సచివాలయాల్లో చలానా కడితే ఇసుక దొరకదు
టీడీపీ నేతలకు డబ్బు కడితే దండిగా ఇసుక
నందిగామ నియోజకవర్గం వేములపల్లి, పెండ్యాల, కాసరబాదలో దోపిడీ
రీచ్‌లలో టీడీపీ ఎంపీ అనుచరుల హల్‌చల్
రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల వత్తాసు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుక దందా యథేచ్ఛంగా సాగుతోంది. రూ.10 వేలు ఇస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా టీడీపీ ఎంపీ ఒకరి అనుచరుల దందానే. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకొన్నా తట్టెడు ఇసుక దొరకదు. చలానాకు ఇసుక దొరకదని కరాఖండిగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టజెబితే దండిగా ఇసుక లోడ్ చేస్తారు.
టీడీపీ ఎంపీ పీఏలుగా వ్యవహరిస్తున్న జగదీష్, కిశోర్‌లే ఈ రీచ్‌లను పర్యవేక్షిస్తున్నారు. ఓ లారీ యజమానికి, ఇసుక రీచ్‌లో ఉన్న మనుషులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావడంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలం వేములపల్లి, పెండ్యాల, కాసరబాద రీచ్‌లను వీరు గుప్పిట్లో పెట్టుకొని లారీకి రూ.10 వేలు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుక ఎత్తిపోస్తున్నారు. అంతే కాకుండా, రోజుకు 200కు పైగా లారీల ఇసుక అక్రమంగా ఖమ్మం, వైరా, హైదరాబాద్, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకొంటున్నారు.
ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే 8 స్టాకు యార్డుల్లో ఉన్న ఇసుకను టీడీపీ నాయకులు లూటీ చేశారు. ఇక్కడ 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను మింగేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీని వెనుక జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధుల హస్తం ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇసుక రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకొని రేటు కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment