురువారం రాత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసుల సాయంతో వారిని బయటకు పంపి, టెండర్లు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కంపెనీ పేరుతో సీతానగరం మండలంలోని ఒక రీచ్‌కు టెండర్‌ వేసి దక్కించుకున్నట్లు తెలిసింది.   

కర్నూలులో నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే
కర్నూలు జిల్లాలో ఇసుక టెండర్ల నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే టెండర్‌ను ఖరారు చేశారు. కేవలం మైనింగ్‌ శాఖ వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటన ఇచ్చారు. టెండర్‌ గురించి ఎవరికీ తెలియకుండా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బంగారయ్య అనే వ్యక్తితో మాత్రమే టెండర్‌ దాఖలు చేయించారు. ఎవరినీ రానీయకుండా ఒకే టెండర్‌ వచ్చేలా చేయడంతో అతనికే రీచ్‌ తవ్వకాల కాంట్రాక్టు ఖరారైంది. 

ఒకే టెండర్‌ దాఖలైతే టెండర్‌ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనకు నీళ్లొదిలారు. పల్నాడు జిల్లాలో 8వ తేదీన టెండర్‌ పిలిచి 10వ తేదీన ఖరారు చేశారు. బాపట్ల జిల్లాలో 7న పిలిచి 8న టెండర్లు ఫైనల్‌ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టెండర్‌ వేసేందుకు వెళ్లగా వెనక్కి పంపించారు. మీ వాహనాలకు జీపీఎస్‌ సిస్టం (డివైస్‌) బాగా లేదని, టెండర్‌ వేసేందుకు వీలు లేదని నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు.   

పాలసీ లేకుండానే తవ్వకాలకు రెడీ  
మూడు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక విధానాన్ని రద్దు చేసింది. త్వరలో పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించి రీచ్‌ల్లో తవ్వకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈలోపు స్టాక్‌ యార్డుల్లో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. 

అయితే గత ప్రభుత్వం వర్షాకాలం కోసం స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు సగానికి సగం వారం రోజుల్లోనే మాయం చేశారు. మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికక్కడ భారీ రేట్లకు ప్రభుత్వం విక్రయించడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని నిండా ముంచిందే కాక, ఇప్పుడు అడ్డగోలు తవ్వకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ మరో భారీ దోపిడీకి తెరలేపింది.  

2, 3 రోజులే సమయం.. అంతా రహస్యం
సరికొత్త దోపిడీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మాన్యువల్‌ ఇసుక రీచ్‌ల్లో (యంత్రాలు ఉపయోగించకుండా) తవ్వకాలకు ఉన్నట్టుండి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఎటువంటి ఇసుక విధానం లేకుండా, మార్గదర్శకాలు చెప్పకుండా అన్ని జిల్లాల్లో ఈ రీచ్‌ల్లో తవ్వకాలకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీల ద్వారా షార్ట్‌ టెండర్లు పిలిచింది. 

ఇసుక తవ్వకాల గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, టెండర్లలో తమ వారు తప్ప బయట వారు పాల్గొనే అవకాశం లేకుండా చేసేందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టింది. షార్ట్‌ టెండర్‌కు కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. 

ఆ జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారు మాత్రమే టెండర్లు వేయడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి వారితో దగ్గరుండి దాఖలు చేయించి, వారికే ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని పాలసీ ప్రకటించకుండా ఎలా చేశారనే దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement